నేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?

అన‌కాప‌ల్లి స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

సిద్ధం సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఉక్రోశం, కడుపు మంటతో మనపై దాడులు చేస్తున్నారు.

రాష్ట్రాన్ని దోచుకోవడానికి కూటమికి అధికారం కావాలట

ఈ ఎన్నికలు.. రాబోయే ఐదేళ్ల భవిష్యత్‌

రాముడిని బచ్చా అనుకున్న మారీశడు.. ఇప్పుడు రామోజీ రూపంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణల్లా కనిపిస్తా ఉన్నారు

హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ల మాదిరి గుర్తుకొస్తున్నాడు

చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు.. హీరోలందరూ బచ్చాలు మాదిరిగా కనిపిస్తారు

అన‌కాప‌ల్లి:   ఈ మధ్య చంద్ర‌బాబు జగన్‌ ఒక బచ్చా అంటున్నాడు..నా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన నిన్ను ఏమ‌నాల‌ని చంద్ర‌బాబును సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, పూతన రాముడిని బచ్చా అనుకున్న మారీచుడు లాంటి వాళ్లు... రామోజీ, రాధాకృష్ణలు. విలన్లకు హీరోలు బచ్చాల్లాగే కనిపిస్తార‌ని సీఎం వైయ‌స్‌ జగన్‌ అన్నారు. 
అయ్యా చంద్రబాబు.. నువ్వు బచ్చా అంటున్న నేను,  ప్రజలకు మంచిచేసి ఎన్నికలకు ఒంటిరిగా ధైర్యంగా ముందుకు వస్తున్నాను. మరి 14 ఏళ్లుగ సీఎంగా చేశావ్‌ కదా.. మూడుసార్లు సీఎంగా చేశావ్‌ కదా.. మరి ఎందుకయ్యా బచ్చాను చూసి భయపడతా ఉన్నావ్‌ అని నిల‌దీశారు.
 
పొత్తుల కోసం ఎందుకు ఎగపడుతున్నావు చంద్రబాబు..

  ప్రజలకు మంచి చేసి తాను ఒక్కడినే ఎన్నికలకు వస్తుంటే 75 ఏళ్ల వయసులో పది మందిని పోగేసుకుని ఎందుకు వస్తున్నావని చంద్రబాబును సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. సింగిల్‌గా వస్తున్న తనను ఎదుర్కొనేందుకు బాబుకు ఎందుకు భయమో చెప్పాలన్నారు. ఒక్కే ఒక్కడిని ఎదుర్కొనేందుకు నక్కలన్నీ కలిసి వస్తున్నాయన్నారు.  

తాను బచ్చా అయితే తన చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న నిన్ను ఏమనాలని చంద్రబాబును ప్రశ్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అందరూ తన చుట్టూ బాణాలు పట్టుకుని నిలుచున్నారన్నారు.

‘ఇంటింటికి జరిగిన మంచిని కొనసాచించాలని పెత్తందార్ల మీద యుద్ధం కొనగించడానికి వచ్చిన ప్రజా సైన్యమిది. మూడు వారాల్లో జరగబోతున్న ఈ ఎన్నికలు ఇంటింటి చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా గుర్తుండిపోతాయి. ఈ ఎన్నికలు పేదలు, రైతులు, పిల్లలు, అక్క,చెల్లెమ్మలు, అవ్వాతాతలు, పేద సామాజికవర్గాల వారి  ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మంచి చేసి మనకు, మోసాలు, కుట్రలతో వచ్చే వారికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

ప్రతి ఇంటికి మంచి చేసి మనం, ప్రతి వర్గానికి మోసం చేసి వారు ఎన్నికల కోసం మళ్లీ భ్రమలు కల్పిస్తున్నారు. మళ్లీ మోసానికి దిగుతున్న ఈ అన్యాయస్తులను ఓడించేందుకు సిద్ధం కావాలి. జగన్‌ను ఓడించాలని వారు, పేదలను గెలిపించాలనే మా మధ్య జరిగే 2024 ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి మన ఈ సిద్ధం సభలు చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు, బస్సులు పరిగెడుతున్నాయి.

ఉక్రోశం, కడుపు మంటతో చంద్రబాబు తన మీద రాళ్లు వేయమంటున్నాడు. నా మీద యుద్ధం చేయమంటున్నాడు. ఇది చంద్రబాబు, దత్తపుత్రుడు వాళ్ల వదినమ్మల ఎజెండా. రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది దాచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలట. ఈ మధ్య బాబు జగన్‌ ఒక బచ్చా అంటున్నాడు. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, పూతన రాముడిని బచ్చా అనుకున్న మారీచుడు లాంటి వాళ్లు... రామోజీ, రాధాకృష్ణలు. విలన్లకు హీరోలు బచ్చాల్లాగే కనిపిస్తారు’ అని సీఎం వైయ‌స్‌ జగన్‌ అన్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైయ‌స్ జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజు అనకాపల్లి జిల్లాలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా శనివారం(ఏప్రిల్‌20) చింతపాలెం వద్ద జరిగిన బహిరంగ సభలో సీఎం వైయ‌స్ జగన్‌ మాట్లాడారు. 

ఉత్తరాంధ్రాలోఇవాళ రెండు సముద్రాలు కనిపిస్తున్నాయి.*
అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి సిద్ధం. ఉత్తరాంధ్రలో ఈరోజు నా కళ్ల ఎదుట రెండు సముద్రాలు కనిపిస్తున్నాయి. ఒకటి బంగాళాఖాతం అయితే, మరొకటి ఇక్కడ కనిపిస్తున్న జనసముద్రం. ప్రభంజనం అనే పదానికి అర్థం చెబుతూ ఇక్కడ జరుగుతున్న ఈ సభ చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది. 

*పెత్తందారీ ప్రతిపక్షం మీద యుద్దం ప్రకటించిన ప్రజాసైన్యమిది.*
మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా, ఇంటింటికీ జరిగిన మంచిని కొనసాగించాలని, దానికి అడ్డుపడుతున్న పెత్తందార్ల ప్రతిపక్షం మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చిన ప్రజా సైన్యం ఇది. 

నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, నా ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, నా ప్రతి స్నేహితుడికీ ముందుగా మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. 

మూడు వారాల్లో జరగబోతున్న ఈ ఎన్నికలు..  రాష్ట్ర చరిత్రలో ఇంటింటి చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా ఇవి ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఇవి మన పేదలను, మన రైతులను, మన పిల్లలను, మన అక్కచెల్లెమ్మలను, మన అవ్వాతాతలను మన పేద సామాజిక వర్గాలను వచ్చే 5 ఏళ్లు.. 60 నెలలు వాళ్ల తలరాతలు, వాళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. 

*మంచికి మోసానికి జరుగుతున్న యుద్ధం ఈ ఎన్నికలు.*
మంచి చేసి ప్రజల మనసు గెలిచి మనం.. చేసిన మంచి ఏదీ లేక మోసాలను, కుట్రలను, అబద్ధాలను, పొత్తులతో కూటమిగా వారు.. తలపడబోతున్న ఈ ఎన్నికల్లో మీరంతా.. సిద్ధమేనా? ప్రతి వర్గానికీ, ప్రతి ఇంటికీ మంచి చేసి మనం.. చేసిన మంచిని చూపించి మనం.. ప్రతి వర్గానికీ మోసం చేసి వారు.. చేసిన మంచి ఏదీ లేదు కాబట్టి ఎన్నికలు వచ్చే సరికే ఆ చేసిన మంచిని చూపించలేక, ఇక మీదట ఇది చేస్తాం, ఇది చేస్తాం అంటూ మళ్లీ భ్రమలు కల్పిస్తూ మోసానికి తిరుగుతున్న ఇటువంటి అన్యాయస్తులను ఓడించేందుకు మీరంతా.. సిద్ధమేనా? 

జగన్ ను ఓడించాలని వారు.. పేదల్ని గెలిపించాలని మనం.. ఇంటింటి అభివృద్ధి కొనసాగించాలని మనం.. చేయబోతున్న ఈ పోరాటం మరో చారిత్రక విజయంతో 2024లో జరగబోయే ఈ ఎన్నికలు ఎప్పటికీ కూడా చరిత్రలో మిగిలిపోతాయని, ఈ చరిత్రలో నిలిచే ఈ యుద్ధానికి మీరంతా.. సిద్ధమేనా? 

మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి, బస్సులు పరుగెత్తుతున్నాయి. ఉక్రోశం, కడుపుమంట భగ్గుమని చంద్రబాబు ఆ ఉక్రోశంతో నా మీద రాళ్లు వేయమంటున్నాడు. నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. ఇదీ చంద్రబాబు, దత్తపుత్రుడు, వాళ్ల వదినమ్మల అజెండా. దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవటానికి ఇదీ బాబు కూటమి ఏకైక అజెండా. దీని కోసం వాళ్లకు అధికారాలు కావాలట. జగన్ ను కొట్టడానికి, జగన్ కు హాని చేయడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి.. దీని కోసం వాళ్లకు అధికారం కావాలట. ఇంకా ఏమంటున్నారో తెలుసా వీళ్లంతా.. ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు, మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు.. పూతన, కాళింది, ఇప్పుడు బాబు… వ్యాను మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తున్నారు. 
రాముడిని బచ్చా అనుకున్న మారీచుడు, సుభాహుడు ఇప్పుడు ఓ రామోజీ వేషంలోనూ, ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణల్లా ఈరోజు కనిపిస్తున్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్లలో గుర్తుకొస్తున్నాడు. 

*విలన్లందరికీ ఓడిపోయే కాలం...*
ఓడిపోయే కాలం వచ్చినప్పుడు. చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు.. విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తుంటారు. అయ్యా చంద్రబాబూ.. నువ్వు బచ్చా అంటున్న నేను.. ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా, ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తున్నా. మరి 14 ఏళ్లు సీఎంగా చేశావు కదా.. 3 సార్లు సీఎంగా చేశావు కదా.. మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడుతున్నావు ఈ చంద్రబాబును అని అడుగుతున్నాను. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి  వస్తోంది అని అడుగుతున్నాను. అంతా గమనించండి. ఇంటింటికీ మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంత మంది బాణాలు పట్టుకుని ఉన్నారో గమనించమని కోరుతున్నాను. 

మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున. మరోవైపున ఓ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్.. వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు, మోసాలు, అబద్ధాలు. వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకుని చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంత మంది నా చుట్టూ బాణాలు, రాళ్లు, ఆయుధాలు పట్టుకుని ఉన్నారు. వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు. మరి మీ జగన్ కు తోడెవరు? మరి మీ బిడ్డకు తోడెవరు? జగన్ కు తోడు ఆ దేవుడు, ఈ కోట్ల మంది పేదలు, ఇంటింటిలో ఉన్న నా అక్కచెల్లెమ్మలు అని కూడా మీ బిడ్డ గర్వంగా చెబుతున్నాడు. మరి మీ ఒక్క జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి మీద, మీ బిడ్డ సింగిల్ గా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఎందుకయ్యా బాబూ నీకింత భయం అని అడుగుతున్నాను. ఇన్ని నక్కలు ఏకమవుతున్నాయి. ఒకే ఒక్కడిని సింగిల్ గా ఎదుర్కొనేదానికి ఇన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడుతున్న పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి. 

అడుగుతున్నా. అయ్యా బాబూ.. నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా? అని అడుగుతున్నాను. ఓ బాబూ.. నిన్నే అడుగుతున్నాను. ఏమనాలి నిన్ను అని అడుగుతున్నాను. నేను బచ్చా అయితే 5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కడివే  రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. అరడజను మందిని వెనకేసుకుని వస్తున్న నిన్నే ఏమనాలి అని అడుగుతున్నాను. ఓ బాబూ.. నిన్ను ఏమనాలి అని అడుగుతున్నాను. ఏమనాలి?
నేను బచ్చా అయితే ఈ 58 నెలల్లో గ్రామానికీ, రైతులకు, పేదలకు, అక్కచెల్లెమ్మలకు,పిల్లలకు, అవ్వాతాతలకు, సామాజిక వర్గాలకు, నేను చేసిన మంచి ఇంటింటికీ చేసిన అభివృద్ధి నువ్వు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని ఈ చంద్రబాబును అడుగుతున్నాను. 

*మీ బిడ్డ ఇంటింటికీ మంచి చేసి.. ఓటు అడుగుతున్నాడు.*
అయ్యా బాబూ.. ఈ బచ్చా చేసిన పని నువ్వు ఎందుకు చేయలేకపోయావు. మరి నిన్ను ఏమనాలి అని అడుగుతున్నాను. మీరే గమనించండి. ఎన్నికల ప్రచారంలో మీ బిడ్డ మీ జగన్ ఏం చెబుతున్నాడు. చంద్రబాబు ఏం చెబుతున్నాడు అని ఒక్కసారి గమనించమని అడుగుతున్నాను. మీ జగన్, మీ బిడ్డ ఈ 58 నెలల్లో చేసిన మంచిని చెప్పుకొని ఓటు అడుగుతున్నాడు. ఇంటింటికీ చేసిన అభివృద్ధిని, మంచిని చూపి ఓటు అడుగుతున్నాడు. మరి గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, జరగని విధంగా, మీ బిడ్డ వచ్చిన ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 2.70 లక్షల కోట్లు.. అంటే ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్లిపోతోంది. 

మీ బిడ్డ ఈరోజు గర్వంగా నిలబడి చెబుతున్నాడు. అక్షరాలా ఈ 58 నెలల కాంలో ఏకంగా 2.70 లక్షల కోట్లు గతంతో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మీ దగ్గరే మీ ఖాతాల్లోనే నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోనే, వారి ఇంటిలో ఉన్న వారి అవ్వాతాతల చేతుల్లోనే ఈరోజు కనిపిస్తోందా? లేదా? అని మీ బిడ్డగా అడుగుతున్నాను. 

*గతంలో ఎప్పుడూ చూడని విధంగా....*
నా అక్కచెల్లెమ్మల కుటుంబాలను సవినయంగా, ఇంత మంచి చేసిన ప్రభుత్వం గతంలో మీరు ఎప్పుడైనా చూశారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 31 లక్షల ఇళ్ల పట్టాలతో పాటు అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ఈరోజు వేగంగా జరుగుతోంది. గతంలో ఎప్పుడైనా కూడా ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం.. నా అక్కచెల్లెమ్మలను పట్టించుకున్న ప్రభుత్వం ఎప్పుడైనా చూశారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 

గతంలో ఎప్పుడైనా కూడా మనం అమలు చేస్తున్న ఈ పథకాలు, స్కీములు చూశారా? అని అడుగుతున్నాడు మీ బిడ్డ. అవ్వాతాతలకు ప్రతి నెలా 1వ తారీఖునే ఇంటికే వచ్చే రూ.3 వేల పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. గతంలో ఎప్పుడైనా కూడా ఓ అమ్మ ఒడి అనే పథకాన్ని ఎప్పుడైనా నా అక్కచెల్లెమ్మలు చేశారా? గతంలో ఎప్పుడైనా కూడా నా అక్కచెల్లెమ్మలు ఓ ఆసరా, సున్నా వడ్డీ చూశారా? నా అక్కచెల్లెమ్మలను, వారి కుటుంబాలను మీ బిడ్డ అడుగుతున్నాడు. గతంలో ఎప్పుడైనా మీరు ఓ చేయూత లాంటి ప్రోగ్రామ్ ఎప్పుడైనా చూశారా? ఓ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పథకాలు ఎప్పుడైనా చూశారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 

పెద్దచదువులకు ఏతల్లీ తండ్రీ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని, ఆ పిల్లలను చేయి పట్టుకుని నడిపిస్తూ, ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఏకంగా పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు 93 శాతం మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ తల్లులకు చేదోడుగా ఉంటూ 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తూ ఓ వసతి దీవెన, విద్యాదీవెన వంటి పథకాలు ఎప్పుడైనా మీరు చూశారా? అని మీ జగన్ అడుగుతున్నాడు. 

*దేశంలో మరే రాష్ట్రంలోని లేని విధంగా...*
ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ.. అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అది చేరడం. ఇందులో సింహ భాగం నా అక్కచెల్లెమ్మల చేతికే అందించిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఇంకొకటి ఏ రాష్ట్రంలో జరగని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఎప్పుడైనా జరిగిందా? అని అడుగుతున్నాడు మీ బిడ్డ. 

ఇదే చంద్రబాబును అడుగుతున్నాను. ఓ బాబూ నిన్నే అడుగుతున్నాను. చెప్పవయ్యా చెప్పు.. ఎప్పుడైనా నవ్వైనా చూశావా? అని అడుగుతున్నాను చంద్రబాబును. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ రైతన్నలకు రైతు భరోసా, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, సొంత వాహనాలున్న డ్రైవర్లకు వాహన మిత్ర, ఓ చేదోడు, తోడు, లా నేస్తం, వంటి పథకాలు ఎప్పుడైనా చూశారా? అని అడుగుతున్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు. ఈ పథకాలు, స్కీములు గతంలో ఏ ప్రభుత్వంలో అయినా కూడా చూశారా? అని అడుగుతున్నాను. 

*మీ బిడ్డ హయాంలో గ్రామల్లో సమూల మార్పులు.*
ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మీ బిడ్డ నా అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం ఇంతగా ఆలోచన చేసి అడుగులు వేసిన ప్రభుత్వం కేవలం ఈ 58 నెలల కాలంలో జరిగింది. మీ బిడ్డ ప్రతి గ్రామంలోనూ గతంలో ఎప్పుడూ జరగనట్టుగా 7 వ్యవస్థలు ఈ రోజు ప్రతి గ్రామానికీ తీసుకొచ్చాడు. మీ జగన్ చూపిస్తున్నాడు. ప్రతి గ్రామంలోనూ, వార్డులోనూ.. గ్రామ, వార్డు సచివాలయాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడొచ్చాయి? ఎవరు తీసుకొచ్చారంటే.. మీ జగన్. ఇంటికే వచ్చే వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారంటే మీ జగన్. అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రాలు ఎవరు తీసుకొచ్చారంటే మీ జగన్. 

*వైద్య ఆరోగ్య రంగంలో పేదలను చేయి పట్టుకుని నడిపిస్తూ...*
అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే విలేజ్ అండ్ వార్డు అర్బన్ హెల్త్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి. మొట్ట మొదటి సారిగా గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తోంది. గ్రామంలో ఏ పేదకైనా ఇబ్బంది రాకుండా చేయి పట్టుకుని నడిపించే ఓ ఆరోగ్య సురక్షకార్యక్రమం జరుగుతోంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నేరుగా గ్రామానికే వచ్చింది. ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసులు కనిపిస్తున్నారు. ఎప్పుడూ కూడా జరగని విధంగా నాలుగు అడుగులు అదే గ్రామంలో వేస్తేఏకంగా ఆ గ్రామంలో ఓ ఇంగ్లీషు మీడియం స్కూలు  కనిపిస్తోంది. నాడు నేడుతో బాగు పడిన ఆ స్కూలు కనిపిస్తుంది. ఎవరు కట్టారు అంటే ఎవరు తెచ్చారు అంటే వచ్చే సమాధానం మీ జగన్. 

అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తున్నాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తోంది. ఆలోచన చేయమని అడుగుతున్నాను. మీ బిడ్డ రాకమునుపు, మీ బిడ్డ వచ్చిన తర్వాత పాలనలో ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇదీ ప్రతి గ్రామంలోనూ ఓ లంచాలు లేని, వివక్ష లేని పాలన ఇస్తున్న మీ జగన్ మార్క్, మీ వైయస్సార్ సీపీ మార్క్ పాలన అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను.

మరి ఈ చంద్రబాబు మార్క్ ఏముందని అడుగుతున్నాను. చెప్పవయ్యా బాబూ.. సమాధానం చెప్పవయ్యా బాబూ అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. 

*చదువుల విప్లవం....*
గతంలో ఎప్పుడూ జరగని విధంగా మన రాష్ట్రంలో ప్రతి పాపా, బాబూ ఇంగ్లీషు మీడియంతో మొదలు నాడు నేడుతో గోరుముద్దతో, విద్యా కానుకతో, బైలింగ్వల్ టెక్ట్స్ బుక్కులతో, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులతో, సబ్జెక్ట్ టీచర్లతో, 6వ తరగతి నుంచే మన గవర్నమెంట్ బడులతో ప్రతి క్లాస్ రూములోనూ ఐఎఫ్ పీ ప్యానెళ్లతో డిజిటల్ బోధనతో, 8వ తరగతికి పిల్లాడు వచ్చే సరికే ఆ పిల్లాడి చేతిలో ట్యాబ్స్ తో.. ఈరోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు కూడా నా చదువులకు ఇబ్బంది లేదు, ఢోకా లేదు కారణం.. ముఖ్యమంత్రిగా మా మామ ఉన్నాడు అని చెప్పుకొనే పరిస్థితిలో ఈరోజు పెద్ద చదువులను కూడా రూపురేఖలు మారుస్తూ పెద్ద చదువుల్లో కూడా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ నుంచి ఆన్ లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ ను డిగ్రీల్లో అనుసంధానం చేస్తూ, మ్యాండేటరీ ఇంటర్న్ షిప్ తీసుకొస్తూ, చదువుల్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే గర్వంగా కూడా చెప్పగలుగుతున్నాను. వాళ్ల మేనమామ అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాడు. ప్రతి అక్కచెల్లెమ్మకు తోడుగా వాళ్ల అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. మీ పిల్లలకు నేను తోడుగా ఉన్నాను అని ఈ సందర్భంగా గర్వంగా చెబుతున్నాను.  

ప్రతి కుటుంబం ఎదగాలి. పేదరికం నుంచి బయట పడాలి. బయట పడాలంటే దానికి మార్గం చదువులు మాత్రమే కాదు. క్వాలిటీ చదువులు అని చెప్పి ఈరోజు చదువుల రంగంలో పేదవాడి పేదరికం సంకెళ్లను తెంచుకునేందుకు ఏకంగా ఒక విద్యా విప్లవాన్ని ఈరోజు మీ బిడ్డ తీసుకొస్తుంటే అదే ఈ 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈ బాబు.. ఈ 75 ఏళ్ల ముసలాయన.. ఈయనేమంటాడు.. ఇంగ్లీషు మీడియమే గవర్నమెంట్ బడుల్లో పేద పిల్లలకు వద్దు అని ఏకంగా ఉద్యమాలు చేయించిన వ్యక్తి ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడంటే ఎవడు? అలాంటి బాబు మన ఖర్మకొద్దీ 5 ఏళ్ల కిందటి వరకు మనం అలాంటి ఆయనను ముఖ్యమంత్రి అన్నాం. మన ఖర్మ చూడు ఎలా ఉందో?. 

వైద్యాన్ని కూడా ఇంటి గడపకు తీసుకొస్తున్న ప్రభుత్వం మీ బిడ్డది. గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష, కంటి వెలుగు, 3300కు పెంచిన ఆరోగ్యశ్రీ సేవలు, ఏకంగా రూ.25 లక్షల దాకా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ఆరోగ్య వైద్యం అందిస్తూ.. పేదవాడికి తోడుగా ఉంటున్నాం. ఆరోగ్యశ్రీయే కాకుండా రెస్టు పీరియడ్ లో కూడా వైద్యంతో పాటు తోడుగా నిలబడుతూ మొట్ట మొదటి సారిగా ఆరోగ్య ఆసరా ఇస్తున్నాం. 
ఏకంగా 2,200 వాహనాలు 108లు, 104లు, తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ లు కొనుగోలు చేయడం మొదలు దగ్గర నుంచి నాడునేడుతో రూపురేఖలు మారుతున్న గవర్నమెంట్ హాస్పిటళ్లు, కొత్తగా మరో 17 కొత్త మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి.ఏకంగా 54 వేల డాక్టర్లు, నర్సులు నియామకాలు ఏకంగా వైద్య రంగంలోనే ఈరోజు చోటు చేసుకున్నాయి. 

ఇలాంటి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఏరోజైనా కూడా నేను చంద్రబాబును అడుగుతున్నాను. నీ కుళ్లు మెదడుకు ఏనాడైనా వచ్చాయా? చంద్రబాబూ అని అడుగుతున్నాను. ఇదే సిద్ధం సభలో ఇన్ని లక్షల మంది సాక్షిగా అడుగుతున్నాను. మీ బిడ్డ పాలనలో ఈరోజు ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. 

*పోర్టులు, ఫిషింగ్ హార్భర్లు నిర్మాణం కూడా..*
వేగంగా 4 కొత్త సీ పోర్టులు నిర్మాణం జరుగుతున్నాయి.ఇందులో ఒకటి మన ఉత్తరాంధ్రలో, మన మూలపేటలో వేగంగా అడుగులు వేస్తూ కనిపిస్తోంది. 

కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. 6 కొత్త ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు వేగంగా పనులు జరుగుతున్నాయి. కొత్తగా 26 జిల్లాలు వచ్చింది ఎప్పుడంటే మీ బిడ్డ హయాంలో. కొత్తగా 15 వేలకుగా గ్రామ, వార్డు సచివాలయాలు వచ్చింది ఎప్పుడంటే మీ బిడ్డ హయాంలో. నాడునేడుతో బాగుపడ్డ స్కూళ్లు, హాస్పిటళ్లు, కొత్తగా మరో 15 వేల విలేజ్, వార్డు క్లినిక్ లు, కొత్తగా 11 వేల రైతు భరోసా కేంద్రాలు, కొత్తగా ఇప్పటికే 3 వేలకుపైగా డిజిటల్ లైబ్రరీలు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్. మారుమూల ట్రైబల్ ప్రాంతానికి కూడా ఈరోజు మొట్ట మొదటిసారిగా కనెక్టివిటీ మీద ధ్యాసపెట్టి మారుమూల ట్రైబల్ విలేజెస్ ను కూడా ఈరోజు నాగరిక ప్రపంచంలోకి తీసుకొచ్చే అడుగులు పడుతున్నాయి ఎప్పుడంటే మీ బిడ్డ హయాంలో. 

*రూ.1లక్ష కోట్ల పెట్టుబడులు, ఎయిర్ పోర్టుల విస్తరణ కూడా...*
ఏకంగా రూ.1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు, రాష్ట్రంలో ఈరోజు ఎయిర్ పోర్టుల విస్తరణ, కొత్తగా వేగంగా మన కళ్ల ఎదుటే కనిపిస్తోంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వాయు వేగంతో పనులు జరుగుతున్నాయి. కొత్తగా రాష్ట్రంలో 2 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నాడ్స్, ఎంఎస్ఎంఈలను ఆదుకుంటున్న ఆపన్న హస్తం మొట్టమొదటిసారిగా ఈ 58 నెలల కాలంలోనే అడుగులు వేగంగా మార్పు జరుగుతూ కనిపిస్తున్నాయి. 

*అన్నదాతలకు అండగా...*
స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటేనే ఏ రాష్ట్రం అయినా బాగుపడుతుందని, గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు ఓ రైతు భరోసా, నా అక్కచెల్లెమ్మలకు ఓ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటూ వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, తోడు, చేదోడు, లా నేస్తం.. ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఉరుకులు పరుగులు తీయించేటట్టుగా.. రాష్ట్రం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడో 28, 29వ స్థానంలో ఉంటే ఈరోజు రాష్ట్రం దేశంలో 5వ స్థానానికి ఎగబాకిందంటే కారణం.. మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో అని గర్వంగా చెబుతున్నాడు. 

ఈరోజు ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటికే రూ.3 వేల పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి ముంగిటకే వైద్యం, ఇంటింటికీ స్కీములు, ఇంటింటికీ పౌర సేవలు డెలివర్ చేస్తూ ఓ మహావ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు అంటే అదీ మీ బిడ్డ అని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెబుతున్నాడు.

*ఒక్క పేదవాడికైనా మంచి చేశావా చంద్రబాబూ..*
అడుగుతున్నా.. ఓ లంచాల బాబు.. ఓ జన్మభూమి కమిటీల బాబు.. మరి మీ పాలనలో ఏముందయ్యా గర్వకారణం చెప్పవయ్యా చంద్రబాబూ చెప్పవయ్యా అని అడుగుతున్నాను. 

14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా, 3 సార్లు సీఎంగా చేసి కూడా ఇదే పేదలకు నువ్వు ఏం చేశావయ్యా బాబూ అని అడిగితే దానికి సమాధానం లేదు కాబట్టి చెప్పలేడు కాబట్టి ఈరోజు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి ఈరోజు నేను మాట్లాడుతూ అయ్యా చంద్రబాబూ.. నీ పేరు చెబితే ఏ ఒక్కరికైనా ఒక్కటంటే ఒక్కటైనా, ఏ పేదకైనా నువ్వు చేసిన మంచి గుర్తుకు వస్తుందా? అని అడుగుతున్నాను ఈ సందర్భంగా. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశావు. నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా పేదవాడికి చేసిన ఒక స్కీమైనా గుర్తుకు వస్తుందా? అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. 

చంద్రబాబు పేరు చెబితే ఇవేవీ గుర్తుకురావు. ప్రజలకు చేసిన మంచి గుర్తుకురాదు. ఇంటింటికీ చేసిన మంచి అంతకన్నా గుర్తుకురాదు. కానీ చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేదేమిటి? వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు. ఇవీ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే అంశాలు. అందుకే నేను చెబుతున్నాను. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి కానే కాదు. ఈ ఎన్నికలన్నవి పేదల భవిష్యత్తు మార్చే ఎన్నికలని మళ్లీ మళ్లీ అందుకే చెబుతున్నాను. 

జగన్ ఉంటే పేదలకు పథకాలన్నీ కొనసాగుతాయి. జగన్ లేకపోతే మళ్లీ ప్రజలు మోసపోయి పథకాలన్నింటికీ కూడా ముగింపే. పేదల భవిష్యత్తు అంధకారమయం కాకుండా మధ్యలో నిలబడి  ఉన్న వ్యక్తి ఒక్క మీ జగన్, ఒక్క మీ బిడ్డే అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
అన్నా.. అక్కా.. చెల్లెమ్మా.. మీరే చెప్పండి. ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా ఓటు వేయాలంటే మీరు ఏమి చూస్తారు అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. 

*రంగు,రంగుల వాగ్ధానాలు చూసి మోసపోకండి.*
కేవలం రంగు రంగుల మోసపూరిత వాగ్దానాలు, మేనిఫెస్టోలు చూసి ఓటు వేస్తారా? లేక జరిగిన మంచిని చూసి ఎవరు ఉంటే మనకు మంచి జరుగుతుందన్న అంశాన్ని చూసి ఓటు వేస్తారా? అన్నది నేను మిమ్మల్నే ఆలోచన చేయమని కోరుతున్నాను. ఎందుకంటే ఓటు వేసే ముందు జరిగిన మంచిని చూసి ఎవరు ఉంటే మంచి జరుగుతుందన్న ఆలోచన చేసి ఓటు వేయండి. 

ఇలా ఎందుకు అడుగుతున్నానంటే.. గతంలో మీ అందరికీ గుర్తుందా? 2014 గుర్తుందా? 2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడ్డాడు. గుర్తుందా ఈ పాంప్లెట్. 

అక్కా, అన్నా.. ఈ పాంప్లెట్ గుర్తుందా? 2014లో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో ముఖ్యమైన హామీలు అంటూ ఇదే ముగ్గురి ఫొటోలతో.. ఫొటోలు గుర్తున్నాయా? ఒకవైపు ఆయన, మరోవైపున దత్తపుత్రుడు, ఆయన మధ్యలో ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీగారు. ముఖ్యమైన హామీలంటూ చంద్రబాబు ఇదే పాంప్లెట్ మీ ప్రతి ఇంటికీ పంపించాడు. ఆరోజుల్లో గుర్తుందా? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 చూసినా హోరెత్తించారు అడ్వర్టైజ్ మెంట్లు. ఈ పాంప్లెట్ లో రాసినవి చదవమంటారా? చదవమంటారా అక్కా? చదవమంటారా అన్నా? 

*చంద్రబాబు విఫలహామీలు.*
ముఖ్యమైన హామీలు.. రైతు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్ల రుణ మాఫీ జరిగిందా? రెండో అంశం చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. అక్కా రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో.. కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? అని అడుగుతున్నాను. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. రూ.25 వేలు కథ దేవుడెరుగు. కనీసం ఒక్క రూపాయి అయినా ఒక్కరి బ్యాంకు అకౌంట్లో అయినా డిపాజిట్ చేశాడా? అని అడుగుతున్నాను. 

ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికీ ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెలా రూ.2 వేల నిరుద్యోగభృతి. మరి 5 సంవత్సరాలు.. అంటే 60 నెలలు ఇంటూ నెలకు రూ.2 వేలు అంటే ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు ఇచ్చాడా? 3 సెంట్లు కాకపోతేపోయే... కనీసం ఏ ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఇచ్చాడా? 

రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు. చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? మన అనకాపల్లిలో ఏమైనా కనిపిస్తోందా? ఆలోచన చేయమని అడుగుతున్నా. ముఖ్యమైన హామీలంటూ 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు సతకం పెట్టి ఇదే ముగ్గురి ఫొటోలు పెట్టి కూటమిగా ఫామ్ అయ్యి మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా? మిమ్మల్నందరినీ అని అడుగుతున్నాను. 

పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా? అదీ లేదు. ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇవ్వకపోగా మళ్లీ ఇప్పుడు ఇదే ముగ్గురితో కూటమి. మళ్లీ ఇదే చంద్రబాబు నాయుడు నాయకత్వం, మళ్లీ ఇదే చంద్రబాబు సంతకంతో మళ్లీ మేనిఫెస్టో అంటున్నాడు. మళ్లీ రంగు రంగుల కాగితాలు అంటున్నాడు. ఏమంటున్నాడు.. సూపర్ సిక్స్ అంటున్నాడు, సూపర్ సెవెన్ అంటున్నాడు. ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నాడు. అక్కా ఇంటింటికీ కేజీ బంగారం అంట.. చెల్లీ... ఇంటింటికీ బెంజ్ కారంట అమ్మా.. నమ్ముతారా? 

*అబద్దాలు, మోసాల మీద పోరాటానికి సిద్ధమే అని చెప్పండి.*
మరి ఇన్ని మోసాలతో, ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును,పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా.. సిద్ధమేనా? సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబుల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. అందులో లైట్ బటన్ ఆన్ చేయండి. పేదల భవిష్యత్తుకు అండగా మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్షలేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు, చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, హాస్పిటళ్లు మెరుగు పడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? 

మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేసే పరిస్థితులు, మంచి చేసే రోజులు దేవుడు ఇంకా చాలా ఇవ్వాలని కోరుకుంటూ.. ఈరోజు మీ అందరికీ కూడా మన పార్టీ తరఫున నిలబడబోతున్న అభ్యర్థులను మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. 

*మన పార్టీ అభ్యర్ధులను దీవించి గెలిపించండి.*
మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మన పార్టీ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను.

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మీలో ఒకడిని మీ లోకల్ ని, బీసీ వర్గాలకు చెందిన అన్నను ముత్యాల నాయుడును మీలో ఒకడిని, మీ అభ్యర్థిగా, మన అభ్యర్థిగా ముత్యాల నాయుడు అన్నను ఎంపీగా నిలబెడుతున్నాం. మీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. మంచి వాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. డిప్యూటీ సీఎంగా కూడామీ బిడ్డ కేబినెట్ లో గొప్ప పాలన ఇచ్చాడు అని ఈ సందర్భంగా చెబుతున్నాను. 

నర్సీపట్నం నుంచి గణేష్ నిలబడుతున్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, సౌమ్యుడు. మంచి చేస్తాడన్న నమ్మకం పూర్తిగా నాకు ఉంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు గణేష్ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

అనకాపల్లి నుంచి భరత్ నిలబడుతున్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి ఆరాటపడుతున్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు భరత్ పై ఉంచి ఈ యువకుడిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో సవినయంగా కోరుకుంటున్నాను. 

చోడవరం నుంచి ధర్మశ్రీ అన్న నిలబడుతున్నాడు. మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

పెందుర్తి నుంచి అదీప్ నిలబడుతున్నాడు. పొట్టివాడైనా గట్టివాడు. మంచివాడు, సౌమ్యుడు, మంచి మనసు కూడా ఉంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అదీప్ పై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. 

పాయకరావుపేట నుంచి జోగులు అన్న నిలబడుతున్నాడు. మంచి వాడు, సౌమ్యుడు, మనసుమాత్రం వెన్నే అని కచ్చితంగా చెబుతాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. 

యలమంచిలి నుంచి కన్నబాబు అన్న నిలబడుతున్నాడు. మంచివాడు, సౌమ్యుడు, ఎప్పుడూ కూడా మంచి చేస్తాడు. కొద్దిగా అప్పుడప్పుడూ మాటలు కటువుగా ఉన్నా మనసుమాత్రం వెన్నే. కన్నబాబు అన్నపైమీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

మాడుగుల నుంచి నా చెల్లెలె అనురాధమ్మ నిలబడుతోంది. మంచి చేస్తుంది. మంచి చేయడానికి ముందుకు వచ్చింది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందర్నీ ప్రార్థిస్తున్నాను. 

మన గుర్తు ఎక్కడో ఇక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి ఉన్నా, తెలియకపోయి ఉన్నా మన గుర్తు ఫ్యాను. అక్కా మన గుర్తు ఫ్యాను అక్కా. అక్కడున్న చెల్లెమ్మలు, అక్కలూ మన గుర్తు ఫ్యానమ్మా చెల్లెమ్మా. అక్కడమ్మా మన గుర్తు ఫ్యాను తల్లీ. అన్నా మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎప్పుడూ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి. మంచి చేసిన మీ ఫ్యాను ఎప్పుడూ ఇంకా మంచి చేసేందుకు అడుగులు ముందుకు వేస్తుందని మరొక్కసారి చెబుతూ ఒక్కసారి మళ్లీ మీ దగ్గరకు వచ్చి మీ అందరికీ నమస్కారం చెబుతూ వీడ్కోలు పలుకుతాను అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అని సీఎం వైయస్.జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
 

Back to Top