మీ డ్రీమ్స్‌ను నా స్కీమ్స్‌తో నెరవేర్చాను 

విజయనగరం మేమంతా సిద్ధం సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

విజయ నగరం జిల్లాలో మహాసముద్రం కనిపిస్తోంది.

శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించేందుకు మీరంతా సిద్ధమా?

ఈ ఎన్నికలు.. రాబోయే అయిదేళ్ల భవిష్యత్తు.

58 నెలల్లో 130సార్లు బటన్‌ నొక్కి సంక్షేమం అందించాం.

దాదాపు 40 పథకాలను పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందించాం.

2 లక్షల 70 వేల కోట్లు నేరుగా ప్రజలకు అందించాం.

నాన్‌డీబీటీ ద్వారా మరో లక్ష కోట్లకు పైగా ఇచ్చాం.

మొత్తం రూ. 3 లక్షల 75 వేల కోట్లకు పైగా అందించాం.

ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా  బటన్‌ నొక్కి నేరుగా ప్రజల ఖాతాలకు నగదు వేశాం.
 
డ్రీమ్స్‌ పేదింటి అమ్మది.. స్కీమ్స్‌ మీ బిడ్డవి.

అక్కాచెల్లెమ్మల సాధికారత కోసం వైయ‌స్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత తీసుకొచ్చాం.

చంద్రబాబుకు ఎప్పుడైనా ఇంతమంచి ఆలోచన వచ్చిందా?

చంద్రబాబు హయాంలో చంద్రముఖి పాలన చూశాం.

అవ్వాతాతల డ్రీమ్స్‌ నెరవేరుస్తూ ప్రతినెలా రూ.3 వేల పెన్షన్‌.

డ్రీమ్స్‌ యువతది.. స్కీమ్స్‌ మీ జగనన్నది.

31 లక్ష ఇళ్ల పట్టాలను పేదింటి మహిళలకు ఇచ్చింది మన వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం
 
స్టార్‌ క్యాంపెయిన్లుగా మీరంతా మీ అన్నకు తోడుగా ఉంటారా?

బాబు పాలనలో స్కీంలు ఉండవు.. స్కాంలు మాత్రమే ఉంటాయి.

జన్మభూమి కమిటీలతో చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారు.

విజయవాడలో కాల్‌ మనీ, సెక్స్‌ రాకెట్‌ నడపడం తప్ప చంద్రబాబు చేసింది ఏంటి?

ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి. 

పొలాల్లో పెట్టే దిష్టిబొమ్మనైనా నమొచ్చేమోకానీ చంద్రబాబును నమ్మలేం.
  
నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా  ఉన్నారు.
  
మాట ఇస్తే నిలబడే పాలన మీ జగన్‌ది

ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచన చేయండి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

 విజ‌య‌న‌గ‌రం:  పేదల కలల్ని అర్దం చేసుకుని మీ జగన్‌, మీ బిడ్డ 40 స్కీమ్స్ తెచ్చాడ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలిపారు. మీ కలల్ని పూర్తి చేసేందుకు ఏకంగా 130 సార్లు బటన్‌ నొక్కాన‌ని, ఏకంగా రెండు లక్షల డబ్బై కోట్ల రూపాయలు నేరుగానే అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాన‌ని చెప్పారు. నా అక్క చెల్లెమ్మల డ్రీమ్స్‌ను.. నా స్కీమ్స్‌ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి పంపించానని  గర్వంగా చెప్పారు.  నా అక్క చెల్లెమ్మల కలలు, నా అవ్వా తాతల కలలు.. ఇలా డ్రీమ్స్‌ మీవి.. స్కీమ్స్‌  మావిగా ఈ 58 నెలల కాలం ప్రయాణం జరిగింద‌ని పేర్కొన్నారు.  టీడీపీ అధినేత చంద్రబాబు వెనక బీజేపీ, కాంగ్రెస్‌ ఉన్నాయన్నారు. ఒకరు ప్రత్యక్షంగా మరొకరు పరోక్షంగా మద్దతిస్తున్నాయని విమర్శించారు. ఒక్క వైయ‌స్ జగన్‌ మీదకు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్‌ ఎగబడుతున్నారని మండిపడ్డారు. ఇంత మంది తోడేళ్లు ఏకమై తన మీద యుద్ధానికి వస్తున్నారని తెలిపారు. పెత్తందార్లకు, నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా  ఉన్నారని స్పష్టం చేశారు. 
 సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజు మంగళవారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చెల్లూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం వైయ‌స్‌ జగన్ ప్ర‌సంగించారు. 

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమన్నారంటే..

 

శతృసైన్యాన్ని ఓడించేందుకు సిద్ధమైన లక్షలాది తాండ్రపాపారాయుళ్లు.*

విజయనగరంలో విజయనగరం జిల్లా సిద్ధం. విజయనగరం జిల్లాలో ఈరోజు ఇక్కడ ఓ మహాసముద్రం కనిపిస్తోంది. ఒక్కసారిగా లక్షల మంది తాండ్రపాపారాయుళ్లు శత్రుసైన్యాన్ని చిత్తుగా ఓడించేందుకు సిద్ధమైతే ఆ యుద్ధం ఎలా ఉంటుందో పేదల వ్యతిరేకులకు రుచి చూపించడానికి నా ఉత్తరాంధ్ర, నా విజయనగరం సిద్ధం సిద్ధం. అని అడుగులు వేస్తుంది. ఈ సభకు వచ్చిన నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా అవ్వా, నా తాతలకు, మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడిగా మీ బిడ్డగా, మీ జగన్ రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. 

 

*నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధమైన ప్రజా సైన్యం*

జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమేకావు. ఈ ఎన్నికలు తమ ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతున్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్తును, తమ పిల్లల భవిష్యత్తును, రాబోయే 5 ఏళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రజలంతా అడ్డు తగులుతున్న ఆ పెత్తందార్ల మీద, ఆ కౌరవ సైన్యం మీద ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం.. సిద్ధం.. సిద్ధం.. అని అడుగులు వేస్తున్న ఓ ప్రజా సైన్యం ఈరోజు నా కళ్ల ఎదుట కనిపిస్తోంది. 

 

ఈ రోజు చంద్రబాబు వెనకాల ఒక కాంగ్రెస్, బీజేపీ ఉంది. ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా ఒకరు మద్దతిస్తున్నారు. ఇదే చంద్రబాబుకు తోడుగా ఈరోజు ఒక దత్తపుత్రుడున్నాడు. ఒక ఈనాడు ఉంది. ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నాయి. వీళ్లందరూ సరిపోరు అన్నట్టుగా ఈరోజు వాళ్లు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయి. మోసాలు, అబద్ధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు మీ జగన్ వెనకాల ఆ ఎల్లో మీడియా లేదు. ఆ పార్టీలు లేవు. ఈ ఒక్క జగన్ మీదకు ఇంత మంది ఏకమవుతున్నారు. 

 

నేను అడుగుతున్నాను. జగన్ కనుక ఇంటింటికీ మంచి చేయకపోయి ఉంటే జగన్ ను ప్రతి ఇంట్లోనూ వాళ్లందరూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ్ముడిగా భావించకపోతే మరి ఇంత మంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. జగన్ ఒకే ఒక్కడు కాదు. నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా చెబుతున్నాను.

*ప్రతి ఇంటికీ మంచి చేశాం.*

ఈ 58 నెలల పాలనలో మీ జగన్, మీ బిడ్డ ఇంటింటికీ మనం చేసిన మంచి నాకున్న నమ్మకం. నాకున్న నమ్మకం ఆ పైనున్న దేవుడి దయ. ప్రతి వర్గానికీ మంచి చేశాం మనం. ప్రతి వర్గాన్నీ మోసం చేసింది వారు. ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రంలో తలపడుతున్నాం. జగన్ ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం.. చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? 

 

*మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేస్తే 420 అంటారు.*

ప్రజల కలల్ని తన మోసాలతో వంచించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు, ఆ బాబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? ఎక్కడైనా గమనించమని కోరుతున్నాను. వస్తువులు ఎత్తుకుపోతే దొంగల ముఠా అంటాం. బెదిరించి దోచుకునేవారిని దోపిడీ ముఠా అంటాం. మరి ఎన్నికలప్పుడు నమ్మించి, ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటున అధికారం ఇస్తే 5 ఏళ్లు మోసం చరిత్ర ఉన్న మూడు పార్టీల కూటమిని మనమంతా ఏమనాలి అని అడుగుతున్నాను. దొంగతనం చేస్తే దొంగ అంటాం. బెదిరిస్తే, హత్యలు చేస్తే దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం. మరి ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు చెప్పి, ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల్ని మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం? ఏమంటాం. 420 యా? 420 యా? బాగా చెప్పారు. అలాంటి వాళ్లను 420 అనే అంటారు. 

 

మళ్లీ మన పేదల కలల్ని, మన పేదల బతుకుల్ని బలిపెట్టి దోచుకునేందుకు వచ్చిన ఈ ముఠాను, రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాం. 420 అని కూడా అంటాం. చంద్రముఖి బృందం అని కూడా అందామా? ఆలోచన చేయమని మిమ్మల్నందరినీ కూడా కోరుతున్నాను. ఏ మనిషికైనా, ఏ కుటుంబానికైనా కూడా వాళ్లకు కొన్ని కలలు, లక్ష్యాలు ఉంటాయి. ఆ కలల్ని నిజం చేసేందుకు మార్గాలు కనుక ఉంటే.. ఆ కుటుంబం ఒక్కో మెట్టు ఎదుగుతూ పోతుంది. 

*డ్రీమ్స్ మీవి, స్కీమ్స్ మీ బిడ్డవి.*

ఆలోచన చేయమని అడుగుతున్నాను. అలాంటి పేదల కలల్ని అర్థం చేసుకుని మీ జగన్, మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? డ్రీమ్స్ మీవి, స్కీమ్స్ మీ బిడ్డవి. మీ స్కీమ్స్ ను నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? దాదాపుగా 40. ఈ 58 నెలల కాలంలో మీ డ్రీమ్స్ ను మీ బిడ్డ పూర్తి చేసేందుకు ఎన్నిసార్లు మీ బిడ్డ బటన్లు నొక్కాడు తెలుసా? ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కాడు. మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో 130 సార్లు బటన్లు నొక్కి అందజేసిన సొమ్మెంతో తెలుసా? ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అందజేశాడు మీ బిడ్డ. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, అది నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తున్న పరిస్థితులు. 

 

ఇక ఈ డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా వేసుకుంటే అంటే ఇళ్ల స్థలాలు, విద్యాకానుక, ట్యాబ్స్.. ఇటువంటివన్నీ వేసుకుంటే ఏకంగా మరో రూ.1 లక్ష కోట్లకుపైగా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో నా అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం వాళ్ల డ్రీమ్స్ మీ బిడ్డ స్కీమ్స్ ద్వారా ఏకంగా రూ.3.75 లక్షల కోట్లు పైచిలుకు నేరుగా పంపించాడు అని కూడా చెప్పడానికి గర్వపడుతున్నాను.

 

ఇదీ 58 నెలల పాలనలో మాత్రమే జరిగింది. మీ డ్రీమ్స్ నెరవేర్చే స్కీముల కోసం వివిధ పథకాల కోసం జరిగింది. ఒక తల్లి కలలు, మీ పిల్లల కలలు, ఒక రైతు కలలు, నా అక్కచెల్లెమ్మల కలలు, నా అవ్వాతాతల కలలు.. ఇలా కలలు మీవి స్కీమ్స్ నావిగా పథకాలు నావిగా ఈ 58 నెలల ప్రయాణం జరిగింది. పేదరికం కారణంగా పిల్లలను బడికి పంపలేక పనికి పంపిన ఎంతో మంది తల్లుల్ని నేను నా ఓదార్పు యాత్రలో, పాదయాత్రలో చూశాను. అలాంటి ప్రతి నిరుపేద తల్లి కలను నిజం చేయటానికే పుట్టిందీ ఓ జగనన్న అమ్మ ఒడి అనే పథకం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నాను. 

 

అంతే కాకుండా ఆ పేద తల్లి తన పిల్లలు, గొప్ప భవిష్యత్తు కోసం కనే కలల గురించి అర్థం చేసుకున్నాను కాబట్టే తన పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా, పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా, పెద్ద పెద్ద చదువులు చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలలో చూడాలని కలలుగన్న ఆ తల్లులకు, మన అమ్మలకు కనే ఈ కలల నుంచి పుట్టిన స్కీములే ఒక నాడు-నేడు. ఒక ఇంగ్లీషు మీడియం బడులు, ఒక సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడుల్లో టోఫెల్ శిక్షణ, గవర్నమెంట్ బడుల పిల్లల్లో బైజూస్  కంటెంట్, 6వ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడుల్లో డిజిటల్ బోధన, క్లాసు రూముల్లో ఐఎఫ్ పీ ప్యానళ్లతో డిజిటల్ బోధనతో పాటు, 8వ తరగతికి వచ్చే సరికే ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టాం. 

*పెద్ద చదువులు కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదని..*

పెద్ద చదువుల కోసం ఏ తల్లీ ఇబ్బంది పడకుండా, అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా ఈరోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, డిగ్రీలు వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు ఏకంగా 93 శాతం మందికి ఈరోజు విద్యాదీవెన, వసతి దీవెన. డిగ్రీ కరిక్యులమ్ లో మార్పులు తీసుకొస్తూ, విదేశీ విశ్వవిద్యాలయాల్లో సర్టిఫైడ్ ఆన్ లైన్ వర్టికల్స్ ను ఆ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేయడం, మన డిగ్రీల్లో మ్యాండేటరీ ఇంటర్న్ షిప్ తీసుకుని రావడం, ఇవన్నీ కూడా నా అక్కచెల్లెమ్మలు, ఆ పిల్లలు కంటున్న ఆ డ్రీమ్స్, ఆ డ్రీమ్స్ నుంచి వచ్చిన మీ జగనన్న స్కీమ్స్ అనిఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను. అవునా కాదా అక్కా? అన్నా, చెల్లెమ్మా.. అవునా కాదా? 

*చంద్రబాబు ఏరోజైనా పేదింటి అక్కచెల్లెమ్మల గురించి ఆలోచించాడా..*

డ్రీమ్ పేదింటి అమ్మది, స్కీమ్ మీ జగన్ ది, మీ బిడ్డది. మరి ఈ తల్లుల కలల గురించి ఈ తల్లుల బాధల గురించి 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకుంటాడు కానీ, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏరోజైనా ఒక్క రోజైనా కూడా ఆ పేదింటి తల్లుల గురించి గానీ, ఆ పేదింటి పిల్లల గురించి గానీ, వాళ్ల కలలు, ఇబ్బందుల గురించి ఏ ఒక్క రోజైనా ఆలోచన చేశాడా? అని కూడా మిమ్మల్నందరినీ అడుగుతున్నాను. 

 

*చంద్రబాబు అంటే చంద్రముఖి.*

చదివించే తల్లుల ఆవేదన ఆ పేద పిల్లల భవిష్యత్తుకు అండగా ఉండాలన్న ఆలోచన, మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు ఎందుకు రాలేదంటే.. ఓ అక్కా.. ఎందుకు రాలేదు? ఓ చెల్లెమ్మా ఎందుకు రాలేదు? కారణం.. చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి. పేదలకు మంచి చేయడం కోసం కాదు ఆయన.. పేదల రక్తం తాగేందుకు లకలకా అని తపిస్తాడు చంద్రబాబు. 

 

మరో డ్రీమ్, మరో స్కీమ్ కూడా చూద్దామా? ఏ అక్కచెల్లెమ్మకు అయినా కూడా ఎలాంటి కలలుంటాయి? ఆత్మగౌరవంతో బతకాలని, తనకు ఒక కల ఉంటుంది. తన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని, కుటుంబం మరింత బాగుండేలా రెండు మెట్లు ఎదగాలని, ఆ తల్లి తనకు అన్ని విధాలా సాయం అందాలని అనుకుంటుంది. కలలు కంటుంది. తాను కూడా తన కుటుంబ బాధ్యతను మోయాలి అని, బాధ్యతగా ప్రతి రూపాయి ఖర్చు చేయాలని, దాంట్లో తాను కూడా భాగస్వామ్యం కావాలని, ఆత్మగౌరవంతో తలెత్తుకుని తాను ఎదగాలి అని కలలు కంటుంది. అవునా కాదా అక్కా? అవునా కాదా చెల్లెమ్మా? మరి అలాంటి కలల నుంచి వారి డ్రీమ్స్ నుంచి జగన్ ఏం స్కీములతో నెరవేర్చాడో చూద్దామా? 

*అక్కచెల్లెమ్మల కలలను జగన్ ఎలా నెరవేర్చాడంటే...*

చంద్రబాబు మాట నమ్మి 2014 నుంచి 2019 మధ్య ఆర్థికంగా కుదేలయిపోయిన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్కచెల్లెమ్మలను మళ్లీ వాళ్లను తమ కాళ్ల మీద తమను నిలబెట్టేందుకు, వారి డ్రీమ్స్ నుసాకారం చేస్తూ ఆ డ్రీమ్స్ లోంచి పుట్టింది ఒక వైయస్సార్ ఆసరా అనే పథకం, ఒక వైయస్సార్ సున్నా వడ్డీ అనే పథకం. ఆ అక్కచెల్లెమ్మలకు అండగా, తోడుగా ఉంటూ మరో నాలుగు మెట్లు ముందుకు వేస్తూ నా అక్కలకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తూ, వారికి తోడుగా ఉంటూ, వారిని చేయిపట్టుకుని నడిపిస్తూ వరుసగా 4 ఏళ్లు ఆ అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటూ తాను నిలదొక్కుకునేలా, తాను ఒక వ్యాపారం చేసేలా, ఆ వ్యాపారం నుంచి అంతో ఇంతో ఆదాయం తాను పొందేలా, ఆత్మగౌరవంతో తాను బతికేలా ఆ అక్కచెల్లెమ్మల కోసం పుట్టింది ఓ వైయస్సార్ చేయూత అనే పథకం. 

 

పథకం తీసుకురావడమే కాకుండా, అదే వయసులో ఉన్న నా కాపు అక్కచెల్లెమ్మల కోసం పుట్టింది మరో పథకం వైయస్సార్ కాపు నేస్తం అని. అదే విధంగా పుట్టింది నా ఈబీసీ అక్కచెల్లెమ్మల కొరకు వైయస్సార్ ఈబీసీ నేస్తం అనే పథకం పుట్టింది 45 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న నా పేద అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటూ వాళ్లు నిలదొక్కుకునేదానికి పుట్టిన పథకాలు ఇవీన్నీ కూడా. ఈ పథకాలన్నీ మన అక్కచెల్లెమ్మల డ్రీమ్స్ ను నిజం చేయడానికి మీ జగన్ పెట్టిన స్కీమ్స్ ఇవీ కావా? అని అడుగుతున్నాను. అవునా కాదా? తల్లీ అని అడుగుతున్నాను. 

 

మరి 14 ఏళ్లు సీఎంగా ఉన్న 3 సార్లు సీఎంగా చేశాను అని చెప్పుకుంటున్న చంద్రబాబు హయాంలో ఏరోజూ కూడా ఇలాంటి స్కీములు ఎందుకు లేవు అని అడుగుతున్నాను. ఏరోజూ చంద్రబాబు హయాంలో ఒక వైయస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైయస్సార్ చేయూత, వైయస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇలాంటి స్కీములు, ఇలాంటి పథకాలు ఏరోజూ లేవు. ఉన్నదల్లా అక్కచెల్లెమ్మలను మోసం చేయడం, వారిని వంచించి, వారిని రోడ్డు మీద పడేసి చంద్రముఖి పాలన నా అక్కచెల్లెమ్మల రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రం చంద్రబాబు హయాంలో చూశాం. అవునా కాదా? చెల్లెమ్మా. 

*మరో డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా చూద్దాం.*

మరో విషయం కూడా చూద్దాం. మరో డ్రీమ్ గురించి మాట్లాడదాం. ప్రతి అక్కచెల్లెమ్మ కల కంటుంది. సొంత ఇల్లు ఉండాలి అని ప్రతి అక్కచెల్లెమ్మ కూడా కల కంటుంది. కొన్ని కుటుంబాలకు ఇది జీవిత కాల కల కూడా అవుతుంది. జీవిత కాలం కూడా ఎదురు చూస్తారు ఒక సొంత ఇల్లు ఉండాలి, నెరవేరాలి అని. మరి ఆ డ్రీమ్ ను నెరవేరుస్తూ మీ బిడ్డ మీ జగన్ ఏం చేశాడు? ఏకంగా నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు మీ బిడ్డ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడా లేదా?  అక్క, అన్నా, చెల్లెమ్మా ఇచ్చాడా లేదా మీ బిడ్డ. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేస్తూ తీసుకొచ్చాడు మీ బిడ్డ.  నా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ ఓ మంచి స్కీము. డ్రీమ్ మీది, స్కీమ్ మీ అన్నది, మీ బిడ్డది, మీ తమ్ముడిది. 

 

*అక్కచెల్లెమ్మల రక్షణ కోసం దిశ యాప్..*

తమ రక్షణకు ప్రతి అక్కచెల్లెమ్మా అనుకుంటుంది.మరీ ముఖ్యంగా నా చెల్లెమ్మలు అనుకుంటారు. తమ రక్షణకు పిలిచిన వెంటనే పలికే ఆ రక్షకుడు కావాలి అని చెప్పి. ఆ రక్షకుడు కావాలి అనే ఆ చెల్లెమ్మ మనసులో ఉన్న ఆ మాట తెలుసుకుని మీ ఆలోచన తెలుసుకుని ఆ ఆలోచన నుంచి పుట్టింది ఒక స్కీము, ఒక దిశ యాప్. ప్రతి అక్కచెల్లెమ్మ కూడా తమ ఫోన్లో దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఎక్కడికైనా ఎప్పుడైనా పోగలుగుతుంది. ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మ ఆ ఫోన్ లో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, లేదా 5 సార్లు ఆ ఫోన్ షేక్ చేసినా వెంటనే ఆ అక్కచెల్లెమ్మకు ఫోన్ వస్తుంది. 10 నిమిషాల్లో పోలీస్ సోదరుడు అక్కచెల్లెమ్మ దగ్గరకు వస్తాడు. వచ్చి చెల్లెమ్మా ఏమైంది అని అడిగే పరిస్థితి వచ్చింది ఎప్పుడు? ఇచ్చింది ఎవరు? తెచ్చింది ఎవరు? డ్రీమ్ మీది, స్కీమ్ మీ జగన్ ది, మీ బిడ్డది, మీ తమ్ముడిది, మీ అన్నది. 

 

మొట్ట మొదటిసారిగా ఈరోజు చూస్తున్నాం. ప్రతి గ్రామంలో ఓ మహిళా పోలీస్. ప్రతి అక్కచెల్లెమ్మకు నేను పక్కనే ఉన్నా అని భరోసా కల్పిస్తూ ఇస్తున్న మహిళా పోలీసు ఈరోజు ప్రతి గ్రామంలో కనిపిస్తోంది. మరి బాబు చేసింది ఏమిటి? అక్కచెల్లెమ్మలను మోసం చేయడం తప్ప.. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ నడపటం తప్ప.. బాబు చేసింది ఏమిటి? మనం కలలు కంటున్న మంచి కలల్లోకి ఒక చంద్రముఖిలా ఆ డ్రీమ్స్ లోకి ఎంటరై ఆ అక్కచెల్లెమ్మలను రక్తం పీల్చడం తప్ప చంద్రబాబు చేసిందేమిటి అని అడుగుతున్నాను. 

 

*మంచి చేసిన మీ అన్నకు ప్రతి ఏటా రాఖీ కడతారా?*

మరి ఇన్ని పథకాలు అందించిన మీ అన్నకు,మీ తమ్ముడికి, మీ బిడ్డకు మీరంతా ప్రతి ఏటా రాఖీ కడతారా అని అడుగుతున్నా నా అక్కచెల్లెమ్మలకు. ఏం చెల్లెమ్మా? ఏం అక్కా రాఖీ కడతారా మీ అన్నకు. మీరంతా రక్షగా నిలుస్తారా? స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ బయటకు వస్తారా? 

*లంచాలు, వివక్ష లేని పాలన అందించాం...*

ఒక్క రూపాయి కూడా లంచంగానీ, ఎక్కడా కూడా వివక్ష లేకుండా మనందరి పాలనలో మీ బిడ్డ అందించిన ప్రతి డీబీటీని కూడా అంటే నేరుగా మీ బిడ్డ నొక్కడం, నేరుగా ఆ డబ్బులు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోవడం. ఈ డబ్బులో రూ.2.70 లక్షల కోట్లలో సింహభాగం ఎవరికి ఇచ్చాడు మీ బిడ్డ అంటే.. మీ బిడ్డ గర్వంగా చెబుతాడు. నా అక్కచెల్లెమ్మలకే ఇచ్చాను అని ఈ సందర్భంగా గర్వంగా మీ బిడ్డ చెబుతాడు, ఏం అక్కా మీకు వచ్చిందా లేదా? ఏం చెల్లెమ్మా.. మీకు వచ్చిందా లేదా? 

 

మరి అందరూ ఆలోచన చేయమని అడుగుతున్నాను. చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అని. మీ బిడ్డ ఎలా చేయగలిగాడు. చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువే.మరి మీ బిడ్డ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు ఎందుకు చేయలేదు అని ప్రతి అక్కచెల్లెమ్మా తమ ఇంట్లో తమ పిల్లలతో, భర్తతో, అవ్వాతాతలతో కూర్చొని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా.కారణం మీ జగన్ బటన్లు నొక్కుతున్నాడు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్తోంది. ఎక్కడాలంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు. 

*జన్మభూమి కమటీలతో దోచుకున్న చంద్రబాబు.*

కానీ అదే చంద్రబాబు ఏం చేశాడు. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబు దాకా రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. అందుకే ఆ రూ.2.70 లక్షల కోట్లు మీ బిడ్డ బటన్ నొక్కితే మీ ఖాతాల్లోకి, మీ చేతిలోకి డబ్బులు వస్తే, చంద్రబాబు హయాంలో ఈ రూ.2.70 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లింది అని ప్రతి అక్కాచెల్లెమ్మా కూడా గట్టిగా అడగండి అని అడుగుతున్నాను.

 

*చంద్రబాబు విఫల హామీల మోసాలు.*

చంద్రబాబు హయాంలో డీబీటీలు లేవు. ఇలా బటన్లు నొక్కడమూ లేదు. అక్కచెల్లెమ్మల చేతుల్లోకి డబ్బులిచ్చింది అంతకన్నా కూడా లేదు. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు రుణ మాఫీ అంటూ చేసింది ఓ మోసం. చంద్రబాబు హయాంలో ఎన్నికలప్పుడు 2014లో చేసిన మేనిఫెస్టోలో చెప్పిన హామీలు.. ఏటా ప్రతి అక్కచెల్లెమ్మకూ 12 సిలిండర్లు ఇస్తామని, ఆ ప్రతి సిలిండర్ కూ రూ.100 చొప్పున సబ్సిడీ అని, 5 సంవత్సరాల్లో రూ.6 వేల సబ్సిడీ ఇస్తాను అని చంద్రబాబు చేసింది ఇంకో మోసం. ఆడబిడ్డ పుట్టగానే ప్రతి బ్యాంకు ఖాతాల్లోకి రూ.25 వేలు డిపాజిట్ చేస్తామని చంద్రబాబు చేసిన మరో మోసం. 

 

గర్భిణులకు రూ.10 వేలు ఇస్తాను అని తాను చేసిన ఇంకో మోసం, బడి పిల్లలకు ఇస్తానన్న సైకిల్ మరో మోసం. అక్కచెల్లెమ్మలకు ఇస్తానన్న సెల్ ఫోన్లు ఇంకో మోసం. చంద్రబాబు హయాం అంతా కూడా ఆయన 2014లో మేనిఫెస్టోలో చెప్పిందేమిటి? ఆయన చేసిందేమిటి? అని చూస్తే చంద్రబాబు 5 సంవత్సరాల పాలనంతా కూడా మోసం మోసం మోసం.. దగా.. దగా.. దగా.. బాబు పాలనలో స్కీములుండవు గానీ, బాబు పాలనలో స్కాములు మాత్రం చాలా ఉంటాయి. మరో డ్రీమ్ గురించి మాట్లాడదామా? 

 

ఇదీ మన అవ్వాతాతల గురించి. మన అవ్వాతాతలత డ్రీమ్స్ గురించి మాట్లాడదామా? మన అవ్వాతాతలు ఏం కోరుకుంటారు? ఏం ఆశిస్తారు? ఏం కలలు కంటారు? మనమంతా చూపించాల్సిన మానవత్వం గురించి మాట్లాడదామా? పెన్షన్ కోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి ఆ తర్వాత లంచాలు, వివక్షకు లోనై, ఆ తర్వాత ఇచ్చే అరకొర పెన్షన్ కూడా ఎండల్లో, వానల్లో పడిగాపులుగాచి, ఎక్కడికెక్కడో వెళ్లి క్యూలల్లో నిలబడుతున్న నా అవ్వాతాతల డ్రీమ్ ఏమిటో తెలుసా? ఆ పెన్షన్ లంచాలు ఇచ్చుకుంటూ జన్మభూమి కమిటీల చేత శాంక్షన్ చేయించుకునేందుకు, ఆ తర్వాత పెన్షన్ తీసుకునేందుకు క్యూలలో నిలబడి తమ ప్రాణాలు అక్కడికక్కడే పోయే పరిస్థితి ఎవరికీ రాకూడదు అన్నది ఆ అవ్వాతాతల డ్రీమ్. తమకిచ్చే ఆ పెన్షన్ సొమ్ము అరకొరగా కాకుండా కాస్తంత పెంచి అందితే బాగుంటుంది అన్నది ఆ అవ్వాతాతల డ్రీమ్. నేను అడుగుతున్నాను. ఇదీ నా అవ్వాతాతల డ్రీమ్. మరి నా అవ్వాతాతల డ్రీమ్ ను నెరవేరుస్తూ వారి బిడ్డ, వారి మనవడు తెచ్చిన స్కీమ్ ఏమిటి? 

ఆ అవ్వాతాతల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ నేరుగా ఇంటికే వచ్చే వాలంటీర్లు నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే రూ.3 వేల పెన్షన్. ఎక్కడా లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఎక్కడా వివక్షకు లోను కావాల్సిన పని లేదు. నేరుగా 1వ తారీఖు పొద్దునే అది ఆదివారమైనా, సెలవుదినమైనా, పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ వాలంటీర్ ఇంటికి వచ్చి ప్రతి అవ్వనూ, ప్రతి తాతనూ పలకరిస్తూ ఆ అవ్వచేతిలో రూ.3 వేలు పెట్టే స్కీము తెచ్చిందెవరు? ఆ అవ్వాతాతలకు ఒక మంచి మనవడు. ఆ ఇంట్లో ఓ మంచి బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. 

 

మరి బాబు స్కీమేమిటి? ఆ చంద్రముఖి స్కీమేమిటి? ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఆ అవ్వాతతలకు ఇచ్చిన పెన్షన్ ఎంత? కేవలం ముష్టి వేసినట్లు అరకొరగా రూ.1000. అది కూడా ఇచ్చింది ఎంతమందికో తెలుసా అరకొరగా కేవలం 39 లక్షల మందికి మాత్రమే. అది కూడా ఆ అవ్వాతతలు పెద్ద పెద్ద క్యూలలో నిలబడుతూ రోజుల తరబడి ఆ పెన్షన్ సొమ్ము కోసం ఎదురు చూస్తూ నిలబడుతున్న పరిస్థితులు. మరి ఆ చంద్రముఖి పాలన, లకలకా అంటూ రక్తం పీల్చే చంద్రముఖి గుర్తుకొస్తున్నాడా? ఏమక్కా, ఏమవ్వా గుర్తుకొస్తున్నాడా? మళ్లీ అలాంటి పాలన కావాలా? 

 

ఆ బాబు పాలన గురించి మాట్లాడితే రేషన్ కోసం క్యూలో నిలబడి ఆరోజు పని మానేసుకోవాల్సిన పరిస్థితి. లేదంటే ఆరోజు పిల్లలను స్కూలు మాన్పించాల్సిన పరిస్థితి మార్చింది ఎవరు? ఈరోజు ఇంటి వద్దకే రేషన్ తెస్తున్నది ఎవరు? ఇచ్చే ఆ బియ్యం క్వాలిటీ కూడామార్చి మరీ నా పేదింటి అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నది ఎవరంటే మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. డ్రీమ్ మీది, స్కీము మీ బిడ్డది. 

*58 నెలల కాలంలో ఏకంగా 2.31 లక్షల ఉద్యోగాలు*

చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగం ఒక కల అయితే, దేశ చరిత్రలోనే ఏ ఒక్క ప్రభుత్వం కూడా 5 ఏళ్లలో ఇవ్వని విధంగా ఏకంగా ఈ 58 నెలల కాలంలో 2.31 లక్షల ఉద్యోగాలు, మళ్లీ చెబుతున్నా,దేశంలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? మన ప్రతి గ్రామ సచివాలయంలో కనిపిస్తారు. మన పిల్లలే, మన చుట్టుపక్కల ఉన్న పిల్లలే, మన చెల్లెమ్మలే, మన తమ్ముళ్లే మన ఎదుటగానే కనిపిస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఆస్పత్రిలోకి వెళ్లినా అక్కడా కనిపిస్తారు. మారిన బడుల్లో కూడా కనిపిస్తారు. ఏకంగా 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చినది ఎవరంటే మీ బిడ్డ, కలలు ఆ యువతది, చేసింది మీ బిడ్డ. స్కీము మీ బిడ్డది అని కూడా సగర్వంగా తెలియజేస్తున్నాను. 

 

మరి బాబు చేసిందేమిటి? స్కీములతో ప్రజల జేబుల్లోకి సొమ్ము పంపితే దాన్ని మీ జగన్ అంటారు. ఏ స్కీమూ లేకుండా ప్రజల జేబుల్లో ఉన్న సొమ్మును లంచాలు అంటూ లాక్కుంటే అది బాబు అంటారు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం.. ఇదీ బాబు చేసిన డ్రీమ్. 

 

ఇప్పుడు మన రైతుల గురించి మాట్లాడదామా? ఒక రైతన్న ఏం కోరుకుంటాడు? ఏం కలకంటాడు? పంట వేసే సమయానికే పెట్టుబడికి డబ్బు చేతికే అందాలనుకుంటాడు ఆ రైతన్న. తన కష్టం వడ్డీ వ్యాపారుల పాలు కాకూడదనుకుంటాడు ఆ రైతన్న. నేల అదునుగా ఉన్నప్పుడు విత్తనం నాటాలని, సమయానికే ఆ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా తన గ్రామంలోనే, తనకు అందాలని ఆశిస్తాడు ఆ రైతన్న. పంట బాగా పండాలని, చీడపీడలు ఆశించకూడదని, కరువు, వరద రాకూడదు అని, పండించిన పంటకు సరైన ధర రావాలని కోరుకుంటాడు ఆ రైతన్న. ఏదైనా రాకూడని విపత్తు వస్తే పంట చేతికి రాకపోతే అప్పుపాలై రోడ్డుపాలు కాకూడదని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆశిస్తాడు ఆ రైతన్న. ఇదీ ఆ రైతన్న డ్రీమ్. 

 

*ఆర్బీకేలు, రైతు భరోసాతో రైతన్న కల కూడా నెరవేర్చాం..*

మరి ఆ రైతన్న కలల్ని నెరవేర్చడానికి ఈ 58 నెలల కాలంలో మీ జగన్ ఏం చేశాడో కూడా చూద్దామా? మీ జగన్ అరకోటికిపైగా రైతుల మొదటి కల పెట్టుబడికి అండగా ఏ స్కీమ్ తో నెరవేర్చాడు అంటే వైయస్సార్ రైతు భరోసా అనే స్కీమ్ తో నెరవేర్చాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడైనా రైతు భరోసా ఉందా? మరి వచ్చింది ఎప్పుడు? ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. 

 

గ్రామంలోనే ఒక రైతు భరోసా కేంద్రం వచ్చింది. ప్రతి ఎకరాకూ ఈక్రాప్ అయింది. ఒక ఉచిత పంటల బీమా వచ్చింది. పగటిపూటే 9 గంటలపాటూ రైతన్నలకు ఉచిత కరెంటు అందుతోంది. సకాలంలోనే రైతన్నకు ఇన్ పుట్ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా దళారీలు లేని పంట కొనుగోలు చేస్తున్నది, ఎంఎస్పీకి మించి జీఎల్టీ అనే పేరుతో ఇంకా రైతన్నలకు అదనపు రేటు ఇస్తూ ధాన్యం కొనుగోలుకు ఏకంగా రూ.65 వేల కోట్లు ఖర్చు చేసింది, కేంద్ర ఎంఎస్పీ లేని ఇతర పంటలకు సైతం మరో రూ.7,200 కోట్లు ఖర్చు చేసి ధరలు పడిపోకుండా ఆ రైతన్నకు తోడుగా నిలిచినది, ఇది కూడా మీ బిడ్డ వచ్చిన తర్వాతే జరిగింది. 

 

రైతన్నలకు అదనపు ఆదాయం చూపించాలి అని చెప్పి అమూల్ ను తీసుకురావడం ద్వారా పాడి రైతులకు అండగా నిలిచింది కూడా ఎప్పుడు అంటే అదీ ఈ 58 నెలల కాలంలోనే. ఏకంగా 35 లక్షల ఎకరాల భూముల మీద రైతులకు పూర్తి హక్కులు ఇచ్చింది ఎప్పుడంటే అది కూడా ఈ 58 నెలల్లోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. ఈ డ్రీమ్స్ అన్నింటికీ స్కీమ్స్ రూపంలో సమాధానం చెప్పింది ఎప్పుడు? ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని కూడా సగర్వంగా చెబుతున్నాను. ఇది రైతుల డ్రీమ్, ఇదీ మీ జగనన్న మీస్కీములు అని కూడా సగర్వంగా చెబుతున్నాను. 

 

*సమాధానం చెప్పు చంద్రబాబూ?*

మరి రైతుల గురించి ఈ బాబు ఏరోజైనా ఆలోచించాడా? ఓ చంద్రబాబూ.. ఏమయ్యా చంద్రబాబూ.. వినవయ్యా చంద్రబాబూ.. సమాధానం చెప్పవయ్యా చంద్రబాబూ.. రైతుల గురించి మరి నువ్వేం చేశావు? అని అడిగితే చంద్రబాబు ఏం చెబుతాడో తెలుసా? వ్యవసాయం దండగ అంటాడు. రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అంటాడు. రుణ మాఫీ చేసేస్తా. మొదటి సంతకం పెట్టేస్తా అని నిలువునా మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తా అని చెప్పి ఏకంగా ఆ బ్యాంకులు రైతన్నల బంగారం వేలం వేస్తుంటే చోద్యం చూశాడు. రైతన్నలంతా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీ పొలాలలో పెట్టే దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చేమోగానీ, చంద్రబాబును మాత్రం నమ్మలేము అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. 

 

ఆలోచించండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే ప్రతి ఒక్కరి కలనీ నిజం చేయడానికి మీ బిడ్డ పాలనలో అడుగులు పడ్డాయి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఒక తల్లి డ్రీము, మీ జగన్ స్కీము. ఒక రైతు డ్రీము, మీ జగన్ స్కీము. ఓ అక్కచెల్లెమ్మ డ్రీము, మీ జగనన్న స్కీము. చిన్నారుల డ్రీము, మీ జగన్ మేనమామ స్కీము. అవ్వాతాతల డ్రీము, మీ మనవడి స్కీము. యువత డ్రీము, మీ జగనన్న స్కీము. ఇవన్నీ కూడా కళ్లెదుటే కనిపిస్తున్న వాస్తవాలు. అవునా కాదా? అని మిమ్మల్నందరినీ అడుగుతున్నాను. 

 

*ఓ పల్లె కల నెరవేరిన వేళ...*

ఇప్పుడు మరో ముఖ్యమైన కల గురించి చెబుతాను. నిజంగా ఈ కల వింటే మీరు కూడా ఎంతో సంతోషపడతారు. ఇది ఒక పల్లె కల. ఒక ఊరి కల. ఇది ఒక గ్రామం కల. అవును ఊరికి కూడా కలలుంటాయి. గ్రామం బాగుంటేనే ఆ గ్రామంలో అందే సేవలు బాగుంటేనే గ్రామమంతా బాగుంటుంది అని, ఆ గ్రామాన్ని ఎవరూ విడిచిపెట్టి ఎక్కడికెక్కడో వెళ్లిపోరు అని ఆ గ్రామానికి కూడా కల ఉంటుంది. మరి ఆ గ్రామం డ్రీమ్ కు మీ జగన్ ఎన్ని స్కీములు తీసుకొచ్చాడో తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.. ఏకంగా 7 స్కీములు ఆ గ్రామం కోసం మీ బిడ్డ తీసుకొచ్చాడు. 

 

ఆ గ్రామంలోనే కనిపిస్తుంది గ్రామ వార్డు సచివాలయాలు. ఆ గ్రామంలోనే కనిపిస్తాయి 60-70 ఇళ్లకొక వాలంటీర్ వ్యవస్థ. ఆ గ్రామంలోనే కనిపిస్తుంది రైతు భరోసా కేంద్రం. ఆ గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్. అదే గ్రామంలోనే కనిపిస్తుంది నాడునేడుతో మారిన ఇంగ్లీషు మీడియం స్కూలు. అదే గ్రామంలోనే కనిపిస్తుంది ఒక గ్రామంలోనే మహిళా పోలీసు. ఈ ఆరింటితోపాటు ఏడో వ్యవస్థ నిర్మాణం అవుతున్న డిజిటల్ లైబ్రరీలు. గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్. ఇది ప్రతి గ్రామంలోనూ కనిపించే మీ జగన్ మార్కు. మన వైయస్సార్ సీపీ మార్క్ అని కూడా సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇది గ్రామం డ్రీము, మీ జగనన్న స్కీము.

 

*మన రాష్ట్రానికీ ఒక డ్రీమ్ ఉంది దాన్ని కూడా నెరవేరుస్తున్నాం.*

 గ్రామానికే కాదు.. మన రాష్ట్రానికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. 

స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ చేయనట్టుగా రాష్ట్రం డ్రీమ్ ను నెరవేరుస్తూ.. రాష్ట్రంలో ఈరోజు 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో అవుతున్నాయా లేదా అని అడుగుతున్నాను. మీ విజయనగరంలోనే కనిపిస్తోందా? అని అడుగుతున్నాను. 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కొత్తగా 26 జిల్లాలు, 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు, 11 వేల విలేజ్, వార్డు క్లినిక్ లు, 11 వేల రైతు భరోసా కేంద్రాలు, ఇప్పటికే 3 వేల డిజిటల్ లైబ్రరీలు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, మారు మూల గిరిజన ప్రాంతాలకు కూడా సెల్ టవర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఎయిర్ పోర్టుల విస్తరణ, కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వాయువేగంతో పనులు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్, రూ.1 లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు... ఇలా రాష్ట్రం కలల సాధన కోసం ప్రతి అడుగూ వేసింది మీ జగన్, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. ఈ 58 నెలల కాలంలోనే ఇవన్నీ జరిగాయి. 

 

ప్రతి స్కీమూ తీసుకొచ్చింది మీ బిడ్డ ప్రభుత్వం కాదా? అని అడుగుతున్నాను. డ్రీమ్ ప్రజలదైతే స్కీము జగన్ ది, మీ బిడ్డది. అవునా? కాదా? అని మీ అందరితో కూడా అడుగుతున్నాను. మరి మీ డ్రీమ్స్ నిజం చేయడానికి బాబు ఏం చేశాడు అని అడుగుతున్నాను.

 

*బాబు హాయంలో స్కాములు తప్ప స్కీములు లేవు.*

స్కీములు ఎలాగూ లేవు. స్కాములు మాత్రం చాలా ఉన్నాయి. రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం.. ఇదీ చంద్రబాబు చేసిన ఘనకార్యం. ఆలోచన చేయమని అడుగుతున్నాను.మీ బిడ్డ పాలన చూశారు. మాట ఇస్తే నిలబడే పాలన మీ బిడ్డలో కనిపించింది. మరి చంద్రబాబు పాలన చూశారు. ప్రతి ఎన్నికలప్పుడూ రంగురంగుల మేనిఫెస్టో అని తీసుకొస్తాడు. ప్రతి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు. ప్రజలందరినీ ప్రతి అడుగులోనూ మోసం చేస్తూ వస్తాడు. ఆలోచన చేయమని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడును నమ్మాలా? వద్దా? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోమని కోరుతున్నాను.

 

*చంద్రబాబు విఫల హామీలు...*

మీ అందరితో కూడా ఒక్క సారి ఇంటికి వెళ్లి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు 2014లో తాను ఏం చెప్పాడు, తాను ఏం చేశాడు అన్నది కూడా ఒక్కసారి అందరూ కూడా మర్చిపోకుండా ఆలోచన చేయమని కోరుతున్నాను. 2014 ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతున్నాను. ఆ చంద్రముఖి పాలనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతున్నాను. 2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు ముగ్గురి కూటమి, మూడు పార్టీలతో కూటమిలోకి వచ్చాడు. ఇదే ముగ్గురి కూటమితో 2014లో ఇవే మూడు పార్టీలు గుర్తున్నాయా? 2014లో మీ ఇంటింటికీ పంపించిన ఈ పాంప్లెట్ గుర్తుందా? గుర్తుందా అన్నా? ముఖ్యమైన హామీలు అంటూ 2014లో ఇదే మూడు పార్టీలతో కూటమి, ఒకవైపు చంద్రబాబు కనిపిస్తాడు, మరోవైపున దత్తపుత్రుడు కనిపిస్తాడు. పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫొటో కూడా కనిపిస్తుంది. కింద చూస్తే చంద్రబాబు నాయుడు సంతకం కూడా కనిపిస్తుంది. 

 

ముఖ్యమైన హామీలంటూ 2014లో ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికీ పంపించడంతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లోనూ అడ్వర్టైజ్  మెంట్లతో ఊదరగొట్టాడు. గుర్తున్నాయా ఆ చంద్రముఖి రోజులు. ఆయన రాసిన ముఖ్యమైన హామీలు చదవమంటారా? జరిగాయా లేదా మీరే చెబుతారా? 

 

రైతు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ అయ్యిందా? రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. రూ.14205 కోట్లు.. కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? అని అడుగుతున్నాను. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఏమక్కా.. అన్నా.. చెల్లెమ్మా.. చేశాడా? ఒక్క రూపాయి అయినా చేశాడా? 

 

ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికీ ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేలు నెలనెలా నిరుద్యోగభృతి.. 5 ఏళ్లలో 60 నెలల్లో నెలకు రూ.2 వేల చొప్పున అంటే ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు. 3 సెంట్ల కథ దేవుడెరుగు.. మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు. చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు చేశాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మీ విజయనగరంలో కనిపిస్తోందా? ఈ ముఖ్యమైన హామీలంటూ ఇందులో ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా? అని మిమ్మల్నందరినీ కూడా అడుగుతున్నాను. ప్రత్యేక హోదా ఇచ్చాడా? అని అడుగుతున్నాను. 

 

ఇవ్వకపోగా ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురు కూటమిగా వచ్చి చంద్రబాబు నాయకత్వంలో మళ్లీ ఏమంటున్నారు. ఈరోజు మళ్లీ సూపర్ సిక్స్ అంట, సూపర్ సెవెన్ అంట. ఇంటింటికీ కేజీ బంగారమంట. ఇంటింటికీ బెంజ్ కారంట. నమ్ముతారా అక్కా? నమ్ముతారా అన్నా? నమ్ముతారా చెల్లెమ్మా? 

 

*పేదల భవిష్యత్ కోసం యుద్ధానికి సిద్ధమని చెప్పండి.*

మరి ఇన్ని మోసాలతో, ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే.. వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాలను ఎదుర్కొనేందుకు మీ జేబుల్లోంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్తు కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. 

 

వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం, మన ఆస్పత్రులు మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలని, 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. నేను సిద్ధం. మరి మీరు సిద్ధమేనా? 

 

*మన పార్టీ అభ్యర్ధులను ఆశీర్వదించి గెలిపించండి.*

విజయనగరం నుంచి మన పార్టీ అభ్యర్థులను మీ అందరికీ పరిచయం చేస్తాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మన పార్టీ అభ్యర్థులపై ఉంచవలసిందిగా మీ అందరితో సవినయంగా వేడుకుంటున్నాను. 

 

విజయనగరం ఎంపీగా మీ అందరికీ పరిచయస్తుడు, మన చంద్రశేఖర్ అన్నను పరిచయం చేస్తున్నాను.మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. చంద్రశేఖర్ అన్నను గొప్ప మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరితో సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

 

విజయనగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్రస్వామి అన్నను పరిచయం చేస్తున్నాను. సౌమ్యుడు, మనసు మాత్రం వెన్న. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. 

 

బొబ్బిలి నుంచి చిన్న అప్పలనాయుడు అన్నను పరిచయం చేస్తున్నాను. మీలో ఒకడు, మీ వాడు, మంచివాడు, సౌమ్యుడు. వెన్నలాంటి మనసున్న వాడు. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

 

నెల్లిమర్ల నుంచి అప్పలనాయుడును పరిచయం చేస్తున్నాను. తాను కూడా మంచి వాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అప్పలనాయుడుపై ఉంచవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. 

 

రాజాం నుంచి రాజేష్ ను పరిచయం చేస్తున్నాను. తాను డాక్టర్, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి ముందుకొచ్చాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు డాక్టర్ రాజేష్ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

 

గజపతినగరం నుంచి అప్పలనర్సయ్యను పరిచయం చేస్తున్నాను. మంచి వాడు, సౌమ్యుడు, వెన్నలాంటి మనసున్న వాడు. మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి. అన్నను గొప్ప మెజార్టీతో ఆశీర్వదించాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

 

ఎచ్చెర్ల నుంచి కిరణ్ అన్నను పరిచయం చేస్తున్నాను. తాను కూడా మంచి వాడు, సౌమ్యుడు. కొంచం కటువుగా అప్పుడప్పుడు అనిపిస్తాడు కానీ గుండె మాత్రం చాలా మెతక, మంచివాడు,సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు కిరణ్ అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను.  

 

చీపురుపల్లి నుంచి నాకు తండ్రిలాంటి వాడు అన్న అంటుంటాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు. గొప్ప మెజార్టీతో అన్నను(బొత్స సత్యనారాయణ) ఆశీర్వదించవలసిందిగా మీ అందర్నీ కూడా కోరుతున్నాను. 

 

*మన గుర్తు ఫ్యాను- గుర్తుంచుకొండి.*

మన గుర్తు ఎవరికైనా, ఇక్కడో, అక్కడో, ఎక్కడో ఎవరికైనా మర్చిపోయి ఉన్నా, తెలియకపోయి ఉన్నా.. అవ్వా అక్కడ.. ఎర్రచీర కట్టుకున్న అవ్వా మన గుర్తు ఫ్యాను అవ్వా. అక్కా మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాను అన్నా, మన గుర్తు ఫ్యాను తమ్ముడూ, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాసు సింక్ లో ఉండాలి. ఒక్కసారి అక్కడికి వచ్చి మీ అందరికీ కనపడి ఆ తర్వాత సెలవు తీసుకుంటాను. అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Back to Top