స్టీల్ ప్లాంట్ కార్మికుల‌కు వైయ‌స్ఆర్ సీపీ అండ‌గా నిలుస్తుంది

ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా మొద‌ట గ‌ళ‌మెత్తింది వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌భుత్వ‌మే

ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణ‌యానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం

ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికతక వైయస్ఆర్ సీపీకే ఉంది

స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువలను విడిచిపెట్టాయి

కార్మికుల‌తో వైయ‌స్ఆర్ సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌

విశాఖ‌: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా మొట్ట‌మొద‌ట‌గా కార్మికుల త‌ర‌ఫున రాష్ట్ర ప్ర‌భుత్వం, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ‌ళ‌మెత్తింద‌ని, స్టీల్ ప్లాంట్ విష‌యంలో కార్మికుల‌కు వైయ‌స్ఆర్ సీపీ అండ‌గా నిలుస్తుంద‌ని పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. విశాఖపట్నం జిల్లా ఎండాడలో `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర‌ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కార్మిక సంఘాల నాయకులు నివేదించారు. అనంత‌రం కార్మిక సంఘాల నాయకులతో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.

సీఎం ఏం మాట్లాడారంటే..
`రాష్ట్ర ప్రభుత్వం, వైయస్ఆర్ సీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుంది. ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని తొలిసారిగా ప్రధానికి లేఖ రాశాం. స్టీల్ ప్లాంట్ అంశంపై పరిష్కారాలు కూడా సూచించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలది రాజీలేని ధోరణి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు జట్టుకట్టాయి, కూటమిగా ఏర్పడ్డాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువలను విడిచిపెట్టాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో వారి వైఖరి ఏంటో బయటపడింది. శాశ్వతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయింపుతో ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుంది. మిగతా అంశాలు దీనివల్ల పరిష్కారం అవుతాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకు వస్తూనే ఉన్నాం. ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికతక వైయస్ఆర్ సీపీకే ఉంది. పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరుతున్నాను` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కార్మికుల‌ను కోరారు. 

Back to Top