శాసన సభను అవమానించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి

కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి
 

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి ప్రజా సమస్యల మీద మాట్లాడే హక్కు ఉంది. గాంధీ గిరి పద్ధతుల్లో తెలియజేసే హక్కుంది. అలా చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య భావాలు కలిగిన మా నాయకుడు, నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ స్వాగతిస్తారు. ఈ భారత దేశం అంతా ముఖ్యమంత్రి అంటే వైయస్ జగన్‌లా ఉండాలి అనుకుంటోంది. ఈ రాష్ట్రం నీరాజనాలు పడుతోంది. ఇది చూడలేక అక్కసుతో, ఓర్వలేనితనంతో అడ్డగోలుగా రోజూ ఆరోపణలు, డ్రామాలు చేస్తున్నారు. చంద్రబాబు మీద నాకు గౌరవం ఉంది. ఎందుకంటే వారి విషయ పరిజ్ఞానం చూసి కాదు, వారి పరిపాలన చూసి కాదు ఈ రాష్ట్ర శాసన సభలో అందరికంటే సీనియర్ కదా అందుకు. 1978 నుంచి ఇప్పటిదాకా సభలో సభ్యుడు బాబు. మధ్యలో 1983లో సొంత మామగారైన ఎన్టీరామారావు అయినా సరే నాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం అంటూ పోటీ చేసి తెలుగుదేశం పార్టీ చేతులో చిత్తుచిత్తుగా ఓడిపోయిన సందర్భంలో, మరోసారి 1989 లో తప్ప ఇన్నేళ్లుగా సభలో కొనసాగుతున్న సీనియర్ మోస్టు నాయకుడు చంద్రబాబు. 1985 లో దొడ్డిదారిన కర్షక పరిషత్ పేరుతో వచ్చి హైకోర్టులో చివాట్లు తిని వెనక్కి వెళ్లాడు. అలాంటి చంద్రబాబు మార్షల్స్ తో ప్రవర్తించిన తీరు హేయంగా ఉంది. స్పీకర్ ఎంతో శక్తి వంతులు. 1989లో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కొంతమంది తెలుగుదేశం సభ్యులు గలాభా చేస్తే నాటి స్పీకర్ నారాయణరావు గారు 30 రోజు శిక్ష వేసారు. వాళ్లంతా కోర్టుకెళితే కోర్టు ఆ శిక్షను 29 రోజులకు తగ్గించింది. కానీ తర్వాత స్పీకర్ నిర్ణయమే సుప్రీం అని కోర్టు చెప్పడంతో చివరి రోజును కూడా వారు శిక్ష అనుభవించారు.  మార్షల్స్ పై దురుసుగా ప్రవర్తించిన ఘటనలోనూ, స్పీకర్ తో అనుచితంగా ప్రవర్తించి, ముఖ్యమంత్రిపై అగౌరవపరిచిన ఘటనలోనూ ప్రతిపక్ష శాసన సభ్యులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని సభాపతిని కోరుతున్నాను. ఎమ్మెల్యేలతో పాటు వచ్చిన కార్యకర్తలను కూడా కెమెరాల్లో గుర్తించి వారిని తక్షణం అరెస్టు చేసి, చట్టబద్ధంగా కేసు ఫైల్ చేయాలని కోరుతున్నాను. అదే జరగకపోతే ఈ శాసన సభపట్ల, స్పీకర్ పట్ల ప్రజల్లో గౌరవం తగ్గే అవకాశం ఉంది. టీడీపీ కార్యకర్తలు వచ్చి శాసన సభమీద దాడులు చేసారంటే అది ఈ శాసన సభకే అవమానం. దయచేసి వారిపై తగు చర్యలు తీసుకోవాలని గౌరవ స్పీకర్ గారిని వేడుకుంటున్నాను.
తెలుగుదేశం ఎమ్మెల్యేలు జగన్ జైలుకు వెళ్లాడని పదే పదే అంటున్నారు. అవును ఆయన వెళ్లాడు. తనపై పెట్టిన అక్రమ కేసులను మేరు నగధీరుడిలా ఎదిరించి జైలుకు వెళ్లాడు. ఆ కేసులు కోర్టులో నడుస్తున్నాయి. రేపు వాటి నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. అయితే ఇదే చంద్రబాబు బ్రీఫ్డ్ మీ అంటూ కేసుల్లో అడ్డంగా దొరికాడు. చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నాడు. కేసీఆర్ కి భయపడి ఉమ్మడి హక్కులను తాకట్టు పెట్టి రాత్రికిరాత్రి కరకట్టకు పారిపోయి వచ్చాడు. ఐదు కోట్ల ఆంధ్రుల ఉమ్మడి ప్రయోజనాల్ని కాలరాసాడు. తమ్మినేని సీతారాం అంటే ప్రజల్లో ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. చక్కటి వాగ్ధాటి, కఠోర నిర్ణయం తీసుకోగలగుతారని నమ్మకం ఉంది. నేడు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. మార్షల్స్ పై దాడులు చేసిన తెలుగుదేశం వారికి స్పీకర్ ఏం శిక్ష వేస్తారని ఎదురుచూస్తోంది. 1989 హైదరాబాద్ లో నారాయణ రావుగారు వేసిన శిక్షను స్పీకర్ కూడా వేస్తారని కోట్లాది ప్రజలు, మీడియా ఎదురు చూస్తున్నారు. మార్షల్స్ ను దుర్భాషలాడినందుకు చంద్రబాబు మీద సైతం స్పీకర్ చర్యలు తీసుకున్నారని ప్రజలు మాట్లాడుకోవాలి. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో సువర్ణాక్షరాలతో నిలబడిపోవాలి. 

Read Also:మీరు పెట్టిన రూల్స్‌..మీకే చెప్పాల్సిన దుస్థితి

 

Back to Top