46 హామీలతో నెల్లూరు రూపురేఖల్ని మారుస్తాం

నెల్లూరు పార్లమెంట్ వైయ‌స్‌ఆర్‌సీపీ 2024 లోకల్‌ మేనిఫెస్టో విడుదల 

యూనిఫాం సివిల్‌ కోడ్‌పై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ వైఖరేంటి..? :  ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

ఎన్‌డీఏ భాగస్వాములుగా మీరు దాన్ని సమర్ధిస్తారా..? లేదా..?

ప్రజాస్వామ్య సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్న దాన్ని వైఎస్‌ఆర్‌సీపీ ఏనాడో వ్యతిరేకించింది

ముస్లీంలు, క్రిస్టియన్లు, బీసీలకు వ్యతిరేకంగా ఉన్న సివిల్‌కోడ్‌పై మీరు సమాధానం చెప్పాలి

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి వి. విజయసాయిరెడ్డి డిమాండ్‌.

నెల్లూరు జిల్లా: నెల్లూరు పార్లమెంట్ వైయ‌స్‌ఆర్‌సీపీ 2024 లోకల్‌ మేనిఫెస్టోను పార్టీ జిల్లా కార్యాలయంలో  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి  వి. విజయసాయి రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు  పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు  బీద మస్తాన్‌రావు, పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి,  మేకపాటి విక్రమ్‌ రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి,  నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, మహ్మద్‌ ఖలీల్,  బుర్రా మధుసూదన్‌ యాదవ్, మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి  వి. విజయసాయి రెడ్డి ఏమన్నారంటేః

*జగన్‌ గారి స్ఫూర్తితో మేనిఫెస్టో రూపకల్పనః*
గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోకు రాష్ట్రవ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జగన్‌ గారి స్ఫూర్తితో  నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో కలిసి ఒక నెలరోజుల పాటు అనేక అంశాల్ని పరిశీలించాం. 

*చంద్రబాబులా ఉత్తుత్తి హామీలతో కాకుండా..ః*
చంద్రబాబులాగా ఉత్తుత్తి హామిలిచ్చి నెరవేర్చలేని పరిస్థితులు లేకుండా.. ఏదైతే, సాధ్యపడుతుందో వాటిని పూర్తిస్థాయిలో నెరవేర్చేలా మేము నెల్లూరు పార్లమెంట్‌ వైఎస్‌ఆర్‌సీపీ 2024 మేనిఫెస్టోను తయారు చేశాం. రాష్ట్రంలో ఖచ్చితంగా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వస్తోంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. కేవలం నిధుల సమకూర్పు నేపథ్యంలో మా ప్రభుత్వ సహకారంతో నెల్లూరు పార్లమెంట్‌ను ఏ విధంగా అభివృద్ధి చేయగలమనే విషయంలో స్పష్టతకొచ్చాం. 

*ప్రజలు హర్షించే మేనిఫెస్టో మాదిః*
ఈ మేనిఫెస్టోలో పొందుపరచనటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఉదయగిరి కోటకు కింద నుంచి పైవరకు కేబుల్‌ కార్‌ అంశాలు కూడా మేము పరిశీలనలోకి తీసుకుంటున్నాం. నిధులు సమకూర్చుకుని మేనిఫెస్టోలో పెట్టని అంశాలనూ నెరవేర్చితే ప్రజలు హర్షిస్తారు గానీ.. చంద్రబాబు లాగా ప్రపంచంలోని అన్నింటినీ నేను చేసేస్తాను.. నావల్లే సాధ్యమని చెప్పాక.. అవి విఫలమైతే ప్రజలు హర్షించరనే ఉద్దేశంతో సాధ్యాసాధ్యాలను ముందుగానే మేం ఆలోచించి ముందుకెళ్తున్నాం. ఈ మేనిఫెస్టో రూపకల్పనకు సహకరించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 

నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్‌ స్థానాన్ని వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంటోందన్న ధృఢ విశ్వాసంతో మేం ఎన్నికలకు వెళ్తున్నాం. మా ద్వారా నెల్లూరు పార్లమెంట్‌ పరిధి ప్రజల కలలు సాకారం అవుతాయనే విశ్వాసం మాలో ఉంది. నెల్లూరు లోక్‌సభ కిందనున్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 46 హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచాం. వీటిలో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 20 వాగ్ధానాలు ఉన్నాయి. (నియోజకవర్గాల వారీగా 46 హామీలను పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ 9 నిముషాల వీడియోను మీడియాకు ప్రదర్శించారు) పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గాల్లోని ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఈ లోకల్‌ మేనిఫెస్టోను తయారుచేశాం. 

*యూనిఫాం సివిల్‌కోడ్‌ను సమర్థిస్తావా..లేదా బాబూ..?ః*
రాబోయే ఐదేళ్ల కాలంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎన్‌డీఏ యూనిఫాం సివిల్‌ కోడ్‌ను తప్పకుండా అమలు చేస్తోంది. అయితే, ముస్లీం సోదరులకు వ్యతిరేకంగా ఉండే ఈ సివిల్‌ కోడ్‌ను ఎన్‌డీఏ భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ సమర్ధిస్తుందా..? లేదా..? ఇదే విషయాన్ని చంద్రబాబును అనేకమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పలేదు. 

*బీజేపీతో మేము ఏనాడూ జతకట్టలేదుః*
ముస్లీం సామాజికవర్గానికి ఆయన సమాధానం చెప్పకపోగా.. మామీద ఏవేవో ఆరోపణలు చేస్తాడు. గతంలో మేము బీజేపీతో జతకట్టామంటా డు. అలా మేమేప్పుడూ జతకట్టిందీ లేదు. రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో కేంద్రంతో సత్సంబంధాలు మెయిన్‌టేన్‌ చేసి వీలైనంత నిధులు రాబట్టామే గానీ... బీజేపీని పెళ్ళి చేసుకోవడమో.. ఆ పార్టీతో జతకట్టడమో మేం చేయలేదు. 

*బీజేపీతో పెళ్లి, కాపురం లింకు చంద్రబాబుకే ఉందిః*
2019 ఎన్నికలకు ముందు బీజేపీతో చంద్రబాబు కాపురం చేశాడు. అలాంటి కాపురం వైఎస్‌ఆర్‌సీపీ ఎప్పుడూ చేయలేదు. బీజేపీ అధికారంలో కేంద్రమంత్రులుగా పనిచేసిన సుజనా చౌదరి, అశోక్‌గజపతి రాజు వారంతా చంద్రబాబు మనుషులే గానీ.. మా పార్టీ ఎప్పుడూ వారితో భాగస్వామ్యం కలుపుకోలేదు. 

*ముస్లీంలకు బాబు, పవన్‌లు, బీజేపీ స్థానిక నాయకత్వం సమాధానమివ్వాల్సిందే..ః*
యూనిఫాం సివిల్‌ కోడ్‌కు సంబంధించి డ్రాఫ్ట్‌ తయారైంది. దానికి ఒక కమిటీని వేశారు. లా కమిషన్‌కు రిఫర్‌ చేశారు. దీన్ని ముస్లీం సోదరులు బలంగా వ్యతిరేకిస్తున్నారు. క్రిస్టియన్లు, దళితులు, బీసీలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి బిల్లును వైఎస్‌ఆర్‌సీపీ ఎట్టిపరిస్థితుల్లో సమర్థించదని నేను స్పష్టంగా చెబుతున్నాను. భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు ఉన్న ఈ సమాజంలో ఏకాభిప్రాయం లేకుండా ఒక చట్టాన్ని ఏ ఇతర సామాజికవర్గంపైన రుద్దలేం. రుద్దకూడదు. అది ప్రజాస్వామ్య సాంప్రదాయానికి విరుద్ధమని మేము చెబుతున్నాం. మరి, ఈ యూనిఫాం సివిల్‌ కోడ్‌పై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తో పాటు బీజేపీ స్థానిక నాయకత్వం సూటిగా సమాధానం చెప్పాల్సిందే.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేశారు. చంద్రబాబు చాలా తెలివిగల రాజకీయవేత్తననే భ్రమలో ఉంటాడు. వారు విడుదల చేసిన మేనిఫెస్టో ముఖచిత్రంపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. మరి, బీజేపీ అధినేత మోదీగారు ఫొటో ఎందుకు లేదు..? ఇదంతా ముస్లీం సామాజికవర్గ ఓట్ల కోసం.. వాళ్లు తమకు మద్ధతివ్వరనే భయంతోనే చంద్రబాబు నడిపిస్తోన్న కుట్రగా అర్ధం చేసుకోవాలి. 

Back to Top