చంద్రబాబే సుప్రీం.. రెడ్‌బుక్కే రాజ్యాంగం!

రాష్ట్రంలో బరితెగించి వ్యవహరిస్తున్న సీఐడీ

న్యాయస్థానమంటే ఖాతరు లేదు.. సీఆర్‌పీసీ 164 అంటే లెక్కే లేదు

సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కుతంత్రం

ఐఏఎస్‌ అధికారులతో తప్పుడు వాంగ్మూలాల నమోదుకు పన్నాగం

ఇప్పటికే న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఐఏఎస్‌ అధికారులు

అందుకు పూర్తి భిన్నంగా తప్పుడు వాంగ్మూలాల నమోదుకు సీఐడీ కుట్ర

చంద్రబాబు అవినీతి కేసులు నీరుగార్చేందుకు స్కెచ్‌

అబద్ధపు వాంగ్మూలాలపై తీవ్ర పరిణామాలు ఉంటాయన్న సుప్రీంకోర్టు

అయినా లెక్క చేయక ఐఏఎస్‌ అధికారి చెరుకూరి శ్రీధర్‌ను కోర్టుకు తీసుకెళ్లిన వైనం

కోర్టు బయట కొద్ది సేపు హైడ్రామా.. వెనుదిరిగిన అధికారి

మళ్లీ 8వ తేదీన న్యాయస్థానానికి తీసుకురావాలని సీఐడీ నిర్ణయం

 

 అమరావతి: భారత రాజ్యాంగమే ప్రామాణికం.. సుప్రీంకోర్టు తీర్పులే మార్గ నిర్దేశం.. అన్నది దేశంలో పరిపాలన వ్యవస్థకు దిక్సూచి. పాలకులు, అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు అందరూ పాటించాల్సిన విధివిధానాలవి. కానీ రాష్ట్ర సీఐడీ విభాగం అందుకు పూర్తి విరుద్ధంగా బరితెగిస్తోంది. ‘చంద్రబాబే మాకు సుప్రీం.. టీడీపీ రెడ్‌బుక్కే మాకు రాజ్యాంగం.. చంద్రబాబు అవినీతి కేసులు నీరుగార్చడమే ఏకైక లక్ష్యం’ అని చెలరేగిపోతోంది. 

అందుకోసం ఏకంగా న్యాయస్థానాల్లో సీఆర్‌పీసీ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలం పవిత్రత, ప్రమాణికతనే దెబ్బ తీసేలా కుట్రలకు పదును పెడుతోంది. ఓసారి సీఆర్‌పీసీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బరితెగించి మరీ ఉల్లంఘిస్తోంది. 

చంద్రబాబు సూత్రధారి, పాత్రధారిగా సాగిన కుంభకోణాల గురించి గతంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలాలకు భిన్నంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు సీఐడీ సన్నాహాలు వేగవంతం చేస్తోంది. డీజీపీ పోస్టు ఇస్తానని ముఖ్య నేత ఎర వేయగానే సుప్రీంకోర్టు మార్గరద్శకాలను కూడా తోసిరాజంటూ సీఐడీ ఉన్నతాధికారి చెలరేగిపోతుండటం విస్మయ పరుస్తోంది. ఈ వ్యవహారం యావత్‌ దేశాన్ని విస్మయానికి గురి చేస్తోంది.

కుంభకోణాల కుట్రదారు చంద్రబాబే..
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల కుంభకోణం, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాల కుంభకోణం, ఫైబర్‌నెట్‌ కుంభకోణం, స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం.. ఇలా వివిధ కుంభకోణాలతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. 

వాటిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) కేసు నమోదు చేసి పూర్తి ఆధారాలతోసహా ఆ భారీ దోపిడీని బట్టబయలు చేసింది. ఆ వ్యవహారాల్లో కీలక పాత్రధారులగా ఉన్న ఐఏఎస్‌ అధికారులను విచారించింది. నిబంధనలకు విరద్ధమని తాము అభ్యంతరం తెలిపినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని వారు చెప్పారు. చంద్రబాబు ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్‌ భూముల బదలాయింపు, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు, కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల విడుదల.. ఇలా అన్ని వ్యవహారాలు సాగాయని వెల్లడించారు. 

టీడీపీ ప్రభుత్వంలో సీఆర్‌డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్, ఫైబర్‌నెట్‌ ఎండీగా వ్యవహరించిన అజయ్‌ జైన్, గుంటూరు కలెక్టర్‌గా చేసిన కాంతిలాల్‌ దండే తదితరులు ఆ వాస్తవాలను ‘సిట్‌’కు తెలిపారు. అంతే కాకుండా ఆ విషయాలను న్యాయస్థానంలోనూ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఆర్‌పీసీ 164 కింద వారు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేసింది. 

అందుకే ఆ కేసుల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడు(ఏ1)గా పేర్కొంటూ సిట్‌ కేసులు నమోదు చేసింది. స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్‌ చేయగా, ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులు రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

తప్పుడు వాంగ్మూలాల నమోదుకు ప్రభుత్వ కుట్ర
గత ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు అవినీతి కేసులను నీరుగార్చేందుకు కుట్రకు తెరతీసింది. అందుకోసం డీజీపీ, సీఐడీ అధికారులు ఆ కేసుల దర్యాప్తు వివరాలను చంద్రబాబుకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. అంటే ప్రధాన నిందితుడే ఆ కేసులను సమీక్షించారు. ఆ కేసులను ఎలా నీరుగార్చాలనే కుట్రకు అప్పుడే బీజం పడింది. 

అనంతరం చంద్రబాబు తరఫున గతంలో వాదించిన ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా రంగ ప్రవేశం చేశారు. డీజీపీ, సీఐడీ అధికారులతో సమావేశమై చంద్రబాబుపై కేసులను నీరుగార్చే కుట్రకు కార్యాచరణ రూపొందించారు. గతంలో చంద్రబాబే కుట్రదారు.. కుంభకోణాలకు ఆయనే సూత్రధారి.. అని న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన వారితో తాజాగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలని పన్నాగం పన్నారు. ఆ బాధ్యతను సీఐడీకి అప్పగించారు. 

గతంలో సిట్‌లో సభ్యులుగా ఉన్న కింది స్థాయి అధికారులను డీజీపీ, సీఐడీ చీఫ్‌ పిలిపించుకుని మరీ తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియను వివరించారు. బాధిత రైతులు, సాధారణ సాక్షులను కింది స్థాయి అధికారులు బెదిరిస్తుండగా, ఐఏఎస్‌ అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే బాధ్యతను సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ భుజానికెత్తుకున్నారు.

బెదిరించి.. భయపెట్టి..
కుట్రలో భాగంగా ఐఏఎస్‌ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్‌ జైన్‌లతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ బరితెగించింది. గతంలో న్యాయస్థానంలో 164 సీఆర్‌పీసీ కింద తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరద్ధుంగా వాంగ్మూలం ఇవ్వాలని వారిపై సీఐడి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. బెదిరింపులకు పాల్పడింది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే సంగతి తేలుస్తామని హెచ్చరించింది. 

గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం సాధ్యం కాదని, అది నేరమని కూడా ఆ అధికారులు, న్యాయ నిపుణులు చెప్పినా సరే సీఐడీ చీఫ్‌ రవి శంకర్‌ అయ్యన్నార్‌ ఏమాత్రం వినిపించుకోలేదని సమాచారం. ఇలా సీఐడీ సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగించి చెరుకూరి శ్రీధర్, అజయ్‌ జైన్‌లను బెంబేలెత్తించారు. దాంతో వారు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించినట్టుగా సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. 

వారిద్దరితో గుంటూరులోని న్యాయస్థానంలో శుక్రవారం తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించేందుకు సీఐడీ అధికారులు తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే న్యాయాధికారి సెలవులో ఉండటంతో ఆ ప్రయత్నాన్ని శనివారానికి వాయిదా వేశారు. 

తీరా శనివారం చెరుకూరి శ్రీధర్‌ ఒక్కరినే తీసుకెళ్లారు. కోర్టు బయట కొద్ది సేపు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత కోర్టు హాలు లోపలికి వెళ్లకుండానే శ్రీధర్‌ వెనుదిరిగారు. మళ్లీ ఈ నెల 8వ తేదీన ఆయన్ను న్యాయస్థానానికి తీసుకొచ్చి వాంగ్మూలం నమోదు చేయించాలని సీఐడీ నిర్ణయించినట్లు తెలిసింది.

నాడు గూండాల బెదిరింపులు.. నేడు సర్కారు వేధింపులు 
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్‌ భూములు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కుంభకోణాల గురించి న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన ఐఏఎస్‌ అధికారి చెరుకూరి శ్రీధర్‌.. తనను ఆ కేసుల్లో సాక్షిగా పరిగణించాలని కోరారు. దాంతో ఆయన అంతు చూస్తామని టీడీపీ గూండాలు బెదిరించారు. తీవ్ర ఆందోళన చెందిన ఆయన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శికి ఫిర్యాదు చేశారు. 

టీడీపీ గూండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా పోలీసు శాఖను కోరారు. దాంతో ఆయనకు పోలీసు శాఖ ప్రత్యేకంగా గన్‌మెన్‌ను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు గన్‌మెన్‌ భద్రత కొనసాగుతోంది. అప్పట్లో టీడీపీ గుండాలు బెదిరింపులకు పాల్పడగా, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా ఆయన్ను బెదిరిస్తోంది. 

తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే అంతు తేలుస్తామని సీఐడీ ద్వారా వేధిస్తోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్‌సీపీ 164 వాంగ్మూలాల గురించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతోపాటు గతంలో ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తున్నారు.

మొదటి వాంగ్మూలానికి విరుద్ధంగా ఉండకూడదు 
సీఆర్‌సీపీ 164 కింద ఓసారి న్యాయస్థానంలో నమోదు చేసిన వాంగ్మూలం అత్యంత విశ్వసనీయమైనదిగా పరిగణిస్తాం. ఎందుకంటే న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా నమోదు చేసిన వాంగ్మూలమది. ఆ వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదు. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ప్రయత్నిస్తే వారిని సంబంధిత న్యాయస్థానం ప్రశ్నించాలి. మొదట ఇచ్చిన వాంగ్మూలాన్నే సాక్షంగా పరిగణలోకి తీసుకోవాలి.

– 2024 నవంబరు 25న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు. ఈ మేరకు ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి చెందిన ఓ కేసులో జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విస్పష్టమైన తీర్పునిచ్చింది.

విరుద్ధంగా ఇస్తే కఠిన చర్యలు 
ఓసారి సీఆర్‌సీపీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇస్తే అది నేరంగా పరిగణిస్తాం. ఎందుకంటే ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి చదవి వినిపించిన తర్వాత సమ్మతించి, మరీ సంతకం చేసి ఇచ్చిన వాంగ్మూలమది. మొదటిసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడమంటే.. మొదట ఇచ్చింది తప్పుడు వాంగ్మూలమని అంగీకరించినట్టే. 

అత్యంత విశ్వసనీయమైన న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసి మరీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్టు అవుతుంది. అంటే అబద్ధపు వాంగ్మూలం ఇచ్చినందుకు నేరంగా పరిగణిస్తాం. ఆ విధంగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వారిపై ఐపీసీ 193, సీఆర్‌సీపీ 340 కింద కఠిన చర్యలు తీసుకుంటాం. 
– వినోద కుమారి వర్సస్‌ మధ్యప్రదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు

ఎదుర్కోవాల్సిన పరిణామాలను న్యాయమూర్తి వివరించాలి 
సీఆర్‌పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షి ప్రయత్నిస్తే.. దాని వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, ఎదుర్కోవాల్సి వచ్చే పరిణామాల గురించి న్యాయమూర్తి ఆ సాక్షికి వివరించాలి.
– అలహాబాద్‌ హైకోర్టు తీర్పు

ఏడేళ్ల వరకూ జైలు శిక్ష 
న్యాయస్థానాల్లో కేసుల విచారణ ప్రక్రియలో ఏ సందర్భంలో అయినా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరం అని సెక్షన్‌ 229 (1) స్పష్టం చేస్తోంది. అటువంటి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తోంది. 

అంటే సీఆర్‌పీసీ 164 కింద న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా రెండు విరుద్ధ వాంగ్మూలాలు ఇస్తే అందులో ఒకటి అబద్ధపు వాంగ్మూలమే అవుతుంది. మొదటి వాంగ్మూలం గానీ రెండో వాంగ్మూలం గానీ ఏది అబద్ధపు వాంగ్మూలం అయినా శిక్షార్హమే. దాన్ని నేరంగా పరిగణించి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.  

Back to Top