వంచించిన చంద్రబాబు.. దగాపడ్డ రైతన్న

హామీలు అటకెక్కించి దారుణంగా వంచించిన చంద్రబాబు

ప్రభుత్వాన్ని నిలదీస్తున్న అన్నదాతలపై నోరు పారేసుకుంటున్న కూటమి నేతలు 

కుక్కలకున్న విశ్వాసం రైతులకు లేదని ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు 

సూపర్‌ సిక్స్‌ ఊసేలేదు.. రైతు భరోసాకూ మంగళం

కూటమి నేతల అవమానాలు.. ఛీత్కారాలు

రైతులకు మళ్లీ కష్టాలు.. ‘క్యూ’ కట్టిన పాస్‌ పుస్తకాలు
వైఎస్‌ జగన్‌ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, సబ్సిడీలు తదితర ప్రభుత్వ సేవలన్నీ అందించగా.. టీడీపీ ప్రభుత్వం రావడంతో రైతుల పరిస్థితి మళ్లీ తలకిందులైంది. గతంలో చంద్రబాబు పాలనలో వారు ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. సబ్సిడీ శనగ విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు గురువారం కర్నూలు జిల్లా మద్దికెరలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బారులుదీరారు. ఎంతసేపు నిరీక్షించినా ఉపయోగం లేకపోవడంతో.. చివరకు పాస్‌పుస్తకాలను క్యూలైన్‌లో పెట్టారు.  

 అన్నదాతలకు మళ్లీ కష్టకాలం దాపురించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు తమ పట్ల కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుండడం పట్ల రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్లుగా వారికి ఎంతగానో అక్కరకొచ్చిన రైతు సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా చాప చుట్టేస్తుండడంతో వారి భవిష్యత్‌ అగమ్య గోచరంగా తయారైంది. మరొక వైపు హామీల అమలుపై నిలదీస్తోన్న రైతన్నలపై కూటమి నేతలు ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారు. 

‘కుక్కలకున్న విశ్వాసం రైతులకు లేదంటూ హేళనగా మాట్లాడిన తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై రాష్ట్రంలోని రైతులు, రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే పదవి నుంచి ఆయన్ను సస్పెండ్‌ చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి రైతుల పట్ల చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

‘రైతులన్నా, వ్యవసాయం అన్నా తనకు గిట్టదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. విద్యుత్‌ బకాయిల కోసం రోడ్డెక్కితే అన్నదాతల గుండెల్లో తూటాలు దింపి గుర్రాలతో తొక్కించిన వ్యక్తిలో మార్పు వస్తుందని భావించడం అత్యాశే అవుతుంది’ అని నాటి ఘటనను గుర్తు చేసుకుని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

ప్రతి రైతుకు రూ.20 వేల సాయమేది? 
⇒ ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్‌ సిక్స్‌ హామీల పేరుతో కూటమి నేతలు  రైతులను నమ్మించారు.   కానీ పగ్గాలు చేపట్టి నాలుగు నెలలు కావస్తున్నా ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేసిన పాపాన పోలేదు.  

⇒ అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 76 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో సన్న, చిన్నకారు రైతులే 68 లక్షల మంది. సూపర్‌ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన ఏటా రూ.15,214 కోట్లు జమ చేయాలి. కేంద్ర ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన వారం రోజుల్లోనే పీఎం కిసాన్‌ కింద తొలి విడతలో 40.91 లక్షల మందికి రూ.824.61 కోట్లు జమ చేసింది. రెండో విడత ఈ నెల 5న జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.  

⇒ రాష్ట్రంలో మాత్రం కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన హామీ మేరకు కనీసం ఒక విడత సాయం కూడా జమ చేయలేదు. పెట్టుబడి కోసం రైతులు రూ.3–5 చొప్పున వడ్డీలకు ప్రైవేటు వ్యాపారస్తుల నుంచి అప్పులు చేయాల్సిన అగత్యం వచ్చింది. 

పరిహారం అందక పడరానిపాట్లు 
⇒ రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు నోటిఫై పంటలకు యూనివర్సల్‌ కవరేజ్‌ కల్పిస్తూ ఉచిత పంటల బీమా పథకాన్ని గత జగన్‌ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. ఈ పథకం ద్వారా ఏటా ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి సంబంధించిన బీమా పరిహారాన్ని ఆ మరుసటి ఏడాది అదే సీజన్‌ ప్రారంభంలోనే ఇస్తూ రైతులకు అండగా నిలిచింది. 

⇒ 2019–23 మధ్య 54.55 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం చెల్లించింది. 2023–24 సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రైతుల వాటాతో సహా రాష్ట్ర ప్రభుత్వ వాటా మొత్తం రూ.1278.80 కోట్ల ప్రీమియం మొత్తాన్ని జమ చేసే సమయంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది.  

⇒ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ బకాయిలు చెల్లించకుండా ఎగనామం పెట్టడంతో ఆ సీజన్‌కు సంబంధించి పంట నష్టపోయిన 15 లక్షల మంది రైతులకు రూ.1,568 కోట్ల బీమా పరిహారం అందకుండా పోయింది. జాతీయ స్థాయిలో ప్రశంసలందుకున్న ఈ పథకాన్ని ప్రస్తుత రబీ సీజన్‌ నుంచి నిలిపి వేస్తున్నట్టు ప్రభుత్వం చేసిన ప్రకటన రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.  

⇒ కంపెనీలు నిర్ధేశించే ప్రీమియం మొత్తం (8 శాతం)లో ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం చొప్పున రైతులు చెల్లించాల్సి ఉంటుంది. 50ః50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఈ లెక్కన ఏటా రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు భారం పడనుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. 

ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలూ ఎగ్గొట్టారు.. 
⇒ 2023 ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు నష్టపోయిన 10.44 లక్షల మందికి రూ.1289.57 కోట్లు జమ చేసేందుకు గత జగన్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా, కోడ్‌ సాకుతో కూటమి నేతలు అడ్డుకున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఈసీ అనుమతితో 8.89 లక్షల మంది రైతులకు రూ.1,126.31 కోట్లు జమ చేశారు.  

⇒ వివిధ రకాల సాంకేతిక కారణాల వల్ల 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ కాలేదు. ఈ బకాయిల కోసం వ్యవసాయ శాఖ పంపిన ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది. మరో పక్క 2023–24 రబీ సీజన్‌లో 6 జిల్లాల్లోని 87 మండలాల్లో కరువు ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. పోలింగ్‌ అనంతరం ఈసీ అనుమతితో పంట నష్టం తుది అంచనాలు తయారు చేశారు. 2.52 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్న 2.32 లక్షల మంది రైతులకు రూ.164.05 కోట్లు చెల్లించాలని లెక్క తేల్చారు.  

⇒ ఈ మొత్తాన్ని వైఎస్సార్‌ రైతు భరోసాతో పాటు జూన్‌లో జమ చేసేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంకల్పించింది. కాగా ఈ కరువు సాయం కోసం పంపిన ప్రతిపాదనలను సైతం కూటమి ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది. 2023–24 సీజన్‌కు సంబంధించి రూ.327.71 కోట్ల కరువు బకాయిలు 3.91 లక్షల మంది రైతులకు అందకుండా చేసి, వారి నోట్లో మట్టికొట్టింది. 

ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి కోతలు 
⇒ ఒకపక్క వరదలు, మరో పక్క తీవ్ర వర్షాభావ పరిస్థితుల ఉన్న రాష్ట్రంలో  లక్షలాది ఎకరాలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కష్టకాలంలో రైతులను ఊదారంగా ఆదుకోవాల్సింది పోయి అంచనాలను కుదించి అడ్డగోలుగా పరిహారం ఎగవేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కింది. 

⇒ జూలైలో కురిసిన వర్షాలకు తొలుత 16 జిల్లాల్లో 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. చివరికి దానిని 4 జిల్లాల్లో 54 వేల ఎకరాలకు పరిమితం చేశారు. 29,944 మంది రైతులకు రూ.37.33 కోట్లు పరిహారం చెల్లించాలని లెక్క తేల్చారు. కానీ ఆచరణకు వచ్చేసరికి కేవలం 23 వేల మందికి మాత్రమే రూ.25.75 కోట్లకు కుదించేశారు. 

⇒ సాంకేతిక కారణాల సాకుతో ఐదారు వేల మందికి ఆరు కోట్లకుపైగా జమ కావాల్సిన పరిస్థితి నెలకొంది. సెపె్టంబర్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు తొలుత 5.93 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా లెక్క తేల్చారు. పంటలతో పాటు పాడి, ఆక్వా, మత్స్యకారులకు కలిపి రూ.557 కోట్ల పరిహారం ఇవ్వాలని అంచనా వేశారు. ఆచరణకు వచ్చేసరికి 2.15 లక్షల మందికి మాత్రమే రూ.319.59 కోట్లుగా కుదించేశారు. సాంకేతిక కారణాలతో 50 వేల మందికి రూ.100 కోట్లకు పైగా జమ కావాల్సి ఉంది. మరో పక్క వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న రాయలసీమ రైతులకు అధిక వర్షాల సాకుతో కరువు సాయం ఊసెత్తడం లేదు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉండి ఉంటే..  
ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉండి ఉంటే.. జూన్‌లో తొలి విడత వైఎస్సార్‌ రైతు భరోసా సాయం అందేది. గత సీజన్‌ మాదిరిగానే ఈ ఏడాది కూడా 53.58 లక్షల మందికి మే నెలలో రూ.7500, అక్టోబర్‌లో రూ.4000 చొప్పున జమ చేసేవారు. 2023 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన బీమా పరిహారం సైతం తొలి విడత భరోసా సాయంతో కలిపి అందించేవారు. 

ఈ లెక్కన రెండు విడతల్లో కలిపి రూ.6 వేల కోట్లకు పైగా పెట్టుబడి సాయం,  23 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రూ.1,568 కోట్ల బీమా పరిహారం రైతుల ఖాతాలకు జమయ్యేది. ఖరీప్, రబీ సీజన్‌లకు సంబంధించిన కరువు సాయం బకాయిలు రూ.327.71 కోట్లు కూడా జమయ్యేవి. ఇలా దాదాపు రూ.8,058 కోట్లు రైతుల ఖాతాలకు చేరేది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పూర్తి స్థాయిలో పరిహారం జమయ్యేది.  

కొలికపూడిని సస్పెండ్‌ చేయకపోతే ఉద్యమిస్తాం  
ఎమ్మెల్యేగా 100 రోజులు కూడా పూర్తి కాకముందే ఆడ వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తూ, రైతులను కుక్కలతో పోల్చిన ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును తక్షణమే ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలి. టీడీపీ నుంచి సస్పెండ్‌ చేయాలి. అలా చేయని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు, పోరాటాలను ఉ«ధృతం చేస్తాం.           
– పోతిరెడ్డి భాస్కర్, ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌ జిల్లా  

దుర్మార్గపు వ్యాఖ్యలవి 
భారతదేశంలో రైతులను అన్నదాతగా అందరూ దైవంలా కొలుస్తుంటారు. అటువంటి రైతులను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కుక్కలతో పోల్చడం దుర్మార్గం. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రతి రైతు స్పందించాల్సిన అవసరం ఉంది. రైతులకు ఎమ్మెల్యే కొలికపూడి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి.  
– బొప్పన సుబ్బారావు, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్, హుకుంపేట, తూర్పుగోదావరి జిల్లా 

హామీల మాటేమిటి? 
సూపర్‌ సిక్స్‌లో ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది. ఖరీఫ్‌ సీజన్‌ కూడా ముగిసిపోయింది. అయినా ఒక్క విడత పెట్టుబడి సాయం కూడా జమ చేయలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు పెట్టుబడి కోసం నానా అగచాట్లు పడ్డారు. 

ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, రైతులను అవహేళన చేస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అవమానకరంగా మాట్లాడడం దుర్మార్గం. రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రైతుల తరఫున ఆందోళన చేస్తాం. 
– జీ.ఈశ్వరయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  

Back to Top