శ్రీవారి లడ్డూపై  ‘పచ్చ’గోల

వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ.. జరగని తప్పుపై  కూట‌మి నేత‌ల విష‌ప్ర‌చారం

కల్తీ నెయ్యిని వాడనే లేదని స్వయంగా టీటీడీ ఈవోనే చెప్పారు 

ఆ నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపించామన్నారు 

ఆ నెయ్యే వాడనప్పుడు ఎక్కడ అపచారం జరిగినట్లు? 

ఈ వాస్తవం తెలిసీ కూడా జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారని చంద్రబాబు దుష్ప్రచారం 

అవే మాటలను పదేపదే ప్రస్తావిస్తూ కోట్లాది మంది భక్తుల్లో విష బీజాలు నాటే యత్నం 

బాబుకు వంత పాడుతూ దుష్ప్రచారాన్ని మరింత రక్తి కట్టించిన పవన్, లోకేశ్‌ 

ఆ ట్యాంకర్లను తిప్పి పంపింది బాబు నియమించిన ఈవో ఆధ్వర్యంలోనే 

బాబు తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, భక్తులు మండిపాటు 

సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ 

ప్రధానికి లేఖ రాసిన వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ 

ఒత్తిడి పెరగడంతో తన జేబులోని అధికారులతో సిట్‌ ఏర్పాటు చేసిన చంద్రబాబు

 అమరావతి: తన వంద రోజుల పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉండటంతో ఆ వ్యవహారం నుంచి వారి దృష్టి మళ్లించడానికే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కల్తీ అయిందని చంద్రబాబు చెబుతున్న నెయ్యిని అసలు వాడనప్పుడు లడ్డూ ఏ విధంగా కల్తీ అవుతుందని.. ఈ లెక్కన ఏ విధంగా అపచారం జరిగిందన్న ప్రశ్నకు చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ నుంచి సమాధానం లేదు. 

ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిటబుల్‌ ఆయిల్‌ మూలాలున్నాయని గుర్తించిన వెంటనే.. ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించామని, ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా సమక్షంలో స్పష్టంగా ప్రకటించారు. ఆ ట్యాంకర్లు కనీసం టీటీడీ గోడౌన్‌ వరకు కూడా రాలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ తలకెక్కించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి రాద్ధాంతం చేయడం ద్వారా లబ్ధి పొందాలని కుట్ర పన్నారు. ఆ వెంటనే తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయిందని నింపాదిగా ప్రకటించారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని పచ్చిగా అబద్ధం చెప్పారు. 

ఇందుకు కారణం గత ప్రభుత్వమేనని నింద మోపుతూ దుష్ప్రచారం ప్రారంభించారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఎల్లో గ్యాంగ్‌ ఇదే పాటను అందుకున్నారు. అసలు కల్తీ నెయ్యిని వాడనే లేదని సాక్షాత్తు ఈవోనే చెబుతున్నప్పుడు.. కల్తీ అయిన నెయ్యితో లడ్డూ తయారు చేశారని ఎలా చెబుతారంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, కోట్లాది మంది భక్తులు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్డు సిటింగ్‌ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.   

ప్రధానికి లేఖ రాసిన వైయ‌స్‌ జగన్‌ 
పచ్చి అబద్ధాలు చెప్పే అలవాటున్న సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం పవిత్రమైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తూ కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బ తీసే స్థాయికి దిగజారారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. జరగని తప్పుపై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ అయిన నెయ్యిని ఉపయోగించనప్పుడు తప్పు జరిగే అవకాశమే లేదని చెప్పారు. చంద్రబాబు చర్యలు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టీటీడీని, ఆ సంస్థ అనుసరిస్తున్న పద్ధతుల ఔన్నత్యాన్ని దెబ్బ తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలను, టీటీడీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా అబద్ధాలను వ్యాప్తి చేస్తున్న చంద్రబాబును గట్టిగా మందలించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఆదివారం లేఖ రాశారు.    

ప్రజల దృష్టి మళ్లించడానికే..  
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం 100 రోజుల్లో ఇచి్చన హామీలు నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికే టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారన్నది స్పష్టమైంది. కల్తీ జరిగిందనే ఆరోపణలతో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024 జూలై 12న తిరుమలకు వచ్చాయి. ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. దశాబ్దాలుగా టీటీడీలో ఉన్న అత్యుత్తమ విధానాల వల్ల నెయ్యిలో సందేహాస్పద పదార్థాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. 

అలా ఆ ట్యాంకర్లను  వెనక్కి పంపారని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని తెలిసి కూడా చంద్రబాబు బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారు. తద్వారా కోట్ల మంది తిరుమల భక్తుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. వాస్తవానికి ఆలయంలోనికి వెళ్లే ముందు ప్రతి ట్యాంకర్‌ నుండి మూడు నమూనాలు తీసుకుని పరీక్షిస్తారు. ఈ మూడు శాంపిళ్లలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతిస్తారు. ఏ పరీక్షలోనైనా సందేహాస్పద పదార్థాలు కనిపిస్తే ఆ ట్యాంకర్‌ను తిరస్కరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు. 

ఇలాంటి అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందు వల్ల ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్నే తలెత్తదు. గతంలో కూడా ఈ వ్యవస్థ ఉంది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 14 నుంచి 15 సార్లు ట్యాంకర్లను ఇలాగే తిరస్కరించారు. 2019–24 మధ్య వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించారు. వాస్తవంగా ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ నెయ్యి సరఫరా ప్రారంభించింది జూన్‌ 12 నుంచి అని టీటీడీ ఈవోనే చెబుతున్నారు. 

నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపిన రెండు నెలల తర్వాత చంద్రబాబు ఆ విషయం గురించి రాద్ధాంతం చేయడాన్ని అందరూ ప్రస్తావిస్తున్నారు. ఆ ల్యాబ్‌ నివేదికను టీడీపీ కార్యాలయం నుంచి విడుదల చేయడాన్ని బట్టి ముమ్మాటికీ ఇది రాజకీయం కుట్రేనని స్పష్టమవుతోంది. మరో వైపు కల్తీకి ఆస్కారమే లేదని ఆహార రంగ నిపుణులు సైతం తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో సీఎం తన జేబులోని అధికారులతో సిట్‌ ఏర్పాటు చేశారు.    

Back to Top