నూజివీడు: ట్రిపుల్ ఐటీ.. ఈ పేరు చెబితేనే వాటి వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు అందరి మదిలో మెదులుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పిల్లలకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను ప్రభుత్వమే అందించి వారి కుటుంబాల్లో మార్పు తీసుకురావాలనే సత్సంకల్పంతో 2008లో వైఎస్ ఈ ట్రిపుల్ ఐటీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అనాటి ఉమ్మడి కృష్ణాజిల్లా.. ప్రస్తుత ఏలూరు జిల్లా నూజివీడులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది. అప్పట్లో ఇక్కడ చదువుకున్న మొదటి బ్యాచ్ (2008–14) విద్యార్థుల సమ్మేళనం శనివారం స్థానిక ట్రిపుల్ ఐటీ ఆడిటోరియంలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాచ్ విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడ్డారు. 400 మంది విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్ ఐటీలను స్థాపించి ఉండకపోతే తమ భవిష్యత్తు సాదాసీదాగానే ఉండేదని, తమ జీవితాలు ప్రస్తుతం ట్రిపుల్ ఐటీకి పూర్వం, ట్రిపుల్ ఐటీ తరువాత అన్నట్లుగా చెప్పుకోవచ్చని వారు తెలిపారు. ట్రిపుల్ ఐటీలవల్లే తాము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని వారంతా ముక్తకంఠంతో చెప్పారు. పలువురు విద్యార్థుల భావాలు వారి మాటల్లోనే.. ఏడాదికి రూ.35 లక్షల వేతనం వస్తోంది 2008లో ట్రిపుల్ ఐటీలో చేరి ఈసీఈ బ్రాంచితో ఇంజనీరింగ్ పూర్తిచేశా. మా నాన్న సన్నకారు రైతు, రైతు కూలీ. చదువు పూర్తవగానే సెమీ కండక్టర్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరా. ప్రస్తుతం ఏఆర్‌ఎం సెమీ కండక్టర్స్ కంపెనీలో జాబ్‌చేస్తున్నా. ఏడాదికి రూ.35 లక్షల వేతనం వస్తోంది. ట్రిపుల్ ఐటీవల్లే ఈ స్థాయిలో ఉన్నా. – నుగ్గు ఆదినారాయణ, గొల్లపల్లి, పొదిలి మండలం, ప్రకాశం జిల్లా అమెరికన్ కంపెనీలో లీడ్ ప్రొడక్ట్ మేనేజర్‌గా.. అమెరికన్ కంపెనీలో లీడ్ ప్రొడక్ట్ మేనేజర్‌గా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా. ఏడాదికి రూ.36 లక్షల వేతనం వస్తోంది. ఈసీఈ చదివాక ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. ఈ స్థాయిలో ఉండటానికి కారణం కేవలం ట్రిపుల్ ఐటీనే. వీటిని స్థాపించకపోయి ఉంటే సాదాసీదా చదువులు చదివేవాడిని. ఇలాంటి విద్యా సంస్థ నెలకొల్పిన వైఎస్ రాజశేఖరరెడ్డికి సెల్యూట్. – పక్కి కార్తీక్, గజపతినగరం, విజయనగరం జిల్లా ఏడాదికి రూ.50 లక్షల వేతనం వస్తోంది.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీలో చదువుకోవడంవల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా. ప్రస్తుతం ఇన్ఫర్మేటికల్ సంస్థలో ప్రిన్సిపల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నా. ఏడాదికి రూ.50 లక్షల వేతనం వస్తోంది. మా నాన్న రైతు కూలీగా పనిచేస్తూ నన్ను చదివించారు. ట్రిపుల్ ఐటీ లేకపోతే నేను మా ఊరిలోనే ఉండేవాడినేమో. – పప్పల సురేష్, గోరింట, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో మేనేజర్‌గా.. నా సొంతూరు విశాఖపట్నంలోని గాజువాక. నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొదటి బ్యాచ్‌లో నేను కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ఆ తరువాత విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నా. మా నాన్న లారీ డ్రైవర్‌గా పనిచేసేవారు. ట్రిపుల్ ఐటీ అనేది లేకపోతే మేం లేం. ట్రిపుల్ ఐటీ అనేది మా జీవితంలో భాగమైంది. – భీశెట్టి గోపి, మేనేజర్, విశాఖ రిఫైనరీ, విశాఖపట్నం ఏడాదికి రూ.36 లక్షల వేతనం ట్రిపుల్ ఐటీ లేకపోతే చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాడిని. ఈసీఈ చదివి ప్రస్తుతం ఒడెస్సా సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేస్తున్నా. వేతనం ఏడాదికి రూ.36 లక్షలు వస్తోంది. మా నాన్న ప్రైవేటు టీచర్‌గా పనిచేసేవారు. ఇంజనీరింగ్ చేసిన తరువాత ఐఐఎం ఇండోర్‌లో ఎంబీఏ చదివి ఆ తరువాత ఉద్యోగంలో చేరా. – నంబూరు మధుబాబు, చల్లవానిపేట, జలుమూరు మండలం, శ్రీకాకుళం జిల్లా ఇస్రోలో సైంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నా.. ప్రస్తుతం నేను తిరువనంతపురంలో ఇస్రోకు చెందిన విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో సైంటిస్ట్–ఈ కేడర్‌లో పనిచేస్తున్నా. ట్రిపుల్ ఐటీలో ఈసీఈ పూర్తిచేసి రగ్‌పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేశా. ఆ తరువాత ఇస్రోలో చేరా. ఆరేళ్లపాటు ట్రిపుల్ ఐటీలో మా భవిష్యత్తుకు బంగారు బాట వేశారు. – కారుమూరి వంశీ, దేవరపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా స్టార్టప్ ప్రారంభించా.. మా నాన్న సన్నకారు రైతు. వ్యవసాయ కూలి పనులకూ వెళ్లేవాడు. ట్రిపుల్ ఐటీ మొదటి బ్యాచ్‌లో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. ఆ తరువాత ఐఐఎం లక్నోలో ఎంబీఏ చేశా. తర్వాత ఏడాదికి రూ.45 లక్షల వేతనంతో సాఫ్ట్‌వేర్ జాబ్ చేశా. ప్రస్తుతం స్టార్టప్ ప్రారంభించా. వైఎస్ రాజశేఖరరెడ్డి, రాజిరెడ్డి ఇద్దరూ మా జీవితాల్లో వెలుగులు నింపారు. ట్రిపుల్ ఐటీలు లేకపోతే మా కుటుంబ ఆరి్థక పరిస్థితికి పాలిటెక్నిక్ గాని, డిగ్రీ గాని మాత్రమే చదివేవాడిని. – పరిటాల శివాజీ, కారంపూడి, గుంటూరు జిల్లా రియాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ట్రిపుల్ ఐటీ లేకపోతే స్థానికంగా ఏదోక కాలేజీలో డిగ్రీ చదివి ఉండేవాడిని. ప్రస్తుతం టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీలో సౌదీలోని రియాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఏడాదికి రూ.72 లక్షల వేతనంతో పనిచేస్తున్నాను. ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరికీ వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడు. మా అందరికీ లైఫ్ ఇచ్చారు. – సంజయ్‌ఖాన్, ఖాజీపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లా సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీం లీడర్‌గా చేస్తున్నా.. ఈసీఈ బ్రాంచిలో ఇంజనీరింగ్ పూర్తిచేసి ప్రస్తుతం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కంపెనీలో రూ.30 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీం లీడర్‌గా చేస్తున్నా. ఇక్కడ ఆరేళ్ల పాటు చదవడం ఒక రకంగా స్వర్ణయుగం. ట్రిపుల్ ఐటీలో చదవడం వరం. ఇలాంటి విద్యాసంస్థను ఏర్పాటుచేయడం గొప్ప విషయం. – పసుపురెడ్డి వివేక్, హరిపురం, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా ట్రిపుల్ ఐటీ మా జీవితాన్నే మార్చేసింది.. మా నాన్న మోటార్ మెకానిక్. ట్రిపుల్ ఐటీలో సీఎస్‌ఈ చదివా. ఆ తరువాత కాకినాడ జేఎన్‌టీయూలో ఎంటెక్ పూర్తిచేశా. కొంతకాలం టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశా. ఆ తరువాత 2018 నుంచి గుంటూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సీఎస్‌ఈ లెక్చరర్‌గా పనిచేస్తున్నా. ట్రిపుల్ ఐటీ మా జీవితాన్నే మార్చేసింది. – గజ్జా ప్రణయని, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా