తిరుపతి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే సహించేది లేదని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని హెచ్చరించారు. సెకీతో ఒప్పందంపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రకటనలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాలినేని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. సోమవారం తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ పదవి కోసం బాలినేని దిగజారిపోయారు. ఆరోపణలు మాని విద్యుత్ ఒప్పందాలపై వాస్తవాలు చెప్పాలి. బాలినేని సంతకంతోనే సెకి ఒప్పందం జరిగింది. కానీ, పార్టీ మెప్పు కోసమే బాలినేని అబద్ధాలు ఆడుతున్నారు. ఎవరినో మెప్పించడం కోసం బాలినేని నాయకుడిపై మాట్లాడుతున్నారు. వాసన్న మాటలు చూస్తే జాలి వేస్తుంది. సెకి తో ఒప్పందం పై గొప్పగా చెప్పాల్సింది పోయి.. రెండుసార్లు మంత్రిగా పనిచేశా.. రెండు సార్లు సంతకాలు చేశా.. ఫార్వర్డ్ చేశాను అని చెప్పడం బాధాకరం. పాలసీ గురించి మాట్లాడితే అదే మాట్లాడతాను. వ్యక్తిత్వ హననం చేసేందుకు మీరు ప్రయత్నిస్తే మేము వాస్తవాలు మాట్లాడతాం మీ నియోజకవర్గం కొండెపి కదా.. ఒంగోలు నుంచి ఎందుకు పోటీ చేశారు?. మీ నాయకుడు(పవన్ కల్యాణ్) పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకెళ్లారని, చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్లారని బాలినేనిని చెవిరెడ్డి ప్రశ్నించారు. ఒంగోలు ప్రజలతో నాకు అనుబంధం ఉంది. ఒంగోలు లో మీకంటే(బాలినేని) నాకు ఎక్కువ ఓట్లు వేశారు ప్రజలు. ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు లో 52 వేల ఓట్లు అదనంగా వచ్చాయి. ఒంగోలు ప్రజలతో నాకు అనుబంధం ఏర్పడింది, అండగా నిలుస్తాం. నేను విద్యార్ధి దశ నుంచి వైయస్ కుటుంబంతో ఉన్నాను. గత 36 సంవత్సరాలగా వైయస్ఆర్ కుటుంబంతోనే ఉన్నాను. నేను ఏ పార్టీ మారలేదు. మరోజెండా పట్టుకోలేదు. వాసన్నా.. వైయస్ జగన్ ఇచ్చిన స్వేచ్చను ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీరు స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు వెళ్లే స్వేచ్ఛ ఇచ్చారు. ఇతర పార్టీలు నేతలతో రష్యా కు వెళ్లారు. కూటమి నేతలు ఇతర పార్టీ నాయకులతో స్పెషల్ ఫ్లైట్ లో డిల్లీకి వెళ్తే చంద్రబాబు దిగే లోపే పదవి ఊడగొడతారు. అయినా కూడా మీరు వైయస్ జగన్‌ను ఎన్నోసార్లు ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా వైయస్ జగన్ భరించారు. ఇప్పుడు కూటమితో జతకట్టి వైయస్ జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా వైయస్ జగన్ ఎదుర్కొంటారని గుర్తుంచుకోండి. వాసన్నా.. మీకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ ఏదో ఒకరోజు మీకు గుర్తుకు వస్తుందని చెవిరెడ్డి అన్నారు.