విజయవాడ: వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి పై అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.ఈ క్రమంలోనే సజ్జల భార్గవ్ డ్రైవర్ సుబ్బారావును మఫ్టీలో వచ్చిన పోలీసులు రహస్యమైన చోటుకు తీసుకువెళ్లి చిత్ర హింసలకు గురి చేశారు. ఈ ఘటనపై విచారణ చేయమని డ్రైవర్‌తో కలిసి వైయస్ఆర్‌సీపీ నాయకులు విజయవాడ కమిషనర్‌ను కోరారు. మా పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం కోసం అమాయకులను హింసిస్తున్నారని అంబటి రాంబాబు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మా పార్టీ నాయకుడు సజ్జల భార్గవ్‌రెడ్డిపై అనేక తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయాలని ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా భార్గవ్ హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్లి రక్షణ పొందుతున్నారు. భార్గవ్ వద్ద ఐదేళ్లుగా సింహాద్రి అప్పన్నపేటకు చెందిన సుబ్బారెడ్డి డ్రైవర్‌గా పని చేస్తున్నారు. నిన్న పోలీసులు మఫ్టీలో సుబ్బారావు స్వగ్రామానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. భార్గవ్ ఎక్కడ ఉన్నారని ఒత్తిడి చేశారు. ఆయన వివరాలు తెలియని చెప్పినా వినకుండా పోలీసులు బైక్‌పై మధ్యలో కూర్చోబెట్టుకొని విజయవాడకు తీసుకొచ్చారు. నగరంలోని ఆంధ్రా ఆసుపత్రి వద్ద సుబ్బారావుకు మంకీ క్యాప్ వేసి లిప్ట్‌లో నుంచి ఓ గదిలోకి తీసుకెళ్లిన తరువాత ఆ క్యాప్ తీసేశారు. పోలీసులతో పాటు మరో ముగ్గురు కలిసి సుబ్బారావును చిత్రహింసలు పెట్టారు. విఫరీతంగా కొట్టి మళ్లీ రెండున్నర గంటల తరువాత ఆంధ్రా ఆసుపత్రి వద్ద విడిచివెళ్లారు. సమాచారం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు అందించారు. ఇది దారుణమైన అంశంగా పరిగణిస్తూ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని అంబటి రాంబాబు తెలిపారు. సజ్జల భార్గవ్‌ను పట్టుకోవాలనే క్రమంలో అమాయకుడైన డ్రైవర్‌ను ఈ విధంగా చిత్రహింసలకు గురి చేయడం సరికాదన్నారు. ఇది చాలా దారుణమైన ప్రక్రియ అని అంబటి రాంబాబు ఖండించారు.