ఎంపీ మిథున్ రెడ్డి వాహనాలపై దాడి హేయమైన చర్య...

వినుకొండలో వైయ‌స్ఆర్ సిపి నాయకుడి హత్య తదితర సంఘటనలతో రాష్ట్రంలో  శాంతిభద్రతలు క్షీణించాయి...

వైయ‌స్ఆర్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి

అన్న‌మ‌య్య జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ   ఎంపీ మిథున్ రెడ్డి వాహనాలపై దాడి హేయమైన చర్య అని అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ  శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుడు పివి మిథున్ రెడ్డి ఈ రోజు  పుంగనూరు పర్యటనలో భాగంగా దళితుడైన మాజీ ఎంపీ రెడ్డెప్ప స్వగృహానికి వెళ్తే టీడీపీకి చెందిన వందలాది మంది వచ్చి రాళ్ళ దాడిచేసి  వాహనాలను ధ్వసం చేయడం పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచీ వరుసగా జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వసం, కూల్చివేతల సంఘటనలు ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు జరగలేదన్నారు. ఈ పరిస్థితులను పోలీసులు వెంటనే చక్కదిద్దే భాద్యతను తీసుకుని అందరికీ రక్షణ కల్పించాలని  ఆయన కోరారు. వినుకొండలో అందరూ చూస్తుండగానే వైయ‌స్ఆర్ సిపి నాయకుడు రషీద్ ను అతి కిరాతకంగా హత్యచేయడం, తదితర సంఘటనలను చూస్తే ఈ రాష్ట్ర పరిస్థితి ఎక్కడికి పోతుందోనని ఆయన ఆందోళన, ఆవేదనను వ్యక్తం చేశారు.

నెల రోజులుగా వరుసగా  పసిపిల్లలపై అత్యాచారాలు  జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరమన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు  ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారానికి గురై, హత్యకు గురైన బాలిక మృతదేహ ఆచూకీని ఇంతవరకు కనుగొనకపోవడం దారుణమన్నారు.తక్షణమే ఇటువంటి సంఘటనలను  సరిదిద్ది, శాంతి భద్రతలను కాపాడి  ప్రజల కోసం పనిచేసే విధంగా ప్రభుత్వం నిరూపించుకోవాలని శ్రీకాంత్ రెడ్డి విన్నవించారు.

Back to Top