అరాచకాలకు అడ్డాగా ఏపీ

మాజీ మంత్రి మేరుగ నాగార్జున
 

 తాడేపల్లి:కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అరాచకాలకు అడ్డాగా మారిందని, దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఆదివారం తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేరుగ మాట్లాడారు.

‘పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది.కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు. ఇళ్లకు వెళ్లి జనాల చొక్కాలు పట్టుకుని బయటకు లాగుతున్నారు. అడ్డగోలుగా దాడులు చేస్తున్నారు. చంద్రబాబు వైఖరి వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. ఈ దాడులను ఆపాలని ఏనాడూ చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు?

వైయ‌స్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలు తప్పుదారిలో నడిస్తే చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు హయాంలో ప్రత్యర్థులు కదిలినా మెదిలినా కేసులు పెడుతున్నారు. మక్కెలు విరగ్గొడతానంటూ ఏకంగా సీఎం చంద్రబాబే మాట్లాడటం దేనికి సంకేతం?మూడు నెలల్లోనే ఇంతటి దారుణాలకు ఎవరు బాధ్యులు? ఎమ్మెల్యేలు దాడులు చేయటానికి చంద్రబాబు లైసెన్సులు ఇచ్చేశారు.

తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారశైలికి నిరసనగా సొంత పార్టీ వారే ధర్నాలు చేశారు.తనను వ్యతిరేకించే వారిని ఇంటికొచ్చి కొడతానంటున్న కొలికిపూడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?కాకినాడలో ప్రొఫెసర్ మీద ఎమ్మెల్యే నానాజీ దాడి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?ఇంకో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఏకంగా అంబేద్కర్ ఫ్లెక్సీనే తొలిగిస్తే ఏం చర్యలు తీసుకున్నారు?

అఖిలప్రియ దాడులకు పాల్పడితే ఏం చేశారు?కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వాల్మీకి కులస్తులపై దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు?ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అరాచకాలపై ఏం చర్యలు తీసుకున్నారు?ఇన్ని దారుణాలు మీ ఎమ్మెల్యేలే చేస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు?ఇవే పరిస్థితులు కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం’అని మేరుగ హెచ్చరించారు.

Back to Top