తాడేపల్లి: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలపై బాదుడే..బాదుడు మొదలైందని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ప్రతీ నెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ ఉమ్మడి ప్రకాశం జిల్లా వైయస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైయస్ జగన్ పార్టీ నేతలతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తోంది. మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మనం రేపు మళ్లీ అధికారంలోకి వస్తాం. చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ప్రతీ నెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి మీద నిందలు వేస్తారు? రేషన్ బియ్యం వ్యవహారంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. అసలు అధికారంలో ఎవరున్నారు అని సందేహం వస్తోంది. రాష్ట్రంలో అధికారం మారి ఏడు నెలలు అయ్యింది. మంత్రులు వాళ్లే, అధికారులు వాళ్ల మనుషులే, చివరకు చెక్‌పోస్టులు వాళ్లు పెట్టినవే ఉన్నాయి. కాకినాడ పోర్టులో కస్టమ్స్ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్లే ఉన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు?.. ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు? అని ప్రశ్నించారు. పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నంబర్ వన్ ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. కానీ, ఆ షిప్ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదు. బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్ వన్‌గా ఉంది. దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నంబర్ వన్. మరి వ్యవస్థీకృత నేరాలు ఎవరు చేస్తున్నారు?. అదనంగా పండించే బియ్యాన్ని ఎగుమతి చేయడంలో తప్పులేదు. కానీ, దీన్ని ఇప్పుడు ట్విస్ట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు సరిగ్గా బియ్యం ఇవ్వడం లేదు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో డీలర్ల వద్ద తప్పులు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తే దాన్ని పక్కనపెట్టాం. నేరుగా వాహనాల ద్వారా లబ్ధిదారులకు అందించాం. స్వర్ణ రకం తినగలిగే బియ్యాన్ని అందించాం. సార్టెక్స్ చేసిన మరీ ఇచ్చాం. రేషన్ బియ్యం దుర్వినియోగాన్ని అడ్డుకుంది మనమే. కానీ, మళ్లీ ఈ ప్రభుత్వంలో అన్ని పద్దతులూ మార్చారు. మళ్లీ డీలర్లకు అన్నీ అప్పగించారు. సార్టెక్స్ బియ్యాన్ని ఇవ్వడం లేదు. ప్రజలకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రజలకు సరిగ్గా బియ్యం ఇవ్వడం లేదు. దీని వల్ల మళ్లీ రేషన్ మాఫియా వచ్చింది. ఎమ్మెల్యేలకూ కమీషన్లు వెళ్లే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఆర్బీకే వ్యవస్థ నీరుగారిపోయింది. రైతులకు గత్యంతరం లేని పరిస్థితులు కల్పిస్తున్నారు. మిల్లర్లకు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. సంపద సృష్టి అంటే ఇదా? చంద్రబాబు వచ్చాడు.. బాదుడే బాదుడు మొదలైంది. కరెంటు బిల్లులు చూస్తే షాక్‌లు తగులుతున్నాయి. రూ.15వేట కోట్లకుపైగా ఛార్జీలు పెంచాడు. గ్రామీణ రోడ్లపై కూడా ట్యాక్స్‌లు వేసే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు సంపద సృష్టి అంటే.. బాదుడే బాదుడు. రామాయపట్నం పోర్టు దశాబ్దాల కల. దాన్ని కట్టింది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమే. వైయస్ఆర్‌సీపీ హాయాంలో దాదాపుగా పూర్తైంది.. షిప్‌లు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఐదేళ్లలో నాలుగు పోర్టులు కట్టడం మొదలైంది. ఇప్పుడు వాటిని శనక్కాయలకు, బెల్లాలకు అమ్మేస్తున్నాడు. మెడికల్ కాలేజీల రూపంలో, పోర్టుల రూపంలో మనం సంపద సృష్టించాం. వీటిని పద్దతి ప్రకారం అమ్మే కార్యక్రమం పెట్టాడని మండిపడ్డారు. ఆర్ అండ్ ఆర్ ఇవ్వకుండా ఆలస్యం వెలిగొండ రెండు టన్నెల్స్ పూర్తి చేశాం. ఆర్ అండ్ అర్ కింద డబ్బులు ఇవ్వాల్సి ఉంది. మనం అధికారంలో ఉండి ఉంటే అక్టోబరులో నీళ్లు నింపేవాళ్లం. అయిపోయిన ఈ ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆర్ కూడా ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. మార్కాపురంలో మనం మెడికల్ కాలేజీని దాదాపుగా పూర్తి చేశాం. ఇప్పుడు దీన్ని కూడా అమ్మేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకే మనమంతా కూడా పోరుబాటు పట్టాల్సిందే. ఈనెల 13న రైతు సమస్యలపైన కార్యక్రమం పెట్టాం. కరెంటు ఛార్జీలపైన ఈనెల 27న కార్యక్రమం పెట్టాం. అలాగే ఫీజు రియింబర్స్‌మెంట్ కోసం జనవరి 3న కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. ఎల్లో మీడియాతో యుద్ధమే.. చంద్రబాబుతోనే మనం యుద్ధం చేయడం లేదు. ఎల్లో మీడియాతోనూ పోరాటం చేస్తున్నాం. ప్రతీ రోజూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వీళ్లు ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు. బురద చల్లడమే పనిగా పెట్టుకున్న వారితో మనం యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలు చెప్పడం, వక్రీకరణ చేయడం, దుష్ప్రచారం చేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారు. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. పార్టీలో ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియా ఖాతా ఉండాలి. అన్యాయం జరిగితే దాని ద్వారా ప్రశ్నించాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.