పోసాని కృష్ణ మురళిపై ప్రభుత్వ కక్షసాధింపు దారుణం 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి జూపూడి ప్రభాకర్ రావు

ఒంగోలు: కూటమి ప్రభుత్వ కక్షసాధింపుల్లో భాగంగానే సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ జరిగిందని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు మండిపడ్డారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ పోసానిపై బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం దుర్మార్గమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలపైనా వేధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపై నిరంకుశంగా వ్యవహరిస్తోందని అన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగంకు పాల్పడే పోలీస్ అధికారులు రానున్న రోజుల్లో న్యాయ వ్యవస్థకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని, చంద్రబాబు నిరంకుశ పాలనే సాగుతోందని ధ్వజమెత్తారు. రాజకీయాల నుంచి దూరంగా ఉంటాను అని గతంలోనే పోసాని కృష్ణమురళి ప్రకటించినా కూడా ఈ ప్రభుత్వం ఆయనను వెంటాడుతోందని, ప్రజలు దీనిని గమనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వైయస్ఆర్ సీపీ ఎండగడుతుండటంతో జీర్ణించుకోలేక ఇటువంటి దుర్మార్గాలకు తెగబడుతున్నారని అన్నారు.
 

Back to Top