నెల్లూరు: ఎన్నికల సమయంలో అరబిందో కంపెనీకి సోమిరెడ్డి ఫోన్ చేసి రూ. 5 కోట్లు డబ్బులు అడిగిన మాట వాస్తవం కాదా? అని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. డబ్బులు ఇవ్వలేదనే అరవిందో మీద ప్రెస్ మీట్‌లు పెట్టి తిడుతున్నారు. అరబిందో కంపెనీ దగ్గర డబ్బులు తీసుకోలేదని కాణిపాకంలో సోమిరెడ్డి ప్రమాణం చేయగలడా? అని సవాల్ విసిరారు. బుధవారం కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో ఎవరూ పట్టించుకోవడం లేదని అసెంబ్లీకి వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టిన వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు . ఇ లాంటి వ్యక్తి.. విజయ సాయిరెడ్డికి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమిరెడ్డికి నేను సవాల్ చేస్తున్నా.. తేదీ, సమయం చెబితే.. విజయ సాయిరెడ్డి, నేను వస్తాం.. ప్రమాణం చేసే దమ్ము సోమిరెడ్డికి ఉందా?. విజయ సాయిరెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడే స్థాయి సోమిరెడ్డికి లేదు. నెల్లూరులో పట్టించుకోలేదని.. అసెంబ్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి సోమిరెడ్డి. హిందీ, ఇంగ్లీష్ వచ్చుంటే ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టేవాడేమో?. పొదలకూరులోని లే అవుట్స్ మీద విచారణ ఎందుకు ఆపేశావ్?. సోమిరెడ్డి కొడుక్కి డబ్బులు ముట్టాయ్ కాబట్టే.. విచారణ ఆగిపోయింది’ అంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు.