పోసానిపై బీఎన్ఎస్ సెక్షన్ 111 కేసు పెట్ట‌డం దారుణం

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీ‌నివాసులు

అన్న‌మ‌య్య జిల్లా:   రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న పోసాని కృష్ణ‌ముర‌ళి(Posani Krishna Murali) కి బెయిల్ రానివ్వకూడదని ఏకైక కుట్రతో  బీఎన్ఎస్ సెక్షన్ 111 కేసు పెట్ట‌డం దారుణ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీ‌నివాసులు మండిప‌డ్డారు. రాష్ట్రంలో అరాచకం కట్టాలు తెంచుకుంద‌ని, రాజకీయ ప్రత్యర్థులను, కళాకారులను, విశ్లేషకులను అరెస్టులు చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులో భాగంగా నిన్న రాత్రి ప్రముఖ నటుడు, నిర్మాత పోసాని కృష్ణ‌ముర‌ళిని అరెస్టు చేసి  అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనను మద్దతుగా కలవడానికి  పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీ‌నివాసులును పోలీసులు అడ్డుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..  `పోసాని కృష్ణమురళి కొన్ని నెలల క్రితమే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.  ఎలాంటి రాజకీయ అంశాలపై ఇక మాట్లాడనని స్పష్టంగా చెప్పారు.

ఒక నటుడు, నిర్మాత, కళాకారుడు అయిన‌ 67 సంవత్సరాల వయసు గల పోసాని కృష్ణ మురళిని రాత్రి సమయంలో కనీసం టాబ్లెట్లు కూడా వేసుకునే సమయం ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. చంద్రబాబు  సర్కార్ తన క్రూరత్వాన్ని చాటుకుంటూ కక్ష తీర్చుకోవ‌డం స‌రికాదు. క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు అధికార‌ దుర్వినియోగం చేస్తున్న తీరుకు పోసాని అరెస్టు నిద‌ర్శ‌నం. ఆయ‌న‌కు బెయిల్ కూడా రానికుండా నెలలు తరబడి జైల్లో అక్రమంగా నిర్బంధించేలా ఒక తప్పుడు సాంప్రదాయాన్ని చంద్రబాబు తీసుకువచ్చారు.

బీఎన్ఎస్ 111 సెక్షన్ ఇలాంటి కేసులకు వర్తించదని ఇప్పటికే హైకోర్టు పలుమార్లు చెప్పినప్పటికీ పోసానిపై  బిఎన్ఎస్ సెక్షన్ 111 కేసు పెట్ట‌డం దుర్మార్గం. పోసాని మురళీకృష్ణకి ఏదైనా హాని జరిగితే కూటమి ప్రభుత్వాన్నిదే బాధ్యత. ప్రభుత్వం చేస్తున్న కుట్ర‌లో భాగస్వామ్యులవుతున్న కొందరు పోలీసులకు తీవ్ర హెచ్చరిక చేస్తున్నాం. చట్టాన్ని అతిక్రమించి ఆక్రమంగా వ్యవహరిస్తే న్యాయపరమైన ఇబ్బందులకు వెళ్లాల్సి వస్తుంది. ఎవరిని విడిచి పెట్టే ప్రసక్తే లేదు. అందరిని న్యాయస్థానాల ముందు నిలబెడతాం.  ప్రభుత్వ ఓతిళ్లకు  త‌లొగ్గి అధికారులు బలి కావద్దు` అని కోరముట్ల శ్రీనివాసులు హెచ్చ‌రించారు. 

Back to Top