జనసేన కార్యకర్త చేతిలో ప్రజల వ్యక్తిగత సమాచారం

అంత కీలక సమాచారం ఆ కార్యకర్త చేతికి ఎలా? 

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ప్రశ్న

కూటమి కార్యకర్తలకు పోలీసులే సమాచారం ఇస్తున్నారా?

లేక ఆ సమాచారం సేకరించే టెక్నాలజీని వారికి ఇచ్చారా?

పోలీస్‌ వ్యవస్థ పనితీరుపై అనుమానాలు కలుగుతున్నాయి

వ్యక్తిగత సమాచారం సేకరించడం చట్టాలను ఉల్లంఘించడమే

ఆ సమాచారం సేకరించిన జనసేన కార్యకర్తను అరెస్టు చేయాలి

పుత్తా శివశంకర్‌రెడ్డి డిమాండ్‌

నాడు పథకాల అమలు కోసం వాలంటీర్ల బయోమెట్రిక్‌

దానిపై ఆనాడు పవన్‌కళ్యాణ్‌ నానా గగ్గోలు. విమర్శలు

మరి ఇప్పుడు ఏ హోదా లేని జనసేన కార్యకర్త వద్ద డేటా

మరి దీనిపై జనసేన అధినేత నోరెందుకు మెదపడం లేదు?

ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపణ

తాడేపల్లి: రాష్ట్రంలో ఎవరికీ వ్యక్తిగత గోప్యత లేకుండా పోయిందని..  పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారని అనిల్ అనే వ్యక్తిని టార్గెట్ చేశారంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అతన్ని బెదిరించి నంబర్ తీసుకుని 25 నిమిషాల్లోనే మొబైల్ ట్రాక్ చేశారని తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు.

 రాష్ట్రంలో నియంత పాలన:
– ప్రజాస్వామ్యం అనేదే లేదన్నట్టుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఎప్పటికీ అధికారం తమ చేతుల్లోనే పెట్టుకోవాలన్న దురహంకారంతో నియంత పాలన సాగిస్తున్నాయి. 
– తమ విధానాలు, తమ అవినీతిపై మాట్లాడకుండా ప్రజల్ని బెదిరింపులతో అణచి వేస్తున్నట్టుగానే అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకోవాలన్న తాపత్రయం కనిపిస్తోంది.  
– గత టీడీపీ హయాంలో ఇజ్రాయిల్‌ నుంచి తెప్పించిన అత్యాధునిక పరికరాలతో ప్రతిపక్ష నాయకులు, వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నాయకుల ఫోన్లను ట్యాప్‌ చేసి మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. 
– ఇప్పుడూ కూటమి ప్రభుత్వం అదే విధానాలు అవలంబిస్తోంది. ఆ పార్టీల సోషల్‌ మీడియా కార్యకర్తలు బరి తెగించి వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. దాన్ని బహిరంగంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి బెదిరిస్తున్నారు.

బ్లాక్‌మెయిలింగ్‌. బెదిరింపులు:
– ప్రజల వ్యక్తిగత సమాచారం లీకవుతున్నా, దాంతో కూటమి పార్టీల సోషల్‌ మీడియా కార్యకర్తలు బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులకు దిగుతున్నా పోలీసులు మాత్రం తమకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. 
– పవన్‌కళ్యాన్‌ వీరాభిమాని, జనసేన కార్యకర్త డిప్యూటీ సీఎం తాలుకా అనే ఎక్స్‌ హ్యాండిల్‌ నుంచి ప్రజల వ్యక్తిగత సమాచారం  పోస్ట్‌ అవుతోంది.
– వ్యక్తుల ఫోన్‌ నెంబర్లు, లోకేషన్‌తో పాటు, ఫ్యామిలీ పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. వాటిని చూపుతూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. బెదిరిస్తున్నారు.

కార్యకర్తకు ఆ సమాచారం ఎలా చేరింది?:
– సదరు జనసేన కార్యకర్త పెట్టిన ఆ డేటా టెలికాం డిపార్ట్‌మెంట్‌ వద్ద మాత్రమే ఉంటుంది. ఈ డేటా కావాలంటే పోలీసులకు కూడా అనుమతి ఉండదు. ఒకవేళ డేటా తీసుకోవాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 
– అలాంటి సున్నితమైన డేటా నిమిషాల్లోనే వీరికి ఎలా చేరుతున్నట్లు?. పోలీసులు, కూటమి కార్యకర్తలు కుమ్మక్కై పని చేస్తున్నారా? లేదా పోలీసుల వద్ద ఉండాల్సిన పరికరాలు వీరి చేతికే ఇచ్చేసి వాడుకోమని చెప్పారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 
– ఒక్క మాటలో చెప్పాలంటే, రాష్ట్రంలో ఇప్పుడు చట్ట విరుద్ధంగా, యథేచ్ఛగా డేటా సేకరణ జరుగుతోంది. 

జనసేన అధినేతకు కనబడ్డం లేదా?:
– వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల డోర్‌ డెలివరీ కోసం వాలంటీర్లు, పథకాల లబ్ధిదారుల నుంచి ఫింగర్‌ ప్రింట్‌ (బయోమెట్రిక్‌) తీసుకుంటేనే వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని నానా హంగామా చేశారు. గగ్గోలు పెట్టారు.
అంటూ, ఆనాడు 2022, జూలై 22న పవన్‌కళ్యాణ్‌ పోస్ట్‌ చేసిన ట్వీట్‌ చూపారు.
– అలాంటి పవన్‌కళ్యాణ్, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. స్వయంగా తన పార్టీ కార్యకర్త డిప్యూటీ సీఎం తాలూకా అనే హ్యాండిల్‌ నుంచి వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టి మరీ బెదిరింపులకు పాల్పడుతుంటే ఆయన ఎందుకు నోరుమెదపడం లేదు?

ఖచ్చితంగా చట్ట ఉల్లంఘనే:
– రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1), 19 (1ఏ) ప్రకారం ఇది ప్రజల ప్రాథమిక హక్కులను హరించడమే. ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ సెక్షన్‌ 26–బి ప్రకారం ఇది డేటా బ్రీచ్, డేటా ప్రైవసీ కిందకు వస్తుంది.
– అయినా వాటన్నింటినీ అతిక్రమించి, వ్యక్తిగత సమాచారం ఎలా సేకరిస్తున్నారు? దాన్ని ఎక్కడెక్కడికి చేరవేస్తున్నారు?
– ఏదేమైనా కూటమి నాయకులు, పోలీసులు కలిసి ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. 
అందుకే..
– ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించేలా, స్వేచ్ఛను కాపాడేలా చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ తరఫున కేంద్ర హోం శాఖను కోరుతున్నాం. 
– అలాగే ఈ ఎక్స్‌ హ్యాండిల్‌ నడుపుతున్న వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పుత్తా శివశంకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Back to Top