కర్నూలు: చంద్రబాబునాయుడు ఒక పథకం ప్రకారమే కర్నూలు వచ్చి దాడి అంటూ హంగామా చేశారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. చంద్రబాబు తన కాన్వాయ్‌లో రాళ్లు, కర్రలు తీసుకొచ్చారని, టీడీపీ కార్యకర్తలు విద్యార్థులపై దాడి చేశారని చెప్పారు. నిజంగా విద్యార్థులు సంయమనం కోల్పోయి దాడి చేసి ఉంటే చంద్రబాబు కర్నూలు దాటి వెళ్లగలిగేవాడా అని హఫీజ్ ఖాన్ ప్రశ్నించారు. చంద్రబాబు ముమ్మాటికీ రాయలసీమ ద్రోహేనని, అందుకే న్యాయ రాజధాని ఇస్తానంటే కుట్రలతో అడ్డుకుంటున్నాడని చెప్పారు. వందేళ్లుగా న్యాయ రాజధాని కోసం పోరాటం చేస్తుంటే చంద్రబాబు మాత్రం మరో వందేళ్లు రాయలసీమ వెనుకబడే ఉండాలని కోరుకుంటున్నాడని, చంద్రబాబుకి తాను పుట్టిన గడ్డ రాయలసీమపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా తన హయాంలో ఎందుకు కర్నూలుకు న్యాయ రాజధాని ఇవ్వలేదని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రశ్నించారు. బాబు ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు! చంద్రబాబు కర్నూలు ఎందుకు వచ్చాడో అర్ధం కాలేదు. వచ్చాక ఏమి మాట్లాడాలో క్లారిటీ లేదనిపించింది. చంద్రబాబు ఏదో ఫ్రస్టేషన్‌లో ఉన్నట్లు స్పష్టంగా కన్పించింది. ఆయన కర్నూలుకు వచ్చి ఏదో ప్రూవ్ చేయాలని భావించారు. కానీ ఇక్కడి ప్రజలు అందుకు స్పందించకపోవడంతో చంద్రబాబు ఫ్రస్టేషన్‌లోకి వెళ్లిపోయారు. మా నాయకుడు శ్రీ వైయస్ జగన్ శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలుకు హైకోర్టు తెస్తానని స్పష్టంగా చెప్పారు. దానికి సంబంధించిన కమిషన్లు, ఇతర సంస్థలన్నిటినీ ఇస్తానని హామీ ఇచ్చారు. జ్యుడిషియల్ క్యాపిటల్ చేస్తానని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారు. వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చి జ్యుడిషియల్ క్యాపిటల్ గురించి మాట్లాడాలి కానీ...అన్నీ బూతులు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు కర్నూలువాసుల ఆకాంక్ష అయిన న్యాయ రాజధాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు..? నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మా నాయకుడు వైయస్ జగన్ గారిపై ఎలాంటి భాషను వాడారో ప్రజలు గమనించాలి. ఏరోజైనా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అలాంటి భాషను చంద్రబాబుపై వాడారా..? జ్యుడిషియల్ క్యాపిటల్ అడ్డుకుంటున్నారు అని ఇక్కడి ప్రజలు రగిలిపోతున్నారు. ఈ సందర్భంలో చంద్రబాబు కర్నూలు వచ్చి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. దానిలోంచి సింపతీ సంపాదించాలని చంద్రబాబు చూస్తున్నాడు. వందేళ్ల నుంచి ఈ గడ్డకు అన్యాయం కడుపు మండిన యువత నిరసనలు తెలియజేస్తే.. పేటియం బ్యాచ్ అంటావా?. మా హక్కుల కోసం ప్రాణాలు అర్పించడానికి రాయలసీమ వాసులు సిద్ధంగా ఉన్నారు. వందేళ్ల నుంచి ఈ గడ్డకు అన్యాయం జరుగుతోంది. నీళ్లు లేవు...యువతకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు చాలా కసితో ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి నిత్యం వలసలు పోవాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడూ మేం హైదరాబాద్, బెంగుళూరు వైపు చూడాలా..? మీరొచ్చాక విజయవాడ వైపు చూడమని మీరంటే మేం అభివృద్ధి చెందేది ఎప్పుడు..? కర్నూలునే అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ చెప్తున్నారు. రాయలసీమ ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మరు. ఈ రోజు చంద్రబాబు కాన్వాయ్‌లో రాళ్లు తీసుకువచ్చారు..కర్రలు తీసుకొచ్చారు. ఆయన కాన్వాయ్ నుంచి న్యాయవాదుల జేఏసీపై రాళ్లు రువ్వారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వాళ్లపై మీ వాహనాల నుంచి రాళ్లు విసిరారు. కర్రలతో వారిపై దాడి చేశారు. వాళ్లు తిప్పి అదే రాయి వేస్తే తనపై రాయి వేశారంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టి సింపతీ పొందటం కోసం చంద్రబాబు ప్రయత్నం చేశాడు. కర్నూలు ప్రజలు చాలా శాంతియుతంగా నిరసన తెలిపినందుకు ధన్యవాదాలు. నిజంగా మా ప్రజలు రెచ్చిపోయి ఉంటే చంద్రబాబు కర్నూలులో తిరగలిగేవాడు కాదు. నిజంగా కర్నూలు ప్రజల ఆవేదన ముందు చంద్రబాబునాయుడు తట్టుకోగలిగేవాడు కాదు. మేం నిజంగా గూండాయిజం చేసి ఉంటే చంద్రబాబు కర్నూలు వదిలి వెళ్లగలిగే వాడు కాదు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని బాబు ఎందుకు అడగలేదు..?: చంద్రబాబే నాకు చివరి ఎలక్షన్ అని చెప్పాడు. చివరి ఎలక్షన్ కాబట్టే ఆయన సింపతీ గేమ్ ఆడుతున్నాడు. తన భార్యను అసెంబ్లీలో తిట్టారని, తనపై రాళ్లు వేశారంటూ చంద్రబాబు లేనిపోని అబద్దాలు చెప్పి సానుభూతి పొందాలని చూస్తున్నాడు. ఇదే కర్నూలు గడ్డకు చంద్రబాబు హైకోర్టుకు ఎందుకు ఇవ్వలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలి. కనీసం చంద్రబాబు చెప్పినట్లు హైకోర్టు బెంచ్ కూడా ఇవ్వలేకపోయాడు. మాకూ రాయలసీమ పౌరుషం ఉంది...చంద్రబాబు మా గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకోవాలా..? వందేళ్ల నుంచీ రాయలసీమ వాసుల్ని అణగదొక్కి పెట్టారు. మరో వందేళ్ల వరకూ మేము ఇలానే దుర్భరంగా బతకాలని చంద్రబాబు కోరుకుంటున్నాడా అని ప్రశ్నిస్తున్నా. ఎస్...చంద్రబాబు ముమ్మాటికీ రాయలసీమ ద్రోహే... రాజధాని అమరావతి అనే విషయంలో జగన్మోహన్‌రెడ్డి గారు ఎప్పుడూ ఒప్పుకోలేదు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడే రాజధాని ఉండాలన్నారు. మూడు ప్రాంతాలు అభివృధ్ది చెందాలని ఆయన కోరుకుంటున్నారు. చంద్రబాబు అమరావతి రాజధాని అన్నప్పుడు మా రాయలసీమకు ఏం న్యాయం చేసి అమరావతి రాజధాని అన్నారో చెప్పాలి. చంద్రబాబు కర్నూలు వచ్చి దిగజారుడు రాజకీయాలు చేశారు. అలా దిగజారుడు రాజకీయాలు చేసినా కర్నూలు వాసులు చాలా సంయమనంతో ఉన్నారు. ‘‘ఎస్...చంద్రబాబు ముమ్మాటికీ రాయలసీమ ద్రోహే...’’ అని హఫీజ్ ఖాన్ అన్నారు. చంద్రబాబు తాను పుట్టిన జన్మభూమి రాయలసీమకు ద్రోహి...పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కి ద్రోహి. చంద్రబాబు మాట్లాడేది అబద్దం...చేసేది ద్రోహం. చంద్రబాబునాయుడు ఈ రోజు ఒక వీధి రౌడీలా ప్రవర్తించాడు. చదువుకుంటున్న విద్యార్థులను రా చూసుకుందాం అంటూ చంద్రబాబు రెచ్చగొట్టాడు. వాళ్ల ఉద్యోగ అవకాశాల కోసం వారు నిరసన తెలుపుతుంటే వారిని రెచ్చగొడుతున్నాడు. ఆ విద్యార్థుల వయసేంటి..చంద్రబాబు వయసేంటి..? నిజంగా ఆ విద్యార్థులు రెచ్చిపోయి ఉంటే మీ పరిస్థితి ఏమిటో గుర్తుంచుకోవాలి. మేం కోరుకునేది ఒక్కటే...న్యాయ రాజధాని రావాలి: వందేళ్ల క్రితం నుంచి మా ప్రాంతం జ్యుడిషియల్ క్యాపిటల్ కావాలని పోరాటం జరుగుతోంది. ఇది చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకోవద్దని చంద్రబాబునాయుడికి మనవి. చంద్రబాబు మాకు కావాల్సింది ఎలాగూ ఇవ్వలేదు. కనీసం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారినైనా ఇవ్వనివ్వండి. ఇప్పటికైనా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చెందనీయండి. రెండు కళ్ల సిద్ధాంతం అంటూ చంద్రబాబు రాష్ట్ర విభజనకు కారకుడై రాయలసీమ వాళ్లు బిచ్చమెత్తుకునేట్లు చేశాడు. ఇప్పుడు సీమకు ఇస్తానన్న న్యాయ రాజధానిని కూడా రాకుండా చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. చంద్రబాబు కుట్రలు ఇలానే కొనసాగితే మరో వందేళ్ల వరకూ మేం ఇలానే బిచ్చమెత్తుకునే పరిస్థితికి వెళ్తాం. రాబోయే రోజుల్లో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి. మూడు ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలనేదే మా కోరిక. ఫ్యాక్షనిస్టులు అని చెప్పడం కోసమే చంద్రబాబు ఆరాటం: చంద్రబాబు రాయలసీమ వచ్చి సీమకు రావాల్సిన హక్కులపై స్పందించకుండా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించి తిరిగి రాయలసీమ వారు రౌడీలు గూండాలు అంటూ నిందలు వేస్తున్నారు. సీమ ప్రజలు బాంబులు, కత్తులు తీసుకుని తిరుగుతారు..ఫ్యాక్షనిస్టులు అని చెప్పడం కోసమే చంద్రబాబు ఒక పథకం ప్రకారం కర్నూలులో డ్రామా చేశాడు. కర్నూలులోని విద్యార్థి, న్యాయవాద, ప్రజా సంఘాలు సంయమనం పాటించకపోయి ఉంటే ఈ రోజు చంద్రబాబు ఏది కోరుకుని వచ్చాడో అది జరిగి ఉండేది. ప్రజలు ఆయన ట్రాప్ లో పడకుండా తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలిపి కర్నూలు వారి మంచితనాన్ని చూపించారు. చంద్రబాబులో ఉండే క్రూరత్వం, ప్రస్టేషన్, రెండు నాల్కల ధోరణిని ఈ రోజు కర్నూలు ప్రజలు గమనించారు. న్యాయ రాజధాని ఒప్పుకునే బాబు కర్నూలు రావాలి: ఇక మీదట చంద్రబాబు కర్నూలుకు న్యాయ రాజధాని రావాలి అని చెబితేనే ఈ ప్రాంతంలో పర్యటించాలి. మా ఓట్లు, సీట్లు కావాలి కానీ చంద్రబాబుకు ఇక్కడి వారి అభివృద్ధి పట్టదా..? ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు అని కుట్రలు చేస్తే మాత్రం కర్నూలు, రాయలసీమ ప్రజలు ఒప్పుకునేది లేదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. గూండాలెవరో చంద్రబాబు చూపించాలి... గూండాలంటూ చంద్రబాబు చేసిన వాఖ్యలు సరికాదని, ఈ రోజు నిరసన తెలిపిన వారిలో న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజా సంఘాల వారు మాత్రమే ఉన్నారు. కానీ చంద్రబాబు ఒక పథకం ప్రకారం వైసీపీ గూండాలంటూ ప్రజలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. విద్యార్థులపై దాడి చేసిన టీడీపీ వారి వీడియోలు చూపించగలం. విద్యార్థులపై దాడి చేసి తిరిగి తమపై దాడి అంటూ నాటకం ఆడుతున్నారు.. ఆందోళన చేస్తున్నది స్థానిక ప్రజలు. గూండాలను తీసుకురావాల్సిన అవసరం చంద్రబాబుకు మాత్రమే ఉంది. నిజంగా మేమే గూండాగిరి చేయాలనుకుంటే చంద్రబాబు కర్నూలు దాటి కూడా వెళ్లలేడని చాలెంజ్‌గా చెప్తున్నా. దీనికి స్క్రిఫ్ట్, దర్శకత్వం అంతా చంద్రబాబే.. చంద్రబాబునాయుడు తన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. ఆయన చాలా బాగా కార్యక్రమాలు చేసుకున్నారు కూడా. ఇక్కడి ప్రజలు మాత్రం గాంధేయ పద్ధతిలో నిరసన తెలిపారు. టీడీపీ పెయిడ్ బ్యాచ్ వారు మహిళలపై కూడా దాడిచేశారు. ఆడవాళ్లు అని కూడా చూడకుండా బూతులు తిట్టారు. దీనికి స్క్రిఫ్ట్, దర్శకత్వం అంతా చంద్రబాబే.. ఇది ట్రైలర్ మాత్రమే చంద్రబాబు... నేను అమరావతికే మద్దతు పలుకుతా..మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు చంద్రబాబు కావాలని కర్నూలులో పర్యటించారు. దాడికి నిరసనకు చాలా తేడా ఉంది. కర్నూలు వాళ్లు కేవలం నిరసన మాత్రమే తెలిపారు. దాడి చేసి ఉంటే చంద్రబాబు కర్నూలు వదిలి వెళ్లేవాడు కూడా కాదు. చంద్రబాబు చేయాలనుకున్న కుట్ర ఫెయిల్ అయింది. ఇది ట్రైలర్ మాత్రమే అని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి కుట్రలే చేస్తే పరిస్థితి మరో రకంగా ఉంటుంది. రాయలసీమలో హత్యలు జరిగాయంటే అది చంద్రబాబు వల్లే. ఆయన పార్టీ నేతలే బూతులు మాట్లాడతారు. సాక్షాత్తు చంద్రబాబే ఆ బూతులు నేర్పిస్తున్నాడని నేడు తేటతెల్లమైంది. రాజకీయాలు ఇంతగా దిగజారిపోయాయంటే దానికి కారణం చంద్రబాబునాయుడే. ఎప్పుడూ కూడా మా పార్టీ వైపు నుంచి రియాక్షన్ మాత్రమే ఉంటుంది..టీడీపీ వైపు నుంచే యాక్షన్ ఉంటుంది. టీడీపీ యాక్షన్ ప్రజల కోసం కాకుండా తమ సిండికేట్, రియల్ ఎస్టేట్ దందా కోసం, స్వార్ధ రాజకీయాల కోసం మాత్రమే ఉంటుందని హాఫీజ్‌ఖాన్ వ్యాఖ్యానించారు.