విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంపై తప్పుడు ప్రచారం 

 లోక్‌సభలో టీడీపీ బండారం బయటపెట్టిన మిథున్‌రెడ్డి

న్యూ ఢిల్లీ: విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం విషయంలో  తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుందని లోక్‌స‌భ‌లో వెల్లడించారు. ఇదే సమయంలో అదానీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని పార్టీ తరఫున ఆయన మరోసారి వివరణ ఇచ్చారు.

ఏపీలో సోలార్ పవర్ విషయంలో వైయ‌స్ఆర్‌సీపీపై గత కొన్నాళ్లుగా టీడీపీ, దాని అనుకూల మీడియా అడ్డగోలు ప్రచారానికి దిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై అమెరికాలో నమోదైన అభియోగాలను.. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానికి అన్వయిస్తూ ఇష్టానుసారం కథనాలతో వైయ‌స్‌ జగన్‌ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించాయి. అయితే.. ఈ కుట్రను తాజాగా లోక్‌సభలోనూ వైయ‌స్ఆర్‌సీపీ బయటపెట్టింది. 

పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా..  మంగళవారం లోక్‌సభలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ..‘సోలార్ పవర్ విషయంలో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు . ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుంది. అదానీతో ఒప్పందం చేసుకోలేదు. 

సెకీతో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. చాలా తక్కువ రేటుకు మేము ఒప్పందం చేసుకున్నాం. 2021లో సోలార్ పవర్ 5.90 యూనిట్‌కు ఉంది. మేము  2.49కు మాత్రమే కొనడానికి ఒప్పందం చేసుకున్నాము. ఇటీవల కాలంలో కూడా ఐదు రూపాయలకు పైగా యూనిట్‌కు చెల్లించి పవర్ కొన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఒక వర్గం మీడియా, మేధావులు మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చట్ట సభ దృష్టికి తీసుకెళ్లారు.

దేశంలో బ్యాంకింగ్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతుంది. దేశంలో 62% జనాభా వ్యవసాయంపైన ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగం అభివృద్ధికి తగిన చర్యలు కనిపించడం లేదు. రుణమాఫీ, అందుబాటులోని రుణాలు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు  కావడం లేదు. చాలా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. చిన్నతరహ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. విద్యార్థులకు ఇచ్చే రుణాలకు సరైన విధానం రూపొందించాల‌ని మిథున్‌ రెడ్డి సూచనలు చేశారు. 
 

Back to Top