కొత్త హామీలతో మోసం చేసేందుకు మళ్లీ ముగ్గురు కలిసి వస్తున్నారు

ప‌ల‌మనేరు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

మోసగాళ్లతో మనం యుద్ధం చేస్తున్నాం

14 ఏళ్లపాటు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మంచైనా చేశాడా?

అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు, మోసాలు

అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు చంద్రముఖి మారిపోతాడు

బాబు తన హయాంలో పేద ప్రజలకు ఒక్క సెంటు భూమైనా ఇచ్చాడా? 

ఈ 59 నెలల పాలనలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం

మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశాం

మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి 99 శాతం అమలు చేశాం

59 నెలల పాలనలో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ

ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి

చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే

మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది

గ్రామ సచివాలయాల్లో ప్రజలకు 600 రకాల సేవలు అందుతున్నాయి

వర్షం రూపంలో దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తున్నారని భావిస్తున్నా

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో సీఎం
 వైయస్.జగన్.

చిత్తూరు జిల్లా: కొత్త హామీలతో మోసం చేసేందుకు మళ్లీ ముగ్గురు కలిసి వస్తున్నార‌ని వైయ‌స్ఆర్ సీపీ అధినేత, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్‌.. జగన్‌కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపు.. పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపేనని అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. 59 నెలల్లో విప్లవాత్మక  మార్పులు తీసుకొచ్చాం. రూ.2 లక్షల 70వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించాం. 59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. పిల్లల చదువులు కోసం అమ్మఒడితో ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించామ‌ని  సీఎం వైయ‌స్ జగన్‌ చెప్పారు.  శనివారం మధ్యాహ్నం పలమనేరు బహిరంగ సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు. 

 ఈ సందర్భంగా   ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఏమన్నారంటే...

పలమనేరు సిద్ధమేనా? దేవుడి దయతో, మండుటెండలో ఒక చక్కటి వర్షం పడింది. మీ చిక్కటి చిరునవ్వులతో పాటు ఈ వర్షం కూడా దేవుడి దగ్గర నుంచి ఒక ఆశీస్సుగా భావిస్తున్నాను. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య మీ బిడ్డ ఇక్కడకు వచ్చిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ జగన్‌ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు
మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం.  చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే. చంద్రబాబును నమ్మితే ఏమౌతుంది. మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. లకలకా..లకలకా అంటూ మీ తలుపు తడుతుంది. 

దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.
 
మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? 
గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలల పాలనలో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. మీ బిడ్డ పాలన రాక ముందు వరకూ రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఉంటే...మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో 2.31 లక్షల ఉద్యోగాలు... కేవలం ఈ 59 నెలల కాలంలోనే వచ్చాయి. మన కళ్లముందు కనిపిస్తున్నాయి. 

మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం.
ఇంతకుముందు అంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు. రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలు పెట్టిస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఆ చెత్త బుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి, గతంలో ఎప్పుడూ చూడని విధంగా దేశంలోనూ ఎక్కడా చూడని విధంగా.. మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక ఖురాన్‌గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే పంపించి, మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి, మీరే మీ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వండి అనే కార్యక్రమం జరుగుతోంది అంటే...కేవలం అది మీ బిడ్డ పాలనలో కాదా?

ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను
ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ మీకు అందాయా అని మీరే ఆలోచించండి.

గవర్నమెంట్‌ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?.
పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా చూసారా?
నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని, ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంతో పాటు  అందులో 20 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టాం. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?

నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ గతంలో ఎప్పుడైనా జరిగిందా?, రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. 
రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను. 

స్వయం ఉపాధికి అండగా
 తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర,  నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?

పేదవాడు ఆరోగ్యం కోసం అప్పులు పాలవ్వకూడదని...
పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్‌. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను. 


గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు.
గ్రామంలో అడుగు పెడుతూనే ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను. 

గ్రామంలోకి అడుగుపెడుతూనే ఒక సచివాలయ వ్యవస్థ. ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్‌. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల ఫోన్‌లో దిశ యాప్. ఇవన్నీ గతంలో ఉన్నాయా అని అడుగుతున్నాను. 

నేను చెప్పినవన్నీ కూడా గతంలో లేనివి...మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల్లో జరిగినవి...నిజమా కాదా అని అడుగుతున్నాను. 

అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చంద్రముఖి. 
మరో పక్క 14 ఏళ్లు సీఎంగా చేసానంటాడు చంద్రబాబు. 3 సార్లు సీఎం అంటాడు. చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఆయన చేసిన మంచి ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతున్నాను. చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతున్నాను. 
మరి ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చంద్రముఖి. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో...ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను.
ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) అన్నా ఇది గుర్తుందా? అక్కా ఇది గుర్తుందా? అక్కా ఇది గుర్తుందా? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ ఫాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి.. సంతకం పెట్టిన ఈ ఫాంప్లెట్‌ను మీ ప్రతి ఇంటికీ పంపించాడు. పంపించడమే కాకుండా అప్పట్లో ఆయన ఈటీవీ, ఆయన ఏబీఎన్, ఆయన టీవీ5లో అడ్వర్టైజ్‌మెంట్లు గుర్తున్నాయా? అడ్వర్టైజ్‌మెంట్లతో ఊదరగొట్టాడు. నేను ఇవాళ అడుగుతున్నాను. 2014లో స్వయంగా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ ఫాంప్లెట్‌లో ఈ ముగ్గురి ఫొటోలతో ఉన్న ఈ ఫాంప్లెట్‌లో ఇవన్నీ 2014 నుంచి 2019 ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి. మొదలుపెట్టమంటారా?  

చంద్రబాబు విఫల హామీలు.
ఇందులో మొదటిది.. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్కా పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు, చెల్లెమ్మా  ఏకంగా రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇందులో ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. మూడో ముఖ్యమైన హామీ.. అక్కా మూడో ముఖ్యమైన హామీ.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? మీ అకౌంట్లలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ వేశాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 

నాలుగో ముఖ్యమైన హామీ..ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించాడు. ఇంటింటికీ ఉద్యోగం. తమ్ముడూ ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చాడా? ఇంకా ముందుకు వెళ్లమంటారా? ఇంకా ముందుకు పోదామా?
అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌, చేనేత పవర్‌ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా?. విమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? మన పలమనేరులో కనిపిస్తోందా? మరి నేను ఒక్కటే అడుగుతున్నాను. మరి నేను మీ అందరినీ అడిగేది ఒక్కటే సాక్షాత్తు చంద్రబాబు సంతకం.. కనిపిస్తోందా? ముగ్గురు పార్టీలతో కూటమిగా ఏర్పడి ఈ ఫాంప్లెట్‌ను మీ ప్రతి ఇంటికీ పంపించి ఆ తర్వాత ఆయన 2014 నుంచి 2019 ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అయిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చాడా? దాన్నీ అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా? అక్కా నమ్ముతారా? అన్నా నమ్ముతారా? చెల్లి నమ్ముతారా? మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. మళ్లీ ఇదే ముగ్గురూ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి ఏమంటున్నారు? ఇవాళ మళ్లీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు అడుగులు పడుతున్నాయి. సూపర్‌ సిక్స్‌ అంట నమ్ముతారా?, సూపర్‌ సెవెన్‌ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా? అక్కా నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.

మోసగాళ్లతో మనం యుద్దం చేస్తున్నాం.
ఇలాంటి మోసగాళ్లతో, వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. మళ్లీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్‌ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?. 

ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, అక్కడ చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్.. అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి.

మన వైయస్సార్ సీపీ తరఫున నిలబడుతున్న మన అభ్యర్థులపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను అని చెబుతూ సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.

 ఈ కార్యక్రమంలో పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వెంకటేగౌడ, చిత్తూరు ఎంపీ అభ్యర్ధి ఎన్ రెడ్డప్ప పాల్గొన్నారు.

Back to Top