పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి

రాజంపేట ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

రాజంపేటలో అక్కచెల్లెమ్మల పేరిట 4వేల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఇళ్ల నిర్మాణం..

మ‌రో 4 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది..

జరగబోయే ఈ ఎన్నికలు పథకాల కొనసాగింపును నిర్ణయించేవి..

మీ జగన్ తీసుకొచ్చినన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?

ఈ తరహాలో పేదవాడి మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో చూశారా?

ప్రత్యేకహోదాను అమ్మేశారు, పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి..

చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని జిల్లా కేంద్రం చేస్తా అంటున్నాడు..

రాజంపేట, మదనపల్లి, రాయచోటిలను జిల్లా కేంద్రం చేస్తానంటున్నాడు నమ్ముతారా?

రాజంపేటలో పింఛా డ్యాం ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం

అన్నమయ్య ప్రాజెక్ట్, గాలేరు-నగరి కాల్వ పనులు పూర్తి చేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి

రాజంపేట కేంద్రంగా అన్నమయ్య కాలేజ్‌ను యూనివర్శిటీగా తీర్చిదిద్దాం

మీ బిడ్డ తీసుకున్న నిర్ణయం రాజంపేట చరిత్రలో నిలిచిపోతుంది

అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు

అన్న‌మ‌య్య జిల్లా:  పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు అంతటి అవినీతిపరుడు దేశంలోనే లేడని మోదీ అన్నారు. కూటమిలో చేరగానే అదే నోటితో చంద్రబాబును పొగుడుతున్నాడు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఏం కావాల్లో అది మాత్రమే మాట్లాడారు. 2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?. చంద్రబాబు కూటమి.. పెత్తందార్ల కూటమి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొస్తే.. వ్యతిరేకించారు. పెత్తందార్ల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకోవాలా? 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. అక్క చెల్లెమ్మలకు నేరుగా రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించామ‌ని సీఎం వివరించారు.
 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే.. 
రాజంపేట సిద్ధమేనా?
మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు, ఆత్మీయతను పంచిపెడుతున్న నా ప్రతి అక్కకూ. ప్రతి చెల్లికి, ప్రతి అవ్వకు,ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి,స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ..మీ జగన్‌ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. 

జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం
మరో 4 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే  జరుగుతున్న ఎన్నికలు కానే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు.మళ్లీ మోసపోటం. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలకాయి పెట్టడమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. ఈ విషయాలను అందరూ గుర్తుపెట్టుకోమని సవినయంగా కోరుతున్నాను.
 

ఏపీ ప్రజలను నిరాశపర్చిన మోదీ, బాబు, అమిత్ షా ఉమ్మడి సభలు
మొన్న ఈ మధ్యనే చంద్రబాబు ప్రధానమంత్రి, దేశ హోంమంత్రి వీళ్లందరితో ఏపీలో ఉమ్మడి సభలు పెట్టిస్తున్నాడు.చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి, అమిత్‌షాతో ఉమ్మడి సభలు పెట్టిస్తున్నప్పుడు ప్రజలంతా ఏం ఆశించారు అంటే.. పదేళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా ఇప్పటికైనా ఇస్తారేమో..ఈ మాట వాళ్ల నోటి నుంచి వస్తుందేమో అని ప్రజలంతా ఆశగా ఎదురుచూసారు. ఈ ప్రకటన చేస్తారేమో అని ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా...చంద్రబాబు నాయుడుకి ఏం కావాలి? దత్తపుత్రుడికి ఏం కావాలి? వదినమ్మకు ఏం కావాలి? దుష్టచతుష్టయానికి ఏం కావాలి? అని వీళ్లకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి, మన మీద నాలుగు రాళ్లువేసి వెళ్లారు. 
మొన్నటిదాకా ఇదే చంద్రబాబును అదే మోదీగారు 'ఇంతటి అవినీతిపరుడు దేశచరిత్రలోనే ఉండడు' అని చెప్పిన అదే నోటితో ఇదే చంద్రబాబును వారి కూటమిలో చేరినందుకు పొగిడి వెళ్లిపోయాడు ఇదే మోదీ గారు. 

99శాతం హామీలు మనం అమలు చేస్తే...
దీనివల్ల రాష్ట్రంలో మన రైతులకు కానీ, మన అక్కచెల్లెమ్మలకు కానీ, అవ్వాతాతలకు కానీ, మన పిల్లలకు కానీ, మన సామాజిక వర్గానికి కానీ, ఏ ఒక్క సామాజిక వర్గానికి కానీ, ఏ ఒక్కరికి అయినా లాభం జరిగిందా? అని అడుగుతున్నాను. 
మరో పక్క మీ బిడ్డ.. మీ జగన్ ఉన్నాడు. మీ జగన్ ఏం చెబుతున్నాడు.. ఐదేళ్ల క్రితం నేను ఇదిగో నా మేనిఫెస్టో అని ఇచ్చాను. ఇందులో చెప్పినవి 99% వాగ్దానాలు అమలుచేసి, చెప్పిన మేనిఫెస్టోను, అమలు చేసిన మేనిఫెస్టోను ప్రతి ఇంటికీ పంపిస్తూ, ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్నదమ్ముడికి, ప్రతి రైతన్నకూ దాన్ని చూపిస్తూ, మీరే దీన్ని టిక్కు పెట్టండి అని వాళ్లని అడుగుతూ, వారందరి ఆశీస్సులు మీ బిడ్డ ఒకవైపున తీసుకుంటూ ఉంటే...

2014లో ఇచ్చిన హామీలు గురించి మాట్లాడని కూటమి నేతలు.
మరి మన భారత దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి, చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ వీరంతా కలిసి 2014 లో వీళ్లిచ్చిన మేనిఫెస్టో చూపించి, ఇదిగో అప్పట్లో మేమిచ్చిన మేనిఫెస్టోలో ఇవిగో మేము ఇవన్నీ చెప్పాము...ఈ మేనిఫెస్టోనే కాకుండా ముఖ్యమైన హామీలు అంటూ ముగ్గురి ఫొటోలతో పాటు చంద్రబాబు స్వయానా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించాడు...పంపిన ఆ ముఖ్యమైన హామీలన్నీ మేము నెరవేర్చాము అని వీరంతా ఎందుకు చెప్పలేకపోతున్నారు. 

కూటమి అంటారు..డబుల్ ఇంజన్ అంటారు...మరి 2014 లో ఇదే ముగ్గురు కలిసి, చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికీ పంపిన పాంప్లెట్, వాళ్ల మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలే చేయకపోతే...అందులో చెప్పిన ఏ ఒక్కదాన్నీ చేయకపోతే...ఇంక వీళ్లు డబుల్ ఇంజనూ...డబుల్ ఇంజనూ అని ఎందుకు అంటున్నారని మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను. 

పెత్తందార్ల కూటమిని అడుగుతున్నా....
మొన్న ఆ మధ్యకాలంలోనే అమిత్ షా వచ్చాడు. చంద్రబాబును పక్కన పెట్టుకుని తానూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పెత్తందార్ల కూటమి అంతా కూడా..పేద పిల్లలకు గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నవారు.వ్యతిరేకిస్తున్నారు. మొన్న వచ్చి మాట్లాడుతున్న ఈ అమిత్‌ షా, ఢిల్లీ పెద్దలను అడుగుతున్నా..చంద్రబాబును అడుగుతున్నా...దత్తపుత్రుడిని అడుగుతున్నా...వీళ్లకు మద్దతు ఇస్తున్న ఈనాడు రామోజీరావును, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 ను అడుగుతున్నాను.

రూపం మార్చుకున్న అంటరానితంపై యుద్దం
మీ పిల్లలు, మీ మనవలు మీ వాళ్లలో ఏ ఒక్కరైనా కూడా ఇంగ్లీష్‌ మీడియం బడుల్లో కానీ, లేదా మీ స్థానిక భాషల్లో కానీ మీరు ఎవరినైనా చదివిస్తున్నారా అని అడుగుతున్నాను. 
పేదలకు వేరే మీడియం అట...మన గవర్నమెంట్‌ బడుల్లో పిల్లలకు మాత్రం తెలుగు మీడియం అంట...ఇలాంటి వాళ్లకు మాత్రం వేరే చదువులట, వేరే విధానమట...
ఇటువంటి భావజాలం, ఇటువంటి పెత్తందారీ భావజాలంతో ఇలాంటి వాళ్లు ప్రజల ముందుకు వచ్చి మాకు ఓటు వేయమని అడుగుతున్నారంటే...ఇలాంటి వారికి రేప్పొద్దున ఓటు వేస్తే పేదపిల్లలకు, గవర్నమెంట్‌ బడుల్లో చదువుతున్న ఆ పిల్లలకు ఏ ఒక్కరికైనా ఇంగ్లీష్‌ మీడియం వీళ్లు నేర్పుతారా అని అడుగుతున్నా. 
ఆలోచన చేయండి...ఈ రూపం మార్చుకున్న అంటరానితనం మీద మనం చేయాల్సిన యుద్ధం ఇంకా ఎంత ఉందో గుర్తుపెట్టుకోమని అడుగుతున్నాను.

59 నెలల మీ బిడ్డ పాలన చూసారు. దేవుడి దయతో ఈ 59 నెలల్లో మీ అందరి చల్లని ఆశీస్సులతో గతంలో ఎప్పుడూ జరగని విధంగా,గతంలో ఎప్పుడూ చూడని విధంగా, మొట్టమొదటిసారిగా మీ బిడ్డ పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన 99% హామీలు అమలు చేసి, మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత అనే అర్థం తీసుకువచ్చింది మీ బిడ్డ పాలనలోనే కాదా? అని అడుగుతున్నాను.
ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు...రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ మీ బిడ్డ పాలన వచ్చేదాక రాష్ట్రంలో 4లక్షల ఉద్యోగాలు ఉంటే కేవలం ఈ 59 నెలల కాలంలో మరో 2,31,00 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఎప్పుడు జరిగిందీ అంటే..  కేవలం ఈ 59 నెలల పాలనలో కాదా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.
ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు వివిధ పథకాల కొరకు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు, ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా...మీబిడ్డ బటన్ నొక్కడం...నేరుగా...వారి కుటుంబాల ఖాతాలకే, వారి చేతికే అందుతున్న పరిస్థితి ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. ఇంతకుముందు ఇలా బటన్ నొక్కడం కానీ, నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్లిపోవడం కానీ, లంచాలు, వివక్షలు లేకుండా ఇలా ఇవ్వడం గానీ ఎప్పుడైనా ఇంతకుముందు జరిగిందా? అని అడుగుతున్నాను. 

విద్యావ్యవస్ధలో  విప్లవం.
గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడునేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూల్లు, గవర్నమెంట్ బడులలో  ఇంగ్లీష్ మీడియం, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుంచే పిల్లల ప్రతి క్లాసులోనూ డిజిటల్ బోధన, ఇంటరాక్టివ్ ప్లాట్ పానెల్స్, 8వ తరగతికి పిల్లలు వచ్చేసరికి వారి చేతుల్లో ట్యాబ్‌లు, మొట్టమొదటిసారిగా...పిల్లల చేతుల్లో బైలింగ్వల్‌ టెక్స్ట్‌బుక్స్‌..అంటే ఒక పేజీ ఇంగ్లీషు, మరోపేజీ తెలుగు..మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్‌ టీచర్లు, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇంగ్లీష్ మీడియం నుంచి ఐబీ దాకా ఈరోజు మన పిల్లలు ప్రయాణం, ఎప్పుడూ జరగని విధంగా బడులు తెరిచేసరికే పిల్లలకు ఒక విద్యాకానుక, బడులల్లో పిల్లలకు గోరుముద్ద, పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి అందిస్తున్నాం. 
పెద్ద చదువుల్లో కూడా విప్లవాలను తీసుకువస్తూ, పెద్ద చదువుల కోసం ఏ తల్లీతండ్రీ ఇబ్బంది పడకుండా పూర్తి ఫీజులతో, ఆ పిల్లల కోసం అండగా నిలబడుతూ, పూర్తి ఫీజులు కడుతూ ఓ జగనన్న విద్యాదీవెన, వసతి  దీవెన అందించడంతో పాటు, ఈరోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ స్టూడెంట్లు, డాక్టర్లు వంటి డిగ్రీలు చదువుతున్న వాళ్లు కానీ ఏకంగా 93% మంది జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అందుకుంటున్నారంటే తేడా గమనించమని కోరుతున్నాను.
మొట్టమొదటిసారిగా పెద్ద చదువుల కరిక్యులమ్ మారింది. కరిక్యులమ్ జాబ్ ఓరియంటెడ్‌గా మారింది. మ్యాండేటరీ ఇన్‌టర్న్‌ షిప్‌ కరిక్యులమ్‌లో భాగం అయ్యింది. ఇంటర్నేషనల్‌ కోర్సులు హార్వర్డ్, ఎల్‌ఎస్‌సీ, ఎంఐటీ, స్టాన్‌ఫర్డ్‌లాంటి కోర్సులు ఇవాళ ఆన్‌లైన్లో, వాళ్ల చేత సర్టిఫికెట్స్ ఇప్పిస్తూ, మన డిగ్రీలతో అనుసంధానం అయ్యాయి. 
ఈ 59 నెలల కాలంలో విద్యారంగంలో తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా?

అక్కచెల్లెమ్మలకు అండగా...
నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలని, వారి బతుకులు బాగుండాలని, నా అక్కచెల్లెమల కోసం తపిస్తూ, మహిళా సాధకారతకు అర్థం చెబుతూ ఓ ఆసరా, ఓ సున్నావడ్డీ, ఓ చేయూత, ఓ కాపునేస్తం, ఓ ఈబీసీ నేస్తం, అక్కచెల్లెమ్మల పేరిటే 31 లక్షల ఇళ్ల స్థలాలు వాళ్ల పేరిట రిజిస్ట్రేషన్..ఇదే రాజం పేట టౌన్‌లో 4000 ఇళ్ల స్థలాలు ఇవాళ నా అక్కచెల్లెమ్మల పేరున రిజిస్ట్రేషన్, అందులో కడుతున్న ఇళ్లుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. 
నేను అడుగుతున్నాను...ఇలా అక్కచెల్లెమ్మల మీద ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? ఇలాంటి పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా?

గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతుభరోసా. రైతన్నకోసం ఉచిత పంటల బీమా, రైతన్నలకు అండగా సీజన్ ముగిసేలోగా ఇన్ పుట్ సబ్సిడీ, పగటిపూటే 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ గ్రామంలోనే రైతన్నకు అండగా ఒక రైతుభరోసా కేంద్రం.ఇన్నిన్ని విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా?

స్వయం ఉపాధి రంగానికి అండగా...
స్వయం ఉపాధి రంగానికి అండగా ఉంటూ ఆటోలు టాక్సీలు నడుపుకునే వారికి వాహనమిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, శ్రమజీవులకు అండగా..ఒక తోడు, చేదోడు. లాయర్లకు కూడా లానేస్తం ఇంతగా స్వయం ఉపాధి రంగానికి ఇన్నిన్ని స్కీములు పెట్టి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఉందా? అని అడుగుతున్నాను. ఇన్నిన్ని పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా ? అని అడుగుతున్నాను.

పేదవాడి ఆరోగ్యానికి భరోసా..
పేదవాడి ఆరోగ్యానికి భరోసా...ఏ పేదవాడూ వైద్యం కోసం అప్పుల పాలు అయ్యే పరిస్థితి ఉండకూడదు అని ఆ పేదవాడికి అండగా ఉంటూ రూ.25 లక్షల దాకా విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ. పేదవాడు ఆపరేషన్ చేయించుకుంటే రెస్ట్ పిరియడ్‌లో ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే పేదవాడికి విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్.పేదవాడి ఇంటి తలుపుతడుతూ ఇంటి వద్దకే వచ్చే ఆరోగ్య సురక్ష. పేదవాడి ఆరోగ్యం కోసం ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? అని అడుగుతున్నాను.

వీటన్నిటితో పాటు ఏ గ్రామానికి వెళ్లినా కూడా 600 రకాల సేవలు అందించే ఒక గ్రామ సచివాలయం. 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ.
అవ్వాతాతలకు ఇంటికే వచ్చి రూ.3000 పెన్షన్ ఇస్తున్నారు.ఇంటి వద్దకే రేషన్. ఇంటి వద్దకే పౌరసేవలు. ఇంటి వద్దకే పథకాలు. అక్కచెల్లెమ్మలకు రక్షణ కోసం గ్రామంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మలకోసం తోడుగా అండగా వారి మొబైల్‌లోనే ఒక దిశ యాప్‌.
ఇటువంటి విప్లవాలు, మార్పులు, పాలన గతంలో ఎప్పుడైనా ఉందా? అని అడుగుతున్నాను. మొట్టమొదటిసారిగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇంటివద్దకే అందుతున్న పాలన ఉన్నదా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 

మరోవంక చంద్రబాబును చూడండి.
14 ఏళ్లు ముఖ్యమంత్రి అంటాడు. 3సార్లు సీఎం అంటాడు. మీ బిడ్డ ఇప్పుడు గడగడా ఇన్ని కార్యక్రమాలు చెప్పాడు. ఇన్నిన్ని పథకాలు చెప్పాడు.
మీ బిడ్డ పేరు చెబితే  నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా అవ్వాతాతలకు..ఇన్నిన్ని గుర్తుకు వస్తాయి.
మరి ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఏ పేదకైనా గుర్తుకు వచ్చే ఒక్క మంచి అయినా ఉందా? ఒక్కటంటే ఒక్క స్కీమ్‌ అయినా ఉందా?
ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేసాడు...అనేది మీకే చెబుతాను. 
అధికారంలోకి వచ్చేదాకా ఈ పెద్దమనిషి అబద్ధాలు ఆడతాడు..మోసాలు చేస్తాడు. అధికారం దక్కితే చంద్రబాబు నాయుడు మాయలు మోసాలు ఎలా ఉంటాయి..అంటే.. 
ఇది 2014లో చంద్రబాబు స్వయానా సంతకం పెట్టి, ఈ కూటమితో కలిసి, ముఖ్యమైన హామీలు అని చెప్పి మీ ప్రతి ఇంటికి పంపించిన పాంప్లెట్‌. (టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ..)
ఈ ముఖ్యమైన హామీల్లో చంద్రబాబు చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేసాడా అని అడుగుతున్నాను. 2014 నుంచి 2019 దాకా ఈ పెద్దమనిషి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా.... ముఖ్యమైన హామీలు అని చెప్పి ప్రతి ఇంటికి పంపిన ఈ పాంప్లెట్‌లో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా చేసాడో లేదో మిమ్మల్నే అడుగుతా మీరే సమాధానం చెప్పండి. 

చంద్రబాబు విఫలహామీలు
ఇందులో ఈయన చెప్పినవి..
మొట్టమొదటి హామీ...రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని ఈ పెద్దమనిషి అన్నాడు. వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు. ఈ మొత్తం వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా?
రెండో ముఖ్యమైన హామీ...ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన పాంప్లెట్‌లో ఉన్న రెండో హామీ..పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తా అని చెప్పాడు. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు. ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందా? అని అడుగుతున్నాను.
మూడో హామీ... ఆడబిడ్డ పుడితే మహలక్ష్మి పథకం కింద రూ. 25 వేలు మీ బ్యాంకుల్లో వేస్తా అన్నాడు. ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా. మీ ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా కూడా...ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క రూపాయి అయినా వేసాడా అని అడుగుతున్నాను.
నాలుగో ముఖ్యమైన హామీ...చంద్రబాబు స్వయానా సంతకం పెట్టి ముఖ్యమైన హామీ అంటూ 2014 లో మీ ప్రతి ఇంటికీ పంపించాడు..ఇంటింటికీ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2వేలు నిరుద్యోగభృతి ప్రతి నెలా అన్నాడు. ఐదు సంవత్సరాలు అంటే 60 నెలలు, నెలకు రూ.2 వేలు అంటే ప్రతి ఇంటికీ రూ.1,20,000. కనీసం ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? అని అడుగుతున్నాను.
ఇంకో హామీ. అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం అంట. కట్టుకునేందుకు పక్కా ఇల్లంట, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా..మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని అడుగుతున్నాను. 
ఇంకాముందుకు పోతే ఏటా రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్  రుణాల మాఫీ అన్నాడు జరిగిందా..? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు జరిగిందా? సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు జరిగిందా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తా అన్నాడు జరిగిందా..?
2014 లో స్వయంగా చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ఆరోజు ఈరోజులాగే డ్రామా ఆడి..ఇప్పుడులాగే అదే ముగ్గురితో జతకట్టి ఎన్నికల ముందు మీ ప్రతి ఇంటికి పంపించిన పాంప్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? మరి ఇలాంటివారిని నమ్మొచ్చా? పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? దాన్నీ అమ్మేశారు. 
ఇదే చంద్రబాబు నాయుడు మీ జిల్లాకు, మన జిల్లాకు వచ్చినప్పుడు ఏమన్నాడు? 

రాజంపేటకు సంబంధించి
మన జిల్లాకు వచ్చి 3 ప్రాంతాల్లో మీటింగులు పెట్టి రాయచోటికి వెళ్తే రాయచోటి కంటిన్యూ అవుతుంది అంటాడు జిల్లా హెడ్ క్వార్టర్స్. మదనపల్లికి పోతే మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు, రాజంపేటకు వస్తే రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు. మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వ్యక్తిని నమ్మొచ్చా అని అడుగుతున్నాను మీ అందరి సమక్షంలో.  ఈరోజు రాజకీయాలు చెడిపోయాయి కాబట్టి మీఅందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తోంది. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదానికి అర్థం రావాలి, విలువల అన్నమాటకు అర్థం రావాలి. ఈ చెడిపోయి ఉన్న ఈ రాజకీయ వ్యవస్థ మారాలి అంటే మీలో ఉన్న ప్రతిఒక్కరూ ఒక్కటి కావాలి. ఒక్కటై తోడుగా నిలబడాలి, అండగా నిలబడాలి. మీ అందరి సమక్షంలో మీ అందరికీ మంచి జరిగేట్టుగా ఈరోజు వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్‌ రూ.3వేలు మళ్లీ ఇంటికే రావాలన్నా, బటన్ నొక్కిన సొమ్ము మళ్లీ మీ ఖాతాలకే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు బాగుపడాలన్నా, వ్యవసాయం, మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా వీటి అన్నింటితో పాటు రాజంపేటకు సంబంధించి పింఛా ప్రాజెక్టు దాదాపుగా 90 శాతం పనులు ఇప్పటికే పూర్తి చేశాం. అన్నమయ్య ప్రాజెక్టు రేపు పూర్తి కావాలన్నా, గాలేరు నగరి కాలువ పనులు రైల్వేకోడూరు వరకు పూర్తి చేయాలన్నా ఇవన్నీ జరగాలన్నా ఏం చేయాలి? ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు.. రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?

ఇక్కడో, అక్కడో, ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే..అన్నా మన గుర్తు ఫ్యాను. తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, చెల్లెమ్మా అక్కా మన గుర్తు ఫ్యాన్, మన గుర్తు ఫ్యాన్ అమ్మా, పెద్దమ్మలు అవ్వలు మన గుర్తు ఫ్యాన్, తాతలు మన గుర్తు ఫ్యాన్.. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింకులోనే ఉండాలి.  

ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ ఇంకో గొప్ప విషయం కూడా చెప్పాలి. అన్నమయ్య కాలేజీ ఇదే రాజంపేటలో మన గంగిరెడ్డి అన్న వాళ్ల కాలేజ్. మన అన్నమయ్య కాలేజ్‌ను టాప్ 100 యూనివర్శిటీస్ ఇన్‌ది గ్లోబ్. అంటే ప్రపంచంలో టాప్ 100 యూనివర్శిటీస్‌తో మన అన్నమయ్య కాలేజ్‌ను టైఅప్ చేయించి అన్నమయ్య కాలేజ్‌ను రాజంపేట హెడ్‌క్వార్టర్స్ గా ఒక యూనివర్శిటీగా మీకు మీ జిల్లాకు ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా మన పిల్లలు ప్రపంచంలోని టాప్ 100 యూనివర్శిటీస్‌లో భాగస్వామ్యమైన అన్నమయ్య యూనివర్శిటీలో మన పిల్లలు డిగ్రీలు తీసుకుంటారు. ఇది నిజంగా రాజంపేట చరిత్రలో ఒక పెద్ద హిస్టరీలో నిలబడిపోయే అంశమని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను. 

ఈ విషయం కూడా చెబుతూ.. నా పక్కన అమరన్న నిలబడి ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. అమరన్న మంచితనం గురించి నేను వేరే చెప్పాల్సిన పనిలేదు. అమరన్న మనస్సు వెన్నలాంటి మనస్సు. ఎంత జెంటిల్‌మెన్ అంటే ఏదైనా గానీ ఒక విలువలు నమ్మాడంటే, ఒక మంచిని నమ్మాడంటే ఆ మంచికోసం ఎందాకైనా నిలబడే ఒక గొప్ప స్వభావం ఉన్న మనిషి. అమరన్న గొప్ప మెజారిటీతో ఆశీర్వదించాల్సిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరుపేరునా ప్రార్థిస్తున్నాడు. అదేవిధంగా నా కుడిపక్కన మిథున్ ఉన్నాడు. నాకు అప్పుడప్పుడు తమ్ముడు లేడు అనిపిస్తా ఉంటాడు. కానీ మిథున్‌ను చూసినప్పుడు మాత్రం నా తమ్ముడు నా పక్కనే ఉన్నాడు అన్న భరోసా మాత్రం నాకు ఎప్పుడూ కలుగుతుంది. మంచివాడు, సౌమ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ చల్లని దీవెనలు కూడా మిథున్‌పై ఉంచాల్సిందిగా రెండు చేతులు జోడించి పేరుపేరున మీ బిడ్డ ప్రార్థిస్తున్నాడు.

రాజంపేటలో మెడికల్ కాలేజీ.
అమరన్న, మిథున్ ఇద్దరూ కలిసి ఒకే ఒత్తిడి నా మీద తీసుకొస్తున్నారు. ఈ ప్రాంతంలో ఒక్క మెడికల్ కాలేజీని మంజూరు చేయించండని.. నేను ఇవాళ చెబుతున్నాను రాజంపేట కోసం వచ్చే టర్మ్‌లో అది కూడా చేయిస్తానని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను. రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం.. 18వ మెడికల్ కాలేజీ రాజంపేటలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
 

Back to Top