పేద‌రికాన్ని మ‌టుమాయం చేయాల‌నేదే మీ బిడ్డ స్వ‌ప్నం

రేపల్లె రోడ్‌షోలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 

మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం

58 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులెన్నో తీసుకొచ్చాం

పద్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు నాయుడి పేరు చెబితే ఒక్క పథకం, చేసిన మంచి గుర్తుకు రాదు

రూ.2లక్షల 70 వేల కోట్లు బటన్ నొక్కి...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేశాను:  వైయ‌స్ జ‌గ‌న్‌

చంద్ర‌బాబును న‌మ్మడం అంటే మ‌ళ్లీ మోస‌పోవ‌డ‌మే

బాపట్ల :  వైయ‌స్ జ‌గ‌న్ అనే మీ అన్న‌..మీ బిడ్డ, మీ రైతు రాష్ట్రంలో వేసిన విత్త‌నాలు మ‌రో 15 ఏళ్ల‌లో మ‌హావృక్షాలు అవుతాయి, ప్ర‌తి గ్రామంలో సంక్షేమం, మంచి మొక్క‌లు నాటానని, పేద‌రికాన్ని మ‌టుమాయం చేయాల‌నేదే మీ బిడ్డ స్వ‌ప్నమ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. పద్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు నాయుడి పేరు చెబితే ఒక్క పథకం, చేసిన మంచి గుర్తుకు రాదని.. 58 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులెన్నో తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం రేపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..
రేపల్లె సిద్ధమేనా? 

ఇంతటి ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ప్రేమానారాగాలు, ఇంతటి ఆప్యాయాతలు, ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న నా ప్రతిఅక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ... మీ అందరి ప్రేమాభిమానాలకు మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు,పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు.

మరో వారం రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం.
మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుంది. జరగబోయే ఎన్నికలు కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. అందరూ గుర్తుపెట్టుకొండి.. ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు.ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే.

బాబును నమ్మడం అంటే మోసపోవడమే అదే బాబు చరిత్ర. 
ఈ ఎన్నికల్లో ఎవరైనా మళ్లీ చంద్రబాబును నమ్మడం అంటే దానర్ధం... మళ్లీ మోసపోవడం. దానర్ధం మళ్లీ చంద్రముఖిని  నిద్రలేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి. చంద్రబాబును మళ్లీ నమ్మడం అంటే... కొండ చిలువ నోట్లో తలకాయపెట్టడమే అన్నది ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకొండి. ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్ధం.

దేవుడి దయతో ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గత చరిత్రను మారుస్తూ..నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతున్నాయి. ఎటువంటి వివక్ష, లంచాలు లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. గతంలోఎప్పుడైనా ఇలాంటి పథకాలను కానీ, గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం కానీ ఎప్పుడైనా చూశారా?.

గతంలో ఎప్పుడూ జరగని విధంగా...
ఏకంగా 2.30  లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది, గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పిన 99శాతం వాగ్ధానాలు అమలు చేసినది ఈ 59 నెలల పాలనలోనే రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగాయి.

మీ బిడ్డ చెప్పిన పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా?
ఇప్పుడు గడగడా మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను. మీరే ఆలోచన చేయండి. మీ బిడ్డ చెబుతున్న పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా గతంలో ఎప్పుడైనా చూశామా?
గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు, గవర్నమెంటు బడుల్లో ఇంగ్లిషు మీడియం, ఆరోతరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్ లోనూ డిజిటల్ బోధన, 8వతరగతికి పిల్లాడు వచ్చేసరికి వారి చేతుల్లో ట్యాబులు, ఇంగ్లిషు మీడియంతో మొదలుపెడితే టోఫెల్ ఐబీ వరకు ప్రయాణం... గవర్నమెంటు బడి పిల్లల చేతుల్లో మొట్టమొదటసారిగా బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లిషులో అందుబాటులోకి తేవడం, బడులు తెరిచే సరికి ఓ విద్యాకానుక, ఓ గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ... రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా అమ్మఒడి అనే పథకం.. పెద్ద చదువులకు ఆ పిల్లలకు, ఆ తల్లిదండ్రులకు అండగా ఉంటూ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన.. ఇప్పుడు నేను చెప్పిన చదువుల రంగంలో విప్లవాన్ని తీసుకొస్తున్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లుమీద వాళ్ల నిలబడేటట్టుగా
వాళ్లకు తోడుగా ఓ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం..ఈ అక్కచెల్లెమ్మల పేరిటే 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ తో పాటు అందులో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 22 లక్షల ఇళ్లు. అక్కచెల్లెమ్మల స్వావలంభన కోసం, వారి సాధికారత కోసం ఇన్ని పథకాలతో తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడునా ఉందా?.

అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేల పెన్షన్ కానుక. ఇంటివద్దకే పౌరసేవలు, పథకాలు, ఇంటివద్దకే రేషన్ ఈ మాదిరిగా ఇంటివద్దకే వచ్చే పాలన కానీ గతంలో ఎప్పుడైనా చూశారా?
రైతన్నలకు పెట్టుబడి సహాయంలో ఇంతకముందు ఎప్పుడూ జరగని విధంగా రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా రైతన్నకు నష్టం జరిగితే ఇన్ పుట్ సబ్సిడీ, పగటిపూటే 9 గంటలకు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నను చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్ధ ఈ మాదిరిగా రైతన్నను పట్టించుకుని అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా?

స్వయం ఉపాధికి తోడుగా, అండగా
స్వయం ఉపాధికి తోడుగా, అండగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, చిరువ్యాపారులకు, శ్రమజీవులకు అండగా తోడు, చేదోడు పథకాలు, మత్స్స్యకారులకు మత్స్యకార భరోరా, లాయర్లుకు లా నేస్తం.. ఇలా స్వయం ఉపాధిరంగానికి ఈ మాదిరిగా ఇన్ని పథకాలు పెట్టి తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?

పేదవాడి ఆరోగ్యం కోసం...
ఏ పేదవాడూ అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆ పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా రూ.25లక్షల వరకూ విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ, , పేదవాడికి అండగా ఆరోగ్యఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే వచ్చే ఆరోగ్యసురక్ష ఈ మాదిరిగా పేదవాడికి తోడుగా ఉంటూ.. పేదవాడికి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అండగా ఉందని భరోసా ఇచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?

వీటన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్లినా..ఏ గ్రామంలో చూసినా ఏకంగా 600 రకాల సేవలందిస్తూ అదే గ్రామంలో ఓ సచివాలయం కనిపిస్తుంది. 60-70 ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్ధ.. ఆ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చేయిపట్టుకుని నడిపిస్తూ... ఇంటికే అందిస్తున్న సేవలు. అదే గ్రామంలో ఓ నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బేకే వ్యవస్ధ. అదే గ్రామంలో ఆర్బీకే వ్యవస్ధ పక్కనే విలేజ్ క్లినిక్ మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడునేడుతో బాగుపడ్డ ఇంగ్లిషు మీడియం స్కూల్. గ్రామంలోనే పైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీసు, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్ లో దిశ యాప్.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా?

ఇలాంటి విప్లవాలు మీ బిడ్డ తీసుకొస్తుంటే..
అటువైపు చంద్రబాబును చూడండి. 14 యేళ్ల పాటు 3 సార్లు సీఎంగా చేశానని ఆ పెద్దమనిషి చెబుతాడు. నేను ఇక్కడున్న వేలాదిమంది నా అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను అడుగుతున్నాను. 14 యేళ్లు సీఎంగా చేసిన ఆ చంద్రబాబు పేరు చెబితే.. ఏ పేదవాడికైనా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు వస్తుందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 

మరి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్న ఈ పెద్దమనిషి పేరు చెబితే.. ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా ?అని అడుగుతున్నాను. 

ఆలోచన చేయండి.
మరి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తన పేరు చెబితే ఏ పేదవాడికీ కూడా ఆ మనిషి వల్ల నాకు మంచి జరిగింది, ఆయన పాలనలో నాకు ఈ స్కీం అందింది అనిచెప్పుకునే పరిస్థితి లేని పాలకుడు చంద్రబాబునాయుడు.

అభివృద్ధి విత్తనాలు నాటిన రైతు మీ జగన్.
చంద్రబాబు నాయుడు మోసాలు ,అబద్దాలు ఏ స్ధాయిలో ఉంటాయంటే.. ఓ పోలిక చెబుతాను. మన రాష్ట్రం ఓ పంటపొలం అనుకొంటే... ఈ పొలాన్ని సాగుచేసే బాధ్యత మీరంతా జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారు. ఆ జగన్ అనే మీ బిడ్డ.. ఈ 5 ఏళ్లలో రాష్ట్రమనే ఈ పొలంలో నేను గడగడా చెప్పిన స్కీములు చేసిన మార్పులు, చేసిన సంస్కరణలు, తీసుకొచ్చిన విప్లవాలు.. వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింటా అభివృద్ధి, సంక్షేమం, సంతోషం, మంచి భవిష్యత్తు అనే మొక్కలని మీ బిడ్డ నాటాడు. ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి సామాజిక వర్గంలో ఈ మొక్కలు ఐదేళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి.

జగన్ అనే మీ బిడ్డ రాష్ట్రం అనే పంటపొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ... మరో 15 సంవత్సరాలలో వృక్షాలవుతాయి. ఆ తర్వాత ఆ పిల్లలు క్వాలిటీ చదువులతో బయటకువస్తాయి. వారి బ్రతుకులు మారుతాయి. తలరాతలు మారుతాయి. పేదరికం అన్నది మటుమాయం అయిపోతుంది. మీ బిడ్డ ప్రతి ఆలోచన పేదవాడి బ్రతుకులు ఎలా మార్చాలి. పేదవాడిని మరో 15 సంవత్సరాల్లో ఐబీ సిలబస్ తో.. స్టాన్ ఫర్ట్ నుంచో, హార్వర్డ్ నుంచో 25 శాతం కరిక్యులమ్ తో డిగ్రీ పూర్తి చేసి.. ఆ కోర్సులకు సంబంధించిన సర్టిఫికేట్ లతో బయటకు వచ్చి, ఆ పిల్లవాడు అనర్ఘళంగా ఇంగ్లిషులో మాట్లాడుతూ ఉద్యోగం కోసం అఫ్లికేషన్ పెట్టుకుంటే... పేదరికం అన్నది ముటుమాయం అవుతుందన్నది మీ బిడ్డ స్వప్నం. 

మరో వంక చంద్రబాబును చూస్తే..
14 ఏళ్లు ముఖ్యమంత్రి గా పనిచేసిన ఈ వ్యక్తి పేరు చెబితే ఏ ఒక్కరికీ కూడా తాను మంచి చేసానని చెప్పుపోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో తాను ఉన్నాడంటే... ఆయన చేసిన మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి గమనించండి. అధికారం వచ్చేవరకు అబద్దాలు, మోసాలు... అధికారం దక్కితే చంద్రబాబు మోసాలు, మాయలు ఎలా ఉండాయో 2014లో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీకే అర్ధం అవుతుంది. ( టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ)..

చంద్రబాబు విఫల హామీలు.
2014లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు తాను ఎన్నికలకు వెళ్లేటప్పుడు ముఖ్యమైన హామీలు అంటూ తాను స్వయంగా సంతకం పెట్టి ఈ కూటమిలో ముగ్గురు ఫోటోలు పెట్టి ప్రతి ఇంటికీ ఈ పాంప్లెట్ పంపించాడు. ఆయన ఇచ్చిన హామీలును నమ్మి ప్రజలు ఆయనకు ఓటు వేస్తే... 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 
మరి 2014 నుంచి 2019 వరకు ఈ పాంప్లెట్ లో  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముఖ్యమైన హామీలంటూ.. ప్రతి ఇంటికి పంపించి, చెప్పిన హామీలలో ఒక్కటంటే ఒక్కటైనా అమలుచేశాడా?
ఇందులో చెప్పినవి నేను చదువుతాను. వాటిని ఈ పెద్ద మనిషి అమలు చేశాడా ? లేదా ? అన్నది మీరే చెప్పండి.
రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్ల రైతుల రుణమాపీ జరిగిందా ? ముఖ్యమైన హామీలలో రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్ల పొదుపు  సంఘాల రుణాలలో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా?.
ముఖ్యమైన హామీలలో మూడోది ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు. రూ.25వేలు మాట దేవుడెరుగు.. కనీసం ఏ ఒక్కరి అకౌంట్లో అయినా ఒక్క రూపాయి అయినా వేశాడా?.
నాలుగో హామీ.. ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే నెల, నెలా రూ.2వేల నిరుద్యోగభృతి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు నెలకు రూ.2వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చాడా?.
ఐదో ముఖ్యమైన హామీ అర్హులందరికీ మూడు సెంట్ల స్ధలం. కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా.. మిమ్మల్ని అడుగుతున్నాను. చంద్రబాబు హయాంలో మీ ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్ధలమైనా ఇచ్చాడా ? 
రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, అయిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్ కి మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీని నిర్మిస్తానన్నాడు, చేశాడా?
రేపల్లెలో కనిపిస్తుందా? అని అడుగుతున్నాను. మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ముఖ్యమైన హామీలంటూ 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన పాంప్లెట్ లో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశాడా?
ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని కూడా అమ్మేశాడు. ఇలాంటి వాళ్లను నమ్మవచ్చా? మళ్లీ ఇప్పుడు ఇదే ముగ్గరు, ఇదే చంద్రబాబు నాయుడు
ఏమంటున్నాడు ? సూపర్ సిక్స్ అంటున్నాడు, సూపర్ సెవెన్ అంటుననాడు? నమ్ముతారా?.
ఇంటింటికీ బెంజి కార్ అంటున్నారు, ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు, నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇలాంటి అబద్దాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. 

ఫ్యాను గుర్తుపై ఓటేసి ఆశీర్వదించండి.
ఇలాంటి అబద్దాలు, మోసాలను మళ్లీ ఓడించి, మళ్లీ వాలంటీర్లు మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలాన్నా ? పథకాలన్నీ కొనసాగాలన్నా? లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా ? మన పిల్లలు, వారి చదువులు, బడులు మెరుగుపడాలన్నా?, మన వ్యవసాయం, ఆసుపత్రులు మెరుగుపడాలన్నా ? ఇవన్నీ జరగాలంటే ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. నొక్కితే 175 కి 175 అసెంబ్లీ స్ధానాలు, 25 కి 25 ఎంపీ స్ధానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా?

అక్కడో, ఎక్కడో మన గుర్తు తెలియని వారు ఉంటే అక్కా మన గుర్తు ఫ్యాను, తమ్ముడూ మన గుర్తు ఫ్యాను. చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాను, అమ్మా మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి. ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయడే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్, సింక్ బయటే ఉండాలి. 

ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ.. నా పక్కనే ఉన్న మన అభ్యర్ధులపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వారిపై ఉంచవలిసిందిగా మీ అందరితో సవియనంగా మీ బిడ్డ చేతులు జోడించి విన్నవించుకుంటున్నాడు. 

ఇంతటి ఎండలో కూడా చెరగని చిరునవ్వులతో మీ ఆప్యాయతలకు మరొక్కసారి మీ బిడ్డ చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాడు అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించాడు.

Back to Top