బాబు వల్లే ‘స్పెషల్’కి మంగళం!

కేంద్రంపై ఒత్తిడి చేయని చంద్రబాబు
బాబుగారి దుబారా ఖర్చులు చూసే మొండిచేయి?
కేంద్ర మంత్రుల విరుద్ధ ప్రకటనలు
స్పెషల్ స్టేటస్ కోసం పెరుగుతున్న ఆందోళనలు
 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వస్తుందా..? అసలు వచ్చే అవకాశాలున్నాయా..? బడ్జెట్‌లోటుతో పాటు అనేక రకాల వెనుకబాటును ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా సహా అనేక రకాల సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సి ఉన్నా ఎందుకు అందడం లేదు? అసలు ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వం కేంద్రంతో ఎందుకు గట్టిగా పోరాడలేకపోతోంది..? కేంద్ర మంత్రులు చేస్తున్న విరుద్ధమైన ప్రకటనల సారాంశం ఏమిటి..? ప్రత్యేక హోదా లేకపోతే మరి ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో చంద్రబాబు ఎందుకు ఆలోచించడం లేదు..? ఎన్నికల ముందు ప్రత్యేక హోదాపై వాగ్దానాల వర్షం కురిపించిన బీజేపీ, టీడీపీలు ఇపుడు నోరు మెదపడం లేదు? 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌పై కేంద్రం నీళ్లు చల్లినట్లే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంటులో చేసిన వాగ్దానం, ఆ మేరకు నాడు కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రస్తుత ఎన్డీయే సర్కారు ఎలాంటి విలువా ఇవ్వడం లేదని తేలిపోయింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమీ ఉండబోదని పార్లమెంటు సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఇచ్చిన ఆర్థిక సాయం, మినహాయింపులతో సరిపుచ్చుకోవాలని తేల్చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి ఇందర్‌జిత్ సింగ్ ఇచ్చిన సమాధానం చూస్తే ఆంధ్రప్రదేశ్‌కు ఇక ప్రత్యేక హోదా రానట్లేనని తేలిపోయింది. 
 
కేంద్ర మంత్రి చెప్పిందిదీ..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నకు మంత్రి సూటిగా సమాధానమివ్వకుండా ప్రత్యేక హోదా పొందడానికి అవసరమైన ప్రాతిపదికలను ఏకరువు పెట్టారు. అంతేకాక ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు సైతం తాజా బడ్జెట్‌లో ప్రత్యేక ప్రణాళికా సాయం కేటాయించలేదని ఆయన తెలిపారు. అంటే ఇకపై ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఇప్పటి వరకు ఉన్న ప్రయోజనాలేవీ ఉండవని మంత్రి పరోక్షంగా వెల్లడించారు. ప్రణాళికా సాయం అందుకునేందుకు గతంలో ప్రత్యేక హోదాను జాతీయ అభివృద్ధి మండలి ఇచ్చేదని, అలా ఇవ్వడానికి కొన్ని నిబంధనలను సంతృప్తి పరచాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 లో పేర్కొన్న రీతిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పన్ను రాయితీ ప్రోత్సాహకాలు అమలవుతాయన్నారు.  ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంటే ఆ విషయాన్ని మంత్రి వెల్లడించేవారు. కానీ ఆ అవకాశం లేదు కనుకనే ఆయన ఇలా డొంకతిరుగుడు సమాధానమిచ్చారన్న వాదన ఉంది. అసలు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్‌లో ప్రత్యేక ప్రణాళికా సాయం లేదంటే ఇక ప్రత్యేక హోదా ఉండి మాత్రం ప్రయోజనమేమిటి అనే ముగింపునకు వచ్చేలా మంత్రి సమాధానం ఉంది.
 
వస్తుంది కానీ.. ఎప్పుడొస్తుందో...
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వస్తుంది కానీ ఎప్పుడొస్తుందో చెప్పలేమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి ఉందని, అయినా పలు కారణాల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొందని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల పరిశ్రమల ఏర్పాటుకు ఇబ్బందులు ఎదురవుతాయనేది నిజమేనని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేకపోవడం.... ఎప్పుడు వస్తుందో చెప్పలేకపోడం వంటి వ్యాఖ్యలు గమనిస్తే ప్రత్యేక హోదాపై ఆశలు గల్లంతనుకోవలసిందేనని విశ్లేషకులంటున్నారు. 
 
ఇది చంద్రబాబు వైఫల్యమే
బీజేపీ- టీడీపీ ఎన్నికల్లో కలసి పోటీ చేశాయి. ప్రత్యేక హోదాపై వాగ్దానాల వర్షం కురిపించాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే టీడీపీ - బీజేపీ కి ఓటువేయాని ఎన్నికల సమయంలో మోడీ, వెంకయ్య, చంద్రబాబు ప్రచారం చేశారు. ఆంధప్రదేశ్‌కి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన సమయంలో బీజేపీ కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వాని డిమాండ్ చేసింది. రాజ్యసభలో వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ వంటివారు దీనికోసం పట్టుబట్టారు కూడా. ఎన్నికలయిపోయాయి. బీజేపీ నాయకత్వంలోనే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉంది. బీజేపీని ఒప్పంచలేకపోవడం చంద్రబాబు అసమర్థత గానే పరిగణించాలని విమర్శకులంటున్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోవడం నిస్సందేహంగా బాబు వైఫల్యమే. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కొన్ని ప్రతిపక్ష పార్టీలు కోరినా... కేంద్రం తప్పనిసరిగా ఇస్తుందని చంద్రబాబు మాయమాటలు చెప్పి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయలేదు.  ఒకవైపు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని అంటూనే రాజధానికి భూసేకరణ పేరుతో ఆర్థిక భారం కలిగించారు. ప్రత్యేక విమానాల్లో వరుసగా విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు. కార్యాలయాల హంగులకి, కాన్వాయ్‌ల పటాటోపానికి కోట్లాది రూపాయలు దుబారా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పే లోటు బడ్జెట్ కబుర్లను కేంద్రం ఎలా విశ్వసిస్తుంది? అసలు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు తరచూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎన్నడూ ప్రత్యేక హోదా కోసం వత్తిడి చేసిన పాపాన పోలేదు. అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎందుకు గట్టిగా పట్టుబట్టడం లేదన్నది రాష్ర్ట ప్రజలకు మింగుడు పడని అంశం. కాగా ప్రత్యేక హోదా సాధిస్తామనే నమ్మకముందని రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ చెబుతుంటే, ప్రత్యేక హోదా కోసం తాము బిచ్చం ఎత్తుకోబోమని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటివారు ఘీంకరిస్తున్నారు. 
 
పెరుగుతున్న ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు మొదలయ్యాయి. మూడు రోజులుగా రాష్ర్టంలోని పలుచోట్ల టీడీపీ, బీజేపీలను నిరసిస్తూ ఆందోళనలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరును ఎండగడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ర్యాలీ, ధర్నా కార్యక్రమాలు జరిగాయి. నగరంలోని ఎల్లమ్మతోటలోని పార్టీ కార్యాలయం నుంచి జగదాంబ జంక్షన్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం కార్యకర్తలు అక్కడే బైఠాయించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో గుంటూరులో ఓ సెల్ టవర్‌పైకి ఎక్కిన ఓ యువకుడు 36 గంటల సేపు టవర్‌పైనే ఉండి నిరసన వ్యక్తం చేశాడు. గుంటూరు సీతానగరానికి చెందిన మామిళ్లపల్లి సంజీవరావు అనే వ్యక్తి ఆటోనగర్ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న సెల్‌టవర్ పైకి ఎక్కాడు. చివరకు కలెక్టర్ హామీతో అతను దీక్ష విరమించాడు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ర్ట వైఖరులను నిరసిస్తూ విజయనగరం జిల్లాలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. విశాలాంధ్ర మహాసభ , సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ధర్నా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. 
 
ఫలించని వైఎస్‌ఆర్‌సీపీ వినతులు...
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు అంతగా పట్టుబట్టకపోవడం, ఒత్తిడి తీసుకురాకపోవడం వల్లనే కేంద్రం మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. అంతేకాదు ఇపుడు పరోక్షంగా మంత్రుల చేత ప్రకటనలూ చేయిస్తోంది. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రత్యేక హోదాపై పలుమార్లు పట్టుబడుతూ వచ్చింది. ఇటు చంద్రబాబు ప్రభుత్వాన్ని తరచుగా తూర్పారబడుతూనే తనవంతు ప్రయత్నంగా కేంద్రానికీ పలుమార్లు వినతులను అందజేస్తూ వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడి, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీలను కలసిన ప్రతిసారీ రాష్ర్టంలో పరిస్థితులను వివరిస్తూనే ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినతిపత్రాలను సమర్పిస్తూ వచ్చారు. అంతేకాక విభజన నాటి హామీలను, రాష్ర్ట పరిస్థితులను వివరిస్తూ పార్టీ ఆధ్వర్యంలో 14వ ఆర్థిక సంఘానికీ గత ఏడాది సెప్టెంబర్‌లోనే వినతిపత్రం సమర్పించారు. అయితే ఇటు చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి గానీ, అటు కేంద్ర ప్రభుత్వానికి గానీ చీమకుట్టినట్లయినా లేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చెవిటివాని ముందు శంఖమూదినట్లయింది.
 
ప్రత్యేక హోదా ఇవ్వాలంటే..
పర్వత ప్రాంతమై ఉండాలి. తక్కువ జనసాంద్రత లేదా అధికంగా గిరిజన జనాభా ఉండాలి. సరిహద్దు ప్రాంతాల్లో ఉండడం గానీ, ఆర్థికంగా, మౌలిక వనరుల పరంగా వెనబడి ఉండడం గానీ, రాష్ర్ట ఆర్థిక వనరులు సరిపోకపోవడం కానీ ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవసరమైన ప్రత్యేక పరిస్థితులు. అయితే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సాంకేతిక కారణాలేవీ అడ్డులేవు. ప్రత్యేక హోదా కోసం సంతృప్తి పరచాల్సిన నిబంధనల్లో ‘ఆర్థిక వనరుల లేమి’ అన్న అంశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కి ఇది వర్తిస్తున్నందువల్ల ప్రత్యేక హోదాకు అర్హత ఉన్నట్లే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఒడిషా, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరుతున్నాయి.
 
ప్రత్యేక హోదా ఉంటే...
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు సాధారణ కేంద్ర సాయం (ఎన్‌సీఏ)లో ప్రాధాన్యం ఉంటుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాల వాటా తక్కువగా ఉంటుంది. అలాగే ప్రత్యేక హోదా రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక ప్రణాళికా సాయం (ప్రత్యేక ప్రాజెక్టుల కోసం 90 శాతం గ్రాంటుగా) ఉంటుంది. వీటితో పాటు ప్రత్యేక కేంద్ర సాయం (వంద శాతం గ్రాంటు) ఉంటుంది. ఎక్స్‌టెర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు (ఈఏపీ - విదేశీ సంస్థల ఆర్థిక సాయం)ల విషయంలో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు 90శాతం గ్రాంటుగా ఇస్తారు. అదే జనరల్ కేటగిరీ రాష్ట్రాలైతే ‘ఈఏపీ’ల విషయంలో మొత్తం రుణంగా పరిగణిస్తారు. 
 
Back to Top