గుంటూరు: గుంటూరులోని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే , వైయస్ఆర్‌సీపీ నేత నంబూరు శంకరరావు కార్యాలయంపై సోమవారం రాత్రి 7 గంటల సమయంలో కంభంపాడు గ్రామానికి చెందిన కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. ఒక్కసారిగా శంకరరావును, ఆయన కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కార్యాలయంలోనే ఉన్న కార్యకర్త నరేంద్రపై విచక్షణ రహితంగా కర్రలు, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కార్యాలయం ఆవరణలో ఉన్న ఫ్లెక్సీలను చించివేసి శంకరరావు , ఆయన సతీమణిపై దుర్భాషలాడుతూ తీవ్రంగా భయభ్రంతులకు గురిచేశారు. ఈ విషయమై శంకరరావు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన నరేంద్రను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. నంబూరు శంకరరావు మాట్లాడుతూ ..ఇలాంటి దాడులు ప్రజాస్వాయ్యంలో సరికాదన్నారు. కావాలనే దాడులకు పాల్పడ్డారని ఇకపై ఇలాంటివి సహించేదే లేదన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో అధికారంలోకి రాకముందు నుంచి తెలుగుదేశం అరాచాకాలకు అడ్డు లేకుండాపోయింది. పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ గెలిచిన తరువాత పెద్ద ఎత్తున , ఇసుక మాఫియా నడుపుతూ ప్రత్యర్థిపై దాడులకు పురిగొలుపుతున్నారు. ఇందులో భాగంగానే గుంటూరులోని తన కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. కంభంపాడు ప్రాంతానికి చెందిన కొందరు తెలుగుదేశం నాయకులు ఈ దాడిచేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన: అంబటి రాంబాబు గుంటూరులో పెదకూరపాడు మాజీ శాసనసభ్యుడు, వైయస్ఆర్‌సీపీ నేత నంబూరు శంకరరావు కార్యాలయంపై తెలుగుదేశం పార్టీకి చెందినవారు దాడిచేసిన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు, మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, మందపాటి శేషగిరిరావు, పెదకూరపాడు నియోజకవర్గ పార్టీ నాయకులు శంకరరావును పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ ..లోకేశ్ ప్రోద్బలంతో రాష్ట్రంలో లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. ఈ దాడిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం.. ఈ దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దండంపుడి నరేంద్రసాయి, కట్టబోయిన జగదీష్, చైతన్యరెడ్డి, సిద్ధు, మనోజ్, శ్రీనులను పరామర్శించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.