ఇంత రాజకీయ శూన్యత వస్తుందనుకోలేదు

హైదరాబాద్, 2 సెప్టెంబర్ 2013:

ఒక గొప్ప నాయకుడు వెళ్ళిపోతే రాజకీయ శూన్యత ఏర్పడుతుందని, అయితే మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మృతితో మన రాష్ట్రం ఈ స్థాయిలో ముక్కలు చెక్కలు అయ్యే పరిస్థితి దాపురిస్తుందని తాము ఎవరమూ ఊహించలేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి అన్నారు. అలాంటి సమర్ధుడైన నాయకుడిని కోల్పోవడం మన దురదృష్టమని మైసూరారెడ్డి అన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి నాలుగ‌వ వర్ధంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు మైసూరారెడ్డి, ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పిఎసి సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, సీఈసీ సభ్యురాలు భూమా శోభా నాగిరెడ్డి, ఇతర నాయకులు సోమవారంనాడు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖరరెడ్డితో తనకు ముప్పై ఐదేళ్ళ ‌అనుబంధం ఉందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం దివంగత మహానేత వైయస్ఆర్ నిరంతరం పరితపించేవారని‌ ఆయన గుర్తుచేసుకున్నారు. వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటూ తాము ఉద్యమాలు చేసిన వైనాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రం ముక్కలు చెక్కలయ్యే పరిస్థితి వచ్చిందని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ మహానేత వైయస్ఆర్ వ‌ర్ధంతి రోజు నుంచే ఆయన తనయ శ్రీమతి షర్మిల 'సమైక్య శంఖారావం' బస్సు యాత్ర ప్రారంభించడాన్ని ఆయన ప్రశంసించారు. సమైక్య శంఖారావం వల్లనైనా రాష్ట్రంలోని పరిస్థితులు కుదుట పడతాయని, మంచి జరుగుతుందని, తెలుగు ప్రజలందరికీ మేలు జరుగుతుందన్న ఆశాభావాన్ని మైసూరారెడ్డి వ్యక్తంచేశారు. మహానేత వైయస్ఆర్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి 4వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా, వాడవాడలా అభిమానులు, పార్టీ శ్రేణులు నిర్వహించారని పార్టీ ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. ఆయనకు నివాళులు అర్పించారని, వైయస్ఆర్‌ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారన్నారు. మహానేత స్మారకార్థం అనేక చోట్ల రక్తదానం, మెగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారన్నారు. ఆస్పత్రిలో ఉన్న రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారన్నారు.

రాజశేఖరరెడ్డిగారు మరణించిన తరువాత తెలుగు ప్రజలందరికీ ఇబ్బందులు వచ్చాయని మేకపాటి ఆవేదన వ్యక్తంచేశారు. కొందరు స్వార్థపరుల రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నదే రాష్ట్ర విభజన అని విమర్శించారు. తెలుగు జాతి మొత్తం సమైక్యంగా ఉండాలనే శ్రీమతి షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర చేస్తున్నారని తెలిపారు. సీమాంధ్ర 13 జిల్లాల్లో మొదటగా ఆమె బస్సు యాత్ర చేస్తారని తెలిపారు. శ్రీమతి షర్మిల బస్సు యాత్రకు తెలుగు ప్రజలంతా సంఘీభావం చెప్పాలని విజ్ఞప్తిచేశారు. తెలుగు జాతిని దేవుడే రక్షించాలనే పరిస్థితి వచ్చిందని మేకపాటి ఆవేదన వ్యక్తంచేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిని ఒక్క క్షణం కూడా రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ తెలిపారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రీ చేయని ప్రగతిని మన రాష్ట్రానికి ఆయన తీసుకువచ్చారని ప్రశంసించారు. ప్రతి నిరుపేదకూ మేలు జరగాలని, అభివృద్ధి ఫలాలు అందాలని, సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళాలని ఆయన పథకాలు అమలు చేశారన్నారు. ప్రతి ఒక్కరికీ ఇల్లుండాలి, విద్య ఉండాలి, ఆరోగ్యం ఉండాలి అనే కృత నిశ్చయంతో వ్యవహరించిన మహనీయుడు డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అని కొణతాల కొనియాడారు. ఆయన మృతితో మన రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయిందని విచారం వ్యక్తంచేశారు. వైయస్ఆర్‌ బ్రతికి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టి ఉండేది కాదని ప్రతి ఒక్కరూ అంటున్నారన్నారు. వైయస్ఆర్‌ లేని లోటు పూడ్చలేనిది అని ప్రధాని డాక్టర్‌ మన్మోన్‌ సింగ్‌ కొద్ది రోజుల క్రితమే చెప్పిన వైనాన్ని కొణతాల ఈ సందర్భంగా గుర్తుచేశారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి లేని లోటును రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ సీఈసీ సభ్యురాలు భూమా శోభా నాగిరెడ్డి తెలిపారు. ఆయన బ్రతికి ఉండి ఉంటే రాష్ట్ర ప్రజలు రోడ్డెక్కి తమ భవిష్యత్తు కోసం ఆందోళన చేయాల్సిన అవసరం కలిగేది కాదన్నారు. అన్ని ప్రాంతాలలోనూ ఆయన సమానంగా పథకాలను అమలు చేశారన్నారు. అందరినీ అభివృద్ధి వైపే ఆలోచించేలా ఆయన చేశారన్నారు. కేవలం శ్రీ‌ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేశాయని దుయ్యబట్టారు.

Back to Top