ప్రజాస్వామ్యంలో పాలనకు సజావుగా సాగేందుకు మంత్రిమండలిని ఏర్పాటు చేయటం జరిగింది. ఆయా మంత్రులు తమ తమ మంత్రిత్వ శాఖల మీద అవగాహన కల్గి ఉండి బాధ్యతల్ని పర్యవేక్షించటం ఆనవాయితీ.
చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం ఇటువంటి సాంప్రదాయాల్ని గాలికి వదిలేశారు. మంత్రులకు ఆయా మంత్రిత్వ శాఖల పనుల కన్నా బాబు అప్పగించిన పనుల మీద మమకారం ఎక్కువగా ఉంటోంది. దీంతో అసలు పనుల్ని గాలికి వదిలేయటం జరిగింది. ముఖ్యంగా కోటరీగా పేరు తెచ్చుకొన్న మంత్రుల శాఖల్లో ఈ బాధ్యత రాహిత్యం ఎక్కువగా ఉంటోంది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎర్రన్నాయుడు చంద్రబాబుకి సన్నిహితుడుగా పేరు తెచ్చుకొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల్ని పాయింట్ లేకుండా తిట్టిపోయటం తో ఆయనకి బాగా పాయింట్లు పడ్డాయి. దీంతో ఆయనకు కార్మిక శాఖ పనులు కాకుండా ఇతర పనులు బాగా అప్పగించారు. ముఖ్యంగా విశాఖ నగరానికి వెళ్లే ఇసుక క్వారీలను అదుపులోకి తెచ్చేసుకొన్నారు. వాటి దగ్గర నుంచి అడ్డదారిలో వసూళ్ల కార్యక్రమం ఆయనే పర్యవేక్షిస్తున్నారన్న మాట ఉంది. ఇప్పుడు భావన పాడు పోర్టు కి భూ సేకరణ పనుల్ని ఆయనే తలకు ఎత్తుకొన్నట్లు తెలుస్తోంది. దీంతో బావనపాడు పోర్టు కి సంబంధించి భూములు లాక్కొనే పని ఈయన చేతుల మీదుగా సాగుతోంది.

బందరు పోర్టు భూముల సేకరణ పనిని స్వయంగా ఎక్సైజ్ మంత్రి కొల్లురవీంద్ర దగ్గర ఉండి నడిపిస్తున్నారు. రక రకాల ఎత్తుగడలతో ఆయన ఈ పని మీదనే సర్వం కేంద్రీకరించారు. దీంతో ఎక్సైజ్ శాఖను పర్యవేక్షించటం కష్టం అయిపోతోంది. ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వ పెద్దలకు వసూళ్లు బాగా జరుగుతున్నాయా లేదా అన్న దాని మీద మాత్రమే ద్రష్టి పెట్టారు. దీంతో మొన్నటి విజయవాడ దుర్ఘటన వంటి వాటికి ఆస్కారం ఏర్పడుతోంది.

రాజధాని ప్రాంతంలో భూములు లాక్కోవటం బాధ్యతను వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మునిసిపల్ మంత్రి నారాయణ తీసుకొన్నారు. నారాయణ అయితే పూర్తిగా సింగపూర్ వ్యవహారాల మంత్రి అని పేరు తెచ్చేసుకొన్నారు. అసలు భూములకు సంబంధించిన వ్యవహారాలు రెవిన్యూ మంత్రి ద్వారా జరగాలి. కానీ ఇందులో లక్షల కోట్ల రూపాయిలు చేతులు మారుతున్న అవినీతి వ్యవహారం కావటంతో చంద్రబాబు తరపున నారాయణే అన్నీ చక్కబెడుతున్నారు. దీంతో మునిసిపల్ వ్యవహారాలన్నీ పూర్తిగా చెట్టు ఎక్కేశాయి.

చంద్రబాబు అక్రమ సంపాదనకు పనికి వచ్చే అంశాల మీద మంత్రులు శ్రద్ధ చూపుతుండటంతో ప్రజలకు వాస్తవంగా అందాల్సిన ప్రయోజనాలు అందకుండా పోతున్నాయి.