విజ‌న్  2047 పేరుతో బాబు డ్రామాలు

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ధ్వ‌జం

తాడేప‌ల్లి: విజ‌న్ 2047 పేరుతో చంద్ర‌బాబు డ్రామాలాడుతున్నార‌ని మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ఇలాంటి తొండాట ఆడ‌టం ఆయ‌న‌కు కొత్తేమి కాద‌న్నారు. చంద్ర‌బాబు ఎన్నిక‌ల ముందు ఇష్టం వ‌చ్చిన‌ట్లు హామీలు ఇస్తారు..అధికారంలోకి వ‌చ్చాక మేనిఫెస్టోను ప‌క్క‌న పెట్టేస్తార‌ని విమ‌ర్శించారు. వృద్ధిరేటు విష‌యంలో చంద్ర‌బాబు చెప్పిన అబ‌ద్ధాల‌ను కాకాణి తిప్పికొట్టారు. శుక్ర‌వారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో దేశం కంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ వృద్ధిరేటు గ‌ణ‌నీయంగా పెరిగింద‌న్నారు. ఎవ‌రు విధ్వంస‌కారులు, ఎవ‌రు నిర్మాణాత్మ‌కంగా పాలించారో గ‌ణంకాలే చెబుతున్నాయ‌న్నారు.  2019-2024కి సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంపౌండ్ అన్యువ‌ల్ గ్రోత్‌రేట్ 10.16 శాతం ఉంటే.. దేశం గ్రేత్‌రేట్ 9.29 శాతం ఉంది. సెకండ‌రీ సెక్టార్ జీవీఏ 11.14 శాతం, దేశం జీవీఏ 8.17 శాతం ఉంది. టెరిట‌రీ సెక్టార్ జీవీఏ 10.43 శాతం, ఇండియా జీవీఏ 9.852 శాతం ఉంది. ఏపీ జీడీపీ 10.23 శాతం ఉంటే, దేశంలో జీడీపీ 9.34 శాతం ఉంద‌ని వివ‌రించారు. ఎవ‌రి హ‌యాంలో రాష్ట్రం వృద్ధి సాధించిందో ప్ర‌జ‌ల‌కు తెలుసు అన్నారు. 
ఏ దేశంలోనూ, ఏ రాష్ట్రంలోనూ 17 శాతం వృద్ధి రేటు సాధించింది లేదు. ఇటువంటి వృద్ధి రేటు సాధించాల‌ని చంద్ర‌బాబు అన‌డం అసంబద్ధ‌మ‌న్నారు. బిల్ క్లింట‌న్ రాష్ట్రానికి వ‌చ్చిన స‌మ‌యంలో చంద్ర‌బాబు పేద‌రికాన్ని దాచిపెట్టేందుకు రాష్ట్రంలో భిక్ష‌గాళ్ల‌ను త‌ర‌లించార‌ని గుర్తు చేశారు. వృద్ధిరేటు విష‌యంలో చంద్ర‌బాబు అబ‌ద్దాలు, అస‌త్యాలు ప్ర‌చారం చేయ‌డం ప్ర‌జ‌ల‌కు మ‌రింత అన్యాయం జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌న్నారు. నిన్న మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబు వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌పై అబ‌ద్ధాలు వ‌ల్లే వేశార‌ని మండిప‌డ్డారు.

2018-2019లో జీడీపీలో ఏపీ 18వ స్థానంలో ఉండేద‌ని, 2021-2022లో 15వ స్థానానికి పెరిగింది. వైయ‌స్ జ‌గ‌న్ హ‌యాంలో ఎలాంటి గ్రోత్ సాధించామో ఈ లెక్క‌లే నిద‌ర్శ‌నమ‌న్నారు. పారిశ్రామిక‌రంగంలో చంద్ర‌బాబు పాల‌న‌లో 11వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని వైయ‌స్ జ‌గ‌న్ 9వ స్థానానికి చేర్చార‌ని చెప్పారు. వైయ‌స్ జ‌గ‌న్ ఆదాయ వ‌న‌రులు పెంచి  మంచి జీఎస్‌డీపీ సాధించారు. రాష్ట్రంలో ఎవ‌రైనా పెట్టుబ‌డి పెట్టాలంటే వైయ‌స్ జ‌గ‌న్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి కార‌ని చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు బాండ్ రాయాలంటా?. ఈ మాటలు సిగ్గుచేటు అని మాజీ మంత్ర కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఫైర్ అయ్యారు.  

‘‘రంగురంగుల మేనిఫెస్టోలు, కలర్ పేజీల డాక్యుమెంట్లతో జనాన్ని మభ్యపెట్టటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఏమీ చేయకపోయినా చేసినట్టు ఎల్లోమీడియాలో బాకాలు ఊదుకుంటారు. ఐదేళ్ల అబద్దాలను నిన్న ఒక్కరోజే చంద్రబాబు చెప్పారు. వైఎస్‌ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి, వృద్దిరేటు గురించి ఏమాత్రం మాట్లాడలేదు. మాటల గారడీ చేసే చంద్రబాబు ఈసారి అంకెల గారడీ కూడా చేశారు’’ అంటూ కాకాణి దుయ్యబట్టారు.

‘‘రాష్ట్ర ఆదాయం ఏమాత్రం పెరగకుండా జీఎస్డీపీ ఎలా పెరిగిందో చంద్రబాబుకే తెలియాలి. ప్రభుత్వ ఆదాయం 1.15 శాతం తగ్గితే మరి జీఎస్డీపీ ఎలా పెరిగింది?. తాను ఏం చెప్పినా జనం నమ్ముతారనుకోవటం చంద్రబాబు భ్రమ. వాస్తవాలను దాచి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఏడాదికి 15 శాతం వృద్ధిరేటు పెరగాలని చంద్రబాబు అంటున్నారు. ఈ స్థాయిలో వృద్దిరేటు ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. బిల్‌క్లింటన్ వచ్చినప్పుడు బిచ్చగాళ్లని తీసుకుని వెళ్ళి ఎక్కడో వదిలేశారు. తద్వారా తమ రాష్ట్రంలో పేదరికం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు.

..చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలోనే వృద్దిరేటు పెరిగిందని కేంద్ర సంస్థలే చెప్పాయి. పారిశ్రామిక నికర ఉత్పత్తి 11వ స్థానంలో ఉంటే జగన్ హయాంలో 9వ స్థానానికి వచ్చింది. అంటే జగన్ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి పెరిగింది. తలసరి ఆదాయాల విషయంలో కూడా చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు. ఇంటర్మీడియట్ తప్పిన చంద్రబాబు రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు మాట్లాడటం సిగ్గుచేటు. చంద్రబాబులాగా మాట్లాడితే మా దేశంలో జైలులో పెడతారని గతంలోనే స్విట్జర్లాండ్ మంత్రి అన్నారు

..చంద్రబాబు హయాంలో అతివృష్టి, అనావృష్టితో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మేనిఫెస్టో హామీలను అమలు చేయకుండా జనాన్ని ఊరిస్తూనే ఉన్నారు. చెప్పినవి చేయకుండా జనాన్ని నిలువునా మోసం చేశారు. గతంలో జగన్ పేదలకు ఇచ్చిన స్థలాలను తీసుకుని తన మనుషులకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన పని మరొకటి లేదు’’ అని కాకాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Back to Top