తాడేపల్లి: రాష్ట్రంలో సంక్రాంతి సంబరాల ముసుగులో కూటమి నేతలు వేల కోట్ల రూపాయల అక్రమ ఆర్జనతో జేబులు నింపుకున్నారని వైయస్ఆర్ సీపీ నేత పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. సంబరాల పేరతో కూటమి నేతలు సంపదను సృష్టించుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త విష సంస్కృతికి కూటమి నేతలు తెర తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 1200 చోట్ల ఏర్పాటు చేసిన కోడిపందాల బరుల్లో మద్యం ఏరులై పారిందని, పేకాట క్యాసినోలు, అశ్లీల నృత్యాలతో సంక్రాంతి పండుగ పవిత్రత, సంప్రదాయాల అర్ధాన్నే పూర్తిగా మార్చేశారని ఆక్షేపించారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అనుమతుల పేరుతో పెద్ద ఎత్తున దండుకున్నారు రాష్ట్రంలో కోడిపందాల ముసుగులో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. తమ నియోజకవర్గాల్లో కోడిపందాల బరులకు రూ.పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూటమి నేతలు వసూలు చేశారు. కత్తులను కట్టి కోడిపందాలు నిర్వహించడం, క్యాసినో స్థాయిలో పేకాట శిబిరాలు, పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకర్షించడానికి అశ్లీల నృత్యాలు, గుండాటలు, కోత ముక్కలు, బెల్ట్ షాప్ లు ఇలా ప్రతి దానికీ ఒక రేటును నిర్ణయించి మరీ కోట్ల రూపాయలును దండుకున్నారు. ఈ డబ్బును కూడా ప్రజల నుంచే వసూలు చేసుకున్నారు. చివరికి కోడిపందాల బరుల్లోకి వచ్చే వారికి టిక్కెట్లు విక్రయించడం, వాహనాలకు పార్కింగ్ చార్జీలను వసూలు చేయడం ద్వారా కూడా డబ్బులు దండుకున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో ఇది చట్ట విరుద్దం అని ప్రశ్నించేందుకు పోలీసులు సాహసం చేయలేకపోయారు. విజయవాడ సమీపంలో ఇలా ప్రశ్నించిన పోలీసులపైనే కూటమి నేతలు దౌర్జన్యంకు దిగడం వీరి బరితెగింపునకు నిదర్శనం. కోడిపందాల్లో గెలిచిన వారికి బుల్లెట్లు, జీపులను బహుమతులుగా ఇచ్చారంటే, ఏ మేరకు పందాల ముసుగులో వసూలు చేశారో అర్థం చేసుకోవచ్చు. తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ.1.50 కోట్ల కోడిపందానికి ముహర్తం కూడా నిర్ణయించి, మరీ పందాలు జరిపారంటే ఏ స్థాయిలో ఈ విష సంస్కృతిని తీసుకువెడుతున్నారో అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో పండుగ సంబరాలకు మహిళా బౌన్సర్లను నియమించడం ఎప్పుడైనా చూశామా? ఇప్పుడు మహిళా బౌన్సర్లను కూడా కోడిపందాలకు తీసుకువచ్చారు. ప్రభుత్వ పెద్దల నేతృత్వంలోనే కోడిపందాల బరులు ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో 350, తూర్పు గోదావరిజిల్లాలో 300, కృష్ణాజిల్లాలో 320, గుంటూరుజిల్లాలో 150 కోడిపందాల బరులను నిర్వహించారు. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఏమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేతృత్వంలో ఏకంగా ఒక స్టేడియంను ఏర్పాటు చేసి, క్రికెట్ మ్యాచ్ ల తరహాలో కోడి పందాల ప్రీమియర్ లీగ్ ల పేరుతో ఈ దందాను నిర్వహించారు. విస్సన్నపేటలో కాకతీయ ప్రీమియర్ లీగ్ పేరుతో కోడిపందాలు జరిపారు. రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గం చెరుకుపల్లిలో 30 ఎకరాల్లో పెద్ద బరులను ఏర్పాటుచేసి, ఎత్తున పందాలు నిర్వహించారు. దీనికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణలతో పాటు పలువురు సినిమా నటులు కూడా పాల్గొన్నారు. ఇక హోంమంత్రి అనిత స్వయంగా కోళ్ళను పట్టుకుని ఈ పందాలను తన నియోజకవర్గంలో ప్రారంభించారు. డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణంరాజు కోడిపందాలను హుషారుగా ప్రారంభించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఈ కోడిపందాల బరులను, వాటిల్లోని పేకాట క్యాసినోలు, మద్యం బెల్ట్ షాప్ లు, అశ్లీల నృత్యాల హోరును ఎంతో ఘనంగా ప్రారంభించారు. ఇదే మా సంస్కృతి అని నిస్సిగ్గుగా చాటుకున్నారు. ఈ విషసంస్కృతిపై పవన్ కళ్యాణ్ స్పందించాలి సనాతన ధర్మ పరిరక్షకుడుగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో జరుగుతున్న ఈ విష సంస్కృతి కనిపించడం లేదా? ఇదేనా తెలుగు ప్రజలు సంప్రదాయకంగా జరుపుకునే సంక్రాంతి సంబరాలు? పేకాట క్యాసినోలు, అశ్లీల నృత్యాలు, గుండాట, కోతముక్కలు, మద్యం విక్రయాలేనా మన సంస్కృతి? ఇదేనా మన ధర్మం? ఎందుకు పవన్ కళ్యాణ్ పండుగ పేరుతో జరుగుతున్న ఈ దుర్మర్గంపైన నోరు మెదపడం లేదు? తన పార్టీ నేతలకు కూడా దీనిలో భాగంగా ఉన్నారని ఉపేక్షిస్తున్నారా? తుని నియోజకవర్గంలో ఏకంగా జిల్లా పరిషత్ పాఠశాలలొ కోడిపందాల బరులను నిర్వహించారు. విద్యాసంస్కరణలను అమలు చేస్తున్నాను అని చెప్పుకునే నారా లోకేష దీనికి సమాధానం చెప్పాలి? విద్యార్ధులకు చిన్నతనం నుంచే ఈ రకమైన జూదం, పందాలను అలవాటు చేస్తున్నారా? ఇందుకు కారకులైన వారిపైన చర్యలు తీసుకునే ధైర్యం ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు ఉందా? కూటమి ప్రభుత్వ నిర్వాకంతో గ్రామాల్లో నిరాశ, నిస్పృహ కూటమి ప్రభుత్వం నిర్వాకం కారణంగా నేడు గ్రామాల్లో నిరాశ, నిస్పృహ కనిపిస్తున్నాయి. ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం హామీలను అమలు చేయపోవడం వల్ల ప్రజలు సంతోషంగా పండుగ కూడా జరుపుకోలేని స్థితిలో ఉన్నారు. ఇదే సమయంలో వైయస్ జగన్ గారు సీఎంగా ఉండి ఉంటే వారికి అమ్మ ఒడి, రైతుభరోసా, విద్యాదీవెన ఇలా పలు పథకాలకు సంబంధించిన సొమ్ము వారి ఖాతాల్లో జమ అయి ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో కోడిపందాల పేరుతో కూటమి నేతలు చేసిన అరాచకంను కూటమి ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది? చంద్రబాబు విజన్ ఇదేనా...? రాష్ట్రంలో ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావడం, వారి జీవన ప్రమాణాలను పెంచడం కోసం ఒక విజనరీగా వైయస్ జగన్ గారు పనిచేశారు. పండుగ అంటే కుటుంబం సంతోషంగా జరుపుకునే సంప్రదాయానికి భిన్నంగా వారి జేబులకు చిల్లు పెట్టే నీచమైన దోపిడీని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిచయం చేసింది. విజన్ 2047 సృష్టికర్తను అని చెప్పుకునే సీఎం చంద్రబాబు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? చట్ట విరుద్దమైన సంస్కృతిని ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దడమేనా మీ విజన్? ఈ రాష్ట్రంలో చట్టాలను కాపాడాల్సిన ప్రభుత్వమే అందుకు భిన్నంగా బెల్ట్ షాప్ లు, పేకాట క్యాసినోలు, అశ్లీల నృత్యాలను ప్రోత్సహించడమేనా మీ విజన్? నిజంగా మీకు చట్టాలపైన గౌరవం ఉంటే ఎన్ని కత్తి కట్టిన కోడిపందాల బరులను సీజ్ చేశారు, ఎన్ని పేకాట క్యాసినోలపై కేసులు పెట్టారు, ఎన్ని చోట్ల అశ్లీల నృత్యాలను అడ్డుకున్నారో వివరాలు వెల్లడించాలి.