తాడేపల్లి: న్యాయమైన డిమాండ్‌ల సాధన కోసం అంగన్‌వాడీలు నిర్వహించిన ఆందోళనలను కూటమి ప్రభుత్వం ఉక్కుపాదంతో కర్కశంగా అణిచివేయడం దుర్మార్గమని వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పాలన ఉద్యోగ వ్యతిరేక పాలనగా సాగుతోందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... దాదాపు లక్ష మంది ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల ఓట్ల కోసం డిసెంబర్ 2023న కుప్పంలో జరిగిన మీటింగ్‌లో అధికారంలోకి వచ్చాక అన్ని డిమాండ్లు నెరవేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. తమ బాధలు ప్రభుత్వానికి వినిపించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న అంగన్‌వాడీ వర్కర్లను విజయవాడలోకి రానీయకుండా పోలీసులను మోహరించి ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే జూలై నుంచే అమలు చేయాలంటూ అంగన్‌వాడీలు డిమాండ్ చేయడం నేరమా? మరీ దారుణంగా ట్రైన్లలో నిద్రపోతున్న అంగన్‌వాడీ మహిళల ఫొటోలు తీసి సంబంధిత అధికారులకు పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశించడం, వారికి వెంటనే షోకాజ్ నోటీసులు ఇవ్వడం చూస్తుంటే ఇంత నిరంకుశ ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని మహిళలు వాపోతున్నారు. అంగన్‌వాడీలకు అండగా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడం జరిగింది. వయో పరిమితిని 40 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచడం జరిగింది. పదవీ విరమణ పొందిన తర్వాత వన్ టైం పేమెంట్ బెనిఫిట్ ను రూ. 50 వేలనుంచి రూ. లక్షకు పెంచడం జరిగింది. దాంతోపాటు అంగన్‌వాడీ మినీవర్కర్లకు రూ. 40 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈమేరకు జీవో ఎంఎస్ నెంబర్ 47 విడుదల చేశారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు టీఏ, డీఏలు ప్రతినెలా ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అంగన్‌వాడీ సెంటర్ల అద్దెలు ప్రభుత్వమే చెల్లించడం జరిగింది. అంగన్‌వాడీల వేతనాలు వైయస్సార్సీపీ ప్రభుత్వ వచ్చిన వెంటనే రూ. 7 వేల నుంచి రూ. 11500లకు, మినీ అంగన్‌వాడీ వర్కర్ల వేతనాలు రూ. 4500 ల నుంచి రూ. 7వేలకు పెంచారు. అంగన్‌వాడీ వర్కర్లకు ప్రమోషన్లు ఇచ్చిన ఘనత కూడా వైయస్ జగన్‌కే దక్కుతుంది. దీంతోపాటు రెండు లక్షల ప్రమాద బీమా కల్పించడం జరిగింది. వైయస్సార్సీపీ పాలనలో చిరుద్యోగులకు కూడా భారీగా వేతనాలను పెంచడం జరిగిందని అన్నారు. అంగన్‌వాడీ వర్కర్ల డిమాండ్లపై తక్షణం స్పందించాలి అంగన్‌వాడీల వేతనం రూ. 26 వేలకు పెంచాలి. గ్రాట్యుటీ చెల్లింపు హామీ అమలు చేయాలి. మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించి ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలి. ఈ హామీలన్నీ కూటమి మేనిఫెస్టోలో పొందుపర్చినవే.. వాటినే ఇప్పుడు నెరవేర్చమని 10 నెలల తర్వాత అంగన్‌వాడీలు అడుగుతుంటే వారి గొంతు నొక్కుతున్నారు. ఆడబిడ్డలు రోడ్డెక్కితే కనిపించడం లేదా అని వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ప్రశ్నించాడు. ఈరోజు లక్ష మంది అంగన్‌వాడీలు తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే వారి పట్ల చంద్రబాబు అమానుషంగా వ్యవహరించాడు. పల్నాడు జిల్లాలో ఫాతిమా అనే అంగన్‌వాడీని రాజీనామా చేయాలని వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే జిల్లాలో సామ్రాజ్యం అనే ఆశ వర్కర్‌ను కూడా వైయస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నావని రాజీనామా చేయమని వేధించడంతో ఆమె కూడా ఆత్మహత్యయత్నం చేసింది. ఉద్యోగుల ఉసుకు పోసుకుంటున్న కూటమి ప్రభుత్వం గత ఐదేళ్ల వైయస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఉద్యోగ సంఘ నాయకులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగులు నిర్వహించి సమస్యలపై చర్చించడం జరిగేది. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇంతలా ఉద్యోగులతో సమావేశాలు జరిగిన దాఖలాలు లేవు. ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం 27 శాతం మధ్యంతర భృతి ఇవ్వడంతోపాటు అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వం రెండు డీఏలు బకాయిలు పెడితే వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా క్లియర్ చేశారు. లక్ష మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోవడం, కాంట్రాక్టు కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కమీషన్లు తీసుకోవడం వంటివి జరుగుతుంటే దాన్ని అరికట్టేందుకు ఆప్కాస్ అనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి సకాలంలో పూర్తి జీతాలు ఇచ్చి అండగా నిలిచారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయడమే కాకుండా ఉద్యోగుల జీతాలు కూడా పెంచడం జరిగింది. ఇందుకోసం గత టీడీపీ ప్రభుత్వంలో రూ. 1100 కోట్లు ఖర్చు చేస్తే, వైయస్ జగన్ సీఎం అయ్యాక మూడు రెట్లు పెంచి రూ. 3300 కోట్లకు తీసుకెళ్లారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) ని ఏర్పాటు చేస్తే, కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత పీఆర్సీ కమిషనర్‌ని తొలగించి కొత్త వారిని నియమించలేదు. అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టకపోవడం చూస్తే కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అవసరం లేదేమో అనిపిస్తుంది. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులుంటే వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 60 లక్షల మంది ఉన్న ఓట్ల కోసం కూటమి పార్టీల నాయకులు కళ్లబొల్లి హామీలు గుప్పించి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక వారి మానాన వారిని గాలికి వదిలేశారు. ఉద్యోగులపై వేధింపులు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనే అంశాన్ని కూటమి ప్రభుత్వం మర్చిపోయింది. గత జగన్ హయాంలో 10,177 మందిని గుర్తించి క్రమబద్ధీకరించింది. ఎన్నికల కోడ్ పేరుతో కూటమి నాయకులు మిగిలిన వారిని రెగ్యులరైజ్ చేయకుండా అడ్డుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనిది ఉద్యోగులకు పార్టీలను ఆపాదించి మిడిల్ లెవల్ ఉద్యోగులను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారు. కొంతమంది ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. కొంతమందిని సస్పెండ్ చేసి వారి కుటుంబాలను రోడ్డున పడేశారు. పెన్షన్ స్కీం విషయంలో 9 నెలలు పూర్తయినా ఇంతవరకు స్ఫష్టత ఇవ్వడం లేదు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తామన్న హామీ మొదటి నెలకే పరిమితం అయ్యింది. ఆరో తేదీ దాటితే కానీ జీతాలు జమ కావడం లేదు. కూటమి ప్రభుత్వం ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ లేదు.. జాబులు లేవు.. ఆఖరుకి నిరుద్యోగ భృతి ఊసే లేదు. మెగా డీఎస్సీ పేరుతో పెట్టిన మొదటి సంతకం ఏమైందో ఇంతవరకు తెలియదు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల పరిధిలో దాదాపు 40 వేల కొత్త ఉద్యోగాలకు ఎసరు పెట్టారు. ఉద్యోగుల హెల్త్ కార్డులకు చాలా ఆస్పత్రులు వైద్యం నిరాకరిస్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా దీనిపై స్పందన లేదు. మెడికల్ బిల్స్ ఇవ్వడం లేదు. ఒకపక్క ఉద్యోగుల హామీలు నెరవేర్చకపోగా దాదాపు రూ. 30 వేల కోట్లు ఉద్యోగుల సొమ్మును ప్రభుత్వం వాడుకుంటోంది. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు 3 డీఏలు పెండింగ్ పెట్టింది. ఇప్పటికైనా ఎన్నికల్లో ఉద్యోగులకు హామీ ఇచ్చిన విధంగా అన్ని కార్యక్రమాలు తక్షణం అమలు చేయాలి. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఉద్యోగుల సత్తా ఖచ్చితంగా చూపిస్తాం.