నాడొక కల.. నేడొక నిజం.. అదే వెలిగొండ ప్రాజెక్టు. ప్రకాశం, నెల్లూరు, వైయస్ఆర్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టును సీఎం వైయస్ జగన్ సాకారం చేశారు. ప్రాజెక్టులో మొదటి టన్నెల్‌ను 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించిన ఆయన.. రెండో టన్నెల్ తవ్వకం పనులు మంగళవారం పూర్తయ్యాయి. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాల (ఇరిగేషన్ టన్నెల్స్)ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడం ద్వారా సీఎం వైయస్ జగన్ చరిత్ర సృష్టించారని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ రెండు సొరంగాలను ఫిబ్రవరి మొదటి వారంలో జాతికి అంకితం చేయనున్నారు. దీంతో వచ్చే సీజన్‌లో శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. వెలిగొండ రెండు సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు తరలించడానికి రంగం సిద్ధంచేశారు. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించనున్నారు. మరోవైపు.. ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. వరదాయినికి మహానేత వైయస్ శ్రీకారం.. శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులను తరలించి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమల సాగర్‌లో నిల్వచేసి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో ఉన్న 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో దివంగత సీఎం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004, అక్టోబర్ 27న ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చుచేసి.. నల్లమలసాగర్‌తోపాటు సొరంగాల్లో చాలావరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసేలా.. 23 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులనూ చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. వెలిగొండ.. ఓ ఇంజినీరింగ్ అద్భుతం ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలోని కొల్లంవాగు వరకు రెండు టన్నెల్స్ తవ్వకం పనులను జలవనరుల శాఖ చేపట్టింది. తొలి టన్నెల్ ఏడు డయామీటర్ల వ్యాసార్థంతో, రెండో టన్నెల్ 9.2 డయామీటర్ల వ్యాసార్థంతో తవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపునున్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. నల్లమల పర్వతశ్రేణుల్లో ప్రకాశం జిల్లాలో పశ్చిమాన విస్తరించిన వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియల వద్ద కొండల మధ్యన ఖాళీ ప్రదేశాల (గ్యాప్)లను కలుపుతూ 378.5 మీటర్లు, 356 మీటర్లు, 587 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్‌లు నిర్మించడం ద్వారా 53.85 టీఎంసీలు నిల్వచేసేలా నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంటుంది. అతితక్కువ వ్యయంతో ఇన్ని టీఎంసీలు నిల్వచేసేలా నల్లమలసాగర్‌ను నిర్మించడాన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీల పొడవున తవ్విన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం. చరిత్ర సృష్టించిన సీఎం వైయస్ జగన్ ఇక వైయస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గత 56 నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావంవల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినాసరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీల పనులను 2019, నవంబరులో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను కూడా అదే ఏడాది పూర్తిచేయించారు. రెండో సొరంగంలో టీబీఎంకు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడం కూడా కష్టంగా మారింది. దాంతో.. 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. మంగళవారం నాటికి 7.698 కి.మీల పొడవున రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. హెడ్ రెగ్యులేటర్ పనులు సైతం పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనున్నారు. సీఎం రమేష్‌కు కట్టబెట్టిన రెండో సొరంగం మిగిలిన పనులను రద్దుచేసిన సీఎం జగన్.. వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించి.. టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ఇక తీగలేరు హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయిస్తున్నారు. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. ఇలా ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకూ రూ.1,046.46 కోట్లను సీఎం జగన్ ఖర్చుచేశారు. ప్రతిపైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తిచేయించారు. బాబు దోపిడీ కొండంత.. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్‌సభ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే.. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసం వ్యయంచేశారు. 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకూ రూ.1,414.51 కోట్లు ఖర్చుచేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కన్పించకపోవడం చంద్రబాబు దోపిడీకి నిదర్శనం. జీఓ–22 (ధరల సర్దుబాటు), జీఓ–63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.650 కోట్లకు పైగా దోచిపెట్టారు. అలాగే, 2017 నాటికే వెలిగొండను పూర్తిచేస్తామని ప్రకటించి.. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలుచేసుకున్నారు. 2018, 2019 నాటికి పూర్తిచేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిస్తూ వచ్చిన చంద్రబాబు.. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. వచ్చే సీజన్‌లో నీరు విడుదల ఇక ఈ ప్రాజెక్టు అంతా నీలం సంజీవరెడ్డి పులుల అభయారణ్యం పరిధిలో ఉండడంతో వన్య ప్రాణులకు సైతం ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని నిర్మాణ సంస్థ మేనేజర్ పి.రాంబాబు తెలిపారు. అలాగే, కరోనా సమయంలో కూడా ప్రభుత్వ సహకారంతో పనులు చేపట్టామని ఆయన చెప్పారు. జలవనరుల శాఖ ఈఈ పురార్ధనరెడ్డి వెలిగొండ టన్నెల్ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సీజన్లో నీటిని ఈ సొరంగాల ద్వారా విడుదల చేస్తామని చెప్పారు. మాది చెప్పింది చేసే ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగా మోసపు హామీలు చెప్పటం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం పనులు చేసే ప్రభుత్వం మాది. మాటిస్తే మడమ తిప్పని నైజం మా సీఎం జగనన్నది. గతంలో సంక్రాంతి, దసరా, ఉగాదికి పూర్తిచేస్తాం అని టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసగించింది. అలాకాకుండా.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి నిధుల మంజూరుతో పాటు ఎప్పటికప్పుడు సమీక్షలతో ఈ ప్రాంత వాసుల కోసం పాటుపడి ఈరోజు ప్రాజెక్టు పూర్తి కావటానికి దోహదపడిన సీఎం జగనన్నకు కృతజ్ఞతలు. పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎప్పటికీ జగనన్నకు రుణపడి ఉంటారు. త్వరలోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తాం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మంత్రి రికార్డు సమయంలో పూర్తి.. దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడంలో సీఎం వైయస్ జగన్ చిత్తశుద్ధికి వెలిగొండ ప్రాజెక్టు నిదర్శనం. మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13 నాటికి.. రెండో సొరంగాన్ని రికార్డు సమయంలో మంగళవారం నాటికి పూర్తిచేశాం. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాలను ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూర్తిచేయడానికి సీఎం జగన్ దిశానిర్దేశం ఎంతో దోహదం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి, ఆయకట్టుకు నీళ్లందిస్తాం. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన వెలిగొండను ఆయన తనయుడు పూర్తిచేసి, జాతికి అంకితం చేస్తుండటం నీటిపారుదలరంగ చరిత్రలో మహోజ్జ్వల ఘట్టంగా నిలిచిపోతుంది. – మురళీనాథ్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్, వెలిగొండ ప్రాజెక్టు