అమరావతి: మాజీ సీఎం వైయస్ జగన్ తన హయాంలో కనబర్చిన ప్రత్యేక శ్రద్ధతో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ విషయంలో ఏపీ 2024 జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల కాలంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ సమయంలో రాష్ట్రంలోకి కొత్తగా 15 ప్రాజెక్టుల ద్వారా రూ.22,580 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. ఇదే సమయంలో రూ.1,02,534 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా.. రూ.36,329 కోట్ల పెట్టుబడులతో గుజరాత్ రెండో స్థానంలో నిలిచింది. ఇదే కాలంలో ఏపీలో కొత్తగా 14 యూనిట్ల ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా రూ.1,049 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. నాటి సీఎం వైయస్ జగన్ ప్రత్యేక చొరవవల్లే వాస్తవానికి.. నాటి సీఎం వైయస్ జగన్ ప్రత్యేక కృషితో ఏపీలో అనువైన వాతావరణం కల్పించడంవల్లే ఈ కాలంలో కొత్త పరిశ్రమలు రాష్ట్రం వైపు ఎక్కువగా మొగ్గు చూపాయి.ఏపీలో 4 పోర్టుల పనులు యుద్ధప్రాతిపదికన చేయించడం.. 10 ఇండస్ట్రియల్ నోడ్స్‌ను ప్రారంభించడం.. 10 ఫిషింగ్ హార్బర్ల పనులకు కూడా శ్రీకారం చుట్టడం.. ఎంఎస్‌ఎంఈలకు ఎన్నడూలేని విధంగా ప్రోత్సహించడం లాంటి అంశాలు ఏపీలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఏర్పడడానికి ప్రధాన కారణాలు. కేంద్రం సైతం ఇందుకు బలం చేకూరుస్తూ తన నివేదికల్లో ఏపీలో పరిశ్రమల ఏర్పాటును ప్రస్తావించింది. కోవిడ్ తర్వాత పెట్టుబడుల ఆకర్షణలో దూకుడు ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ మహమ్మారి తర్వాత కాలంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, వాటిని వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ దూకూడు ప్రదర్శించింది. ఈ విపత్కర సమయంలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకుండా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వారిని చేయిపట్టి నడిపించడంతో పాటు పరిశ్రమలకు గతంలో చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన బకాయిలను చెల్లించడంతో పారిశ్రామికవేత్తలకు ఏపీపై నమ్మకం ఏర్పడింది. దీంతో 2022 నుంచి 2024 మార్చి వరకు అంటే 27 నెలల కాలంలో రాష్ట్రంలోకి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఈ 27 నెలల కాలంలో రాష్ట్రంలోకి 120 సంస్థలు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నాయని, దీనికి సంబంధించి ఇండ్రస్టియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మెమోరాండం (ఐఈఎం) పార్ట్–ఏను జారీచేసినట్లు డీపీఐఐటీ పేర్కొంది. ఈ 120 ఒప్పందాల ద్వారా రాష్ట్రంలోకి రూ.50,955 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇదే సమయంలో కొత్తగా 112 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా రూ.62,069 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. ఈ 112 సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడంతో ఐఈఎం పార్ట్–బీని మంజూరుచేసినట్లు డీపీఐఐటీ ఆ నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలోకి ఈ స్థాయిలో భారీ పెట్టుబడులు రావడం ఇదే ప్రథమమని పరిశ్రమల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.