‘థ్యాంక్యూ సీఎం సార్‌’.. 

రాష్ట్రవ్యాప్తంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు  

అమరావతి:  కాంట్రాక్టు ఉద్యోగుల రెండు దశాబ్దాల కలను నెరవేరుస్తూ క్రమబద్ధీకరణ నిర్ణయంతో వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్‌ చిత్రపటాలకు రాష్ట్రవ్యాప్తంగా క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ)ను ప్రభుత్వంలో విలీనం చేసి 010 పద్దు కింద ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లించేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తమవుతోంది.  
 
♦ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, కార్వేటినగరం, పలమనేరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఉద్యోగులు సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు.  పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్‌రెడ్డి శుక్రవారం  తాడేపల్లిలో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు.  
♦ విజయనగరం జిల్లా కేంద్రంలో సీఎం  జగన్‌ చిత్రపటానికి కాంట్రాక్టు పారామెడికల్‌ సిబ్బంది క్షీరాభిషేకం చేశారు. కాకినాడ జిల్లా  కోటనందూరులో సీఎం జగన్, మంత్రి దాడిశెట్టి రాజా ఫొటోలకు  క్షీరాభిషేకం చేశారు.  
♦  సీఎం జగన్‌ మాట తప్పని, మడమ తిప్పని నేతగా మరోసారి రుజువు చేసుకున్నారని విజయనగరం జిల్లా వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.కనకరాజు కృతజ్ఞతలు తెలిపారు.  ఏపీవైవీపీ కార్యాలయం వద్ద ఉద్యోగులతో కలిసి ఆయన సీఎం జగన్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.  
♦ తమ జీతాలను ఏకంగా 23 శాతం పెంచిన ముఖ్యమంత్రి జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆరోగ్యశ్రీ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ సభ్యులు పేర్కొన్నారు. అసోసియేషన్‌ సభ్యులు శుక్రవారం గుంటూరులో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనిని కలసి  ధన్యవాదాలు తెలిపారు.   ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.అశోక్‌కుమార్, అధ్యక్షుడు ఎ.విజయ్‌భాస్కర్‌ తదితరులున్నారు.  
♦ ఏపీ ఎన్‌జీవోలు కర్నూలు కలెక్టరేట్‌ వద్ద ప్లకార్డులతో ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.  నంద్యాలలో మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి నివాసంలో గవర్నమెంట్‌ ఫెడరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్, కాంట్రా­క్ట్‌ ఉద్యోగులు సంబరాలు చేసు­కున్నా­రు. 
♦  కడపలో కాంట్రాక్టు లెక్చరర్ల ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేయర్‌ సురే‹Ùబాబు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మ శివప్రసాద్‌రెడ్డి, ఏపీఎన్జీవోస్‌ నేతలు పాల్గొన్నారు. 
♦  క్రమబదీ్ధకరణ ద్వారా సీఎం జగన్‌ 10 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని ఏపీ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ మెడికల్‌ సర్విసెస్‌ అసోసియేషన్‌ (ఏపీ హంస) అధ్యక్షుడు అరవా పాల్, జనరల్‌ సెక్రటరీ ఆర్‌.గోపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఏపీవీవీపీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 14 వేల మంది ఉద్యోగులకు భరోసా కల్పించారన్నారు.  
♦ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరించి ముఖ్యమంత్రి జగన్‌ మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి వారి జీవితాల్లో వెలుగు నింపారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. విజయవాడ వైఎస్సార్‌ పార్క్‌లో కాంట్రాక్ట్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు: కె.వెంకటరామిరెడ్డి

ఉద్యోగుల సమస్యలను ఉదారంగా పరిష్కరించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలిపినట్లు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ ఏర్పాటుకు నిర్ణయం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్‌ బదులు మెరుగైన పెన్షన్‌ వచ్చేలా జీపీఎస్‌ తేవడం, వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయడానికి వేగంగా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. 27 శాతం ఐఆర్‌ ఇచ్చారని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారని, ఇవన్నీ ధైర్యం గల ముఖ్యమంత్రిగా జగన్‌ చేశారని తెలిపారు. ఆ తర్వాత కరోనా మహమ్మారితో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోవడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారని, పీఆర్సీ కూడా ఆశించిన స్థాయిలో ఇవ్వలేకపోయారని, ప్రభుత్వ ఉద్యోగులుగా వీటిని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. 

జీపీఎస్‌ దేశానికే రోల్‌మోడల్‌ 
జీపీఎస్‌లో ఉద్యోగులకు తొలుత బేసిక్‌లో 30 శాతం వరకే పెన్షన్‌ వచ్చేలా ప్రతిపాదనలు చేస్తే ముఖ్యమంత్రి స్వయంగా బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌ వచ్చేలా మార్పులు చేశారని, అలాగే సీపీఎస్‌లో లేని డీఆర్‌ను జీపీఎస్‌లోకి తెచ్చారని, గతంలోకన్నా మెరుగ్గా ఉందని సీపీఎస్‌ ఉద్యోగలు చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్‌ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారని, ఏ రాష్ట్రంలోనూ జీపీఎస్‌ ప్రయోజనాలు లేవని చెప్పారు. సీఎం జగన్‌ నిర్ణయం సాహసోపేతమైనదని కొనియాడారు. 

వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల 15 వేల కుటుంబాలకు మేలు చేశారని అన్నారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలన్నీ 60 రోజుల్లో అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారన్నారు. జీపీఎస్‌ విధివిధానాలు వచ్చిన తరువాత ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలిగిపోతాయని చెప్పారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం ఆరు నెలలకోసారి వేతనాలు ఇచ్చేదని, ఈ ప్రభుత్వంలో రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటే వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థను నిర్మూలించారని గుర్తు చేశారు. 12వ పీఆర్సీని ముందుగానే ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతులు తెలిపినట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు.  

అశోక్‌బాబుకు సవాల్‌ 
ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు, టీడీపీ నేత అశోక్‌బాబు మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారని, ఆయన బహిరంగ చర్చకు వస్తే టీడీపీ మేనిఫెస్టోలో చెప్పినవి ఎన్ని అమలు చేసిందీ, ఇప్పటి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినవి ఎన్ని అమలు చేసిందీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసిరారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో చాలావరకు అమలు చేసిందని, ఇంకా ఏమైనా ఉంటే అమలు చేయడానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను టీడీపీ ప్రభుత్వం  రైగ్యులరైజ్‌ చేయలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ ధైర్యంగా 10 వేల మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.  

 

Back to Top