ప్రభుత్వ నిర్లక్ష్యానికి తల్లీ కొడుకు మృతి విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి చెందిన కలిశెట్టి సీతమ్మ ఇటీవల డయేరియాతో మృతి చెందింది. ఆమె మృతితో కొడుకు రవి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవి అప్పటి నుంచి విధులకు వెళ్లకుండా ఊరి బయటే ఉండిపోయాడు. అక్కడే మృతిచెందాడు. రాష్ట్రంలో నాలుగు నెలలుగా అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఏ ప్రభుత్వ ఆస్పత్రిని తీసుకున్నా దయనీయ పరిస్థితి కనిపిస్తోంది. విలేజ్ క్లినిక్‌లకు దిక్కు లేకుండా పోయింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టకు తిలోదకాలిచ్చింది. 104 వ్యవస్థనూ నిర్వీర్యం చేసింది. పీహెచ్‌సీల్లో అక్కర్లేదంటూ స్పెషలిస్ట్ వైద్యులనూ తొలగించింది. చాలా చోట్ల వైద్యులు, వైద్య సిబ్బంది స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదు. మందుల కొరత వేధిస్తోంది. ఏ చిన్న మందు కావాలన్నా బయటకు రాసిస్తున్నారు. ఇక పరీక్షల సంగతి అయితే మాట్లాడుకోక పోవడమే మంచిది. కొంచెం క్రిటికల్ కేసు వస్తే చాలు.. రెఫర్ చేయడమే పరిపాటిగా మారింది. ఇదేంటయ్యా.. అని అడిగితే ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండని సీరియస్ అవుతున్నారు. నాలుగవ తరగతి సిబ్బందిపై నియంత్రణ కరువైంది. ఏ అర్ధరాత్రుళ్లో ఎవరికైనా సీరియస్ అయితే దేవుడే దిక్కు అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఫీవర్ సర్వే ఊసే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్పత్రుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రజారోగ్యాన్ని దీన స్థితికి తీసుకొచ్చింది. బడి బల్లలే బెడ్లు... కిటికీలే సెలైన్ స్టాండ్లు అమరావతి: రాష్ట్రంలో జూన్ నుంచి ప్రజలు జ్వరాలతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రులపాలవుతున్నారు. పెద్ద ఎత్తున డయేరియా కేసులు వెలుగు చూశాయి. తాజాగా విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా పంజా విసిరింది. 450 మందికిపైగా డయేరియా బారిన పడగా, వారిలో 11 మంది మృత్యువాతపడ్డారు. వెంటనే బాధితులకు మెరుగైన వైద్య సేవలు కల్పించి ప్రాణనష్టం జరగకుండా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అక్కడా ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద సక్రమంగా ఉచిత వైద్యం లభించడం లేదు. ఆరోగ్యశ్రీ స్థానంలో బీమా ప్రవేశపెట్టాలని నిర్ణయించిన చంద్రబాబు ఆ పథకాన్ని ఇప్పటికే గాలికి వదిలేశారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో గ్రామాల్లో బీపీ, సుగర్ ఇతర జబ్బులతో బాధపడే వారికి క్రమం తప్పకుండా వైద్యం అందేది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి ఇంటి వద్దకే వెళ్లి వైద్యం అందించే వారు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఏమైందో ఎవరికీ తెలియదు. అసలు 104 వ్యవస్థ పని చేస్తోందా? లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పీహెచ్‌సీల్లో ఉన్న 150 మంది స్పెషలిస్ట్ వైద్యులనూ తొలగించి కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని దూరం చేసింది. భయం గుప్పెట్లో గిరిజనం గిరిజన ప్రాంతాల్లోని ప్రజలను డెంగీ, మలేరియా, విష జ్వరాలు, ఇతర వ్యాధులు చుట్టుముట్టాయి. ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరు వ్యాధులతో బాధపడుతున్నారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో మందులు, పరీక్షలు సక్రమంగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఇంట్లో ఒకరికి విష జ్వరం వస్తే వైద్యానికి కనీసం రూ.5 వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ ఏడాది జూలై నుంచి మూడు నెలల వ్యవధిలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఐదుగురు విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారినపడి మృతి చెందారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోయింది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను గాలికి వదిలేయడంతో పాటు, తాగునీటిని సరిగా శుద్ధి చేయకపోవడంతో జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైగా డయేరియా ప్రబలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభణ మొదలైంది. జగ్గయ్యపేట, వత్సవాయి ప్రాంతాల్లో 107 మంది డయేరియా బారినపడటంతో ఆరుగురు మృతి చెందారు. తిరుపతి జిల్లా కాట్రపల్లిలో డయేరియాతో రెండేళ్ల చిన్నారి, జూలైలో కర్నూలు జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిని మృత్యువు కబళించింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కలుషిత నీటి సరఫరా కారణంగా 250 మంది డయేరియా బారినపడ్డారు. వారిలో ఏడుగురు మరణించారు. ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ఇక్కట్లు జన్యు సంబంధమైన హీమోఫీలియా బాధితులకు మందులు సరిగా దొరకడం లేదు. వ్యాధిగ్రస్తుల్లో రక్తస్రావాన్ని నియంత్రించడానికి యాంటి హీమోఫీలియా ఫ్యాక్టర్ ఇంజెక్షన్లను చికిత్సల్లో వినియోగిస్తారు. ఫ్యాక్టర్ 7, 8, 9 ఇలా వివిధ రకాల ఇంజెక్షన్లు అవసరం ఉండగా, చాలా వరకు జీజీహెచ్‌లలో ఇవి లేవని తెలుస్తోంది. అలాగే రోగ నిరోధకత బాగా తక్కువగా ఉండే క్యాన్సర్, న్యూరో, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం వాడే ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు కూడా అన్ని జీజీహెచ్‌లలో లేవు. కేసులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్థానికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ వ్యాధులకు చికిత్సల్లో వినియోగించే అన్ని రకాల యాంటిబయోటిక్స్ సీడీసీ (సెంట్రల్ డ్రగ్ స్టోర్)లో ఉండటం లేదు. వైరల్ జ్వరాలకు వాడే ఎమాక్సిలిన్, మలేరియా చికిత్సకు అవసరమైన ఆర్టిసినేట్ ఇంజెక్షన్ చాలా ఆస్పత్రులకు సరఫరా కావడం లేదు. చర్మ సంబంధిత వ్యాధిగ్రస్తులకు పలు రకాల క్రీములు ఆస్పత్రుల్లో లేకపోవడంతో బయటకు రాస్తున్నారు. డీ అడిక్షన్ సెంటర్లలో మందులు సరిపడా లేవు. పెరిగిపోతున్న ఖాళీలు ⇒ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జీరో వేకెన్సీ పాలసీని అమలు చేసింది. ఇందులో భాగంగా ఆస్పత్రుల్లో ఏర్పడిన, కొత్తగా మంజూరైన పోస్టులను ఎప్పటికప్పుడే భర్తీ చేస్తూ వచ్చారు. ఇలా ఐదేళ్లలో 54 వేల పోస్టులు ఒక్క వైద్య శాఖలోనే భర్తీ చేశారు. ⇒ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జీరో వెకెన్సీ పాలసీకి బ్రేక్ వేసింది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పారా మెడికల్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ నియామకాల కోసం డిస్టిక్ సెలక్షన్ కమిటీలు 2 వేలకుపైగా పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్‌లు విడుదల చేశాయి. నియామక ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఈ నోటిఫికేషన్‌లను రద్దు చేశారు. ⇒ ఓ వైపు ఆస్పత్రుల్లో ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వో ఇతర వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉంటే, ఆ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. ఇక సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ వైద్య పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. గతంలో గిరిజన, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో సైతం స్పెషలిస్ట్ వైద్యుల కోసం పలు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, వైద్యులు అడిగినంత వేతనాలు ఇచ్చి మరీ పోస్టులు భర్తీ చేశారు. ⇒ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక సెకండరీ హెల్త్‌లోని గిరిజన, మారుమూల ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ల కొరత ఉన్నప్పటికీ ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. గత ప్రభుత్వంలో ఉద్యోగాల్లో చేరిన వారు సైతం వెళ్లిపోవడం, ఇటీవల కాలంలో పదవీ విరమణలు, పదోన్నతుల అనంతరం డీఎంఈ ఆస్పత్రుల్లో 500కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. అదే విధంగా 900కుపైగా సీనియర్ రెసిడెంట్, 250కి పైగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోలేదు. మరోవైపు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం కోసం మన విద్యార్థులకు అన్యాయం చేసింది. ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయేలా చేసింది. అత్యవసర మందులూ బయటే ⇒ 2019కి ముందు చిన్నారిని ఎలుకలు పీక్కుతిన్న దీనస్థితికి ప్రభుత్వాస్పత్రులు మళ్లీ దిగజారుతున్నాయా.. అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాలను పీకల వరకూ తాగించి ఆరోగ్యాలను గుల్ల చేయడంపై పెట్టిన శ్రద్ధ.. ప్రజారోగ్య పరిరక్షణపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టలేదని మండిపడుతున్నారు. గ్రామాల్లోని విలేజ్ క్లినిక్‌ల నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని ఆస్పత్రులను మందుల కొరత వేధిస్తోంది. ⇒ జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు ఉంచాలని వైద్య శాఖ నిర్ణయించింది. 372 మేర సర్జికల్స్, వ్యాధి నిర్ధారణ కిట్‌లు కూడా ఉండాలి. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలోని బోధనాస్పత్రులన్నింటినీ మందులు, సర్జికల్స్ కొరత వేధిస్తోంది. గురువారం (17వ తేదీ) అన్ని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్‌లతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌లు అందరూ మందుల కొరత అంశాన్ని ప్రధానంగా లేవనెత్తినట్లు తెలిసింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో ఎసెన్షియల్ డ్రగ్స్ అన్నీ అందుబాటులో ఉండటం లేదని, లేని మందులను స్థానికంగా కొనుగోలు చేసుకోవాలని మంత్రి కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. స్థానికంగా కొనుగోలు చేయడానికి నిధులు ఎక్కడ ఉన్నాయని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. అంటే దీని అర్థం రోగులను బయట తెచ్చుకోమని చెప్పడమే. ⇒ ల్యాబ్‌లలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి సరిపడా రసాయనాలు అందుబాటులో ఉండటం లేదు. పాడైన పరికరాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. కూటమి పాలనలో ప్రభుత్వాస్పత్రుల్లో మార్చురీల్లోని శవాలకు కూడా భద్రత లేకుండాపోయింది. ఏలూరు ఆస్పత్రిలో అనాథ మృతదేహాలు మాయమైన ఘటన వెలుగు చూసింది. పారిశుధ్య నిర్వహణను గాలికి వదిలేయడంతో డయేరియా విలయతాండవం చేస్తోంది. ఈ నిర్లక్ష్యం.. గర్భిణికి ఎంతకష్టం.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారానికి చెందిన గర్భిణి యర్రా శకుంతల జ్వరంతో బాధ పడుతుండటంతో ఆమె తల్లి కంటిపాటి ధనలక్ష్మి మంగళవారం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతుండగానే శనివారం ఉదయం ఆరు గంటలకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. తన కుమార్తెకు పురిటినొప్పులు వస్తున్నాయని ధనలక్ష్మి నర్సులకు చెప్పగా వారు పట్టించుకోలేదు. ఈలోగా శకుంతల బాత్‌రూమ్‌కు వెళ్లగా, అక్కడే తీవ్ర రక్తస్రావమై కడుపులోని బిడ్డ తల బయటకు వచ్చింది. ప్రాణాపాయ పరిస్థితుల్లోకి శకుంతల వెళ్లిపోయింది. ఇది గమనించిన తల్లి.. గట్టిగా కేకలు వేయగా, శిక్షణలో ఉన్న నర్సులు వచ్చి.. గర్భిణిని డెలివరీ రూమ్‌కు కాకుండా ప్రసూతి వార్డుకు తరలించారు. మంచంపై పడుకోబెట్టగా ఆ మంచంపైనే శకుంతల ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తీరిగ్గా నర్సులు శకుంతలను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి మాయ తొలగించి, కుట్లు వేశారు. నర్సింగ్ విద్యార్ధినులు సకాలంలో పట్టించుకోకపోయి ఉంటే గర్భిణి ప్రాణాలకే ముప్పు వచ్చేది. ఆస్పత్రిలో శకుంతల పడిన నరకయాతనను చూసిన వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లెదుటే అంత జరుగుతున్నా, సిబ్బంది చీమ కుట్టినట్లు కూడా స్పందించక పోవడం దారుణమని మండిపడ్డారు. ఎంతలో ఎంత మార్పు అంటూ నిట్టూర్చారు. కాగా, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్ ఏవీఆర్‌ఎస్ తాతారావు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పట్టించుకోరా అంటే.. బయటికి పొమ్మన్నారు విధుల్లో ఉన్న నర్సుల వల్లే నా బిడ్డకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు నా బిడ్డ ప్రాణాలతో దక్కింది. పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న నా కూతురిని పట్టించుకోకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించగా.. బయటకు పొమ్మంటూ దుర్భాషలాడారు. ఆస్పత్రిలో మూడురోజుల నుంచి నా కుమార్తె నొప్పులతో బాధపడుతోందని, పరీక్షించమని వేడుకున్నా ఒక్క నర్సు కూడా పట్టించుకోలేదు. డాక్టరు వస్తారు.. సమాచారం ఇస్తాం... అంటూ మమ్మల్ని పంపేశారు. ఆస్పత్రిలో సిబ్బంది గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – ధనలక్ష్మి, గర్భిణి శకుంతల తల్లి, ఎల్.అగ్రహారం, తాడేపల్లిగూడెం మండలం