పత్రికా స్వేచ్ఛపై ‘రెడ్‌బుక్‌’ పడగ

 
రాజ్యాంగ హక్కులను కాలరాసిన కూటమి ప్రభుత్వం

‘సాక్షి’ ఎడిటర్‌ వి.మురళిపై అక్రమ కేసు నమోదు  

వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేసినందుకే.. 

కక్ష పూరితంగా ప్రైవేట్‌ వ్యక్తితో ఫిర్యాదు చేయించిన సర్కారు 

ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిపై సర్వత్రా తీవ్ర ఖండనలు 

ఈ అక్రమ కేసులు చెల్లవని సుప్రీంకోర్టు న్యాయవాదుల స్పష్టీకరణ  

పత్రికా స్వేచ్ఛపైకత్తి కట్టడమే.. కురసాల కన్నబాబు, మాజీ మంత్రి

అభ్యంతరాలుంటే ఖండన ఇవ్వాలి.. దేవులపల్లి అమర్, ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు

మీడియా స్వేచ్ఛను హరించడమే..వీవీఆర్‌ కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌  

అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన మీడియాపై కూడా చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో వేధింపులకు తెగించింది. పత్రికా స్వేచ్ఛ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరా­స్తూ ఎమర్జెన్సీ రోజుల నాటి అరాచకాలకు తెరతీసింది. టీడీపీ కూటమి సర్కారు అసమర్థ, అవినీతి పరిపాలనను సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుంచుతున్న ‘సాక్షి’ మీడియా గ్రూప్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగింది. 

రాజ్యాంగ సూత్రాలు, పార్లమెంటు చేసిన చట్టాలకు విరుద్ధంగా విజయవాడ పోలీసులు గురువారం ‘సాక్షి’ ఎడిటర్‌ వి.మురళి, ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయ­డం చంద్రబాబు ప్రభుత్వ దమననీతికి నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దుర్నీతి, కక్ష సాధింపులు ఇలా ఉన్నాయి...

పత్రికా ధర్మం నిర్వర్తిస్తున్నందుకే చంద్రబాబుకు కంటగింపు
టీడీపీ కూటమి రెడ్‌బుక్‌ పేరుతో సాగిస్తున్న అరాచకాలు, దాడులు, వేధింపులను ఎక్కడికక్కడ ఎండగడుతూ ‘సాక్షి’ బాధితులకు అండగా ఉంటోంది. బాధ్యతా­యుతమైన మీడియా సంస్థగా పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పాటుపడుతోంది. ఈ క్రమంలో గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో టీడీపీ రౌడీమూకలు బరితెగించి పాల్పడుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచుతోంది. 

మరోవైపు టీడీపీ ప్రభుత్వ అవినీతి, దోపిడీని ప్రజలకు వివరించి చైతన్యపరుస్తూ తన ధర్మాన్ని నిర్వర్తిస్తోంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ‘సాక్షి’ మీడియాపై కక్ష గట్టింది. సాక్షి టీవీ చానల్‌ ప్రసా­రాలకు ఆటంకాలు కల్పిస్తోంది. కేబుల్‌ ఆపరేటర్లను భయపెట్టి సాక్షి టీవీ చానల్‌ ప్రసారాలను నిలిపివేస్తోంది. మరోవైపు సాక్షి పత్రికపై కూడా కక్ష గట్టింది. సర్కారు అలసత్వంతో ఇటీవల విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. 

భారీ వర్షాలు, వరదలు వస్తాయని వాతావరణ శాఖ నాలుగు రోజుల ముందే స్పష్టమైన సమాచారం ఇచ్చి హెచ్చరించినా సరే చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదు. దీంతో వరదలు ముంచెత్తి విలయం సృష్టించాయి. 50 మందికిపైగా దుర్మరణం చెందగా ఏకంగా రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది. వరదల సహాయ, పునరావాస చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతేకాదు వరద బాధితులకు సహాయ, పునరావాస వ్యయం, పరిహారం పంపిణీలో భారీ అవినీతికి పాల్పడింది. భోజనాలు, అగ్గిపెట్టెలు, మంచినీళ్ల సీసాలు తదితర వ్యయాన్ని భారీ ధరలతో అమాంతం పెంచేసింది.

దీనిపై పూర్తి సాక్ష్యాధారాలతో ‘ముంపులోనూ మేసేశారు’ అనే శీర్షికతో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. వామపక్ష పార్టీలు కూడా ఈ విషయంపై పూర్తి ఆధారాలతో ప్రెస్‌మీట్‌ నిర్వహించి ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘సాక్షి’ కథనంతో తమ అవినీతి బండారం బట్టబయలైందని ఆందోళన చెందిన చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. ఈ క్రమంలో దొంగదారిలో కక్ష సాధింపు చర్యలకు తెర తీసింది.

కుట్రపూరితంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు
పత్రికా స్వేచ్ఛ కోసం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసింది. పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తగిన చర్యలు తీసుకునేందుకు మన చట్టంలో స్పష్టమైన నిబంధనలున్నాయి. పత్రికలో ప్రచురితమైన కథనంపై అభ్యంతరం తెలుపుతూ ఖండన ఇవ్వవచ్చు. ఇంకా తమ పరువుకు భంగం వాటిల్లిందని భావిస్తే న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేయవచ్చు. దానిపై న్యాయస్థానం విచారించి తగిన తీర్పు వెలువరిస్తుంది. ఇదీ చట్టపరమైన విధానం. 

కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ చట్టపరమైన మార్గాన్ని ఎంచుకోలేదు. ఎందుకంటే న్యాయస్థానంలో కేసు వేస్తే.. సాక్షి పత్రిక పూర్తి ఆధారాలతో తన వాదనను వినిపిస్తుంది. అందుకే  దొంగదెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. విజయవాడకు చెందిన గుడిపాటి లక్ష్మీనారాయణ అనే న్యాయవాదితో ‘సాక్షి’ కథనానికి వ్యతిరేకంగా పటమట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇప్పించారు. నిబంధనల ప్రకారం ఆ ఫిర్యాదును పోలీసులు స్వీకరించకూడదు. 

ఎందుకంటే ‘సాక్షి’ కథనంతో ఆ న్యాయవాదికి ఎలాంటి సంబంధం లేదు. ఆ న్యాయవాదిని ఉద్దేశించి ఆ కథనం రాయలేదు. ఆయన పరువుకు ఎక్కడా భంగం కలగలేదు. ఆ కథనంలో ప్రభుత్వ అవినీతి గురించే పేర్కొన్నారు. ఆ న్యాయవాది ప్రభుత్వ అధికార వ్యవస్థలో భాగం కూడా కాదు. అయినా సరే నిబంధనలకు విరుద్ధంగా ఆ న్యాయవాదితో ఫిర్యాదు చేయించారు. ఆయన ఫిర్యాదుపై విజయవాడ పోలీసులు ఏకంగా ‘సాక్షి’కి వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం మరింత విడ్డూరం. 

కేవలం చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అసమర్థ పరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా.. ‘సాక్షి’ని కట్టడి చేయాలన్న కుట్రతోనే ఈ అక్రమ కేసు బనాయించారన్నది సుస్పష్టం. ఇక తిరుపతిలోనూ ఇదే విధంగా ‘సాక్షి’పై ఫిర్యాదు చేయించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ... రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ‘సాక్షి’ మీడియా గ్రూప్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగటాన్ని యావత్‌ పాత్రికేయ రంగంతోపాటు మీడియా నిపుణులు తీవ్ర స్థాయిలో నిరసిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.

సుప్రీం ఆదేశాలు పట్టవా?
‘ప్రభుత్వాన్ని విమర్శించే వార్తలు రాశారనే కారణంతో జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు ఈ నెల 4వతేదీన ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (ఏ) కింద జర్నలిస్టులకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వ అధికారుల్లో కుల సమీకరణాలను ఉద్దేశించి జర్నలిస్టు అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ ‘యాదవ్‌ రాజ్‌ వర్సెస్‌ ఠాకూర్‌ రాజ్‌’ శీర్షికన ఓ  కథనం రాశారు. దీనిపై లక్నోలోని హజ్రత్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో సెప్టెంబర్‌ 20న ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 

నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాల్సిందిగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ హృషికేశ్‌రాయ్, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి ధర్మా­సనం విచా­రించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయ­స్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘జర్నలిస్టు రాసి­నవి కేవలం ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉన్నా­యనే కారణంతో క్రిమినల్‌ కేసులు పెట్ట­వద్దు’ అని స్పష్టం చేసింది. 

జర్నలిస్టులపై దూకుడు చర్య­లు తీసుకోవద్దని అత్యున్నత న్యాయ­స్థానం ఆదే­శాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ.. ఏపీ ప్రభు­త్వ పెద్దల ఆదేశంతో ఫిర్యాదు వచ్చిందే తడవుగా విజ­యవాడ పోలీసులు సాక్షి ఎడిటర్‌పై కేసు నమోదు చేసిన తీరుపై జర్నలిస్టులతో పాటు న్యాయ­వాదు­లు విస్తుపోతున్నారు. కుట్రతో కూడిన ఈ కేసుపై సుప్రీం కోర్టు వరకు వెళతామని ప్రకటించారు.

చట్ట ప్రకారం కేసులు చెల్లవు
ఒక కథనం విషయంలో ఎడిటర్‌పై కేసు పెట్టడం అంటే భావ ప్రకటనా సేచ్ఛను ఆటంకం పరిచినట్టే. వాస్తవాలను బయట పెట్టకుండా బెదిరించే ప్రయత్నం ఇది. ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టుకోవచ్చు. పత్రికలు చాలా జవాబుదారీతనంతో నడుస్తాయి. అలాంటి పత్రికా ఎడిటర్‌పై కేసులు పెట్టడం అప్రజాస్వామికం. ఇలాంటి ఘటనల్లో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా ఉండాల్సింది. రాజకీయ ఒత్తిళ్లతో ఆ పని చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి కేసులు చట్ట ప్రకారం నిలబడవు. – సుప్రీం కోర్టు న్యాయవాదులు

అభ్యంతరాలుంటే ఖండన ఇవ్వాలి
రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టి పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం సరికాదు. విపత్తుల సమయంలో ప్రభుత్వ పనితీరును తెలియచేసిన ‘సాక్షి’ ఎడిటర్‌పై పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టడం, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అకాల వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల కష్టాలను, ప్రభుత్వ చర్యలను రిపోర్టు చేయడం మీడియా బాధ్యత. ఇటీవల విజయవాడ వరదల నేపథ్యంలో బాధితులకు అందిన సహాయంపై ‘సాక్షి’ అదే పని చేసింది. 

పత్రికలో ప్రచురించిన కథనంపై అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. అందులో అసత్యాలు ఉన్నాయని భావిస్తే మొదట వాస్తవ గణాంకాలను చెబుతూ ఖండన ఇవ్వాలి. సాక్షి ఆ వివరణను ప్రచురించకపోతే న్యాయ స్థానాలను ఆశ్రయించాలి. అంతేగానీ పోలీసు కేసు పెట్టడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను దెబ్బతీయడమే. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అసత్య కథనాలపై సంబంధిత శాఖ ఖండనను ప్రచురించకుంటే న్యాయస్థానానికి వెళ్లే వెసులుబాటును అధికార యంత్రాంగానికి కల్పిస్తూ జీవో తీసుకొచ్చారు. 

అప్పట్లో దీనిపై ప్రతిపక్షాలు నానా హంగామా చేశాయి. ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పక్షాలు గొడవ చేశాయి. ఆనాడు జగన్‌ ప్రభుత్వం తెచ్చిన జీవో సరైందని అంగీకరించాకే ఇప్పుడు ముందుకు వెళ్లాలి. ఎవరైనా తప్పు వార్త రాస్తే ఖండించాలి. ఖండన ప్రచురించకుంటే పరువు నష్టం దావా వేసుకోవచ్చు. అంతేగానీ ఎవరో ఒకరి చేత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించి దానిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం ఏమాత్రం సరికాదు’ – దేవులపల్లి అమర్, ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు,  మన తెలంగాణ దినపత్రిక సంపాదకుడు 

కచ్చితంగా కక్ష సాధింపే
మీడియాపై ప్రభుత్వ కక్ష సాధింపులు సరికాదు. సాక్షిపై కేసు పెట్టడం అప్రజాస్వామికం. విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు సాయం అందడం లేదన్న వాస్తవాన్ని రాసినందుకు సాక్షిపై కూటమి ప్రభుత్వం అక్కసు పెంచుకోవడం దారుణం. ప్రజా సమస్యలపై విస్తత కథనాల ద్వారా మీడియా తన బాధ్యతగా ప్రభుత్వం, సమాజం దృష్టికి తెస్తుంది. మీడియా ప్రచురించిన కథనాలపై ఎటువంటి అభ్యంతరం ఉన్నా సంబంధిత బాధ్యులు ఖండన ఇవ్వవచ్చు.

అందుకు విరుద్ధంగా కేసులు పెట్టి బెదిరింపులతో మీడియాను కట్టడి చేయాలనే ప్రయత్నం ఏ మాత్రం వాంఛనీయం కాదు. చంద్రబాబు డైరెక్షన్‌లో ఒక లాయర్‌తో ఫిర్యాదు ఇప్పించి ఆగమేఘాలపై కేసు నమోదు చేయించడం కచ్చితంగా కక్ష సాధింపే. మీడియాపై పోలీసులను పురిగొల్పి బెదిరించే ధోరణిని కూటమి ప్రభుత్వం మార్చుకోవాలి.  – మలసాని మనోహర్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు 

పత్రికా స్వేచ్ఛపై కత్తి కట్టడమే 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారని ‘సాక్షి’పై కేసు నమోదు చేయడం అత్యంత దారుణం. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడే. రోజురోజుకీ గతి తప్పి వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం ఓ నియంతలా మారుతోంది. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరదల తర్వాత సహాయక పనుల్లో రూ.534 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ వివరాలను అధికారులు స్వయంగా ముఖ్యమంత్రికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో వివరించారు. 

అందులో అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, భోజనాలు, నీళ్ల బాటిల్స్‌ కోసం ఖర్చు చేసినట్లు చూపిన మొత్తం.. ఆ గణాంకాలు వాస్తవాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దాన్ని ప్రస్తావిస్తూ, వాస్తవంగా అయ్యే ఖర్చును వివరిస్తూ.. వరద సహాయ పనుల్లో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తూ రాయడం తప్పా? నిజానికి అది మీడియా బాధ్యత. అదే పని ‘సాక్షి’ చేసింది. వరద సహాయక చర్యల్లో చోటు చేసుకున్న అంతులేని అవినీతిని ఎండగట్టింది. 

అందువల్ల ‘సాక్షి’పై కక్ష కట్టిన కూటమి ప్రభుత్వం మరింత దిగజారి ఏకంగా కేసు నమోదు చేయడం హేయమైన చర్య. ఇప్పటికే కేబుల్‌ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి, బెదిరించి సాక్షి ఛానల్‌ ప్రసారాలను అడ్డుకుంది. ఇప్పుడు పత్రికపైనా కత్తి కట్టారు. వెంటనే ‘సాక్షి’పై కేసును ఉపసంహరించుకోవాలి. – కురసాల కన్నబాబు,  మాజీ మంత్రి

మీడియా స్వేచ్ఛను హరించడమే..
వాస్తవాలను బయటపెడితే కూటమి ప్రభుత్వం సహించలేకపోతోంది. విజయవాడ వరదలకు సంబంధించి  అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి పత్రికలను టార్గెట్‌ చేస్తోంది. సాక్షి ఎడిటర్‌పై కేసు పెట్టడమంటే పత్రికా స్వేచ్ఛను హరించడమే. నిర్భయంగా, నిష్పాక్షికంగా వార్తలు రాసి వాస్తవాలు బయటపెట్టే విలేకరుల గొంతు నొక్కడమే. ఇది అత్యంత గర్హనీయం. 

దీనిపై మా అసోసియేషన్‌ తరఫున ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాకి ఫిర్యాదు చేస్తాం. ఇలా కేసులు పెట్టేవారిని ఏ ప్రభు­త్వం ప్రోత్సహించకూడదు. బేషరతుగా కేసును ఉపసంహరించుకోవాలి.  – వీవీఆర్‌ కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌

Back to Top