రాజ‌కీయంగా ఎదుర్కొనే స‌త్తా లేక‌.. 

వైయ‌స్ జగన్‌పై పెద్ద‌ ఎత్తున రాజకీయ కుట్రలు

టీడీపీ, ఎల్లోమీడియాల పావుగా షర్మిల..! 

తండ్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి వీరిద్దరికి ఆస్తులు పంచి ఇచ్చారు. 

వైయ‌స్‌ జగన్ తన స్వార్జితమైన ఆస్తుల నుంచి కూడా షర్మిలకు కొంత వాటా ఇవ్వాలని నిర్ణ‌యం

వైయ‌స్ జగన్ తన తల్లి, చెల్లిపై కేసు పెట్టారని తప్పుడు ప్రచారం 

టీడీపీ ఎల్లో మీడియా వేసిన చక్రబంధంలో ఇరుక్కున్న ష‌ర్మిల‌

అమ‌రావ‌తి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ పై రాజకీయ కుట్రలు పెద్ద ఎత్తునే సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోదరి షర్మిలను పావుగా మార్చుకున్న టీడీపీ నేతలు, ఎల్లోమీడియా జగన్‌పై అభాండాలు, అర్ధసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ కుట్ర చేస్తోందంటే అర్థం చేసుకోవచ్చు కానీ.. మీడియా సంస్థలు నడుపుతున్నవారు ఇందులో భాగస్వాములు కావడం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మరో మెట్టు పతనమయ్యాయి అనేందుకు నిదర్శనం. రాజకీయంగా జగన్‌ను పూర్తిగా దెబ్బతీయకపోతే తమ మనుగడకే ప్రమాదం అన్నంత కసితో వీరంతా కుమ్మక్కై నైతిక, మానవీయ విలువలకు కూడా తిలోదకాలిస్తున్నారు.
 
అక్టోబరు 21న పచ్చమీడియాలో భాగమైన ఆంధ్రజ్యోతి ఒక కథనం వండింది. దిక్కుతోచని పరిస్థితిలో జగన్‌ తన చెల్లి షర్మిలతో కాళ్లబేరానికి దిగారన్నది ఆ కథనం సారాంశం. ఆస్తుల పంపకంపై బెంగళూరు వేదికగా చర్చలు జరిగాయని, ఒప్పందం దాదాపుగా కుదిరిందని కూడా ఈ కథనంలో చెప్పేశారు. కాంగ్రెస్‌తో దోస్తీ కోసం జగన్‌ ఇలా చేశాడని కూడా ఆ పత్రిక కనిపెట్టేసింది. ప్రత్యక్ష సాక్షులం తామే అన్నట్టుగా ఈ కథనాన్ని అల్లారు. పైగా షర్మిలపై ఎనలేని సానుభూతి వ్యక్తమైంది దీంట్లో. మూడు రోజులు కూడా గడవకముందే.. అంటే అక్టోబరు 24న అదే పత్రికల్లో ఇంకో కథనం ప్రత్యక్షమైంది. మునుపటి దానికి పూర్తి వ్యతిరేకమైన వాదనతో ఈ కథనం ఉండటం గమనార్హం. జగన్‌ సొంత చెల్లిపైనే కేసులు వేశారని, అసలు  ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని 'మమకారం మాయం" శీర్షికతో సదరు పత్రిక మొసలి కన్నీరు కార్చింది కూడా. ఆస్తుల పంపకంపై అన్నా చెల్లెళ్ల మధ్య రాజీ అని రాసిన మూడు రోజులకే ఈ రకమైన కథనం రాయడంలోనే కుట్ర ఉంది. జగన్‌పై ఏదో ఒకలా నిత్యం అబద్ధాలు ప్రచారం చేయకపోతే జనంలోకి దూసుకెళుతున్న ఆయన్ను రాజకీయంగా ఆపడం కష్టమని వారికి అర్థమైనట్టుంది. అందుకే ఎక్కడలేని దుగ్ధతో వాళ్లు ఈ రకమైన కథనాలు వండి వారుస్తునే ఉన్నారు. 

జగన్, షర్మిలల మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు ఉన్న మాట వాస్తవం. షర్మిల... సోదరుడు అని కూడా చూడకుండా జగన్‌ రాజకీయ ప్రత్యర్ధులతో, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి దుర్మార్గులతో కుమ్మక్కై ఇష్టారీతిన జగన్ వ్యతిరేక ప్రచారం చేసింది నిజం. అయినప్పటికీ గత పదేళ్లలో జగన్ నుంచి ప్రత్యక్షంగా లేదా, పరోక్షంగా సుమారు రూ.200 కోట్ల మొత్తం పొందిన తర్వాత కూడా ఆశ తీరక షర్మిల తన అన్నను అప్రతిష్టపాలు చేయబోయి తానే పరువు పోగొట్టుకుంటున్నారన్న  సంగతి తెలుసుకోలేక పోతున్నారు. 2024 ఎన్నికల్లో జగన్‌ సమర్పించిన అఫిడవిట్‌లోనే జగన్ నుంచి రూ.80 కోట్లు పొందినట్లు షర్మిల పేర్కొనడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఎంత అభిమానం లేకపోతే జగన్‌ జగన్ అంత మొత్తం చెల్లికి ఇస్తారు? చివరికి అన్న బెయిల్ రద్దుకు కొందరు చేస్తున్న కుట్రలో ఆమె ఒక పాత్ర  పోషించడం హేయమైన చర్యగా కనిపిస్తుంది. షర్మిల రాజకీయంగా అంత పరిపక్వత లేని వ్యక్తి కావడం ఎల్లో మీడియా ఆడింది ఆటగా, పాడింది పాటగా మారింది. 

ఈ నేపథ్యంలో జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఒక పిటిషన్ వేసి తాను గతంలో చెల్లెలికి ఇవ్వదలచిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసుకుంటున్నానని, తనకు తెలియకుండా జరిగిన షేర్ల బదిలీని ఆమోదించవద్దని కోరారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసినట్లు ఇది కేసు కాదు. కేవలం ఒక అభ్యర్థన మాత్రమే. కోర్టు ధిక్కారం జరగకుండా ఉండేందుకు తీసుకున్న ఒక జాగ్రత్త మాత్రమే. ఈ విషయాలపై జగన్, షర్మిల మధ్య లేఖలు నడిచాయి. వాటిని చదివితే జగన్‌కు వ్యతిరేకంగా పెద్ద కుట్రే జరిగిందని అర్థమవుతుంది. గిఫ్ట్‌డీడ్ తాను ఎందుకు రద్దు చేసుకోదలించింది కూడా జగన్‌ ఆ లేఖల్లో స్పష్టంగా రాశారు. తన వాదనను ఆయన బలంగా వినిపించారు. 

తండ్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి వీరిద్దరికి ఆస్తులు పంచి ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో షర్మిలకు తన స్వార్జితమైన ఆస్తుల నుంచి కూడా కొంత వాటా ఇవ్వాలని జగన్ అనుకున్నారు. సాధారణంగా ఎవరూ ఇలా చేయరు. కేవలం చెల్లిపై అభిమానంతోనే ఆయన ఇలా చేయాలని అనుకున్నారు. పైగా దీన్ని లిఖితపూర్వకంగా ఒక అవగాహన పత్రం రూపంలో 2019 ఆగస్టు 31న ఇచ్చారు. తనపై వచ్చిన కోర్టు కేసుల పరిష్కారం ఆ గిఫ్ట్‌ డీడ్‌ తర్వాతే అమలు అవుతుందని చాలా స్పష్టంగా పేర్కొన్నారు కూడా. సరస్వతి పవర్ కంపెనీలో జగన్, ఆయన సతీమణి భారతిలకు ఉన్న వాటాలలో కొంత భాగాన్ని షర్మిలకు ఇవ్వాలని భావించి, ఆమె సంతృప్తి కోసం తల్లి విజయమ్మ ను ట్రస్టీగా పెట్టుకుని డీడ్ రాశారు. షేర్ల బదిలీకి తమ అనుమతి అవసరమని స్పష్టం చేశారు. అయితే  షర్మిల తన తల్లిపై ఒత్తిడి తెచ్చి వాటిని జగన్ కు తెలియకుండా తన పేర బదిలీ చేసుకునే యత్నం చేసింది. ఈ సంగతి తెలిసిన  వెంటనే  జగన్ లాయర్లు స్పందించి, అలా చేయడం చెల్లదని చెబుతూ పిటిఫన్ వేశారు. ఎల్లో మీడియా దీనిని వక్రీకరిస్తూ, జగన్ తన తల్లి, చెల్లిపై కేసు పెట్టారని తప్పుడు ప్రచారం చేసింది. కేసుకు, పిటిషన్‌కు మధ్య ఉన్న తేడాను ప్రజలకు తెలియకుండా ఇలా రాశారన్నమాట. 

జగన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేయకపోతే, ఆయన గతంలో తనకు కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినట్లవుతుంది. షర్మిల పాత్ర ముగిసిన వెంటనే టీడీపీ వారు మరో పాత్రను ప్రవేశపెట్టి, జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది. ఆ మేరకు టీడీపీ ఎల్లో మీడియా కుట్ర నుంచి జగన్ బయటపడ్డారు. ఇదే సందర్భంలో షర్మిలకు జగన్ రాసిన లేఖలో తనపట్ల ఆమె వ్యవహరిస్తున్న తీరుపై కూడా అభ్యంతరం చెప్పారు. ఎల్లో మీడియా కొత్త, కొత్త సూత్రీకరణలు చేస్తోంది. జగన్ తన స్వార్జితమైన ఆస్తిలో షర్మిలకు వాటా ఇవ్వకపోతే అది అన్యాయమట. నిజానికి మన సమాజంలో ఎక్కడైనా ఒక కుటుంబంలో పిల్లల మధ్య ఆస్తుల పంపకం జరిగిన తర్వాత, సోదరుడు మళ్లీ తోడబుట్టిన వారికి తన ఆస్తిలో వాటా ఇవ్వడానికి సిద్దపడే పరిస్థితి ఉంటుందా? అయినా జగన్ సోదరిపై ఆప్యాయతతో అలా తన ఆస్తిని కూడా కొంత ఇవ్వాలని తలపెట్టారు. షర్మిల మొత్తం వ్యవహారాన్ని గందరగోళం చేసి, వైఎస్ కుటుంబ పరువును రోడ్డుకు ఈడ్చారు. 

తమ కుటుంబానికి శత్రువు వంటి ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణతో చేతులు కలిపి ఇలాంటి కుట్రలకు తెరదీశారు. రాధాకృష్ణ వెనుక ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యమే. దీనిని గుర్తించిన జగన్ ఆ కుట్రలను చేధించారు. విజయనగరం పర్యటనలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, కేవలం చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ఇలాంటి ఉదంతాలను వాడుకుంటున్నారని, ఏ కుటుంబంలో గొడవలు ఉండవని ప్రశ్నిస్తూ, రాష్ట సమస్యలకు దీనికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఆయన చెప్పింది నిజమే. ఇప్పుడు షర్మిలకు మద్దతుదారుగా నటిస్తున్న చంద్రబాబు నాయుడు గతంలో తన సొంత మామ ఎన్.టి.రామారావును సీఎం. సీటు నుంచి నిర్దాక్షిణ్యంగా కిందకు లాగిపారేస్తే ఆయన కుమిలి ,కుమిలి ఏడ్చారు. ఆ తర్వాత ఎన్.టి.రామారావుకు పార్టీ తరపున ఉన్న రూ.75 లక్షల డబ్బు కూడా ఆయనకు అందకుండా కోర్టు ద్వారా చంద్రబాబు లాగేసుకున్నారు. దాంతో తీవ్ర అవమాన భారంతో ఎన్.టి.ఆర్. మరణించారు. మరణానికి కొద్ది రోజుల ముందు ఎన్.టి.ఆర్ ఒక వీడియోలో మాట్లాడుతూ చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చి, పెద్ద మోసగాడని ధ్వజమెత్తారు. 

అంతేకాదు. ఎన్.టి.ఆర్. రెండో భార్య లక్ష్మీపార్వతికి ఆయన ఆస్తిలో సరైన వాటా దక్కకుండా ఆమెను రోడ్డుకు ఈడ్చారా? లేదా? చివరికి ఆమె తాను ఉంటున్న ఇంటిని ఖాళీ చేయవలసి వచ్చింది. ఇది మామ పట్ల చంద్రబాబు వ్యవహరించిన అమానుష ధోరణి అయితే, సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు తో కూడా ఆయనకు  తగాదా వచ్చింది. రామ్మూర్తి చివరికి అన్నపై కోపంతో కాంగ్రెస్ లో కూడా చేరారు. ఇదంతా చంద్రబాబు కుటుంబ తగాదాల కింద రావా? చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలతో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకమే  రాశారే. చంద్రబాబు తీరును తప్పుపడుతూ ఆయన బావమరిది హరికృష్ణ సొంత పార్టీ పెట్టుకుని పెద్ద ఎత్తున దూషణలు చేశారు. హరికృష్ణకు అప్పట్లో ప్రస్తుత ఎమ్.పి దగ్గుబాటి పురందేశ్వరి మద్దతు ఇచ్చేవారు. 

చంద్రబాబు తల్లి అమ్మాణమ్మకు హైదరాబాద్‌లోఉన్న అత్యంత విలువైన ఐదెకరాల భూమిని ఇతర సంతానానికి గాని, ఇతర మనుమళ్లకు కాని ఇవ్వకుండా చంద్రబాబు కుమారుడు లోకేష్ కు మాత్రమే ఆమె ఎందుకు ఇచ్చారన్న దానిపై జవాబు దొరుకుతుందా? జగన్, షర్మిల మధ్య వివాదంతో రాష్ట్రం అంతా ఏదో అయిందన్న భ్రాంతి కల్పించాలని చూస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలలో ఇలాంటివి జరగలేదా? ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావుపై ఆయన రెండో కుమారుడు సుమన్ ఎంత తీవ్రమైన ఆరోపణలు చేశారో తెలియదా? నిజమో, కాదో కాని కొంతకాలం క్రితం ఆస్తుల పంపిణీపై రామోజీ కుటుంబంలో కూడా భిన్నాభిప్రాయాలు వచ్చాయని ప్రచారం జరిగింది. 

ఆంధ్రజ్యోతి పునరుద్దరణలో కీలక భూమిక పోషించి పెట్టుబడి పెట్టిన విజయ ఎలక్ట్రికల్స్ దాసరి జయరమేష్, నూజివీడు సీడ్స్ ప్రభాకర్ రావు ల వాటా ఎలా తగ్గిపోయింది? రాధాకృష్ణ వాటా ఎలా పెరిగింది? మొత్తం పెత్తనం అంతా ఈయన చేతికే ఎలా వచ్చిందని పలువురు ప్రశ్నిస్తుంటారు. మరికొన్ని ప్రముఖుల కుటుంబాల గొడవలకు సంబంధించి పాత విషయాలు ఇప్పుడు మళ్లీ  వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ పై ఆయన మొదటి భార్య నందిని ఏకంగా కేసు పెడితే, రెండో భార్య రేణు దేశాయ్ ఆయన గురించి ఏమి చెప్పారో గుర్తు చేస్తున్నారు. తనకు రాజకీయంగా ఉపయోగపడుతున్నారు కనుక పవన్ కళ్యాణ్ ను ఆయన గొప్పవాడని ప్రచారం చేస్తారు. తేడా వస్తే ఇంతకన్నా ఘోరంగా చంద్రబాబు  అవమానిస్తారు. 

ప్రధాని మోడీ పెళ్లాన్ని ఏలుకోలేని వాడని చంద్రబాబు అన్నారా? లేదా? తదుపరి తన అవసరార్థం ప్లేట్ మార్చి మోడీ చాలా గ్రేట్ అని ఉపన్యాసాలు చెబుతున్నారు కదా! రిలయన్స్ అంబానీ సోదరులు ఇద్దరూ ఆస్తుల విషయంలో కొంతకాలంం గొడవ పడ్డారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పై ఆమె రెండో కోడలు మేనకా గాందీ కొన్ని ఆరోపణలు చేస్తూ తనకు ఎలా అన్యాయం చేశారో వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు వస్తాయి. 

ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే షర్మిలపట్ల జగన్ అతి ప్రేమ చూపి అనవసరంగా చికాకు కొని తెచ్చుకున్నారని అనిపిస్తుంది.  అయినా ఆయన ఇప్పటికీ కూడా తన అభిమానాన్ని కనబరుస్తూనే ఉన్నారు. షర్మిల తప్పు సరిదిద్దుకుంటే మళ్లీ ఆస్తులు ఇవ్వడానికి ఆలోచిస్తామని చెప్పడం కొసమెరుపు. కాని ఆమె ఇప్పటికే టీడీపీ ఎల్లో మీడియా వేసిన చక్రబంధంలో ఇరుక్కున్నారు.ఆమెను  అడ్డు  పెట్టుకుని వారు ఆడుతున్న ఈ డ్రామాకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

Back to Top