సాయం కోసం ఎదురుచూపులు.. 

 
పరిహారం అందలేదంటూ బుడమేరు వరద బాధితుల గగ్గోలు 

21 వేల మందికిపైగా కలెక్టరేట్‌లో దరఖాస్తులు 

45 రోజులకు పైగా గడుస్తున్నా అందని సాయం 

అంచనా బృందాలు నట్టేట ముంచాయని బాధితుల మండిపాటు 

విజయవాడ కండ్రికలోని ఈమె ఇల్లు ఇటీవల బుడమేరు వరదల్లో పూర్తిగా  మునిగింది. 12 రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపింది. సర్వే సిబ్బంది వివరాలు రాసుకుని వెళ్లారు. అయితే, పరిహారానికి సంబంధించిన జాబితాలో మాత్రం ఈమె పేరులేదు. సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితంలేదు. కలెక్టరేట్‌లో కూడా మరోసారి దరఖాస్తు చేసుకుంది. చివరికి.. ఎవరిని అడిగినా లాభంలేక సాయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. 

బుడమేరు వరదతో విజయవాడలో నిండా మునిగిన బాధితులకు నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వరదలు వచ్చి 45 రోజులకు పైగా గడిచినప్పటికీ, సాయం కోసం ఇంకా వేలాది మంది బాధితులు నిరీక్షిస్తూనే ఉన్నారు. 

ప్రతి ఒక్క బాధితుడికి సహాయం అందిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. రకరకాల సాకులతో బాధితుల జాబితాకు కోతేసి గతనెల 17న సచివాలయాల్లో ప్రదర్శించారు. కానీ, సర్వే అంతా తప్పుల తడకగా ఉందని, గ్రౌండ్‌ఫ్లోర్‌ అయితే, ఫçస్ట్‌ ఫ్లోర్‌ అని.. వాహనాలు నమోదు కాలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. 

మరికొందరైతే తమ పేర్లు నమోదు చేయలేదంటూ రోడ్డెక్కి ధర్నా చేశారు. దీంతో బాధితుల ఆగ్రహాన్ని   చల్లార్చేందుకు సచివాలయాల పరిధిలో దరఖాస్తులు తీసుకున్నారు. ఆ సమయంలో 18వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో కొన్నింటిని పరిష్కరించి, వరద బాధితుల ఖాతాల్లో నగదు జమచేశారు. 

అయినా ఇంకా తమకు పరిహారం అందలేదంటూ చాలామంది సెపె్టంబరు 27 వరకు సచివాలయాల చుట్టూ తిరిగారు. తామేమీ చేయలేమని అక్కడి సిబ్బంది చెతులేత్తేయడంతో సెప్టెంబరు 28 నుంచి బాధితులు దరఖాస్తులతో విజయవాడలోని కలెక్టరేట్‌ బాటపట్టారు. ఇలా వచ్చిన దరఖాస్తులు 21వేలకు పైగా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

అర్జీల‌న్నీ బుట్టాదాఖ‌లు
సీన్‌ కట్‌చేస్తే.. ఇప్పుడీ దరఖాస్తుల గురించి సమాధానం చెప్పేవారే కరువయ్యారు. వీటిని అధికారులు పరిశీలించి, అర్హులైన జాబితాలు సచివాలయాల్లో ఉంచితే బాధితుల్లో గందరగోళం ఉండేది కాదు. అయితే, దరఖాస్తులు కంటితుడుపుగా తీసుకున్నారా లేక కాలయాపన చేసి వీటిని కోల్డ్‌స్టోరేజిలోకి నెడతారా అని బాధితులు అనుమానిస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోవడంతో, బాధితుల అర్జీలన్నీ బుట్టదాఖలు అయినట్లేనని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు. 

అంచనా బృందాల అరాచకం.. 
ఇక నష్టం అంచనా జాబితాలోనే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందంటూ బాధితులు మండిపడుతున్నారు. అంచనా బృందాలు వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నా డోర్‌లాక్‌ అని నమోదు చేశారని, గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే ఉంటే నాలుగో అంతస్తు అని నమోదు చేశారని.. ఇల్లంతా బురదమయంగా కనిపిస్తున్నా.. నష్టం జరగలేదని నమోదు చేశారని, వాహనాలు పూర్తిగా పాడైనా.. ఎలాంటి నష్టం జరగలేదని నమోదు చేశారని, ఆధార్, బ్యాంకు ఖాతాలన్నీ సక్రమంగానే ఉన్నా నాట్‌ ట్రేస్డ్‌ అని నమోదు చేశారని బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారు. 

సాయం చేసింది గోరంతే.. 
ఇదిలా ఉంటే.. వరద నష్టం అంచనా పూర్తయిన తరువాత ముంపు ప్రాంతాల్లో 2.68 లక్షల కుటుంబాలకు నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇందులో 2.32 లక్షల కుటుంబాలకు సంబంధించి 1,700 సర్వే బృందాలతో సర్వే చేయించారు. ఇందులో ఇప్పటివరకు 89,616 ఇళ్లు నీట మునిగినందున రూ.188.80 కోట్ల పరిహారం అందించారు. ఎంఎస్‌ఎంఈలు, వాహనాలు, వ్యవసాయరంగం, పశువులు, మత్స్యశాఖ, చేనేత, ఉద్యానవనం అన్ని శాఖలకు కలిపి రూ.97.66 కోట్ల సాయం మాత్రమే అందించారు. 

ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించే రూ.55.60 కోట్ల పరిహారం ఉంది. అంటే.. వరదకు సంబంధించి జిల్లాలో అన్ని రకాల సాయం కింద అందించింది కేవలం రూ.286.46 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక బాధితులకు ఇచ్చిన పరిహారం కంటే అగ్గిపెట్టెలు, భోజనాలు ఇతర ఖర్చుల కింద ఎక్కువగా ఖర్చుచేయడం విశేషం. 

అతీగతీలేని సాయం.. 
మేం రాజీవ్‌నగర్‌ ప్లాట్‌ నెంబరు 26లో ఉంటున్నాం. బుడమేరు వరదలో ఇల్లు  పూర్తిగా మునిగింది. సర్వే సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. నష్టపరిహారానికి సంబంధించిన జాబితాలో పేరున్నా డబ్బు మాత్రం పడలేదు. ఎవర్ని అడిగినా సమాధానం కరువైంది. చివరికి కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు అతీగతీలేదు.      – వెంగల సాయితేజ, రాజీవ్‌నగర్‌  

Back to Top