బాబు డైరెక్షన్‌.. పవన్, నాదెండ్ల ‘బియ్యం హైడ్రామా

ప్రభుత్వ వైఫల్యాలు, తమ దోపిడీని కప్పిపుచ్చే ఎత్తుగడ

అసత్య ఆరోపణలతో ఏమార్చి మభ్యపెట్టే కుతంత్రం.. కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే బియ్యం స్మగ్లింగ్‌ మాఫియా 

ఆ దోపిడీని అడ్డుకోలేక.. పోర్ట్‌ వద్ద రాజకీయ డ్రామాలు.. స్మగ్లింగ్‌ జరిగితే ప్రశ్నించాల్సింది మంత్రి నాదెండ్లనే! 

నిలదీయాల్సింది సీఎం చంద్రబాబునే...! 

వైఎస్సార్‌సీపీ నేతలపై దు్రష్పచారంతో పవన్‌ డ్రామా.. కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌ వేరు... యాంకరేజ్‌ పోర్ట్‌ వేరు 

ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంకరేజ్‌ పోర్ట్‌ నుంచే బియ్యం ఎగుమతి.. మరి స్మగ్లింగ్‌ జరిగితే బాధ్యత ప్రభుత్వానిదే కదా! 

పవన్‌ నిలదీయాల్సింది సీఎం చంద్రబాబునే  

కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌పై పవన్, నాదెండ్ల నిరాధార ఆరోపణలు 

డీప్‌ వాటర్‌ పోర్ట్‌ యాజమాన్య మారి్పడి ప్రైవేటు వ్యవహారం.. దాంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? 

లాభాల్లో ఉన్న కాకినాడ పోర్ట్‌ను గతంలో ప్రైవేటుపరం చేసింది చంద్రబాబే 

ఇప్పుడు కూడా మూడు పోర్టులను తన బినామీలకు అప్పగించేందుకు పన్నాగం 

అసలు ఆ షిప్‌లో ఉన్నది రేషన్‌ బియ్యమని ఎవరు నిర్ధారించారు?.. బియ్యం శాంపిల్స్‌ను అసలు పరీక్షించ లేదన్న కలెక్టర్‌ 

మరి పవన్, నాదెండ్ల రాద్ధాంతం దేనికో!

అమరావతి: అనుకున్నంతా అయ్యింది... ఎన్నికలు అయిపోయాయి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అయ్యాయి కదా..! మరి ఇంకేంమంటూ... ముఖ్యమంత్రి చంద్రబాబు క్రమంగా చంద్రముఖిగా మారడం మొదలుపెట్టారు! ఆయనలోని మాయల మరాఠీ మళ్లీ నిద్ర లేచారు! తమ ప్రభుత్వ వైఫల్యాలు, అడ్డగోలు దోపిడీ బాగోతాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ మంత్రదండాన్ని ప్రయోగించారు. 

సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో కూటమి సర్కారు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు నెలకో రాద్ధాంతంతో హడావుడి చేసిన చంద్రబాబు ఇక ఆ కథలు అట్టే సాగవని గుర్తించారు. టీడీపీ కూటమి పెద్దలు యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీపై సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. దాంతో అంతకు మించిన డ్రామాతో కనికట్టు చేసేందుకు రంగంలోకి దిగారు. అందులో భాగంగానే  జనసేనలోని తన కోవర్టు నాదెండ్ల మనోహర్‌ ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌తో కాకినాడ తీరంలో డైవర్షన్‌ సినిమాకు క్లాప్‌ కొట్టారు. 

అసత్య ఆరోపణలతో డైలాగులు.. సీన్‌కు సంబంధంలేని ఓవర్‌ యాక్షన్‌... కృతకంగా సాగిన రాజకీయ ఎపిసోడ్‌తో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. కానీ చంద్రబాబు స్క్రిప్ట్‌ వర్క్‌ అవుట్‌ కాలేదు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. 

వైఫల్యాలపై ఏమార్చి... దోపిడీని దాచేందుకే
ఓ వైపు రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం.. మరోవైపు మిల్లర్ల నుంచి తమ భారీ కమీషన్ల బాగోతం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వ పెద్దలు ‘బియ్యం డ్రామా’కు తెరతీశారు. ధాన్యం కొనుగోలుపై కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేయడంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయిపోయినా ప్రభుత్వం కనీసం గోనె సంచులు కూడా సరఫరా చేయలేకపోయింది. 

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు 75 కిలోల బస్తాను రూ.400 తక్కువకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. దాంతో ఎకరాకు రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు నష్టపోతున్నారు. మరోవైపు మిల్లర్లకు రూ.1,600 కోట్ల సీఎంఆర్‌ బకాయిలు చెల్లించేందుకు 8 శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు బేరం పెట్టారు. 

అందుకు మిల్లర్లు సమ్మతించడంతో మొదట విడతగా ఇటీవల రూ.200 కోట్లు విడుదల చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ చేతగానితనం.. మరోవైపు మిల్లర్ల నుంచి కమీషన్ల దోపిడీ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే టీడీపీ పెద్దలు కాకినాడ పోర్ట్‌ వద్ద బియ్యం డ్రామాకు తెరతీశారన్నది స్పష్టమవుతోంది.

కూటమి ఎమ్మెల్యేల నేతృత్వంలోనే రేషన్‌ బియ్యం మాఫియా
క్షేత్రస్థాయిలో రేషన్‌ బియ్యం మాఫియాను అడ్డుకోకుండా... కస్టమ్స్, సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఉండే కాకినాడ యాంకరేజ్‌ పోర్ట్‌ వద్ద డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌ రాజకీయ రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉంది. బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టపై చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నది ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ఎందుకంటే.. టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలే మాఫియాగా ఏర్పడి రేషన్‌ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. 

అక్రమ రవాణాను అడ్డుకోవాలంటే చెక్‌ పోస్టుల వద్ద నిఘా పెంచాలి. అధికారుల సహకారంతో రేషన్‌ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న టీడీపీ కూటమి ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం చెక్‌ పోస్టుల వద్ద తలుపులు బార్లా తెరచి మరీ రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు సహకరిస్తోంది. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సింది రవాణా, హోం, పౌర సరఫరాలు, విజిలెన్స్‌ శాఖలే. అక్రమ రవాణా సాగుతోందంటే అందుకు ఆ శాఖల మంత్రులు బాధ్యత వహించాలి. 

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా సాగుతోందంటే అందుకు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్‌ బాధ్యత వహించాలి. మరి పవన్‌ కళ్యాణ్‌ తన పార్టీకి చెందిన మంత్రి నాదెండ్లను నిలదీయకుండా కాకినాడ వద్ద సముద్రంలోకి వెళ్లి హడావుడి చేయడం వెనుక లోగుట్టు ఏమిటి..? పోర్టులను కేంద్ర షిప్పింగ్‌ శాఖ, కస్టమ్స్‌ శాఖ పర్యవేక్షిస్తాయి. సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పిస్తుంది. పవన్‌ కళ్యాణ్, మనోహర్‌ కాకినాడ యాంకరేజ్‌ పోర్టు వద్దకు వెళ్లి ఆ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక మతలబు ఏమిటి? ఇదంతా కేవలం ప్రజల దృష్టి మళ్లించే దిగజారుడు రాజకీయమే కదా! 

రేషన్‌ బియ్యమని ఎవరు చెప్పారు..?పరీక్షించకుండానే ఎందుకీ గగ్గోలు?
కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి ఓ షిప్‌ ద్వారా ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన బియ్యంపై పవన్‌ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌ రెండు రోజులుగా చేస్తున్న రాద్దాంతం కేవలం రాజకీయ డ్రామాయేనని స్పష్టమవుతోంది. రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు రవాణా చేస్తున్నారని వారిద్దరూ మీడియా కెమెరాలను వెంటబెట్టుకుని వెళ్లి చేసిన రాద్ధాంతం హాస్యాస్పదంగా మారింది. 

ఆ షిప్‌లో రవాణా చేసేందుకు సిద్ధం చేసిన బియ్యం అసలు రేషన్‌ బియ్యమని ఎవరు చెప్పారు? మంత్రులుగా ఉన్న పవన్‌ కళ్యాణ్, మనోహర్‌కు ఆమాత్రం అవగాహన లేకపోవడం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటే.. కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ వెంటనే వాటి శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపించాలి. అవి రేషన్‌ బియ్యమా..? మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బియ్యమా? అన్నది పరీక్షించి నిర్ధారించాలి. 

కానీ కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌గానీ జాయింట్‌ కలెక్టర్‌ రాజీవ్‌ మీనాగానీ ఆ బియ్యం శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పంపించనే లేదు. పౌర సరఫరాల శాఖ అధికారులను వెంటబెట్టుకుని కలెక్టర్‌ బుధవారం ఆ షిప్‌లోకి వెళ్లి బియ్యాన్ని చూసి వచ్చారు గానీ వాటి శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పంపలేదు. షిప్‌లో ఉన్నవి రేషన్‌ బియ్యమని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనూ లేదు. మరి రేషన్‌ బియ్యం అక్రమ స్మగ్లింగ్‌ అంటూ పవన్‌ కళ్యాణ్, మనోహర్‌ రాద్ధాంతం చేయడం ఏమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. 

దోపిడీని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు చీప్‌ ట్రిక్స్‌
సూపర్‌ సిక్స్‌ హామీల అమలు ఎగవేత, తమ అడ్డగోలు దోపిడీ బాగోతాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయా­లకు పాల్పడుతున్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీనిపై నిలదీస్తున్న ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు రకరకాల డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. ఆరు నెలలుగా ఇదే ధోరణి. 

అయితే ఎల్లకాలం డైవర్షన్‌ పాలిటిక్స్‌తో మభ్యపెట్టలేమని గుర్తించడంతో తాజాగా బియ్యం డ్రామాకు తెర తీశారు. కూటమి పెద్దలు యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ మద్యం సిండికేట్‌ దోపిడీకి ప్రభుత్వమే రాచబాట వేసింది. ఇతరులు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా పోలీసులతో బెదిరించి మరీ టీడీపీ సిండికేట్‌ సభ్యులు ఏకపక్షంగా మద్యం దుకాణాలు దక్కించుకున్నారు. అనంతరం వీధి వీధినా...వాడవాడలా బెల్ట్‌ దుకాణాలు నెలకొల్పి దోపిడీకి పాల్పడుతున్నారు. 

ఏకంగా దండోరా వేసి మరీ బెల్ట్‌ దుకాణాలకు వేలం పాటలు నిర్వహిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. మరోవైపు ఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ కూటమి పెద్దలు రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లను ఏకపక్షంగా దక్కించుకుని భారీ దోపిడీకి తెరతీశారు. తద్వారా ప్రభుత్వం ఏటా రూ.750 కోట్ల ఆదాయం కోల్పో­తోంది. రీచ్‌లను నిర్వహిస్తున్న టీడీపీ సిండికేట్‌ ఇసు­క రేట్లు భారీగా పెంచేసి ప్రజలను దోపిడీ చేస్తోంది. ఇక వలంటీర్ల జీతం నెలకు రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే తన అసలు స్వరూపం చూ­పించారు. వలంటీర్ల వ్యవస్థను తొలగించి వారిని రో­డ్డున పడేశారు. 

ఇక పోలవరం ప్రాజెక్ట్‌లో నీటి­నిల్వను కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేయా­లన్న ఎన్టీయే ప్రభుత్వ నిర్ణయానికి చంద్రబాబు వంత పాడడం ద్వారా రాష్ట్రానికి తీరని ద్రోహం తలపెట్టారు. మరోవైపు అందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ నిస్సిగ్గుగా అసత్య ఆరోపణలతో తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఈ పరిణామాలతో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తు­తోంది. దీంతో డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే బియ్యం డ్రామాకు టీడీపీ పెద్దలు తెర తీశారు.  

కాకినాడ పోర్టు వేరు.. యాంకరేజ్‌ పోర్ట్‌ వేరు
పవన్, నాదెండ్ల నిలదీయాల్సింది చంద్రబాబునే
మంత్రులుగా వారూ బాధ్యత వహించాలి..
కాకినాడ పోర్టు స్మగ్లింగ్‌ డెన్‌గా మారిందంటూ పవన్‌ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌ ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేశారు. కాకినాడ పోర్టును అరబిందో సంస్థ దక్కించుకున్నప్పటి నుంచే రేషన్‌ బియ్యం అక్రమ రవాణా హెచ్చుమీరిందని అసత్య ఆరోపణలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. వారిద్దరూ బాధ్యతాయుతమైన మంత్రులుగా ఉంటూ కాకినాడ పోర్ట్, కాకినాడ యాంకరేజ్‌ పోర్టుల మధ్య తేడాను గుర్తించలేని అజ్ఞానంలో ఉండటం విస్మయపరుస్తోంది. 

కాకినాడ పోర్ట్‌ వేరు... కాకినాడ యాంకరేజ్‌ పోర్ట్‌ వేరు. కాకినాడ యాంకరేజ్‌ పోర్ట్‌ నుంచి బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఆ యాంకరేజ్‌ పోర్ట్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. మరి ఆ పోర్ట్‌ నుంచి స్మగ్లింగ్‌ జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత కదా? మరి పవన్‌ కళ్యాణ్, మనోహర్‌ ఎవర్ని నిలదీయాలి? 

రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీ­యాలి కదా! ఆ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారిద్దరూ కూడా బాధ్యత వహించాలి. అందుకు విరుద్ధంగా కాకినాడ పోర్టును నిర్వహిస్తున్న అరబిందో సంస్థను ప్రశ్నించడం వారి అజ్ఞానమా? లేక రాజకీయ కుట్ర అనుకోవాలా?

ప్రైవేటు వ్యవహారంపై రాద్ధాంతం ఏమిటో..!
కాకినాడ డీప్‌వాటర్‌ పోర్ట్‌ను ప్రమోటర్‌ కేవీ రావు నుంచి అరబిందో సంస్థ కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసింది. అది రెండు ప్రైవేటు సంస్థల మధ్య జరిగిన అమ్మకం–కొనుగోలు లావాదేవీ. కాకినాడ డీప్‌వా­టర్‌ పోర్ట్‌ యాజమాన్య మార్పిడి చట్టబద్ధంగా సాగిన ప్రైవేటు వ్యవహారం. దాంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ అంశాన్ని వక్రీకరిస్తూ టీడీపీ కూటమి పెద్దలు అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించడం విడ్డూరంగా ఉంది. 

కాకినాడ పోర్టును ప్రైవేటుపరం చేసింది బాబే కదా..
కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టును ప్రైవేటుపరం చేసింది గతంలో చంద్రబాబు ప్రభుత్వమే. ఆసి­యా అభివృద్ధి బ్యాంకు, ఏడీబీ రుణాలతో రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌ను 1997లో నిర్మించింది. లాభాల్లో ఉన్న ఆ పోర్టును 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రైవేటుపరం చేశారు. ప్రస్తుతం కూడా చంద్రబాబు అదే కుట్రతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను తన బినామీల పరం చేసేందుకు సిద్ధపడుతున్న విషయం తెలిసిందే.

 

Back to Top