కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమంగా పెట్టిన కేసులున్నాయి. ఏడాదిన్నర జైల్లో ఉండి బెయిలుపై బయటకు వచ్చారాయన. పైపెచ్చు ఆ కంపెనీల ఆస్తులన్నీ ఈడీ, సీబీఐ జప్తులో ఉన్నాయి. ఆ ఆస్తులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలూ జరపకూడదని హైకోర్టు ఇచ్చిన ‘స్టే’ ఉత్తర్వులూ ఉన్నాయి. మరి ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఏమవుతుంది? దీనికి సమాధానమివ్వటానికి న్యాయనిపుణులే అక్కర్లేదు. కాస్త చదువు, ఇంకాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరైనా చాలు. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే దాని ప్రభావం బెయిలుపైనా పడే ప్రమాదముంటుంది! ఇదిగో... సరస్వతీ పవర్ షేర్ల బదిలీ వ్యవహారంలో ఇదే జరిగింది. వైఎస్ జగన్‌కు తెలియకుండా ఆయన పేరిట ఉన్న షేర్లను తల్లి పేరిట సోదరి షర్మిలే దగ్గరుండి మార్పించేశారు. షేరు హోల్డరైన వైయస్ జగన్‌కు కనీసం సమాచారమూ ఇవ్వలేదు. కోర్టు స్టే ఉత్తర్వులున్నా... కనీసం కోర్టుకూ చెప్పలేదు. పెద్ద మనుషుల ఒప్పందం మాదిరి తల్లి పేరిట రాసిన అన్ రిజిస్టర్డ్ గిఫ్ట్‌డీడ్‌ను ఉపయోగించుకుని షేర్లను తల్లి పేర మార్పించేశారామె. దీంతో కంపెనీ యాజమాన్యం పూర్తిగా తల్లి చేతికి వచ్చినట్లవుతుంది. మరి ఇది కోర్టు ఉల్లంఘనే కదా? జగన్‌కు తెలియకుండా జరిగినా... కోర్టు దృష్టిలో తప్పే కదా? మరి ఈ తప్పును కోర్టు దృష్టికి తేవాల్సిన అవసరం జగన్‌కు లేదా? ఈ లావాదేవీని కోర్టు దృష్టికి తెచ్చి... రద్దు చేయమంటూ కోరటం తప్పెలా అవుతుంది? తనకు తెలియకుండా తన పేరిట చెల్లెలు చేసిన తప్పును సరిదిద్దడానికి ఆయన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీని) ఆశ్రయించటాన్ని చంద్రబాబు కూటమి ఎందుకంత ఘోరమైన తప్పిదం మాదిరి ప్రచారం చేస్తోంది? దాన్ని తల్లిపై కేసు వేసినట్లుగా ఎందుకు చూడాలి? న్యాయపరంగా రక్షించుకోవటానికి వైయస్ జగన్ ఎన్‌సీఎల్‌టీకి వెళ్లటం తప్పెలా అవుతుంది? ఆలోగా చేయటం చట్టవిరుద్ధం కాబట్టే.. సొంత అన్న న్యాయపరంగా ఇబ్బంది పడతాడని తెలిసి కూడా షర్మిల ఇలా చేయటానికి అసలు కారణం... చంద్రబాబు నాయుడు. బాబు పన్నిన లోతైన కుట్రలో షర్మిల భాగం. అంతా కలిసే జగన్‌ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. అందుకే రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. వీటిని పసిగట్టి జగన్ వెంటనే కోర్టును ఆశ్రయించటంతో... తమ పన్నాగం బెడిసికొట్టిందని గ్రహించి దీనికి ‘తల్లిపై వేసిన కేసు’గా కలర్ ఇస్తున్నారు. ఆస్తుల కోసం వైయస్ జగన్ తన కుటుంబీకులతోనే పోరాడుతున్నారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు సరస్వతీ పవర్‌లో 100 శాతాన్ని షర్మిలకు ఇచ్చేస్తానని చెప్పాక... అప్పటికే 49 శాతం తల్లిపేరిట మార్పించి... తన మాటపై మరింత భరోసా కలిగేలా మిగిలిన 51 శాతాన్ని కూడా గిఫ్ట్‌గా ఇస్తానని రాసేశారంటే ఏమిటర్థం? ఆ ఆస్తిని పూర్తిగా వదులుకున్నట్లేగా? కాకపోతే కేసులున్నాయి కనక... అవన్నీ పూర్తిగా తొలగిపోయాకే ఆ షేర్లను చట్టబద్ధంగా షర్మిల పేరిట బదిలీ చేస్తానన్నారు. ఆలోగా చేయటం చట్టవిరుద్ధం కనక తాను చేయనన్నారు. అందుకే ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు తనవద్దే ఉంచుకున్నారు. కానీ షేర్ సర్టిఫికెట్లు పోయాయనే అబద్ధాలతో తల్లి ద్వారా షర్మిల అలాంటి చట్టవిరుద్ధమైన పని చేసేయటంతో... విధిలేక కోర్టును ఆశ్రయించారు. ఇదీ నిజం. ఇదే నిజం.