తాడేపల్లి: వైయస్ జగన్ ఇంతే చేశాడు.. మేం అంతకన్నా ఎక్కువ చేస్తామంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా, అంతకుముందు అమల్లో ఉన్న పథకాలను ఎత్తివేయడమే కాదు, కొత్తగా వారు చెప్పిన ఒక్క పథకమూ అమలు చేయడంలేదు, కొత్తగా ప్రజలకు చేసింది ఏమీ లేదు. అన్నిరంగాల్లో తిరోగమనమే కనిపిస్తోంది. మరోవైపు మహిళలకు రక్షణకూడా లేని పరిస్థితులు, రెడ్‌బుక్ రాజ్యాంగం, సూపర్ 6- సూపర్ 7లు మోసాలే అయిన పరిస్థితులు, విద్య, వైద్యం, వ్యవసాయం, డోర్‌డెలివరీ గవర్నెన్స్ ఇలా అన్నీ పడకేసిన పరిస్థితులు, వీటికితోడు ఉచిత పంటలబీమాకు మంగళం, కరెంటు ఛార్జీల బాదుడు. ఓవైపు ఇవి చేస్తూ మరోవైపు ఇసుక , లిక్కర్ స్కాం, వరద సహాయంలో అంతులేని అవినీతికి పాల్పడుతోంది. దీనికితోడు ప్రజల పట్ల తన తన బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయంలో విఫలమై, ప్రజల దృష్టిని మళ్లించడానికి, తాను చేయాల్సిన బాధ్యతలనుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ప్రజలకు సంబంధంలేని అంశాలను తెరమీదకు తెచ్చి, తన సొంత మీడియా బలంతో దానికి విపరీత ప్రచారం కల్పించి, వైయస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి బురదజల్లుడు రాజకీయాలు చేస్తోంది. జూన్‌లో రుషికొండ భవనాలు అని, జులైలో శ్వేతపత్రాలు అని, మదనపల్లె ఫైల్స్ అని, ఆగస్టులో ముంబైనటి వ్యవహారం అని, సెప్టెంబరులో బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారని, శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో కల్తీ నేయి కలిసిందని తప్పుడు ప్రచారాలు చేస్తే, ఈ అక్టోబరులో వైయస్‌ఆర్ కుటుంబంలో వ్యవహారాన్ని లక్ష్యంగా చేసుకుని వక్రీకరణలతో విషప్రచారాలు చేసింది. ఈ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి, ప్రజలకు వాస్తవాలను వెల్లడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో వైయస్‌ఆర్ కుటుంబంలో వ్యక్తిగత అంశాలనూ కూడా రచ్చకీడ్చి, వాటిని వక్రీకరించి వైయస్ జగన్ ప్రతిష్టను దెబ్బతీయాలనే చంద్రబాబు, ఆయన మీడియా దుర్భుద్దిని ఎండగట్టక తప్పలేదు. ఈ అంశంపై అన్ని వివరాలను ఇప్పటికే ప్రజలముందు ఉంచాం, ఉన్నాయి. ఇప్పుడు ఎవరిది మంచి? ఎవరిది చెడు? అన్నది ప్రజలే నిర్ణయించుకుంటారు. అంతేకాకుండా ఈ వ్యవహారం న్యాయస్థానాల్లో ఉన్నందున, ఇక వాదనలు ఏవైనా కోర్టుల్లోనే చేసుకునే వెసులుబాటు ఎవరికైనా ఉన్నందున, దీనికి ఇక్కడితో ముగింపు పలకాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైయస్ఆర్ సీపీ జెండా, అజెండా ప్రజలే. కష్టనష్టాల్లో వారికి తోడుగా ఉంటూ నిరంతరం ప్రజల గొంతుకై నిలుస్తోంది. ప్రజాసంబంధిత అంశాలే ప్రాధాన్యతగా, కూటమి ప్రభుత్వ నయవంచనలను ప్రశ్నిస్తూ, నిలదీయడంపైనే దృష్టిపెట్టాల్సిందిగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వైయస్ఆర్ సీపీ పిలుపునిస్తోంది.