కర్నూలు: మండలంలోని చింతమానుపల్లె గ్రామంలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్త ఆటో బుడ్డన్నను హత్య చేసేందుకు తెగబడ్డారు. పక్కా ప్లాన్ ప్రకారం పట్టుడు కర్రలు, ఇనుప రాడ్లతో బుడ్డన్నపై హత్యాయత్నం చేయడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇద్దరిని చితకబాదారు. తీవ్రగాయాలతో ఎలాగోలా బయటపడిన బాధితుల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడిపై బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త బుడ్డన్న మంగళవారం ఉదయం బహిర్భూమికి ఊరి చివరనున్న వంక వద్దకు ఒంటరిగా వెళ్లాడు. గమనించిన టీడీపీ నాయకులు కుమార్, వీరేష్, శివకృష్ణ, అరవిందు, హరికృష్ణ, కిష్టన్న, రాజు దాడి పధకం ప్రకారం చుట్టుముట్టారు. మలవిసర్జనకు కూర్చున్న ఆటో బుడ్డన్నపై వెంట తెచ్చుకున్న పట్టుడు కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా చితకబాదారు. వీపుపై తీవ్రంగా కొట్టడంతో పాటు పాటు, కాళ్లు, చేతులు, మెడపై దాడి చేశారు. కదల్లేని స్థితిలో బుడ్డన్న కింద పడిపోవడంతో వదిలేసి వెళ్లారు. కాసేపటికి తేరుకున్న బుడ్డన్న అతికష్టం మీద ఇంటికి చేరుకున్నారు. అలాగే బుడ్డన్న కుటుంబసభ్యులు పొలంలో పురుగు మందు పిచికారీ చేస్తుండగా టీడీపీ గూండాలు అక్కడికి వెళ్లి ఆయన కుమారుడు వినయ్, మామ గుడప మద్దిలేటిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబసభ్యులు క్షతగాత్రులను సి.బెళగల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడ ఫిర్యాదు అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బుడ్డన్న పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర వార్డులో చికిత్స చేయిస్తున్నారు. మిగతా ఇద్దరికీ చేతులు, వీపుపై తీవ్ర గాయాలైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఘటనపై స్థానిక ఎస్‌ఐ తిమ్మారెడ్డి, పోలీస్ సిబ్బందితో చింతమానుపల్లె గ్రామంలో పర్యటించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, గ్రామంలో విచారించి నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు టీడీపీ ప్రభుత్వం గెలవడంతో ఇకపై అంతా తాము చెప్పినట్లే జరగాలంటూ రెచ్చిపోతున్న ఆ పార్టీ నాయకులు అడ్డుగా ఉన్న వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను అంతంమొందించేందుకు సైతం వెనుకాడడం లేదని బాధితులు వాపోయారు. టీడీపీ శ్రేణుల ఆగడాలతో గ్రామాల్లో ప్రశాంతత లోపించిందని, ప్రజలు భయందోళన చెందుతున్నారని, జిల్లా పోలీస్ యంత్రాంగం పల్లెల్లో గట్టి రక్షణ చర్యలు తీసుకుని ప్రశాంత వాతావరణం నెలకొనే విధంగా కృషి చేయాలని మండల వాసులు కోరుతున్నారు.