ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతికి ప్రముఖుల సంతాపం
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్‌సీపీ బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కడప నగరంలోని వెంకట సుబ్బయ్య స్వగృహానికి చేరుకొని పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.
►వైద్యుడిగా, ఎమ్మెల్యేగా వెంకట సుబ్బయ్య సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ వెంకట సుబ్బయ్య కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
►ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, కడప ఇంచార్జ్ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వెంకట సుబ్బయ్య మృతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని తెలిపారు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైయస్సార్‌సీపీ వెంకట సుబ్బయ్య కుటుంబానికి అండగా ఉంటుందని మంత్రి చెప్పారు.
►ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి అత్యంత బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2014లో వైయస్సార్‌సీపీ ద్వారానే వెంకట సుబ్బయ్య రాజకీయ రంగప్రవేశం చేశారని గుర్తు చేసుకున్నారు. పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉండేవారు అని చెప్పారు. 2019 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారని పేర్కొన్నారు. వెంకట సుబ్బయ్య ఆత్మకు శాంతి కలగేలా భగవంతున్ని ప్రార్థిస్తున్నాని ఆళ్ల నాని పేర్కొన్నారు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.