సాగునీటి సంఘాల ఎన్నికల్లో అధికార దుర్వినియోగం

రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ దౌర్జన్యకాండ

పోలీసులతో బెదిరింపులు

వైయస్ఆర్ సిపి అభ్యర్ధులపై దాడులు

ప్రజాస్వామ్య స్ఫూర్తికి మచ్చ తెచ్చేలా కూటమి ప్రభుత్వ వైఖరి

తూర్పుగోదావరిజిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే  జక్కంపూడి రాజా  ఆగ్రహం

నోడ్యూస్ సర్టిఫికెట్లు అందకుండా చేశారు

ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేశారు

వైయస్ఆర్‌సీపీ నేతలపై పోలీసులు చెలరేగిపోయారు

ఏకగ్రీవాలే లక్ష్యంగా ఎన్నికల్లో పారదర్శకతకు పాతర వేశారు

ఒత్తిళ్ళతో తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు

మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం: రాష్ట్రంలో నీటిసంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మాజీమంత్రి, తూర్పుగోదావరిజిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దంగా, కనీస పారదర్శకత లేకుండా నీటిసంఘాల ఎన్నికలను ఏకపక్షంగా ఈ ప్రభుత్వం నిర్వహించిందని మండిపడ్డారు.  

రాష్ట్రంలో సాగునీటిసంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించామంటూ కూటమి పార్టీలు చెప్పుకుంటున్నాయి. అధికారబలంతో, పోలీసు యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని ఈ ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కనీస పారదర్శకతకు చోటు లేకుండా నిరంకుశంగా, తమకు అనుకూలంగా ఈ ఎన్నికలను నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఈ సంఘాలకు నిర్వహించే ఈ  ఎన్నికల్లో ఎవరైనా రైతులు  టీసీ (ప్రాదేశిక నియోజకవర్గం) సభ్యుడిగా పోటీ చేయాలనుకుంటే, నీటి బకాయిలు పూర్తిగా చెల్లించి ఉండాలి. ఆ మేరకు వీఆర్‌ఓ నుంచి నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) తీసుకోవాలి. ఇది తప్పనిసరి. అది ఉంటేనే నామినేషన్‌ అనుమతిస్తారు. లేకపోతే రిజెక్ట్‌ చేస్తారు. ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వైయస్ఆర్ సిపికి చెందిన వారు ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండేందుకు విఆర్వోలను అందుబాటులో లేకుండా చేశారు. ఎమ్మార్వో కార్యాలయాల్లో విఆర్వోలను ఉంచి, నోడ్యూస్ కోసం వచ్చిన వారిని పోలీసులతో బెదిరించి వెనక్కి పంపించారు. 

 న్యాయస్థానం ఉత్తర్వులను కూడా గౌరవించలేదు

సాగునీటి సంఘాలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను కూడా కూటమి ప్రభుత్వం గౌరవించలేదు. కేవలం ప్రతిపక్ష పార్టీపై కక్షసాధించాలనే ఉద్దేశం, ఏదో ఒకరకంగా ఈ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రయత్నించింది. అధికార యంత్రాంగాన్ని పూర్తిగా తప్పుడు విధానాలకు వినియోగించుకుంది. దీనిని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడ్డారు. ఈ అరాచకాలను ప్రజలకు తెలియచేసేందుకు ప్రయత్నించిన మీడియాపై కర్కశంగా భౌతికదాడులకు తెగబడ్డారు. ఇటువంటి దారుణాలతో గెలిచి, ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం పాల్జేశారు. పైగా పులివెందుల్లో గెలిచామని చెప్పుకుంటూ, ఇదంతా తమ గొప్పతనంగా చాటుకోవడం సిగ్గుచేటు. 

ఏకగ్రీవాలే లక్ష్యంగా పనిచేశారు.
 
ఇతర పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేకుండా, గ్రామసచివాలయాల్లో నోడ్యూస్ సర్టిఫికేట్ లు ఇవ్వకుండా కుట్రలకు పాల్పడ్డారు. ఇటువంటి దుర్నీతికి నిరసనగానే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.  రాష్ట్రంలో 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు (టీసీ), 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాల (డబ్ల్యూయూఏ)కు సంబంధించి శనివారం రహస్య ఓటింగ్‌ పద్దతికి తిలోదకాలిచ్చి ఏకగ్రీవాలే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది.

వీఆర్వోలను అందుబాటులో లేకుండా చేశారు

ఈ ఎన్నికలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వీఆర్‌ఓలు అంతా గ్రామ సచివాలయాల్లో ఉండాలి. కానీ చాలా మంది వీఆర్‌ఓలు ఫోన్లు స్విచాఫ్‌ చేసి కూర్చున్నారు. ఇంకా అందరు వీఆర్‌ఓలను మండల ఆఫీస్‌కు తీసుకుపోయి, నిర్భంధం చేశారు. బయట పోలీసులను కాపలగా పెట్టారు. వారిని రెండు రోజుల పాటు మండల  ఆఫీస్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? వారిని అక్కడ జైల్లో ఖైదీలుగా ఉంచినట్లు ఉంచారు. ఏ రైతు కూడా తమ వీఆర్‌ఓను కలిసే వీలు లేకుండా చేశారు. అలా వీఆర్‌ఓలు ఆ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కుట్ర చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా దౌర్జన్యకాండ

రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దౌర్జన్యకాండను కొనసాగించింది. విజయనగరం జిల్లా ఎల్‌.కోట మండలం కళ్లెంపూడిలో బీజేపీ నాయకుడు కోన మోహన్‌రావు నామినేషన్‌ వేసేందుకు కళ్లెంపూడి ఎంపీపీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లగా, ఆయన్ను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీలను పైకి విసిరారు. తన నామినేషన్‌ స్వీకరించాలని ఆయన డీఈ పి.శ్రీచరణ్‌ కాళ్లు పట్టుకుని వేడుకున్నా టీడీపీ నాయకుల ఒత్తిడితో డీఈ పట్టించుకోలేదు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరి తెగించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వైయస్ఆర్‌సీపీ మండల కన్వీనర్‌ మద్దిబోయిన వీరరఘును, అభ్యర్థి దగుమాటి కొండయ్యను పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్‌కు తరలించి సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వైయస్ఆర్‌సీపీ నాయకులు హుటాహుటిన స్టేషన్‌కు చేరుకుని, తమపార్టీ నాయకులను అర్ధరాత్రి సమయంలో ఎందుకు స్టేషన్‌కు తీసుకువచ్చారని నిలదీసినా ప్రయోజనం లేకపోయింది.

కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెందుర్రు ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నిక నామినేషన్‌ పత్రాలను చించేశారు.

ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో తమ మాట వినలేదని టీడీపీ వర్గీయులు రైతులపై అక్రమ కేసులు పెట్టారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లిలో ఓటర్లు ఆందోళనకు దిగారు. 300 మంది ఓటర్లు ఉంటే కేవలం 12 మందిని మాత్రమే లోపలికి ఎలా అనుమతిస్తారని పోలింగ్‌ స్టేషన్‌ వద్ద ధర్నా చేశారు. 

అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ (పీబీసీ) సాగునీటి సంఘానికి నామినేషన్‌ వేయకుండా జెడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మడకశిర మండలం కల్లుమర్రిలో పోటీలో ఉన్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు.  

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తొనుకుమాల రెండు చెరువులకు సంబంధించి పోటీ చేసిన రైతు చక్రపాణిరెడ్డిని అడ్డుకున్నారు. దాదాపు జిల్లా అంతటా టీడీపీ కూటమి నాయకులు చెప్పిన విధంగా ఇరిగేషన్‌ శాఖ అధికారులు నడుచుకున్నారు.  

నెల్లూరు జిల్లా కుడితిపాలెంలో టీడీపీ నేతలు అరాచకాలు చేశారు. పద్మమ్మ అనే మహిళా రైతు గెలిచినా.. టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు..

 మాజీ ఎమ్మెల్యేపై నోరుపారేసుకున్న సీఐ  

‘రే.. నువ్వు నన్నేమీ చేసుకోలేవు.. ఏమి చూస్తావు.. ఏమి చేస్తావు రా.. ఇక్కడి నుంచి దెం..యి’ అంటూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కర్నూలు సీసీఎస్‌ సీఐ ఇబ్రహీం దుర్భాషలాడారు. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో ఈ ఘటన జరిగింది.ఓటర్లను అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో మాట్లాడటానికి వెళ్లడంతో పోలీసులు ఇలా ‘పచ్చ’ నేతల్లా వ్యవహరించారు. దీంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవమైంది.
కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్‌ మండలం బ్రహ్మణదొడ్డిలో టీడీపీ నేత డి.విష్ణువర్ధన్‌ రెడ్డి అనుచరులు నామినేషన్‌ పత్రాలను లాక్కొని చింపి వేశారు.  

 చేతకాని దద్దమ్మ ప్రభుత్వం

 ఇది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం. పోలీసులను అడ్డు పెట్టుకుని ఎన్నికలు చేయడం చేతకానితనం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే, రైతులు ఓటు వేసి ఉంటే, టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్‌ను చొక్కా విప్పి కూర్చోబెట్టి ఉండేవారు. మా పార్టీ సానుభూతిపరులు పోటీ చేస్తే, ఓడిపోతామని చెప్పి, రైతులకు నోడ్యూస్‌ సర్టిఫికెట్స్‌ ఇవ్వలేదు. వీఆర్‌ఓలు గ్రామ సచివాలయాల్లో ఉండకుండా, వారిని ఎందుకు మండల ఆఫీస్‌ల్లో బంధించి ఉంచారు. చివరకు కవరేజ్‌కు వచ్చిన మీడియాపైనా వైయస్ఆర్‌ జిల్లా వేములలో దాడి చేశారు. ఇన్ని పనులు చేసి, నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ కోసం ఎవరూ రాలేదని పచ్చి అబద్ధాలు చెప్పారు. ఒక్క పులివెందులలోనే కాదు, జమ్మలమడుగులో కూడా అదే పని చేశారు. వీఆర్‌ఓలు అందరినీ తీసుకెళ్లి, దేవగుడిలో బంధించారు. ఇది వాస్తవం కాదా?

అధికారుల తప్పులు, వారు దగ్గరుండి చేయించిన పొరపాట్లకు శిక్ష అనుభవించక తప్పదు. సాగు నీటి ఎన్నికల్లో టీడీపీ గెలుపు అస్సలు గెలుపే కాదు.. చంద్రబాబు జీవితంలో ఇదో చీకటి అధ్యాయం.. ఎన్నికలు పెట్టకుండా.. టీడీపీ నేతలే చంద్రబాబు నామినేట్‌ చేసుకుని ఉంటే బాగుండేది.

Back to Top