ఒంగోలు: స్వార్థ ప్రయోజనంతో పచ్చి అబద్ధాన్ని నిజంలా ప్రచారం చేయడాన్ని ప్రజలెవ్వరూ హర్షించరని, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మంత్రిగా పని చేసినప్పుడు ఇక్కడ ఎలా ఉంది అన్న విషయం ఆయనకు స్పష్టంగా తెలుసని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. గత రెండు రోజలుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలను చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఒంగోలులో వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ ఒప్పందం చరిత్రాత్మకం: వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ రాష్ట్రానికి అన్ని రంగాల్లో ఎంతో మేలు జరిగింది. రాష్ట్ర విద్యుత్ రంగంలో సెకీతో ఒప్పందం చరిత్రాత్మకం. అత్యంత తక్కువ రేటుతో సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. దాని వల్ల ఏటా రూ.3700 కోట్ల మేర ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా 25 ఏళ్లలో దాదాపు లక్ష కోట్లు ఆదా అవుతాయి. అయినా దానిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ‘బాబు’ ధర కంటే సగం: చంద్రబాబు తన హయాంలో చేసిన అన్ని రేట్లతో పోలిస్తే.. ఈ పీపీఏ రేటు దాదాపు సగం ఉంది. దాన్ని కూడా దురుద్దేశంతో తప్పుదోవ పట్టిస్తున్నారు. చంద్రబాబు హయాంలో 2016లో యూనిట్ విద్యుత్‌ను రూ.4.50కి కొనుగోలు చేసేలా ఒప్పందం జరిగితే, అదే జగన్‌గారి ప్రభుత్వం కేవలం రూ.2.48కే యూనిట్ విద్యుత్ కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. పైగా చంద్రబాబు హయాంలో ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ వ్యయం అదనంగా ఉంటే, అది జగన్‌గారి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో లేదు. అదంతా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. అంత మంచిగా నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే, మంచిని మంచి అని అంగీకరించని కూటమి ప్రభుత్వంతో ఆయన జత కట్టడం చాలా బాధాకరం. తనకు తానే వ్యక్తిత్వ హననం: కూటమి పెద్దలకు దగ్గర కావడం కోసం వాసన్న (శ్రీనివాస్‌రెడ్డి) ఈ స్థాయికి దిగజారుతాడని మేం ఏనాడూ కలలో కూడా ఊహించలేదు. వైయస్ జగన్‌గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే, తనను కూటమి పెద్దలు గుర్తిస్తారని భావిస్తూ, తనకు తాను కూడా వ్యక్తిత్వంగా దిగజారిపోతున్నాడు. తన వ్యక్తిత్వాన్ని కూడా హననం చేసుకుంటున్నాడు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఒక మంచి ఒప్పందం జరిగింది. యూనిట్ విద్యుత్ రూ.2.48కే కొనుగోలుకు నిర్ణయం జరిగింది. క్యాబినెట్ అంగీకారంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారు. అలాంటప్పుడు అర్ధరాత్రి ఫైల్ పంపి సంతకం చేయమన్నారని ఎలా చెబుతున్నారు?. ‘సెకీ’తో ఒప్పందం ముందు..: 2021, సెప్టెంబరు 15న, రాష్ట్ర ప్రభుత్వానికి సెకీ నుంచి లెటర్ వచ్చింది. ముందస్తుగా నిర్ణయం ప్రకారం, లెటర్ వచ్చిన మరుసటి రోజు కేబినెట్ సమావేశం ఉంది. ఆ సమావేశంలో సెకీ లెటర్ అంశాలను అధికారులు వివరించారు. ఆ తర్వాత సెకీతో ఒప్పందానికి క్యాబినెట్‌లో సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంపై మంత్రి బాలినేని సంతకం చేశారు. అనంతరం అన్ని అంశాల అధ్యయనం కోసం ఎనర్జీ సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. నెల రోజుల పాటు అన్నీ అధ్యయనం చేసిన కమిటీ నివేదిక ఇచ్చింది. దాన్ని క్యాబినెట్ ముందుంచి చర్చించారు. అన్ని అంశాలు చర్చించిన తర్వాత, సెకీతో ఒప్పందానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అప్పుడు కూడా మంత్రి బాలిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సంతకం చేశారు. ఇంకా చెప్పాలంటే, ఆయన సంతకం తర్వాతే ఫైల్ క్యాబినెట్ ముందుకు వచ్చింది. మరి అలాంటప్పుడు ఫైల్ తనకు అర్ధరాత్రి పంపారని ఎలా ఆరోపిస్తున్నారు?. పైగా మీకు తెలియకుండా ఒప్పందం జరిగిందని చెప్పడం దారుణం. ఆనాడు మీ అంత స్వేచ్ఛ ఎవరికీ లేదు: వైయస్సార్ కుటుంబం వల్లే బాలినేనికి గుర్తింపు వచ్చింది తప్ప, ఆయనకంటూ వ్యక్తిగతంగా ఎలాంటి గుర్తింపు లేదు. కానీ, ఇప్పుడు మా పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత, తాను కూడా ఒక రాజకీయ నాయకుడినే అని, తనకూ గుర్తింపు ఉందని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నాడు క్యాబినెట్ మంత్రిగా మీకు స్వేచ్ఛ లేదని చెబుతున్నారు. కానీ, అప్పుడు మీకున్న స్వేచ్ఛ మరెవరికీ లేదు. ఇది వాస్తవం. అప్పుడు మీ గురించి ఇదే ఎల్లోమీడియాలోనే రాశారు. మీరు ఇతర పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక విమానంలో విదేశాలకు వెళ్లారని. అప్పుడు మీకంత స్వేచ్ఛ ఉంది. మరి ఇప్పుడు అంత స్వేచ్ఛ మీకు కూటమి ప్రభుత్వంలో ఉంటుందా? ఆ మాట దేవుడెరుగు? మీరు కనీసం ఇతర పార్టీల వారితో కూడా మాట్లాడలేరు. ఆ విషయం మీకు కూటమిలోకి పోయిన తర్వాత అర్ధమవుతుంది. పుట్టిల్లు ఎంత గొప్పది. ఎంత స్వేచ్ఛ ఇచ్చింది. ఎంత గౌరవంగా చూసుకుంది అన్నది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరి ప్రాపకం కోసమో ఇది సరికాదు: ఎవరినో సంతృప్తి పర్చాలని చెప్పి, నీకు ఎంతో అండగా నిల్చిన పార్టీపై నిందలు వేస్తూ, జగన్‌గారి వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూస్తున్నావు.కానీ, ఆ పని ఎవరు చేసినా, వారు ఏం సాధించలేదు? గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు జగన్‌గారిపై చేశారు. కానీ, ఏం సాధించారు?. ఇంత మంది కలిసి ఒక వ్యక్తిపై దాడి చేస్తున్నారు. కానీ ఆయనకు ప్రజల అండ ఉంది. బాలినేనికి చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని సమాచారం. అందుకే ఆయన ఈ స్థాయికి దిగజారిపోయారు. దీన్ని ఏనాడూ తాము ఊహించలేదని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు.