

















గిరిజన హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో త్వరలో కరాటే క్లాసులు
డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
విజయవాడ: గిరిజన సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థినులకు త్వరలో సెల్ఫ్‌డిఫెన్స్ క్లాసులను నిర్వహింబోతున్నామని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. హస్కీక్యాపర్స్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో విద్యార్థినులకు కరాటేలో శిక్షణ, సెల్ఫ్‌డిఫెన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన దిశ సంఘటన చాలా బాధ కలిగించిందని, కానీ, తప్పు చేసిన వాడికి దేవుడు కచ్చితంగా శిక్ష విధిస్తాడనేందుకు పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్ నిదర్శనమన్నారు. దేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠినమైన చట్టాన్ని తీసుకురావాలన్నారు. ఆంధ్రరాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణ చర్యలు చేపట్టామని చెప్పారు. ఉమెన్ సేఫ్టీకి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలో ఒక ఉమెన్ కానిస్టేబుల్‌ను సీఎం వైయస్ జగన్ ఏర్పాటు చేశారన్నారు. మద్యపాన నిషేధం కూడా అమలు చేస్తున్నామని, దీనికి మహిళాలోకం హర్షిస్తుందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తీసుకువస్తామన్నారు. ఆడపిల్లల తనను తను రక్షించుకునేందుకు సెల్ఫ్‌డిఫెన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో హస్కీ క్యాపర్స్ కాత్యాయని, సత్య, చిన్పపురెడ్డిలు పాల్గొన్నారు.