పేదల పొట్ట కొట్టాలని చూస్తున్నారా?

వారందరినీ రోడ్డు మీదకు ఈడ్చడమే మీ ధ్యేయమా?

ఈనాడు కథనంపై మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ ఫైర్‌

పూర్తిగా గతి తప్పిన ఈనాడు. రోజూ రోత రాతలు

పేదల మంచి కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించే యత్నం

అందుకే అసైన్డ్‌ భూములపై దారుణంగా అసత్య కథనం

మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ధ్వజం

సమస్యల నుంచి ప్రజాదృష్టిని మళ్లించే కుతంత్రం

అలా ప్రభుత్వ వైఫల్యాలు కప్పి ఉంచాలన్న కుట్ర

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం

అయినా చంద్రబాబు పల్లకి మోయడమే ఈనాడు లక్ష్యం

మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ స్పష్టీకరణ

మీడియా బాధ్యతను పూర్తిగా వదిలేసిన ఈనాడు

చంద్రబాబు ఒక్కరే బాగుంటే చాలన్నట్లు వ్యవహారం

ఆయనకు మాత్రమే మేలు జరగాలన్న ధోరణి

ఇకనైనా విలువలు పాటించండి. వైఖరి మార్చుకొండి

ప్రెస్‌మీట్‌లో ఈనాడుకు అనిల్‌కుమార్‌ హితవు

తాడేపల్లి: పేదల పొట్ట కొట్టాలని చూస్తున్నారా? వారందరినీ రోడ్డు మీదకు ఈడ్చడమే మీ ధ్యేయమా? అని ఈనాడు యాజ‌మాన్యాన్ని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈనాడు కథనంపై మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ మండిప‌డ్డారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కన్నా.. ప్రజలకు మేలు చేసేలా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఎలా తీసివేయాలి. వాటిని ఎలా తొలగించాలన్న దానిపైనే కూటమి ప్రభుత్వ పెద్దలు ఎక్కువ దృష్టి పెట్టారని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ఆక్షేపించారు.
    దీనికి ఎల్లో మీడియా, ముఖ్యంగా ఈనాడు దినపత్రిక శకుని పాత్ర పోషిస్తోందని.. బాధ్యత గల ఒక ఫోర్త్‌ఎస్టేట్‌ మాదిరిగా కాకుండా, ప్రజలకు.. ముఖ్యంగా నిరుపేదలకు ఎలా నష్టం చేయాలన్న దానిపై ఆ  మీడియా దృష్టి పెడుతోందని ఆయన పేర్కొన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమని అన్నారు. శ‌నివారం కైలే అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

అసలు అక్రమాలు ఎవరివి?:
    నిజంగా అసైన్డ్‌ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడింది ఎవరు? చంద్రబాబునాయుడి ప్రభుత్వం కాదా? పేదల భూములను వారు కొట్టేయలేదా? రాజధాని అని పేరు చెప్పి అమరావతిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసింది దోపిడి కాదా?. అని మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ ప్రశ్నించారు. 
    ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మభ్యపెట్టి, మోసం చేసి 1100 ఎకరాలు కొట్టేశారని ఆయన తెలిపారు. మీ చేతిలో భూములు ఉంటే.. పరిహారం రాదని, ప్లాట్లు రావని చెప్పి.. పేదల భూములు లాగేసుకుని, ఆ తర్వాత జీవో ఇచ్చి.. చేతులు మారిన భూములను పూలింగ్‌లోకి తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు.
    ఆ తర్వాత తమ బినామీలకు ప్లాట్లు కేటాయించుకుని కోట్లు కొల్లగొట్టారన్న, కైలే అనిల్‌కుమార్‌.. అమరావతి ప్రాంతంలో అలా దాదాపు 1336 మంది బినామీలు ఉన్నారని వెల్లడించారు. దీనిపై కేసు నడుస్తోందన్న ఆయన, అది అక్రమం కాదా? అని ప్రశ్నించారు.

అసైన్డ్‌ భూముల సమస్య ఎప్పటిది?:
    నిజానికి అసైన్డ్‌ భూముల సమస్య ఈనాటిది కాదన్న కైలే అనిల్‌కుమార్‌.. భూమి ఉన్నా కష్టం వస్తే.. దాన్ని ఏదో ఒకటి చేసుకుందామనుకున్నా.. చేసుకోలేని పరిస్థితి ఉండేదని, చివరకు పైసాకో, పరక్కో ఏదొక కాగితం మీద రాసిచ్చి ఎంతో కొంత తీసుకునే స్థితి ఉండేదని గుర్తు చేశారు. 70 ఏళ్లుగా ఆ సమస్య కొనసాగిందని చెప్పారు.

పేదలకు న్యాయం కోసమే:
    అందుకే పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ భూముల చట్టానికి సవరణలు చేశారని, దానికి సంబంధించి గత ఏడాది అక్టోబరు 27న గెజిట్‌ జారీ అయిందని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆ మేరకు ఒరిజనల్‌ అస్సైనీలు, ఒకవేళ వారు లేకపోతే వారి చట్టబద్ధ వారసులను గుర్తించి, ఆ భూములపై హక్కులు కల్పించారని ఆయన తెలిపారు.

దురుద్దేశంతో దుష్ప్రచారం:
    నిజానికి అసైన్డ్‌ భూముల విషయంలో జగన్‌గారికి కానీ, అప్పటి ప్రభుత్వానికి కానీ, స్వార్ధం ఉంటే ఒరిజినల్‌ అసైనీలకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ హక్కులు సంక్రమించేలా చట్టం చేసే వారా? అని కైలే అనిల్‌కుమార్‌ సూటిగా ప్రశ్నించారు.
    ఆ భూములపై ఎవరైతే పొజిషన్‌లో ఉన్నారో.. వారికే హక్కులు కల్పించారన్న ఆయన, ఏ స్వార్ధం లేకుండా నిరుపేదలకు న్యాయం జరగాలన్న ఆలోచనతో మంచి చట్టాన్ని రూపొందిస్తే.. ఎల్లో మీడియా.. ముఖ్యంగా ఈనాడు పత్రిక దుగ్ధ, కుటిలమైన ఆలోచనతో దుష్ప్రచారం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆక్షేపించారు.

అదే కదా.. మీ లక్ష్యం?:
    ప్రజలు, రైతులు.. ముఖ్యంగా నిరుపేదలకు మంచి జరగొద్దు. వారి పొట్ట కొట్టాలి. వారిని రోడ్డు మీదకు ఈడ్చాలి.. ఇదే కదా మీ లక్ష్యం? అని ఎల్లో మీడియాను, ఈనాడును మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ సూటిగా ప్రశ్నించారు.
 
చంద్రబాబు నిర్వాకం:
    నిజానికి 2016లో నాటి సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల ఆ భూముల సమస్య మరింత జటిలమైందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఏకంగా 2,06,171 ఎకరాలను 22–ఏ జాబితా కింద నిషేధిత భూముల జాబితాలో చేర్చారని గుర్తు చేశారు.

జగన్‌గారు మేలు చేశారు:
    ఆ రైతుల సమస్యలను పరిష్కరించేలా గత సీఎం వైయస్‌ జగన్‌ చొరవ తీసుకున్నారని కైలే అనిల్‌కుమార్‌ వెల్లడించారు. షరతులతో కూడిన పట్టాలకు సంబంధించి 22 వేల మంది రైతులకు మేలు చేస్తూ, 35 వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించారని ఆయన చెప్పారు. చుక్కల భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించారని తెలిపారు.
    ఇంకా అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఏకంగా 2,00,083 ఎకరాలకు సంబంధించి, హక్కు పత్రాలు జారీ చేశారని గుర్తు చేశారు. ఇంకా సుమారు 15,21,160 మంది భూమి లేని నిరుపేదలకు, వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు కలిగాయని చెప్పారు. ఆ భూమలన్నీ కూడా 1954 తర్వాత అసైన్మెంట్‌ చేసినవే అని వివరించారు. 

చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌:
    గత ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయని చంద్రబాబు, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్ర చేస్తున్నారని, అందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ కొనసాగిస్తున్నారని కైలే అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. 
    ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఒక్కరికే పరిమితం చేస్తూ.. తల్లులు, పిల్లలకు పంగనామం పెట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఎన్నికల ముందు గొప్పగా ప్రచారం చేసుకున్న సూపర్‌సిక్స్‌ గురించి ఇప్పుడు ఊసే ఎత్తడం లేదని ఆయన గుర్తు చేశారు. అందుకే వాటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. ఇలా తన అనుకూల ఎల్లో మీడియాలో నిత్యం అసత్య కథనాలు రాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు.

Back to Top