జాతి గర్వించేలా అంబేద్క‌ర్‌ విగ్రహం ఏర్పాటు చేశాం

 ఈ నెల 19న విజయవాడ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ 

 వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి

ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి 

ద‌ళిత నేతలతో కలిసి పోస్టర్లు ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే

ఉరవకొండ: ఈనెల 19న విజయవాడ నడిబొడ్డున దేశంలోనే అత్యంత ఎత్తయిన రాజ్యాంగ నిర్మాత, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని వైయ‌స్ఆర్‌సీపీ ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి చెప్పారు.  వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో విగ్రహావిష్కరణకు సంబంధించిన పోస్టర్లను వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఎస్సి విభాగం నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సి సెల్ అధ్యక్షులు మీనుగా ఎర్రిస్వామి, మల్లప్ప, ఉమా శంకర్, జగదీశ్, సంగప్ప, వీరాంజినేయులు, బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏసీ ఎర్రిస్వామి, పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు బసవరాజు,ఎస్సి సెల్ జిల్లా కార్యదర్శి సుంకన్న, కూడేరు వైస్ ఎంపీపీ సుబ్బమ్మ, తదితరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి దిక్సూచి, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆవిష్కరించనున్నారని, ఈ కార్యక్రమానికి కుల, మత, వర్గ విభేదాలు లేకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. విజయవాడ నడిబొడ్డున అతి ముఖ్యమైన స్థలం స్వరాజ్య మైదానంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందుకు అంబేద్కర్ అభిమానులు, ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు.

404 కోట్ల రూపాయలతో రూపుదిద్దుకున్న అంబేద్కర్ స్మృతి వనంలోని విశిష్టతలను ఆయన వివరిస్తూ విగ్రహం మాత్రం 125 అడుగులు ఎత్తు కలిగి ఉంటుందని, మరో 80 అడుగులు గల విగ్రహం కింది భాగంలో మూడు వేల మంది కూర్చోగలిగే మల్టీ కన్వెన్షన్ హాల్, 2 వేల మంది ఆసీనులు కాగల ఓపెన్ థియేటర్, బుద్దిస్ట్ మెడిటేషన్ హాల్, ఫౌంటెన్లు, పార్కు వంటి అన్ని రకాల సదుపాయాలతో దాదాపు 210 అడుగుల ఎత్తులో దేశంలో కనీ వినీ ఎరుగని రీతిలో అద్భుతంగా నిర్మించడం జరిగిందన్నారు. జాతి గర్వించేలా అంబేద్కర్ విగ్రహాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప పండుగగా నిర్వహించనుందని వెల్లడించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కేవలం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికి మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదని, దేశంలోని ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ విగ్రహావిష్కరణకు ఉరవకొండ నియోజకవర్గం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. 

Back to Top