నేడు అరటి తోటలను పరిశీలించ‌నున్న వైయ‌స్ జగన్

అకాల వ‌ర్షాల‌కు తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులు
 
వైయ‌స్ఆర్ జిల్లా, అనంతపురం జిల్లాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో నేలకూలిన తోటలు

ఒక్క లింగాల మండలంలోనే 2,460 ఎకరాల్లో పంట నష్టం.. అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో దెబ్బతిన్న అరటి

తీవ్రంగా నష్టం వాటిల్లడంతో ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం

మొక్కజొన్న, బొప్పాయి పంటలకూ నష్టం

ఇది నిన్నటి దృశ్యం.
పచ్చటి అరటి తోటలు.. బారెడు గెలలతో కోతకు సిద్ధమయ్యాయి.. తమ ఆశలు పండించేలా ఉన్న తోటల్ని చూసి రైతు కళ్లల్లో ఆనందం తాండవించింది. ఇక అప్పులన్నీ తీరతాయని ధైర్యం వచ్చింది. 

ఇది నేటి పరిస్థితి.
ఎటు చూసినా విరిగిన అరటి చెట్లు.. నేలవాలిన తోటలు. చేతికందే దశలో పంట నేలపాలై కంట నీరు పెట్టుకుంటున్న రైతులు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని దీనస్థితి. 

అకాల వర్షాలకు వైయ‌స్ఆర్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైయ‌స్ఆర్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.

మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. పెద్దకుడాల గ్రామానికి చెందిన రామాంజనేయరెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. 3 ఎకరాల్లో యాలకి (సుగంధాలు) అరటి సాగు చేయగా.. పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.   

అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం 
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగ­న­మల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి.   

గోరుచుట్టుపై రోకలి పోటులా.. 
గోరుచుట్టుపై రోకలి పోటులా అకాల వర్షం వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లోని అరటి రైతులను దెబ్బతీసింది. గత నెలలో టన్ను అరటి ధర రూ.23 వేల నుంచి రూ.25 వేలు ఉండేది. ఇప్పుడు ధరలు పడిపోవడంతో పెట్టుబడులు దక్కుతాయో లేదోనని అరటి రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పులు చేసి పంటల్ని సాగుచేస్తే చేతికందాల్సిన పంట నేలనంటిందని వాపోతున్నారు. పురుగు మందులు, ఎరువుల ధరలు ఏటా పెరుగుతుంటే.. పంట సాగుచేసిన తమకు గిట్టుబాటు ధరలేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటల్ని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.  

రైతుల్ని ఆదుకుంటాం: సీఎం 
అకాల వర్షాలు ఈదురు గాలులకు పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పంటలు దెబ్బతిన్న జిల్లాల కలెక్టర్లతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయి అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లికి చెందిన ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై సీఎం ఆరా తీశారు. ఆ ఇద్దరు రైతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ప్రభుత్వం ఆదుకోవాలి
కోటి ఆశలతో అప్పులు చేసి అరటి పంటను సాగు చేస్తే అకాల వర్షం, ఈదురు గాలులు కోలు­కోలేని దెబ్బతీ­శాయి. ఈ వర్షానికి తీవ్రంగా నష్టపోయాం. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.    – శ్రీనివాసులరెడ్డి, అరటి రైతు, ఎగువపల్లె

ఈ స్థితి వస్తుందనుకోలేదు
ఏటా ఏప్రిల్, మే నెలల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురి­సేవి. ఆలోగా రైతులు అరటి పంట దిగుబడి చేతికందేది. ఈ ఏడాది ముందుగానే భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో తీవ్రంగా నష్టపోయాం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.  – రామాంజనేయరెడ్డి, అరటి రైతు, పెద్దకుడాల

నేడు వైయ‌స్ జగన్‌ పర్యటన 
వైయ‌స్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వైయ‌స్ఆర్ జిల్లా లింగాల మండలంలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించేందుకు వైఎస్‌ జగన్‌ వస్తున్నారని వైయ‌స్ఆర్సీపీ మండల కన్వినర్‌ బాబురెడ్డి తెలిపారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిన అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారన్నారు. 

Back to Top