ఇసుక టెండర్లలో మీరెందుకు పాల్గొనలేదు?
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఇసుక టెండర్లపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు
టీడీపీ హయాంలో లక్ష కోట్ల దోపిడీ జరిగింది
తాడేపల్లి: ఇసుక టెండర్లపై ప్రతిపక్షాలు రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయని, అలాంటప్పుడు మీరెందుకు టెండర్లలో పాల్గొనలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారరెడ్డి ప్రశ్నించారు. రూ.120 కోట్లు డిపాజిట్ చేసిన కంపెనీ నష్టాల్లో ఎలా ఉంటుందని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా టెండర్లు నిర్వహించి సెక్యూరిటీ డిపాజిట్ చేసిన కంపెనీ దివాళా తీసిందనడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇసుక టెండర్ విధానంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని, వినియోగదారులకు సులభంగా, తక్కువ ధరకే నాణ్యమైన ఇసుకను అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో ఇసుకలో లక్ష కోట్ల దోపిడీ జరిగింది. మా ప్రభుత్వం ఇసుక సరసమైన ధరలకు విక్రయించాలని కమిటీ నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ద్వారా టెండర్లు పిలిపించి, దాదాపు రూ.125 కోట్లు బిడ్లు తీసుకొని అర్హత ఉన్న వారికి కేటాయించాం. ప్రతిపక్షాలు టెండర్లను మోసం, దగా అంటున్నారు. ఆరోపణలు చేసేవారు ఎందుకు టెండర్లలో పాల్గొనలేదని ప్రశ్నించారు.
రూ.125 కోట్లు బిడ్ సెక్యూరిటీ చెల్లించిన తరువాత ఆ సంస్థ ఎలా దివాలా తీస్తుంది. ప్రతిపక్షాలు రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతున్నారు. ఏడాదికి ఒక కోటి 50 లక్షల శాండ్‌ను విక్రయించడం జరిగింది. దాన్ని ఆధారంగా తీసుకొని అదనంగా టెండర్లు పిలిచాం. ఏ రీచ్‌లో ఇసుక బాగుంటే..ఆ రీచ్‌లో తీసుకునే వీలుంటుంది. వాహనాలు కూడా అందుబాటులో ఉంచుతారు. సొంతంగా కూడా లారీల్లో ఇసుక తీసుకెళ్లే వెసులుబాటు కల్పించాం. ఇందులో ఏవైనా అవకతవకలు జరుగుతున్నాయా? ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారా అన్న కోణంలో ఫిర్యాదులు చేసేందుకు కాల్ సెంటర్ నంబర్ 14500 కూడా ఏర్పాటు చేశాం. కాల్ సెంటర్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఇసుకలో అక్రమాలు అరికట్టేందుకు ఎస్‌ఈబీకి కూడా ఫిర్యాదు చేయవచ్చు. మైనింగ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఏడాదికి రూ.2 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ.470 టన్నుకు ధర ఉంది. డీజిల్ ధర పెరగడంతో ఈ మాత్రం ధర పెంచాం. దొంగే దొంగ దొంగ అన్నట్లు టీడీపీ వ్యవహారం ఉంది.
ప్రభుత్వం ఈ ఏడాది పేదలకు 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చింది. వారికి పక్కా ఇల్లు కట్టించేందుకు తీర్మానించింది. ఈ ఇళ్లకు ఇసుక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రాజెక్టులకు, ఆర్ అండ్ ఆర్ పునరావాస ప్రాంతాలకు కూడా ఇసుక ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. పారదర్శకంగా ఇసుక విక్రయాలు చేపట్టేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఈ రోజు నూతన ఇసుక విధానం తీసుకువచ్చాం. రీచ్‌ల వద్ద ఉన్న గ్రామాలకు ఉచితంగా ఇసుక ఇస్తాం. ఇలాంటి నిర్ణయాలపై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. టీడీపీ చేసిన దోపిడీకి ప్రజలకు జవాబు చెప్పాల్సింది పోయి..మంచి చేస్తున్న మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం దురదృష్టకరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.