బాబుకు ఓటు అడిగే అర్హతే లేదు 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 

పుంగనూరు: ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసే చంద్రబాబుకు కనీసం ఓటు అడిగే అర్హత కూడా లేదని మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని కొత్తయిండ్లు, కొత్తపేట, ఎల్‌ఐసీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మంత్రి మాట్లాడుతూ బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి చచ్చిన పాములాంటివాడని, ఆయనకు డిపాజిట్‌ కూడా దక్కదని స్పష్టం చేశారు. 

2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసి, అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చారని కొనియాడారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యం, పేదల ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేసినట్లు వెల్లడించారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకే ప్రభుత్వ పాలనను తీసుకెళ్లి సేవలు అందించామని తెలిపారు.

వలంటీర్లు అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యులు సైతం భయపడినా, జగనన్న వలంటీర్లు మాత్రం ధైర్యంగా రోగులకు సేవలు అందించారని స్పష్టం చేశారు.  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించామని వివరించారు.  జగన్‌మోహన్‌రెడ్డి చేసేవి మాత్రమే చెబుతారని , వాటినే మేనిఫెస్టోగా విడుదల చేశారన్నారు. ఐదేళ్లలో 98 శాతం ఎన్నికల హామీలను అమలు చేసిన వైయ‌స్ఆర్‌సీపీకే ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లి ఓటు అడిగే అర్హత ఉందని వెల్లడించారు.

చంద్రబాబు , పవన్‌కల్యాణ విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోకి బీజేపీ దూరంగా ఉందని, దీన్ని బట్టే అది ఎంత మోసకారి మేనిఫెస్టోనో అర్థమవుతోందని తెలిపారు. బారు మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటమి తప్పదని  స్పష్టం చేశారు. ఈనెల 13న జరిగే పోలింగ్‌ రోజున ప్రతి ఒక్కకూ తమ రెండు ఓట్లను ఫ్యాన్‌ గుర్తుకు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్‌కుమార్,  రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, పీకేఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్, సీమ జిల్లాల మైనారిటీ సెల్‌ ఇన్‌చార్జి ఫకృదీ్ధన్‌షరీఫ్, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ జిల్లా అమ్ము పాల్గొన్నారు. 

Back to Top